గోలకొండ పత్రిక సంపాదకీయాలు/స్వ విషయము
స్వ విషయము
9 - 5 - 1935
సర్వ కారణుడగు భగవంతుని యొక్క అపార కృపా విశేషమువలనను ఆంధ్ర సోదరుల అభిమాన మూలమునను నిజాం రాష్ట్రములోని యాంధ్ర దేశమున నొక్కటేయగు నీ యాంధ్ర వార్తా పత్రిక తొమ్మిదవ వత్సరము దాటి పదివ వత్సరమున ప్రవేశముగాంచినది
గత సంవత్సరములందు మా పత్రిక శక్తి కొలది ఆంధ్రుల పురోవృద్ధికి పాటుపడుటయందు వెనుదీయలేదు. ముందును సామర్థ్యము మేరకు, నిజాం రాష్ట్రము నందలి ప్రత్యేక పరిస్థితులు అవకాశ మొసగునంత వరస సేవ చేయ సంసిద్ధమైయున్నది
దుర దృష్ట వశమున మన రాష్ట్రములోని యాంధ్ర సోదరులందు మాతృభాషాభిమానము తగిన విధమున వ్యాపించియుండనందునకు చింతిల్ల వలసియున్నది ఈ విషయమున తొమ్మిది వత్సరముల సేవకు యోగ్యమగునంత ప్రతి ఫలము లభింపకుండుట నిరుత్సాహకరమే యైనను, విద్యా విషయములందు. సామాన్యముగను, ఆంధ్ర భాషా విషయమున ముఖ్యముగను, వెనుకబడియున్న మన రాష్ట్రము నందలి వివిధ పరిస్థితులను గ్రహించియున్న వారెవరును తమకర్తవ్యము విడనాడదలంపరు. మొత్తము మీద నాలోచించి చూడగా, నిజాం రాష్ట్రాంధ్ర దేశమునందును నవ్య భావోదయ మగుచున్నందులకు నిదర్శనములు లేకపోలేదు కనుక ప్రవృద్ధి మందముగ నుండినను, ఫలితములు స్థిరములుగానే యుండుననుట నిస్సంశయము మూడు సంవత్సరముల కాలము వరకు ప్రభుత్వాంగీకారము లభింపనందున 'ఆగిపోయి యుండిన తృతీయాంధ్ర మహాసభ ఖమ్మముమెట్టు నందు జరుగుటయు, నిజాం రాష్ట్ర ఆదిమాంధ్ర మహాసభ కందూరునందు జయప్రదముగా సమావేశమగుటయు యువజనాంధ్ర సంఘమను సంస్థ యేర్పడి కార్యారంభమునకు గడంగుటయు, బ్రిటిషు ఆంధ్రదేశమున వెలువడుచున్న ఆంధ్ర వాఙ్మయము యొక్క వ్యాప్తి క్రమక్రమముగా హెచ్చగుచుండుటయు ప్రజలయందు కలుగుచున్న నూతన ప్రబోధమును విశదము చేయుచున్నవి
మన రాష్ట్రములో ప్రజాహిత కార్యాసక్తిని పెంపొందించుటకును, ఆధునికములగు వివిదోద్యమములను గూర్చిన విజ్ఞానమును రాష్ట్రమునందెల్లెడల వ్యాపింపజేయుటకును మన రాష్ట్రము యొక్క ప్రజా సమస్యలను గూర్చిన యదార్ధ జ్ఞానమును గ్రామస్ధులు ద్వారముల కడకు గొనిపోవుటయు ఎంతయో యవసరమని మానిశ్చితాభిప్రాయము ఈ యంశములను దృష్టియందుంచియే గోలకొండ పత్రికను దిన పత్రికగా మార్చుటకై ప్రభుత్వము వారి యాజ్ఞ కోరబడియుండెను. కానియది లభించియుండలేడు నిజాం రాష్ట్రాంధ్రుల సంఖ్య డెబ్బది లక్షలు. మొత్తము రాష్ట్ర జన సంఖ్యలో వీరివంతు నూటికి 45 చొప్పున నగుచున్నది. ఇంత గొప్ప సంఖ్య ఈ రాష్ట్రమునందలి మరి యే భాష వారికిని లేదు మహాఘనత వహించిన నిజాం ప్రభుత్వము వారు రాష్ట్రములోని ప్రజలలో ఆంధ్రులకు గల సంఖ్యా ప్రాధాన్యతను వారి యోగ్యతా విశేషములను బాగుగ నెరుగుదురు. కనుక యిట్టి ముఖ్య ప్రవా భాగమునకు ఒక దిన పత్రిక యత్యవసరమని ప్రభుత్వము వారు విశ్వసించియేయున్నారు. కావున కొలది కాలములోనే యాంధ్ర దిన పత్రిక మన రాష్ట్రమునకు లభించగలదని మనము ఆశించవచ్చును. అట్టి సుదినము త్వరలో చూడగల్గుదుము గాక!
"గోలకొండ పత్రిక" మన రాష్ట్రమున నొకటే యగు తెలుగు వార్తాపత్రిక యని పైన సూచించి యున్నాము ఈ కారణమువలన ఆంధ్ర సోదర సోదరీమణు లందరికిని యిది ముద్దు బిడ్డ వివిధ శాఖల వారికిని వివిధ భావముల వారికిని సనాతనులకును, నవీనులకును, స్త్రీలకును, పురుషులకును, వేయేల, యందరికిని తమ న్యాయ్యాభి ప్రాయముల ప్రకటించుటకు ఈ పత్రిక యందు తావుండక తప్పదు కొన్ని హృదయములలో నీ విషయమున సందియము బాధించుచున్నట్లు తెలియుచున్నందున మేము విష్పష్టముగా చెప్పదలచిన విషయమేమన, మా పత్రిక యొక్క విధానము సంకుచితము కాదు. వ్యక్తుల యభి ప్రాయములు కొన్ని వేళల పరస్పర విరుద్ధములై యుండవచ్చును కాని పత్రిక యొక్క విధానము మాత్రము విశాలమైన దనియు, దేశీయులందు మత, సాంఘిక ఆర్థిక రాజకీయాది వివిధ విషయకాభివృద్ధిని పరిశీలించచు, దానిని పెంపొందించుటయే మా మనోరధ మనియు మేము ఘంటా పధముగ జాటుచున్నాము. నిజాం రాష్ట్రాంధ్ర సోదరులు ఈ పత్రికను ఉదార హృదయములతో పోషించి ఈ రాష్ట్రమున వాడిపోయియున్న ఆంధ్రాభిమానాంకురముల చిగుర్పజేసి, ఆంధ్రులందు నూతనజీవనమును ప్రతిష్ఠింతురుగాక! ఆరంభమైన పదవవత్సరము కాంతివంతమగు భవిష్యత్తును చేకూర్చునట్లును గ్రహించుగాక యని దేవుని ప్రార్థించుచున్నాము.