గోలకొండ పత్రిక సంపాదకీయాలు/సంస్థానాధీశులు
ఆంధ్ర సభలు
24 - 11 - 1928
నవంబరు నెల 17, 18 తేదులలో నంద్యాలయందు ఆంధ్ర మహా సభ ఆంధ్ర రాష్ట్రీయ సభ గోరక్షణ సభ సమర్థులగు అధ్యక్షుల యాజమాన్యమున జయప్రదముగ జరిగినవి ఇదివరలో మేము సూచించిన రీతిగా ఆంధ్రమహా సభాధ్యక్షులగు ఆచార్య రాధాకృష్ణయ్య గారు ఆంధ్రులలో యుత్సాహమునకు తోడు కార్యదీక్ష యవసరమని నుడివిరి ఎన్నియో విద్యా సంస్థలు, ఉద్యమములు కార్యదీక్ష, లేనందున సన్నగిల్లినవి కనుక నీవిషయము గమనించుట ముఖ్యాతి ముఖ్యము
ఈ సంవత్సర మేలకో ఆంధ్ర మహాసభవారు నిజాం రాష్ట్రాంధ్రులపై తమ దృష్టిని ప్రసరింపజేసిరి రాజకీయ రాహిత్యసభలు సమావేశ పరచుటకు ప్రభుత్వాజ్ఞ అనవసరమనియు, నిజాం ప్రభుత్వము వారు ఇదివరకున్న అంక్ష తొలగించ వలయుననియు తీర్మానము గావించిరి ఇదియెంతయు ప్రశంసనీయము అయినను అఖిలాంధ్ర దేశము గూర్చి ఇంకను శ్రద్ధవహించుట లేదు. స్థాయి సంఘము వారు తగు రీతి పని జేయుటలేదు
రాష్ట్రీయ సభయందు నెహ్రూ నివేదిక అంగీకరింపబడుట శుభప్రదము. కాంగ్రెసు ఆదర్శము మార్చుటకై తీర్మానము తేబడెను. కాని అధ్యక్షులు క్రమ విరుద్ధమని త్రోసివేసిరి సైమను సంఘమును బహిస్కరించుటకై నిశ్చయింప బడెను ఇక తీర్మానముల ఆచరణకై నాయకులు కృషి సలిపెదరని నమ్మెదము. ఇది వాద వివాదములకు సమయము కాదు. లాలాజీవలె నిరంతరము నాయకులు కార్యాచరణయందే నిమగ్నులై యుండవలయును అది నివేశ స్వాతంత్ర్యమా? సంపూర్ణ స్వాతంత్ర్యమా యను చర్చ ఇక ముందుండదని తలంచెదము. ఆంధ్రులు తమ కర్తవ్యము నిర్వహించెదరు గాక !