గోలకొండ పత్రిక సంపాదకీయాలు/లోకమాన్యుడు
లోకమాన్యుడు
4-8-1926
ఆధునిక కాలమున భారత వర్ష రంగమున నద్వితీయ విఖ్యాతితో తన పాత్రమును బ్రదర్శించిన మహా పురుషులలో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను మించిన వారు వేరొకరు లేరని చెప్పినచో అందతిశయోక్తి యుండదు. గడచిన 1 ఆగస్టు నాటితో నీ భారత పుత్ర రత్నము కీర్తిశేషుడై 6 సంవత్సరములు గడచినవి. ఆనాడు వివేకవర్ధనీ నాటకళాలయందు లోకమాన్యుని స్మరణార్థము జరుపబడిన సభా వృత్తాంతములు వేరొకచో ముద్రితములై యున్నవి.
లోకమాన్యుడు 23 జూలై 1856 నాడు బొంబాయి ప్రాంతము నందలి రత్నగిరి యందు సాధారణ కుటుంబమున జన్మించెను. 1872 లో ప్రవేశ పరీక్ష యందును, 1876 లో పట్ట పరీక్ష యందును మహా గౌరవ ప్రదముగ నుత్తీర్ణుడయ్యెను. తానభ్యసించిన న్యాయశాస్త్ర జ్ఞానమును జీవనోపాధికై వినియోగింపక, బీదతనమునే శరణ్యముగ గొని, దేశ కార్యములందు ప్రవేశించెను. జీవిత కాలమున నీ మహానుభావుడు, ఉపాధ్యాయుడుగను, గ్రంథకర్తగను, పత్రికా లేఖకుడుగను, ప్రజా నాయకుడుగను, దేశసేవ సల్పి జరామరణము లేని కీర్తి గడించెను. తలపెట్టిన ప్రతి కార్యమునందును చలింపని పట్టుదల, మొక్కవోని ధైర్యము, స్వార్థ రాహిత్యతయు, యాథార్థవాదిత్వము ఆ యనఘుని యందు వ్యక్తములగుచుండెను. ఉపాధ్యాయుడుగా పనిచేసి శిష్యులందు విజ్ఞానముతో పాటు దేశాభిమానాగ్నిని రగుల్కొల్పి 'నవీన మహారాష్ట్ర దేశమ"ను దానిని సృష్టించెను. "వేదములందలి మన ఉత్తర ధృవ నివాసము" (Our Arctic Home in the Vedas)ను, “మృగ శిర” (Orion)ను రచించి స్వదేశీయుల వలన ప్రశంసనందుటే కాక యూరపు ఆమెరికా ఖండములందలి దిగ్ధంతులగు పరిశోధకులను తన నవీన సిద్ధాంతములచేత ఆశ్చర్య సాగరమున ముంచివైచెను. కారాగారమునందు రెండవమారు వసించినకాలమున రచింపబడిన "గీతా రహస్య" మను ప్రచండ వైజ్ఞానిక గ్రంథము ఆంగ్ల, ఆంధ్ర, హిందీ, ఘూర్జరాది వివిధ భాషలందు అనువాదితమై భారత వర్షీయులకును, పరదేశీయులకును ఉత్తమ మార్గమును బోధించి నిరుపమాన యశమును గడించెను. “కేసరి”, “మరాటా" యను రెండు పత్రికలను నడపి, ఏ వారపత్రికకును మన దేశమున నేటివరకు లభించి యుండని వ్యాప్తిని కలిగించెను.
నాయకుడుగా రాజ్యాంగ క్షేత్రమున చేసిన కార్యములు ఆ బాల గోపాలము విదితములని చెప్పవచ్చును. రాజ్యాంగమునందు లోకమాన్యునకుండిన జనవశీకరణము మరే నాయకునకు నుండలేదనియు, ఆయన అనుచరుల సంఖ్య కోట్ల పరిమితి కలిగియుండెననియు తెలియుచున్నది. మొదటిసారి 1892 లో 12 మాసములును రెండవ మారు 1908 నుండి 1914 వరకు 6 సంవత్సరములును కర్మవశమున కారాగార శిక్ష ననుభవించి దేశీయులవలన నెక్కువ ప్రశంసను బొందెను. ఈ కర్మయోగి కారాగార జీవితమును ఉత్తమ గ్రంథరచనము నందును, పఠనము నందును వినియోగించి "సుఖ దుఃఖా సమేకృత్వా, లాభాలాభౌజయాజయౌ" యను గీతా వాక్యమును సార్థక పరచెను. రెండవమారు చెరసాల నుండి వచ్చిన తర్వాత ద్విగుణీకృతోత్సాహుడై, దేశీయ మహాసభయందు హిందూ మహమ్మదీయైక్యతకై, లక్నో నగరమున పాటుబడి కృతార్థుడై, ఆ సంస్థకు బలము చేకూర్చెను. హోం రూలు డిప్యుటేషన్ సందర్భమున ఆంగ్ల దేశమునకు జని రాజ్యాంగ సంస్కారములకై యత్నించియుండెను. ఇట్టి యాదర్శ ప్రాయమగు సేవ యొనర్చి తుదకు బొంబాయి నగరమున 31 జూలై 1920 నాడు 65 సంవత్సరముల ప్రాయమునందు భౌతిక దేహమును వదలి కీర్తికాయుడయ్యెను.
లోకమాన్యుని వర్తనము నందు ఎల్లప్పుడును ప్రస్ఫుటమగుచుండు యథార్థ వాదిత్వమున కొక తార్కాణము చూపెదను. 1918వ సంవత్సరమున ఇంగ్లాండునకు బోవుచు చైన్న పట్టణమున నుండిన దినములలో ఆంధ్రుల వలన సమర్పింపబడిన సన్మాన పత్రమునకు ప్రత్యుత్తర మొసగుచు ఇట్లు ప్రస్తా వించెను. "నేను నేడు ఆంధ్రులను మహారాష్ట్రులను ఏకముగా దలచుచున్నాను. కారణ మేమనగా మహారాష్ట్ర రాజ్యాంగ ధురీణులు అవలంబించిన రాజ్యాంగ సంస్కారము లన్నియు, విజయనగర సామ్రాజ్యమును పాలించుచుండిన ఆంధ్ర రాజులు చూపినవే. ఇందు వలననే మహారాష్ట్రులమగు మేము ఒక విధముగ ఆంధ్రులకు కృతజ్ఞులమై యుండవలసిన వారము. శ్రీ శివాజీ మహారాజును, ఆయన తరువాత మహారాష్ట్ర రాజ్యమును నడిపిన వారును విజయనగరసామ్రాజ్య రాజనీతి సూత్రములనే యనుకరించిరి. ఈ విధముగా నీ రెండు శాఖల వారికి కలిగిన సంబంధము నేటి వరకును స్థిరముగా నున్నది." ఈ విషయము చారిత్రికమే యైనను ఇంత విస్పష్టముగా నొప్పుకొనువారు మహా నాయకులలో సైతము అరుదని చెప్పవచ్చును.
లోకమాన్యుని పరహితాచరణమును, ఉత్తమ వర్తనమును, మనకు మార్గదర్శకముగ నుండుగాక!