Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/సంస్థాన ప్రజల ఘోష

వికీసోర్స్ నుండి


సంస్థాన ప్రజల ఘోష

26 - 7 - 1933

భారత సంస్థాన ప్రజల స్థితిని జూడ దిక్కులేనట్లున్నది. వారు తమ రాష్ట్రములో తమ కోరికలను తెలుపుకొనజాలకుండుటచే రాష్ట్రాంతరమునకు పోయి అచటనుండి తెలుపవలసి వచ్చుట సంతాపకరము వారి కోరికలు అందరిచేతను దూషింపబడునంత నింద్యములైనచో వాటిని గూర్చి ఏ వాదము అక్కరలేదు. తమ పాలనకు తామే బాధ్యులమై యుండవలెనను ప్రజల కోరిక యింతవరకును అర్ధశాస్త్రవేత్తలచే దూషింపబడలేదు అంతేగాక ఈ కాలమున నేటికిని "ఏ రాజ్యమందుగాని ప్రభుత్వము ప్రజలదే" యనుభావము ప్రతి నాగరిక రాజ్యమందును అంగీకృతమై యున్నది ప్రజాస్వామిక పాలన కాలము అంతరింపలేదనియే మా నమ్మకము. కొందరు ఇటలీ, జర్మనీ మొదలగు ప్రాశ్చాత్య దేశములందు నియంతృత్వపాలన (Dictatorship) యున్నది గనుక ప్రజాస్వామిక ప్రభుత్వములంతరించినవని వాదింతురు. అచటనైనను ప్రజలు సమ్మతించినందువల్లనే వారు నియంతలకు అవసరమగు స్థితి యేర్పడినది గనుకనే ప్రజలు సమ్మతించిరి అమెరికాలో రూజ్వెల్టుగారి అధికారము ఈమధ్య ప్రబలమైనదియు నీ కారణముచేతనే కావున ప్రజాసామిత్వమునకు భంగము రాలేదు. ఇట్లు ప్రపంచమందు చుట్టుప్రక్కల రాజ్యములలో ప్రజలు స్వాతంత్ర్యమును రుచి చూచుచుండ భారత సంస్థాన ప్రజలు దానిచే ఆకర్షింప బడకుండజాలరు. రుచిచూతమన్న వారికి తమ రాజ్యములో అధి లభింపదాయెను. మాకది కావలెనని తమ ప్రభువుగారికి తెలియునట్లు చెప్పుకొనకూడదాయెను. చెప్పుకొన్న చోటనైనను వారు మనష్యులవలె వారి కోరికలు కోరికలవలె ఆదరింపబడవాయె. ఇంక వారేమి చేయగలరు" తమ కోరికలు సాధించుకొనుటకై యితర రాష్ట్రముల యొక్క శరణుజొచ్చుచున్నారు

బొంబాయిలో ఈ జూలై నెల 22-23వ తేదులతో జరిగిన సంస్థాన ప్రజా మహాసభ యొక్క చతుర్థ సమావేశమునందు ఆమోదింపబడిన తీర్మాన ములు ఈ విషయమును అన్నిటికంటె ఎక్కువ స్పష్టముగా సూచించుచున్నవి ఆ తీర్మానములలో నేమి కలదు? సంస్థాన ప్రజలు 8 కోట్లమంది యున్నను అఖిలభారత సమాహరము (ఆలిండియా ఫెడరేషను)ను గూర్చిన చర్చలలో వారి ప్రతినిధులకు తావీయలేదను కోపమును ఒక తీర్మానమును తెలుపుచున్నది. సంస్థాన ప్రజల ప్రతినిధులను శాసనసభలలో చేర్చుటకు ఏర్పాటులేనిది గనుక తెల్లకాగితపు సమాహార (ఫెడరలు) పద్ధతి యిష్టము కాదని యింకొక తీర్మానము చెప్పుచున్నది మరికొన్ని తీర్మానములలో వ్యక్తి స్వాతంత్ర్యము, సంఘముగ చేరుటకు హక్కు మొదలగు హక్కులు కోరబడినవి మరియొక తీర్మానము భావి రాజ్యాంగమందు ప్రభుత్వమనునది ప్రజల సొత్తుగా నుండవలెనని చెప్పుచున్నది. తీర్మానములలో సంస్థాన ప్రజల యనుమాన బుద్ధిని తెలుపునట్టివి కొన్ని గలపు ఆ అనుమాన మేమన సంస్థానాధిపతులకు తమకు బాధ్యతాయుత ప్రభుత్వము నిచ్చు కోరికలేదు అనునది అందుకై ప్రతి సంస్థానము ఫెడరేషనులో విధిగా చేరవలసినట్లు నియమింపబడవలెననియు, అట్లు చేరు ప్రతి సంస్థానములోను బాధ్యతాయుత ప్రభుత్వము విధిగా స్థాపింపబడవలెననియు మహాసభవారు తీర్మానించిరి ఇంతజేసినను ఆఖరుకు చర్యలలో సంస్థానాధిపులు ప్రజా స్వాతంత్ర్యమునకు భంగము కలిగించిన గతియేమి అనుసంశయముతో, ఫెడరలు చట్టముల నుల్లఘించిన సంస్థానాధిపతులపై ఫెడరలు కోర్టులో దావా చేయుటకు సంస్థానాధికారులకు హక్కుండ వలెననియు, ఎక్కడ దుష్పరిపాలనము జరుగునో ఆ సంస్థానము యొక్క ప్రజలు కోరిన వెంటనే అచటి అధిపతిని సార్వభౌముడు తొలగింపవలెననియు మహాసభ తీర్మానించెను. ఈ తీర్మానములను సంస్థాన ప్రజల కోరికలను సాధించుటకై ఇండియాలోను ఇంగ్లాండులోను ప్రచారము చేయబడవలెనను తీర్మానమును సంస్థాన ప్రజలకు తమ అధిపతులపై విశ్వాసమెట్లు నశించుచున్నదో తెలుపుచున్నది

