Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/సిరిసిల్ల ఆంధ్ర మహాసభ

వికీసోర్స్ నుండి


సిరిసిల్ల ఆంధ్ర మహాసభ

9 - 1 - 1936

ఈసారి సిరిసిల్లలో జరిగిన చతుర్థ నిజాం రాష్ట్రాంధ్ర మహాసభకు పోయిన యెవని నడిగినను, ఇటువంటి మహోత్సవము యిదివరకెన్నడు గాని యీ సభలు జరిగి యుండలేదనువారే ఈ మాటను విన్న ప్రతివాడును తన మిత్రుడు తనను పిలుచుకొనిపోనందుకు తప్పుపట్టువాడే

1200 చదరపు గజాలు విస్తీర్ణము గల సభా మంటపములో జనము - టిక్కెట్లు కొని ప్రతినిధులైనవారును ప్రేక్షకులైన వారును మాత్రమే - మహాసభ సమావేశములోనున్న వేళల క్రిక్కిరిసి యుండుటయే గాక స్థలము లేని వారో లేక టిక్కెట్లు కొనలేనివారో అనేకులు సభా మండపమునకు వెలుపల జీవరక్షా ప్రచారము మున్నగు ప్రచారములు చేయవచ్చిన వారికిని ప్రదర్శనములకును పని పెట్టుచుండిరట హైద్రాబాదు నగరము నుండి పోయిన 13 బస్సులతో సహా మొత్తము వివిధ ప్రాంతముల నుండి 30 బస్సులలో జనము వచ్చిరట. ఇదేమో గొప్ప సంబరముగానున్నది, చూతమని అనేకులు చుట్టుప్రక్కల పల్లెల నుండి మొదటి రోజు వచ్చిరట ఇదంతయు మన ఆంధ్ర మహాసభను గూర్చి యెక్కువ ప్రచారము జరిగియుండుటను, అనేకులకు మన రాష్ట్రీయాంధ్రులకు తమ అభివృద్ధియే ఉద్దేశముగా గల యీ సభల యందు ఆదరమును సూచించును

అంతే కాదు మొదట మొదట యీ ఆంధ్ర మహాసభల వృత్తాంతములు ఈ ఒక్క పత్రికలో తెలిసికొనవలసి యుండు నట్లుండెడిది పిమ్మట హైద్రాబాదు బులెటిను పత్రిక సానుభూతి లభించెను అటు తర్వాత బ్రిటిషిండియాలో ఒక్కటే దిన పత్రికగా నుండిన ఆంధ్ర పత్రిక యందు వచ్చుట ప్రారంభమయ్యెను గత ఖమ్మం మహాసభ నుండి ఆ అదృష్టము పట్టెను ఈసారి స్థానిక ఉర్దూ దినపత్రికలన్నియును ఆ వార్తలను ప్రకటించుటయేగాక ప్రశంసించను గూడ ప్రశంసించినవి ఇందుచే ఉర్దూ పత్రికలను మాత్రమే విశేషముగా చూచు అనేకులు పెద్దలు అధ్యక్షునికి తమ సంతోషమును తెలియబరచినట్లు వినుచున్నాము. ఆఖరుకు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికలో గూడ కొద్దియో గొప్పయో యీ సభ వార్త వచ్చినది కాబట్టి ఆంధ్రోద్యమ అంకురము నానా దిక్కుల కొమ్మలను వేయనారంభించినదన్నమాట!

ఈ సభకు రామణీయకమును ఆపాదించిన మరికొన్ని విశేషములలో వ్యాయామపు పోటీలును, సాంఘిక నాటకములును, ఆర్యసమాజము వారి వైదిక ధర్మ ప్రచారమును చేరి యున్నవి ప్రభుత్వము వారి వ్యవసాయ పరిశ్రమల శాఖల నవీనాభివృద్ధి ప్రదర్శనములును జీవరక్షా ప్రచారక మండలి వారి మ్యాజిక్ లాంతరు ప్రదర్శనములును ఖమ్మంలో వలెనే ఈ సభలోను జరిగినవి

మేము యిదివరకే తెల్పియున్నట్లు యీ సిరిసిల్ల సభకు విశేషత్వమును ఒనగూర్చు రెండంశములు ఏవనగా - 1 స్వయముగా ఉత్సాహముతో ఏర్పడి శ్రద్ధతో పని చేసిన ఆహ్వాన సంఘము లభించుట, 2 మన ఆంధ్రోద్యమ పితామహుడు అధ్యక్షుడగుట

