Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/సత్యమును మెచ్చిన మంత్రి

వికీసోర్స్ నుండి


సత్యమును మెచ్చిన మంత్రి

12-4-1933

ఉదకమండలములో గణేశ దేవాలయమునకు శంకుస్థాపన జేయుటకై హిందువు లాహ్వానింపగా ఆదరముతో వారి కోరికను దీర్చిన సర్ మీర్జాయి స్మెయిల్ మహాశయుని దివానుగా నుంచుకొనిన మైసూరు సంస్థానము గొప్ప అదృష్టముగలదని చెప్పవచ్చును. సర్ మీర్జా యిస్మెయిల్‌గారి యందు విద్య నిజముగా ప్రయోజనము గలదైనదని చెప్పవలయును. శంకుస్థాపనోత్సవ సమయమున మైసూరు దివానుగారు గావించిన యుపన్యాసము శ్రోతల హృదయములనేగాక పాఠకుల హృదయములను కూడ ప్రేమరసముచే పరిపూత మొనర్ప జాలియున్నదని మా విశ్వాసము సత్యమును మెచ్చగల క్షమాగుణము నీయని విద్య సంస్కారఫలహీనమైనది. సర్ ఇస్మేలుగారు సత్యమును నహించుటయే గాక మెచ్చను గూడ మెచ్చినారు. సత్యము మెప్పుపొందిన చోటు ప్రేమకు స్థానమగును

కొందరికి గాంధీ మహాత్ముని మొదటినుండి కొంతవరకు గూడ ద్వేషించుట గుణమైనది. మైసూరు దివాను ఇస్మేలుగారు మహాత్ముడు హరిజనుల నుద్ధరించుటకై చేయు సేవను మహాదరముతో ప్రశంసించిరి. హరిజనోద్ధరణముచే హిందూమతము యొక్క ఉత్తరక్షేమము స్థిరమగుననియు, హిందూమతము క్షేమముగ నుండుటవలన ఇండియా అంతయు క్షేమముగ నుండుననియు చెప్పినట్లు మీర్జాగారిని ప్రేరేపించిన ఉదారభావము అద్భుతము ఈ మతము ప్రతి భారతీయుని ఆవేశించు నెడల, భారత భూమి ఆచిరకాలములో మహోత్కర్షమును పొందగలదనుటకు సంశయము లేదని మా అభిప్రాయము. తక్కిన మతములను దూషించి తన మతమునే నమ్మకపోయినను, అందరిచే బలాత్కారముగ అవలంబింపజేయ జూచువారికి మీర్జాగారి మహా వాక్యము పశ్చాత్తాపము కలిగించవలయును. సర్ మీర్జా ఇస్మేయిల్‌గారు మహమ్మదీయులేయైనను హిందూమతమును గూర్చి వారు గావించు సంస్తవమును చూడుడు. విద్యాసంస్కృతబుద్ధులై సత్యమును గౌరవించుటకు తగినంత సహనభావముగల ఎవరుగాని మీర్జాగారి అభిప్రాయమును ఎదిరింపరు హిందూమతము పరమతస్థులను తన వంకకు త్రిప్పుకొనుటకై వారిని బలాత్కరించునదికాదు. హిందూమతమును విశ్వసించువారు పరమతములను దూషింపక గౌరవింపగల్గుటయే హిందూమతము యొక్క విశేషము తన మతమును నమ్మి పరమతస్థులను సహింపవలసినదని బోధించు మతమేదైనయున్నచో అది గౌరవమునకు అనర్హమైనది అది మతమని అనిపించుకొనుటకే తగదని మైసూరు దివానుగారి నమ్మకము. వాస్తవమీరీతిగనుండ దేవాలయముల పేరు పెట్టియు, మసీదుల పేరు పరస్పర రక్తపాతములకు కర్తలగు హిందువులుగాని, మహమ్మదీయులుగాని చదివినవారైనను చదువువలని ఫలమును పొందనివారే యని చెప్పవలసియున్నది మహమ్మదీయుల మసీదుల ఎదుట హిందువులు వాద్యములు మ్రోయింపకూడదు. అను విధిని వారి మతము చేయుచున్నదని మేము తలపజాలము. అది ఎటులున్నను హిందూమతము దేవాలయములవద్ద మహమ్మదీయులు తమ వాద్యములను మ్రోయింపరాదని విధించుటలేదు. ఒక మసీదు ఎదుటగాని, దేవాలయము ఎదుటగాని వాద్యములు వాయించుటను గూర్చిన విషయములలో ప్రభుత్వము వారి చర్యలకు న్యాయశాస్త్రము ఆధారముగ నుండవలెను. ప్రజలు ఎవరుగాని ఉపయోగించుటకు హక్కుగల వీథిలో వారు సాధారణముగ ఉత్సవములను జరుపుకొనుటకు అభ్యంతరము కలిగింపబడరాదు. అట్టి యభ్యంతరము కలిగించువారినుండి ప్రభుత్వమువారు శాంతిని కాపాడవలసియున్నది అట్లుగాక బలవంతులమని చెప్పి ప్రజల హక్కులకు భంగము కలిగించినవారిచే అనుకూలముగ ప్రవర్తించుట వలన ఆ ప్రభుత్వము యొక్క శక్తియందు ప్రజల విశ్వాసము నశించును

అట్లనుటచే ఉపద్రవమును సూచించుట మా తలపు గాదు. సర్ మీర్జా ఇస్మేయిల్‌గారి నిష్పక్షపాతబుద్ధి ప్రతి ప్రభుత్వమును ఆవేశింపవలెను. మహమ్మదీయుల మసీదుల దగ్గరకు బోయి తమ వాద్యములందలి నేర్పును జూపవలెనని హిందువులకు అభిప్రాయమే లేదు. కాబట్టి గతమును గతమునుగ తలచి హిందూ ముసల్మానులు ఒకరొకరి మతముల యందలి గుణముల గ్రహించి పరస్పర ప్రేమతో భావిభారతీయాభివృద్ధికి యత్నించెదరుగాక ఉదకమండలములలో సర్ మీర్జా ఇస్మేయిల్ మహాశయుడు శంకుస్థాపన చేసిన గణేశ దేవాలయము నుండి "మనము ఈ మతములో ఈ పరిస్థితులలో పుట్టవలెనని మొదట కోరియుండలేదు. మనము పుట్టినపుడు మనకు ఏర్పడిన ప్రకృతిసిద్ధ గుణములు మనము కోరినవికావు. మంచిగాని, చెడుగాని అవి తర్వాత ఎప్పుడో మనపై వేయబడినవి అందువల్ల వేర్వేరు మతముల నవలంబించిన వార్త యైనను మనము ఒకరి నొకరు సోదరునివలె జూచుట ముఖ్యము కాదా!" అను హిందూ ముసల్మాను ప్రేమసందేశము నాల్గు దిక్కులకు పోయి నిర్విఘ్నముగా జయించు గాత!