గోలకొండ పత్రిక సంపాదకీయాలు/శ్రీ ప్రభువు గారి జన్మదినోత్సవము
శ్రీప్రభువుగారి జన్మదినోత్సవము
5-1-1927
మహా ఘనత వహించిన నిజాము ప్రభువుగారి జన్మోత్సవము రేపటిదినము రాజధాని యందును, ఇతర స్థలములందును రాజభక్తితో జరుపబడ నున్నది. నేటి నుండి మన ప్రభువుగారికి 43 వ సంవత్సరము ఆరంభమగు చున్నది. ఈ సుసందర్భమున, శ్రీ ప్రభువుగారిని, ఒక కోటి ఇరువది నాల్గు లక్షల ప్రజల పక్షమున మేము సవినయముగా నభినందించు గౌరవమును బడయుచున్నారము.
మన ప్రభువుగారు రాజ్య సింహాసన మధిష్ఠించిన నాటగోలె రాష్ట్రములో పెక్కు మార్పులు జరిగినవి. శ్రీ ప్రభువుగా రపార ప్రజ్ఞాబలయుతులు. వీరి కాలముననే యనేక ప్రసిద్ధ నిర్మాణములు జరిగెను. ఇంకను క్రొత్త క్రొత్త కట్టడములు జరుగుచున్నవి. రాజ్యాంగము నందలి విమర్శ నీయాంశముల శ్రీ నిజాము ప్రభువుగారు శ్రమయనక శ్రద్ధతో పరికించి స్వయముగా తగు నేర్పాటులు చేయుచుందురు.
మన ప్రభువుగారు రాజ్య భారమును వహించి (17) వత్సరములు కావచ్చినది. వీరి పాలనమున రాజ్యాంగమునందెన్నియో మార్పులు జరిగినవి. ముఖ్యముగ వీరి కాలముననైన విద్యాభివృద్ధియు కృతజ్ఞతా పూర్వకముగ గొనియాడదగియున్నది. ప్రారంభ విద్యయందు వ్యక్తమైన యభివృద్ధియే కాక, ఉన్నత విద్యలను రాజ భాషయగు ఉర్దూలో నేర్పుటకై శ్రీ ప్రభువుగారి వలన ఆదర్శపూర్వకముగ స్థాపింపబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయము మూలమున ఎంతయో యుపయోగము కలుగుచున్నది. నాల్గు వత్సరముల నుండి విశ్వవిద్యాలయమువలన స్నాతకులుగా జేయబడిన వారి సంఖ్య నాల్గు వందలకు మించినదని చెప్పవచ్చును. ఈ విశ్వవిద్యాలయము యొక్క 8 వత్సరముల యభివృద్ధి, మద్రాసు విశ్వవిద్యాలయమునకు సంబంధించిన నిజాము కాలేజి మున్నగు విద్యాలయముల మూలమున దాదాపు అర్ధశతాబ్దముననైన యభివృద్ధితో సమానముగా నున్నదని పలువురు వక్కాణించుచున్నారు.
పరిపాలనము యొక్క ఇతర శాఖలందును ఎన్నియో మార్పులు జరిగినవి. ఇవి యన్నియు ప్రజాహితము కొరకు శ్రీ ప్రభువుగారు శ్రద్ధతో నాలోచించి చేసిరి.
ప్రజా క్షేమ తత్పరులగు మన ప్రభువుగారి పక్షమున కొన్ని మాసముల క్రింద “సంస్కారములు" చేయబడునని ప్రకటింపబడినది. అట్టి సంస్కారములలో మొదటి కార్యముగా క్రొత్త యధికారులు నియమింపబడుచున్నారు. మాల్గుజారీయందు గొప్ప మార్పులు జరిగి ముఖ్యాతిముఖ్యమగు నీ శాఖ మూలమున దేశాభివృద్ధి కలుగునని మేము విశ్వసించుచున్నాము.
ఇచ్చట శాసన నిర్మాణ సభను ప్రజా ప్రాతినిధ్య పద్ధతిపైన సంస్కరించుటకు శ్రీవారు కొన్ని వత్సరముల క్రింద నాజ్ఞాపించిరి. ఈ విషయమున కావలసిన అంకెలను వివరములును సిద్ధము కూడనై నవి. గత మాసమున ప్రధానామాత్యులగు శ్రీ మహారాజా బహద్దరుగారు శాసన నిర్మాణ సభ యందు, అనధికార సభాసదులతో, సంస్కార విషయములను సానుభూతితో నాలోచింతుమని సెలవిచ్చి ప్రజలయందుత్సాహమును ప్రతిష్ఠింపజేసిరి. ఇది యంతయు మన ప్రభువుగారి ప్రజా వాత్సల్య విశేషము. శ్రీవారి జన్మోత్సవ సందర్భమున గాని ఇతర సందర్భమునగాని ముఖ్యముగా నీ సంస్కారము ప్రవేశపెట్టుట మహా శుభ ప్రదమనియు, పరిపాలనమునందు ప్రజల తోడ్పాటు నిజముగా మనరాజ్యమును దుర్భేద్యముగా నొనర్చుననియు వినయ పూర్వకముగ సూచించు చున్నాము.
శ్రీ ప్రభువుగారు ప్రజా క్షేమంకరులై చిరకాలము వర్ధిల్లుదురుగాక ! నిజాం రాష్ట్రవాసులు ప్రపంచమందలి ఏ నాగరిక రాష్ట్రవాసులకును స్వాతంత్ర్యమునందును, విద్యాధికములందును తీసిపోక స్వదేశాభ్యుదయమునకు తోడ్పడునట్లు పరమేశ్వరుడనుగ్రహించు గాక !