ఇపుడు పైన చెప్పబడిన విశేషములే గాక ముఖ్యాతి ముఖ్యమయిన మరియొక అంశము పేర్కొన దగినది గలదు గత ఖమ్మం మహా సభలో యెవరో సనాతనులమని ప్రకటించుకొనుచు వివాహవయో నిర్ణయమునకు సంబంధించిన తీర్మానము మున్నగు రెండు మూడు సంఘ సంస్కరణపు తీర్మానములను తుదకు చర్చకైనను రానీయకుండ, పడగొట్టి యుండిరి వాటితో కూడ మహాసభకు సంబంధించిన నియమావళి (చిత్తు)కి కూడ దృష్టి దోషము తగిలెను ఈసారి సభలోనైనసు యీ నియమావళి గతి యేమగునో యేమో యని అనుకొనుచుండ, యే విధమయిన ఆటంకము లేకుండ అది ఆమోదించబడినది అది యెట్లన్నను నిరుడు సంఘ సంస్కరణ తీర్మానములు పడగొట్టబడినపుడు అనేకులు సంస్కరణ ఉత్సాహులు, ఎవరో తీర్మానములను పడగొట్టజూచుటయు, మీరు లొంగుటయునాయని నాయకులపై చాల కోపించి యుండిరి 1 ఇపుడా పక్షమువారు మొదటి విజయము పొందినారు. బాలికలకు 15 ఏండ్ల వయస్సు వచ్చు వరకు వివాహము చేయరాదని సంస్కరణోత్సాహుల వాదము దీనికి సనాతనుల పక్షము తీవ్రముగా ప్రతిఘటించి ఓడిపోయినను పిమ్మట మహాసభలో ఆ తీర్మానముపై చర్చ జరిగి సంస్కరణ ప్రతిఘటన ఏవో రెండు ఓట్లు సంపాదించుకొని ఓడునంతవరకు తృప్తి నొందలేదు

2 ఇంకొకటి సంస్కరణోత్సాహుల విజయము ఇంతకంటె ముఖ్యమైనది గలదు మహాసభ కార్యక్రమ మంతము తెలుగు భాషలోనే నుండవలసినదని వారు పట్టుబట్టిరి. అందుచే నియమావళిలో ఆ నియమము చేర్చక తప్పినది కాదు అంతేగాక ఈసారి సభా కార్యక్రమ మంతయు తెలుగు భాషలోనే జరిగినదని వినుచున్నాము ఎంత గొప్పవారి కయినను గూడ యీ విషయములో 'మాఫీ' యివ్వనేయివ్వరాదని పై సంస్కరణోత్సాహుల పట్టు. వారి యీ పట్టు దివ్యముగా నెగ్గినందుకు వారిని మిక్కిలి అభినందించుచున్నాము "వేములవాడ భీమ కవి నగరము" లో జరుగు మహాసభలో ప్రసంగములు ఆంధ్రేతర భాషలోనా? దాదాపు సగము మందిని తెలుగు మాతృ భాషగా గలవారిని కడుపులో పెట్టుకొనియున్న మన నిజాం రాష్ట్రములో ప్రభుత్వ విధాన మందు తెలుగు భాషద్వారా విద్యనేర్పు పద్ధతికి నియమములలో "ప్రైమరీ" దశలోనే స్వస్తి చెప్పబడెను. ఆంధ్ర భాషా వ్యవహరమును ప్రోత్సహించుటకు అటు ప్రభుత్వమువారికి సాధ్యము కానేలేదు కదా? యిటు ప్రత్యేకము ఆంధ్రుల కొరకై ముఖ్యముగా సాంఘిక భాషాభివృద్ధి కొరకై పాటుపడుచున్నట్లు చెప్పకొను ఆంధ్రమహాసభ కూడ యితర భాషా దాస్యమును (జ్ఞానమును అని మేము చెప్పుటలేదు. గమనించుడు) వదలించుకొన జాలనిచో అది యెంత లోపమోయిప్పుడు మనస్సులి కెక్కునట్లు చేయబడినది ఆంధ్రులకు ప్రత్యేకముగ నొక సంస్థ అవసరమైనచో అది ముఖ్యముగా ఆంధ్రులకును తదితరులకును భాషా భేదము ఉండుట వలననే యని తలచవలసియున్నది ఇతర సాంఘిక వ్యవహారములు మున్నగు వాటిలో పాశ్చాత్య నాగరికతా సంపర్కముచే అధికముగా మార్పు కలిగి యితర సంఘములకును అట్టి సమస్యలే యేర్పడియున్నవి కాని భావ భిన్న మగుటచే తెలుగు మాత్రమే తెలిసిన వారు ఆ సమస్యలను చర్చించుటకై యితరులతో చేర వీలు లేకుండెను మన ఆంధ్ర మహాసభ అట్టి లోపమును తీర్చుటకే అవసరమగు చున్నదని తలచెదము. అట్లైనచో తెలుగు మాత్రమే తెలిసిన సభ్యులకు అర్థము కానట్లు యితర భాషలలో కార్యక్రమము సాగించుట యెంత మాత్రము గాని తగదు!

