Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/వ్యవసాయ విచారణ సంఘము

వికీసోర్స్ నుండి


వ్యవసాయ విచారణ సంఘము

13-10-1926

ఈ సంఘము తాలుకు ముగ్గురు సభ్యులును, అధ్యక్షుడగు లిన్లిత్గో ప్రభువును శనివారము నాడు బొంబాయిలో నోడదిగిరి. వారచ్చటి నుండి తిన్నగా సిమ్లాకు బోయి, తదితర సభ్యులతో గూడి కార్యమున కుపక్రమింతురు. వ్యవసాయాభివృద్ధి, పశుసంపద, పశుచికిత్స, క్రొత్త పంటలు నూతన వ్యవసాయ పద్ధతులు, వీనిగూర్చి ప్రస్తుతము ప్రభుత్వము వారెట్టి చర్యను గొనుచున్నారు? ప్రస్తుతము యాన సౌకర్యములెవ్విః ఫలసాయ మే విధముగ నమ్మబడుచున్నది? వ్యవసాయపనుల కే విధమున ధనసహాయము జరుగుచున్నది? ఋణములకెట్టి యవకాశములుగలవు? కృషికుల క్షేమముతో సంబంధము గలిగిన ముఖ్యాంశము లెవ్వి? ఈ విషయముల గూర్చి యీ సంఘము వారు శోధన సలుపవలెను. కాని యీ శోధనాంశములలో నొక ముఖ్యమైన విషయమును విడిచివేసి యున్నారు. అది ప్రస్తుతపు కౌలు పద్ధతులు గూర్చిన చర్చ. కృషికుల స్థితి గతులు ముఖ్యముగా వీనిపై నాధారపడి యుండును. వ్యవసాయాభివృద్ధికిగల యవకాశములన్నియు వీని నాశ్రయించి యుండును. ఒక ఉదాహరణము దీనిని విశదపరచగలదు. ప్రస్తుతము బంగాళాదేశమున జమీందారీ పద్ధతి అమలులో నున్నది. దీనివలన వాస్తముగా భూమిని దున్నుచున్న రయితాభూమికి స్వామి కాజాలడు మరి ఫల సాయములో కొంత భాగమును రయితు నుండి గొని, దానిలో నుండి సర్కారు వారికి సిస్తు చెల్లించి, మిగిలినది తాననుభవించుచు, జీవించుచున్న జమీందారుడా భూమికి యజమాని. ఇట్లు భూమి దున్నువాడు భూస్వామికాడు. భూస్వామి రయితు భూమికి స్వతంత్రాధికారి కాడు. ఈ ద్వంద్వ స్వామ్యమువలన యనేక అనర్థములు మూడుచున్నవి. భూస్వామి యెక్కువ ఆదాయము వచ్చుననెడి యాశచే తన భూమిని యనేక రయితులకు పంచి యిచ్చును. దీనివలన భూమి యనేక క్షుద్ర భాగములుగా విభజింపబడి, వ్యవసాయములో అభివృద్ధి మార్గముల ప్రవేశ పెట్టుటకు వీలులేక పోవుచున్నది. రయితునకు జెందవలసిన ధనము భూస్వామికిని, తదితర మధ్య వర్తులకును జెందుచున్నది. సగటున బంగాళమున నొక్కొక్క జమీందారునకు రూ. 3 స్వామి భోగము వచ్చును. వీరు దీని నుండి 10 అణాలు మాత్రమే సర్కారువారికి సిస్తు కట్టి మిగిలిన రూ. 1-6-0 తామనుభవించుచున్నారు. వ్యవసాయమున నెట్టి పాలునుగొనక, హాయిగా పట్టణములలో గూర్చుండి, వీరి ధనము ననుభవించుచున్నారు. ఎండలో మాడి వానలో తడిసి, రేయింబవలు పొలములో బనిచేసిన కర్షకులకు నిజముగా నీ ధనము చేరవలసియున్నది. ఈ ధన సాహాయమున వారు సేద్యము నెంతయో అభివృద్ధి పరచియుందురు. కాని యిప్పుడా ధనము సోమరులకు జెంది వృధావ్యయముల పాల్బడుచున్నది. ఇట్టి ముఖ్యమైన కౌలు సమస్యను వ్యవసాయ కమిషను వారు సంశోధింపకుండు టెంతయు విచారకరము.