సంస్థానప్రజల యనుమానము రెండు విధములుగ నున్నది. పై జెప్పినట్టిది మొదటిది. ఇక రెండవదానిని గూర్చి విమర్శించెదము. తమ కోరికలను సాధించుకొనుటకై సంస్థాన ప్రజలు పరప్రభువు ( బ్రిటిషు ప్రభుత్వము )ను, అది శరణుజొచ్చుచున్నారు ఇద్దరికి అనుకూల్యము లేనప్పుడు - పిల్లులు కొట్లాడుటచే కోతివలె - మూడవ వానికి లాభమను నీతికూడ వారి హృదయములను బాధించు చున్నది. ఆఖరుకు సంస్థానాధిపతులను, సంస్థాన ప్రజలను కూడ తక్కువ జేసి ఎవరు శరణముగా వేడబడుచున్నారో వారి వారి లాభమును జూచుకొని ఊరకున్నచో గతియేమి ? కనుక సంస్థాన ప్రజల యభిమతము లేనిదే వారి యధిపతిని సింహాసనము నుండి తొలగింపరాదనియు, తొలగించుచోట్లలో బ్రిటిషు యిండియా నుండి ఎగుమతిచేసిన సివిలు సర్వీసు ఉద్యోగులనుగాక సంస్థాన ప్రజల ప్రతినిధులతో నేర్పడబడిన ఒక కమిటీని పరిపాలక స్థానమున నియమింప వలసినదనియు తీర్మానింపబడినది కాశ్మీరము, ఆల్వారు సంస్థానముల నిదర్శనమును మనసు నందుంచుకొనియే ఈ తీర్మానమును గావింపబడెను మహాసభకు అధ్యక్షతవహించిన యన్ సి కేల్కరుగారు చెప్పినట్లు సంస్థానములలో బ్రిటిషు మంత్రులను నియమించుటచే బ్రిటిషు యిండియాలో భారతీయులకు ఉద్యోగము లీయబడుచుండుట వలన పోయిన స్థానములు బ్రిటిషువారికి సంస్థానములలో భర్తియగుటయేగాక, ఫెడరేషన్ ఒకవేళ యేర్పడినచో అందులో సంస్థాన ప్రతినిధులమను పేరుతో ఈ విదేశీయులుచేరి ప్రజల కోరికలతో సంఘర్షణ యున్నప్పుడు బ్రిటీషు ప్రభుత్వమువారి కోరికలనే సాధించుటకు సాధన భూతులై యుండగలరు.

ఇట్లు మొత్తముమీద భారత సంస్థాన ప్రజామహాసభవారి తీర్మానములు సంస్థాన ప్రజలకు ఇటుజూచినను అటుజూచినను అనుమానమేయను స్థితిని తెల్పుచున్నవి సంస్థానములలో రాజులుండియు తమ ప్రజలను రంజింపజేయక వారి నిట్టిస్థితిలో బెట్టుట ఎంతమాత్రము గర్వింప దగినదిగాదు కొడుకు తండ్రిని అనుమానించి ఇతరుల సహాయమునాశించుట తండ్రికా లేక కొడుకునకా అపకీర్తికరము? రాజైనవాడు ప్రజల కందరికి తండ్రివంటివాడు అను అభిప్రాయము నిల్చునుగాని ప్రజలను ప్రాణములేని తన సొంత సొత్తువలె రాజుపయోగించుకొనుటకు హక్కుగలదు అను అభిప్రాయమును ఎవరును వివేకవంతులు మెచ్చజాలరు అట్టి అభిప్రాయమునకు తావుండిన చోట్లలో నెల్ల ఉపద్రవమే ఫలితమైనది కాబట్టి సంస్థానాధిపతులు తమ ప్రజల జ్ఞాన సామర్ధ్యములను బట్టి క్రమ క్రమముగా బాధ్యతాయుత ప్రభుత్వమును హెచ్చించుచు పూర్తి జేయుటకు శాసనములను జాగుచేయక ఏర్పరుపవలెను ఇంటిలో పెద్ద పెరిగిన కొడుకునకు ఇంటి పెత్తనమంతయు ఒప్పజెప్పినట్లే రాజ్యపద్ధతియు నుండవలెను. ఇంటి విషయములో వలెనే రాజ్య విషయమును పరస్పరానురాగ నిబద్ధమై యుండవలెను. అనగా తమ ప్రజలకు ఏమి బాధలున్నను సంస్థానముల ప్రభుత్వమువారు సంతోషముతో తీర్చుచు వారికి మనఃక్లేశము గలుగనీయకుండ పాలింపవలెను. అట్టి రాజ్యములను ప్రజలెన్నటికిని విడువగోరరు ఈ బుద్ధిని భగవంతుడు కలిగించుగాక!