Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/విద్యావిధానము

వికీసోర్స్ నుండి


విద్యా విధానము

28-8-1926

క్రిందటి వారము, విద్యా విధాన విషయమున సుప్రసిద్ధ మహాశయు లిద్దఱు తమ తమ యభిప్రాయముల వెల్లడించినారు. వీరు మద్రాసు విద్యాశాఖ మంత్రిగారు సర్. పరశురామ పాత్రో గారును, విఖ్యాత గ్రంథకర్తలును పండితులునగు డాక్టర్ బ్రజేంద్రనాథశీల్‌గారును. పాత్రోగారు చెన్న పట్టణమందును, సీల్‌గారు బొంబాయి నగరమందును, పట్టభద్రులకు పట్ట ప్రధాన మొనర్చునపుడిచ్చిన ఉపన్యాసములలో మఱుగుపఱచక వెలిబుచ్చిన యభిప్రాయము లెంతయు గంభీరములును, ప్రశంసార్హములునై యున్నవి. ఇవి విద్యా విధాయకులు, బాలురు, ఉపాధ్యాయులు గమనింపదగినవి. విద్య యొక్క లక్ష్యము బుద్ధి వికాసమని పాత్రోగారు నుడివియున్నారు. ఇది యెల్లరు ముఖ్యముగా మనసునందుంచుకొన వలసిన విషయము. కేవలము జీవనోపాధి గల్పించుట విద్య యొక్క పరమావధిగాదు. విద్య విజ్ఞానము కొఱకు గాని, ధనార్జము కొఱకు గాదు. దీనిని విద్యార్థులందఱు గమనించి విద్య యొక్క విలువను రూపాయలణాల దమ్మిడీలతో లెక్కింప కుందురు గాక.

ఆటుపైని, యెట్టిది కళాశాలయను విషయమున పాత్రోగారి యభిప్రాయ మెంతయు మాననీయము. జాతీయ జీవనమునకు వికాసమును, ప్రోత్సాహము నొసగునదియే కళాశాల. ఇట్టి ఉన్నతాదర్శమును నాచరణలోనికి దెచ్చునంతవఱకే కళాశాల గౌరవనీయము. విశ్వవిద్యాలయములు భావి పౌరుల కాటపట్టువులు. జాతీయభావము, సేవాశక్తి యీ విద్యాలయములందే పెరుగవలయును. కాని ప్రస్తుతము విద్యాలయముల స్థితి యెంతయు విచారకరము. ఈ యున్నతాశయాలన్నిటికిని వ్యతి రిక్తముగ కార్యక్రమములు జరుగుచున్నది. ఈ విద్యాలయములు విద్యార్థుల మానసిక సృష్టి శక్తి యభివృద్ధి జెందుటకు మారుగ నడుగంటుచున్నది. త్యాగము, ప్రజ్ఞాతిశయము, స్వాతంత్ర్యమును ప్రోత్సాహించుటకు మారుగా స్వార్థ పరాయణత్వము, సంకుచిత స్వభావము, పరాధీనత పెంపొందించు చున్నవి. శైశవ దశలో నున్న ఆంధ్ర విశ్వ విద్యాలయ మీ కొఱతల సరకు గొని, సంస్కరించి స్వధర్మ నిర్వహణమునకును, ఆత్మోపలబ్ధకిని ననుకూలించు నిజమగు విద్య నొసగి జాత్యభ్యుదయమునకు పాటు పడునని నమ్ముచున్నాము.

విద్యా విధానముగూర్చి సర్ బ్రజేంద్ర నాథ్ సీల్‌గారి సూచన లెంతయు మాననీయములు. ప్రాచ్య పాశ్చాత్య విద్యా వికాసముల మేళగించి, బాలురకు శిక్ష నొసగుట ఇప్పుడు మన సమస్యయై యున్నది. బ్రహ్మచర్యము,గురుకులము మొదలగు విధానముల కాలము పోయినది. అయినను ఆ విధానములోని గూఢమైయున్న భావములను, ఆశయములను మనము విసర్జింపరాదు. వానిని గొని, మన భిన్న పరిస్థితుల కన్వయించి, సానుకూలముగా, శుభప్రదముగా మన విద్యా విధానము నెఱపవలెను. ఈ సందర్భమున సీలుగారొక నూతన విషయమును సూచించియున్నారు. విద్యావిధానము వృత్తికిని స్థానిక పరిస్థితుల కనుగుణ్యముగా నుండునటుల నుండవలెనని వారి సలహా. దీని గూర్చి యెల్లరు నాలోచించుట యెంతయు నవసరము. ప్రత్యేక కళలకును, పరిశ్రమలకు ప్రత్యేక సదుపాయము లుండును. ఆ ప్రాంతపు బాలుర కా ప్రాంతపు కళలను గాని, నేర్చుకొనుట సులభముగా నుండును. మఱియు నా కళలు గాని పరిశ్రమలుగాని వృద్ధియగుట కెక్కువ యవకాశముకూడ నుండును. ఈ యంశమును విద్యాభివృద్ధియందును తద్వ్యాప్తియందు నభిమానులందఱు నాలోచింతురు గాక!