ప్రస్తుతము రయితులను పీల్చి పిప్పిచేయుచున్న పిశాచము ఘోరమైన ఋణ బాధ. భూమి ప్రస్తుతము యతి స్వల్పమగుట చేతను, తగు నీటి లేక పోవుట చేతనే, తదితర కారణముల చేతను రయితునకు సుఖజీవనోపాధిని కలిగించుటలేదు. గృహ పరిశ్రమలు నశించుటచే వేరు ఆదాయము లేదు. కోళ్ళను, పందులను, గొఱ్ఱెలను బెంచి వ్యాపారము చేయుట మనలో వాడుక కాదు. కాన సిస్తు కట్టుటకుగాని, పశువుల కొనుటకుగాని వివాహ శ్రాద్ధములకు గాని, సొమ్ము కావలసినప్పుడు మన బీద రయితు సాహుకారి వద్దకు బోయి ఋణమును దేవలసి వచ్చుచున్నది. ఈ ఋణము వడ్డీకి వడ్డీ చొప్పున అనతి కాలములోనే పెరిగి పాపమా రయితు రాబడి నంతయు మ్రింగివేయ సిద్ధపడును. ఈ ఋణమును దీర్చుట కారయితు వేరొక ఋణము జేయును. ఇట్లు ఋణము కొఱకు ఋణము చేయుచు రయితు తన జీవిత కాలములో నెన్నటికిని ఋణవిముక్తి నొందకున్నాడు. ఈ సమస్య గూర్చి శోధన సలుపు నెడ “రయితు వివాహములు, శ్రాద్ధములు చేయునవుడు విపరీత వ్యయముల చేయరాదు. రయితుల భార్యలు నగల యందలి యపేక్షను విడువవలెను; భూమిని స్వల్ప భాగములుగా విభజింపకూడదు; రయితు పొదుపు గలిగి జీవనయాత్ర గడుపవలెను; అప్పుడీ ఋణబాధ మాయమగును." అని యా రీతిగా నీ సంఘమువారు తమ శోధనాంతరము సూచనలు చేసిన నేమియు ప్రయోజనము లేదు. ఈ విష యము లన్నియు నిదివఱకే మన మెరుగుదుము. వీనిని మఱల వల్లించుటకు వేలకొలది రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేకముగా నొక సంఘమును నియోగింప నవసరములేదు. ఋణము చేయుట మోసమని యెల్లఱకును విశదమే. కాని విధిలేక రయితులప్పుల పాల్పడినారు, పడుచున్నారు. ఋణస్తులను ఋణ విముక్తుల జేయుటెట్లు? ఋణము చేయబోపు వారిని దాని నుండి మరల్చుటెట్లు: ఈ యంశముల గూర్చి యీ విచారణ సంఘము వారు మార్గముల జూపిన దేశీయులు కృతజ్ఞులయ్యెదరు.

ప్రస్తుతము వ్యవసాయశాఖవారు చేయుచున్న ప్రయత్నములలోను, అవలబించు పద్ధతులలోను, గొన్ని నిష్ఫలములును, నిష్ప్రయోజనములునునై యున్నవి. వీరు సలుపుచున్న శోధనలు విద్యకును, విజ్ఞానమునకును సంబంధించిన వగుచున్నవిగాని, ప్రకృతపు కర్షకుల వ్యవసాయ చిక్కులను పరిష్కరించుటలేదు. ఆమెరికాలో కృషికులు స్వయముగ వచ్చి, పంటలు పండించునపుడు తమకు గలుగుచున్న చిక్కుల నెల్లను వ్యవసాయ శోధకుల కెఱింగించెదరు. అటుపైని, యా సమస్యల గూర్చి పరిశోధన సంఘము వారు శోధన జేయుదురు. కాని మన దేశమున రైతునకును శోధన సంఘమునకును ఇట్టి సన్నిహిత సంబంధము లేదు. పరిశోధకులు తమకు దోచిన నేదియో నొక విషయము గూర్చి శోధన ప్రారంభింతురు. సంవత్సరములకొలది ప్రయత్నించి యేదియో నొక దానిని కనిపెట్టుదురు. కాని యది కేవలము వైజ్ఞానికముగ నుపయోగపడుచున్నది గాని, ప్రకృతపు సేద్యమునకు కక్కఱకు వచ్చుటలేదు. నారవిషయములలో నిపుణుడగు ఫిన్లో దొరగారెన్నియో సంవత్సరములు ప్రయాసపడి జనపనారను వేరు విధమున దీయుట కొక యంత్రమును కనిపెట్టిరి. కాని ఈ యంత్రము గూర్చి యే సేద్యగాడును శ్రద్ధ గొనలేదు. జనపనారదీయుట కిదివఱకొక సుగమమగు మార్గముండనే యున్నది. అందుచే యీ యంత్రము వారి కావశ్యము కాదు. వారి ముఖ్యావశ్యములు వేరు. వాని గూర్చి నూతనాంశముల వారికి దెలిపిన వారు శ్రద్ధ వహింతురు. కాని వానికి బదులీ క్రొత్త యంత్రము వారి కొసగిన వారు దానిని నిరసించుటలో నెట్టి వింతయు లేదు కదా! ఇట్టి దిక మీదట జరుగకుండునటులను. ప్రకృతపు సేద్యములోని సమస్యలను స్వంతముగగాని, వ్యవసాయకుల నడిగిగాని, దెలిసికొని మఱి శోధనకు గడంగు నటులను, ఈ సంఘమువా రేర్పాటు చేసినయెంతయు మేలు కలుగును. వ్యవసాయ శాఖకును, రయితులకును దగ్గఱ సంబంధమున్నగాని వ్యవసాయ మభివృద్ది చెందును.

ఈ సంఘము వారింకొక విషయమును తమ దృష్టి యందుంచు కొనపలెను. ప్రస్తుతము వ్యవసాయములో గమనింపబడుచున్న మన దేశీయ వాడకులను వారు గ్రహింపవలసియున్నది. మన దేశములో వ్యవసాయము నిన్న మొన్న నేర్చుకొనిన పరిశ్రమకాదు. అనేక వేల సంవత్సరముల నుండి నానాటికి వికాసము గాంచుచు వచ్చిన కళ. కాని మన పద్ధతులలో ననేక మహత్తరమైన వైజ్ఞానిక విషయములు నిగూఢమై యున్నవి. ఈ యంశమును ప్రస్తుత మనేక పాశ్చాత్య వ్యవసాయ శాస్త్రజ్ఞులు కూడ నంగీకరించి యున్నారు. కాన విచారణ సంఘము వారు మన పద్ధతులను తేలికగా నొక మూల ద్రోసివేయక, వానిని బూర్తిగ లెక్కగొని తగు మార్పుల సూచించవలెను. అట్లయినగాని వీరి సూచనలకు తగు విలువగాని ఫలముగాని యుండదు. ఈ విషయమున వివిధ రాష్ట్రీయ వ్యవసాయశాఖ మంత్రు లీ సంఘము వారికి దోడ్పడ గలరని నమ్ముచున్నాము.