గోలకొండ పత్రిక సంపాదకీయాలు/స్త్రీ విద్యా మహాసభ
స్త్రీ విద్యా మహాసభ
15 - 2 - 1928
స్త్రీల యభివృద్ధి యెడ నానాటికి శ్రద్ధ హెచ్చుచుండుట సంతోషకరము. అందును, తమ అభివృద్ధికై పురుషులపైననే ఆధారపడియుండక, స్త్రీలు తమంతట తామే ప్రయత్నములు సలుపుచుండుట ప్రశంసార్హము, శుభకరము. కొలదికాలమునుండి, ప్రతి యేడును ఏదియో యొక స్త్రీల సమావేశము జరుగుచునే యున్నది. తీర్మానములలో తమ ఆశయములను, కోరికలను ప్రకంటిచుచు సంఘమున సంచలనము కలిగించుచునే యున్నారు. కానీ తదితర సమావేశముల కంటె మొన్నటి ఢిల్లీ సమావేశము కొన్ని విషయములలో నెగడదగినది. అలీగఢ్ విశ్వవిద్యాలయమునకు వైస్ ఛాన్సలర్‌ను, స్త్రీల అభ్యున్నతికై, విద్యా వ్యాప్తికై నిరంతర కృషి సలుపుచున్న భోపాలు మహారాణిగారీ సమావేశమునకు అధ్యక్షత వహించుట యెంతయు అదృష్టమనవచ్చును. అదియును గాక పాశ్చాత్య విజ్ఞాన పారీణయగు ఇర్విను ప్రభ్వి తమ అమూల్యమగు సందేశము నొసగి, ఈ సమావేశ సమాలోచనములకు వన్నెదెచ్చిరి. భారతదేశమందలి వివిధ ప్రాంతముల నుండి ప్రతినిధులు విచ్చేసి ఈ సభ యందు పాల్గొని, విపుల చర్చ యనంతరము గావింపబడిన తీర్మానములకు విలువను అపాదించిరి
స్త్రీలకు విద్య అత్యవసరమనియు, విద్యా వ్యాప్తికి పలు భాషలు, పేదరికము, అజ్ఞానము, ఉపేక్ష, ప్రతికూల ప్రజాభిప్రాయము, సాంఘిక నడతలు, ఆచారములు, రాజకీయములు, అంతరాయములు కల్పించుచున్న వనియు, బాల్యవివాహము, పరదాపద్ధతి నిరసించవలెననియు, ధృవపరుచుటలో విశేషమేమియు లేదు ఇవి యందరికి తెలిసిన విషయములే ఇందు ప్రశంసింప దగిన దేమియు లేదు.
ఈ సమావేశమును ముఖ్యముగా మూడు విషయములకై మేము అభినందించుచున్నాము. అందు మొదటిది బాలికలకు నిర్బంధ ప్రాధమిక విద్య ముఖ్యమని నిర్ధారణ చేయుచు, దీనికై ప్రభుత్వము వారిని, స్థానిక సంఘము లను, తగిన ఆర్థిక సౌకర్యముల నొసగవలెనని కోరునది కేవలము అస్పష్టముగ, ప్రయోజన హీనముగ, విద్య కావలెనని ఉపన్యాసములిచ్చి తనివిజెందక యా కోరిక కార్య రూపముగ ఫలవంతమగుటకు గాను ప్రభుత్వమును హెచ్చరించుట సమంజసము. స్థాయి సంఘము వారీ తీర్మానమును అనుసరించి విద్యాశాఖాధికారులకు ఒత్తిడి కలుగజేసినచో మంగళకరమగు ఫలితములు బడయవచ్చును.
