గోలకొండ పత్రిక సంపాదకీయాలు/స్వవిషయము
స్వవిషయము
(అక్షయనామ సంవత్సర నిజ చైత్ర బ॥ 13)
10 - 5 - 1926
అనేక విఘ్న ప్రతి బంధముల కోర్చి యెట్టకేలకు "గోలకొండ" పత్రిక నాంధ్రజనులకు సమర్పించుకొన గలిగితిమి. ఇదివఱకే విన్నవించిన రీతి నీపత్రిక యొక్క ముఖ్యోద్దేశము జనసేవయే కాని తదితర మేదియు గాదు. ఈ పత్రికా విషయమై కొన్ని సందేహములు తఱచుగా వినవచ్చుచున్నవి. వానినిందు మాచే నైనంతవరకు నివారింప బ్రయత్నించుచున్నాము.
ఈ పత్రిక వలన లాభమేమి? యని కొందరు ప్రశ్నించియున్నారు. వారెల్లప్పుడును బత్రికల జదువు వారే యైనను బత్రికల లాభము గనుగొనినట్టి వారలుగ గనుపింపరు. నేటి కాలమున నాగరికతయంతయు బత్రికలపై నాధారపడినదని యనవచ్చును. ప్రజలందుగాని, ప్రభుత్వమందుగాని, మంచిగనో చెడ్డగనో మార్పుగలిగించునది పత్రికల యొక్క మహాశక్తియే. ప్రపంచ మందలి పత్రికా ప్రచారము కల దేశములను బోల్చి చూచిన హిందూస్థానము చాల హీనస్థితి యందున్నది ప్రస్తుతము నిజాము రాష్ట్రమందు 65 లక్షల కన్న నెక్కు డాంధ్రులుండగా రెండు వార పత్రిక లుంట గొప్పలోటు. ఒక చిన్న తిరువాన్కూర్ సంస్థాన మందు నూర్ల కొలది నానా విధ పత్రికలుండ హైద్రాబాదులోని యాంధ్రులకై మూడవ పత్రిక యొకటి ప్రచారము చేసినందులకు మేము చింతింపము.
ఈ పత్రిక "రెడ్ల” కొఱకేర్పడినదని కొందరు శంకించి యున్నారు. రెడ్ల యొక్క అభివృద్ధిని గోరుచుండునదైన నితర శాఖల వారికి బ్రతికూలముగా నెప్పటికి నుండదని యందఱకును విశదపఱచుచున్నాము.
మేము హిందువులందే యన నేల మతాంతరావలంబకులందును భేదమేమాత్రమును జేయువారము కాము. ముఖ్యముగా నాంధ్రులలో నగ్ర జనులను వారిని మొదలుకొని యంత్య జన్ములను వారి వఱకును మేము సేవజేయ యత్నింపలము. ఇందులకై యందఱును దోడ్పడుదురు గాక.
ఈ పత్రిక చందా విశేషమేమో యని కొందఱు మిత్రులు మందలించిరి. బ్రిటిషు ప్రాంత మందలి యొకటి రెండు వార పత్రికలు తప్ప తక్కిన యన్ని పత్రికల కన్న దీని చందా తక్కువయని చెప్పగలము. అయిన నిది ప్రధమ ప్రయత్నమగుటచే నింతకన్న తక్కువ చేయజాలము. చందాదారులు విశేష సంఖ్యాకుకురై పత్రికకు - లాభమటుండనిండు - నష్టము రానిచో ముందు సంవత్సరము చందా తగ్గింప దలచియున్నాము.
నిజాము రాష్ట్ర మందలి జనులే యననేల మన దేశ మందలి యితర ప్రదేశము లందలి వారును ముఖ్యముగా వ్యవసాయముపై నాధారపడినవారు. ఈ పత్రిక యట్టి జనులకు జేతనైనంత వఱకు వ్యవసాయ సంబంధములగు వ్యాసములను వ్రాసియు వ్రాయించియు ప్రోత్సహించుచుండును. పరపతి సంఘములు (Co-Operative Society) వ్యవసాయకుల కెంతయో లాభకరములైనవి. వాని యుపకారములను జనులు సరిగా గ్రహించిన వారుకారు. ఏ తద్విషయమై తరచుగా మా పత్రిక యందు వ్రాయుచుందుము. ఈ పత్రిక హైద్రాబాదు రాష్ట్రములో విశేష ప్రచార మందుండగలదు. కావున తక్కువ సమాచారములను దెలుపుచు, బ్రత్యేకముగా నీ రాష్ట్రపు వార్తల ప్రకటించుచుందుము.
ఇదిగాక విద్యాభివృద్ధిని గుఱించియు, సంఘాభివృద్ధిని గుఱించియు దగు రీతుల బ్రయత్నించుచుందుము.
పై యంశములతో బాటు భాషాభివృద్ధికరములగు వాఙ్మయసేవయు చేయు చుందుము.
ఈ పత్రిక యింతవఱకే ప్రచురింపబడి యుండవలసినది. కాని మా స్వాధీనమునలేని యనేకాంతరాయములచే మే మాలసింపవలసి వచ్చెను. ఆంధ్రలోకము మమ్ము క్షమింతురని ప్రార్థన.
ఈ పత్రిక నిర్విఘ్నముగా దన విధిని నెరవేర్చుట యందు, దైవము, ప్రభుత్వము, ప్రజ, మాకు దోడ్పడుగాతయని ప్రార్థించుచున్నాము.