గోలకొండ పత్రిక సంపాదకీయాలు/సంఘ దౌర్బల్యము
సంఘ దౌర్బల్యము
8 - 2 - 1928
ఇందూరు మహారాజు గారు మరల పత్రికల చర్చలలో ప్రధానులైరి. వీరికిఇదివరకే ఇద్దరు భార్యలున్నారు ఇంతటితో నిలువక వారు అమెరికా కన్యను వివాహమాడ నెంచినారు క్రైస్తవ న్యాయానుసారముగా నొక పురుషుడు ఒక స్త్రీ కన్న నెక్కుడుగా స్త్రీలను వివాహమాడరాదు. కాని హిందూ, మహమ్మదీయ మతములలో నిట్టిది ఎంతవరకు అయినను సాధ్యమై యున్నది. కావున మహారాజు గారు ఈ అమెరికా స్త్రీని హిందూ మతములో జేర్చి మూడవ వివాహమును గావింప నిశ్చయించిరి.
హిందూ సంఘములో నెవ్వరును ఈ స్త్రీని శుద్ధిచేసి హిందువుగా జేయ సమ్మతింప మిచే ముసల్మాను సంఘము వారు వీరిరువురిని ముసల్మానులనుజేసి వివాహము చేయుటకు అంగీకరించిరట ఈ వార్త కొందరి హిందువులకు రుచించదయ్యెను. తమ మతము యొక్క జనాభాలో నిద్దరు తగ్గిపోవుదురను భీతిచే మహారాజు గారికి తమ భావి వధువును హిందూ స్త్రీనిగా మార్చెదమని ఆహ్వాన మంపినారు.
ఈ వార్తలను జూచిన సత్యాన్వేషణ పరులందరు విచారపడ వలసియున్నది. నేడు ప్రపంచములో మతములన్నియు సంఖ్యను వృద్ధిచేయ గోరుచున్నవి గాని ప్రపంచమును వృద్ధి చేయ గోరుట లేదు ఈ కన్య కామమే ప్రధానము కలదై మతాంతరము స్వీకరించుచున్నదే కాని క్రైస్తవ మతమున కన్న హిందూ మతములో విశేషములు వున్నవని యెంచి మత స్వీకారము చేయుట లేదు. ఇట్లు చేయుట వలన నామె కుభయ మతములు కూడ బోధ కాలేదని విశదమగును. పైగా హిందూ మహమ్మదీయులు మత వ్యాప్తితో పరస్పరముగా పోటీలు కలిగియుండుట యుభయ సంఘములకు నష్టదాయకముగా నున్నది. సంఘము వృద్ధి కావలయుననిన మతములోని లోపములను బాపికొనవలయునే కాని లోపములను మతములో వృద్ధి చేయకూడదు
ఆంధ్రోద్యమము :
ఈ రాష్ట్రమందలి యాంధ్రోద్యమమును గురించిన విషయములు వేరుచో ప్రకటింపబడినవి. నిజాం రాష్ట్ర ఆంధ్రులలో నిరుత్సాహమునకు ఇపుడు అవసరమేమియు గనబడదు న్యాయబద్దులై సంఘాభివృద్ధికి మార్గదర్శకములగు ఉద్యమముల నెవ్వరును బ్రతిఘటింపజాలరు. ఉన్నత న్యాయస్థానపు తీర్పు ఇప్పుడందరకును తెలిసిన విషయము. అట్టిచో వాఙ్మయాభివృద్ధికిని, సాంఘికాభివృద్ధికిని, ప్రభుత్వోద్యోగులు ఆటంకములు కలిగింపనేరరు కొంత కాలము క్రిందట హైద్రాబాదులో జరిగిన హిందూ సాంఘిక మహాసభలో ఆంధ్రులు చాలా కొలదిగా నుండి యుండిరి. దీనివలన మనము మహారాష్ట్ర సోదరుల కన్న వెనుకబడి యున్నారమని విశదమగును. కావున ఇకముందైనను మనమీ లోపములను బాపికొనవలయును. రాష్ట్రీయ ఆంధ్రులు అందరును శ్రద్ధ వహింతురుగాక.