మొత్తము మీద విశేషము లన్నియు ఒకసారి సింహావలోకనము చేసిన తర్వాత సిరిసిల్ల మహాసభకు ఆంధ్రోద్యమ చరిత్ర యందు వాస్తవమయిన ప్రాముఖ్యము నిచ్చునది - "ఆంధ్ర భాషా విజయము"న్ను దానికి మూలమయిన సంస్కరణోత్సాహుల విజయమున్ను అని చెప్పక తప్పదు ముందు ముందు యీ పక్షము అంతకంతకు ప్రబలమై ఆంధ్రోద్యమపు నావను వశపరచుకొన గల రోజు మాకు దూరమున నైనను స్పష్టముగా గోచరించుచున్నది



రామకృష్ణుని సందేశము

16 - 3 - 1936

మతము పేర ప్రాణములతో చెరలాటము జరుగుచున్న నేటి భారత దేశములో, శ్రీ రామకృష్ణుని వంటి మహాపురుషుల సందేశములను, వారల జన్మ దినోత్సవములను, శతాబ్ద్యుత్సవములను, వేటినైననుసరే సందర్భముగా జేసికొని పవిత్ర హృదయములతో మననము చేయుట ఎంతయో ముఖ్య కర్తవ్యము

శ్రీ రామకృష్ణ పరమహంసగారి మహా వాక్యములు శాస్త్ర పారంగతులు పూర్వపక్ష సిద్ధాంతములతో కాలక్షేపము చేయుటకైగాక, హృదయ పూర్వకముగా ఆచరించువారలకై చెప్పబడినవి శ్రీ రామకృష్ణుడు భగవంతుని పొందుటకై ఒక్క హిందూ మతములోనేగాక, ఇస్లాం మతము, క్రైస్తవ మతములలో కూడ ఆచరణీయములగు సాధన లన్నింటిని పరమ విశ్వాసముతో అభ్యాసముచేసి, తుదకు గ్రహించినదేమనగా, నానా మతములును భగవంతుని పొందుటకు వేర్వేరు మార్గములు, అందరికిని పొందదగిన దొక్కటె వస్తువు, భగవంతుడు, ఈ మత భేదములు దేశకాలాద్యవస్థా భేదములను బట్టి ఏర్పడినవి అగుటంజేసి ఒక మతము కంటె ఇంకొకటి గొప్ప అను మాటయే లేదు, ఇప్పుడుండు మతములలో నేవిగాని సంపూర్ణము గావు. అన్ని మతముల నుండి ప్రధాన సూత్రములను అన్నింటిని ఒకటిగా చేర్చినచో సంపూర్ణ మతము ఏర్పడవచ్చును; కాబట్టి తన మతమున కంటె ఇతర మతములు తక్కువయని యెవరును వాటిని చిన్నజేయవీలులేదు, అయ్యో దేశములో ఇన్ని మత భేదములున్నవే యని యెవరును విచారపడనక్కరలేదు, భిన్న దేశ కాలాది పరిస్థితులు ఉండునంత వరకు మత భేదములును ప్రకృతి సిద్దములే యగును. మతము భిన్నమను కారణమున ఎచటెచట వైరములున్నవో, ఆచటచట యంతయు స్వామి రామకృష్ణ పరమహంసగారి సందేశము హృదయములను ఆవర్జించునట్లు సంతత యత్నము అవసరము.