ఈ సందర్భమున భోపాలు మహారాణి గారి సూచన యెంతయు బొగడ దగియున్నది ప్రభుత్వము వారు పూనుకొనిన వరకు చేతులు ముడుచుకొని వేచియుండుట యుక్తము కాదు. అదియునుంగాక భారత ప్రజలు కడుపేదవారు. సగటున ఒక్కొక్కరికి నెలకు రూ.2-8-0 మాత్రమే ఆదాయమని గమనించవలెను. ఇట్టి తఱి, ప్రతి గృహస్థును తమ బిడ్డల విద్య గూర్చి తగినంత ధనము వెచ్చింపలేడుగదా! ఇట్టి నిరుపేదల కొరకు ఒక మంచి పద్ధతిని మహారాణి గారు సూచించియున్నారు. విద్యావతి యగు ప్రతి స్త్రీయును తన తీరుబడి కాలములో కొంత సమయమీ బీద బిడ్డల బోధనకై వినియోగించినచో దేశమునకు అమూల్యమగు సేవచేసిన వారగుదురు. దీని వలన దీని వలన ప్రస్తుతపు పాఠశాలల కొరతయు, ఉపాధ్యాయుల కొరతయు కొంత వరకు దీరును
స్త్రీ విద్యా నిరూపణ గూర్చి జరిగిన చర్చ కొనియాడదగిన రెండవ విషయము. నేటి బాలికల విద్యావిధానము, బాలుర విద్యావిధానమునే అనుకరించి యున్నది ఇది సరియయిన పద్దతి కాదు దీని వలన స్త్రీ విద్య యొక్క ముఖ్యాశయములు విఫలమయి పోవుచున్నవి శారీరక, మానసిక, నైతికాభివృద్ధికి దోడ్పడునది విద్య పురుషుల ప్రయత్నములకు చేదోడు వాదోడుగ నుండి, కష్ట సమయములలో నాదరణ నొసగుచు, గృహమును శాంతి సుఖధామముగ చేయుటకుగాను విజ్ఞాన వికాసము నొసగుట స్త్రీ విద్య యొక్క ముఖ్యాశయము. పురుషుల కొరకు ఏర్పరచబడిన విద్యా విధానమును అనుసరించి యుండినచో, స్త్రీ విద్య యీ ఆశయమును పూర్తిచేయజాలదు అట్టి విద్య నిష్ఫలము.
స్త్రీల యవసరములు వేరు. వానిని గుర్తెరిగి తదను గుణ్యముగ విద్య గరుపవలెను. అనుదిన జీవనమున కుపయోగపడునటుల గృహమేధి అర్థ శాస్త్రము, (Domestic Economy) ఆరోగ్య సూత్రములు, చేతి పనులు మున్నగునవి వీరికి తప్పక గరుపవలెను తదుపరి కళలు, శాస్త్రములు మొదలుగా గల ఉన్నత విద్యలు వలయువారు అభ్యసించుటకయి ప్రత్యేకముగ ఏర్పాటులు చేయవచ్చును విద్యా విధానములో ఇండియా నేడొక మార్గ సంధిని జేరి యున్నది. ఇక మీదట స్త్రీలు ఏ మార్గము నవలంబించవలెనో నిశ్చయించునెడ పై విషయమును శ్రద్ధతో గమమనించవలెను.
ఇక మూడవ విషయము ఉపాధ్యాయినుల ఆవశ్యకత బోధకులు (Teachers) సభ్యతా సూత్రధారులు. ఏ జాతి ప్రతిభయైనను వీరి కృషి ఫలితమే చిన్న పిల్లల బోధనకు పురుషులకంటె స్త్రీల నియోగించుట శ్రేష్ఠము. శాంతి, సహనము, సానుభూతి వీరియందు ఎక్కువ అందుచే చిన్నపిల్లల మనోవైఖరిని గ్రహించుట యందును, తదనుగుణ్యముగ బోధించి పాఠముల నచ్చ జెప్పుటయందును వీరు విజయవంతులుగ నుందురు. ఈ యవసరమును, బాలికా పాఠశాలల యవసరములను, పూర్తిజేయుట కెందరో సుశిక్షితులగు ఉపాధ్యాయినులు కావలసియున్నారు ఒక స్త్రీ కేవలము పరిజ్ఞానమున్నంతమాత్రముననే సద్బోధకురాలు కానేరదు. దీర్ఘ దృష్టి, స్వార్థ త్యాగము, వృత్తియందు శ్రద్ధా భక్తులు, కలిగియుండవలెను. విద్యా బోధన అత్యుత్తమ వృత్తి యనియు దాని నవలంబించుట గౌరవ ప్రదమనియు ప్రతి బోధకురాలును నమ్మి కార్యమునకు ఉపక్రమించవలెను అప్పుడే వారి కృషి దివ్యమగు ఫలితములకు కారణమగును. ఈ ఉన్నత పదవిని స్వీకరించుటకు ఉత్తమ తరగతుల స్త్రీలు పూనుకొనవలెను. ఈ వృత్తి యెడ నేడుగల తూష్ణీం భావము మాని, భక్తి మర్యాదలతో జూచి, బోధకులకు సౌకర్యములు కలిగించుచు, ప్రోత్సాహము నొసగిన గాని ఈ అవసరము పూర్తి కాజాలదు. అంతవరకు విద్యా వ్యాప్తికి నిరోధము కలుగుచునే యుండును. కాన ఈ బోధకుల శిక్షణ కొరకు ప్రభుత్వము వారు బోధనాలయముల స్థాపించు నటుల స్త్రీ విద్యా సంఘము వారు ఒత్తిడి కలిగించవలెను.