గోలకొండ పత్రిక సంపాదకీయాలు/రెడ్డి విద్యార్థి గృహము
తెలుసుకునే వారు. ప్రతాపరెడ్డిగారి సంపాదకీయాలలో వ్యంగ్యం, అధిక్షేపం, తీవ్రత, అభినివేశం అనే గుణాలు కొట్టవచ్చినట్లు కనిపించేవి. విషయానికి అనుగుణంగా వారు శైలిని మార్చి వ్రాసేవారు. స్వేచ్ఛగా వ్రాసేవారు. అప్పుడప్పుడు ప్రతాపరెడ్డిగారు స్వగ్రామమైన ఇటికాల పాడుకు (అప్పుడది నీళ్లు లేని ఇటికేల పాడు) వెళ్ళి వచ్చేవారు. వారు లేనప్పుడు సంపాదకీయాలు వ్రాసే బాధ్యత స్నేహితుల కెవరికైనా అప్పగిస్తూండే వారు. ఆ సంపాదకీయాలు చదివితే ప్రతాపరెడ్డిగారు హైదరాబాదులో లేరన్న విషయం సులభంగా అర్థమయ్యేది. సంపాదకీయాన్ని చదివి మీరు తిరిగి హైదరాబాదు వచ్చారని తెలిసిందని ఉత్తరాలు వ్రాసిన మిత్రులు వారికి లేకపోలేదు. సంపాదకీయాలను చదివితే ఆయన ఉనికి స్పష్టంగా తెలిసిపోయేది.
ఆనాడు దేశానికి మార్గదర్శకులైనవారు పత్రికలనే అందుకు సాధనంగా వినియోగించుకున్నారు. అన్నిటికన్న మిన్నగా మహాత్మాగాంధిగారు యంగ్ ఇండియా, మరియు హరిజన్ పత్రికలను, బాలగంగాధర తిలక్ గారు మరాటా, కేసరిద్వారా, జవహర్‌లాల్ నెహ్రూగారు నేషనల్ హెరాల్డు పత్రికద్వారా, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌గారు అల్ హిలాల్ పత్రిక ద్వారా, రాజగోపాల చారిగారు స్వరాజ్య పత్రికద్వారా తమ అభిప్రాయాలను ప్రజలకు అందజేసినారు. ప్రతాపరెడ్డిగారు ఈ మహనీయుల మార్గమునే అవలంబించిరి. బి. ఏ., బి. యల్ పట్టభద్రులైన ప్రతాపరెడ్డిగారు వృత్తినే అవలంబిస్తే న్యాయమూర్తులయ్యేవారు. ఉద్యోగమే చేస్తే పెద్ద పదవి దొరికేది. వ్యవసాయం చేసుకున్నా తగినంత సంపాదన లభించేది. పుష్కలమైన సంపాదన కొరకు అవసరమైన అవకాశాలన్నీ కలిగినప్పటికి ప్రతాపరెడ్డిగారు వాటిని వినియోగించు కొనక పత్రికా నిర్వహణకు తమ జీవితమును అంకితము చేసినారు. ఇది ఆయన త్యాగ నిరతికి నిదర్శనం. గోలకొండ పత్రికతో ఆకస్మికముగా సంబంధం వదలుకొన్నప్పుడు మరొక పత్రిక స్థాపించే దాక ప్రతాపరెడ్డిగారు నిదురపోలేదు. ప్రజావాణి పత్రికను కొంతకాలము వారు నడిపినారు. ప్రజావాణి కూడా గోలకొండ సంప్రదాయాన్ని అనుసరించింది. ఈవిధంగా దేశ సేవ కొరకు పత్రికను సాధనంగా స్వీకరించి సంపాదక వృత్తికి ఆత్మార్పణ గావించిన ప్రతాపరెడ్డిగారి వంటివారు దేశనాయకులలో, మేధావులలో, పత్రికా సంపాదకులలో ఎంతమంది?
1926 నుంచి 1947 దాకా ప్రతాపరెడ్డిగారు గోలకొండపత్రికకు సంపాదకులుగా ఉన్నారు. ఈ రెండు దశాబ్దుల సంపాదకీయాల నుంచి కొన్ని ముఖ్యమైన సంపాదకీయాలను రెండు సంపుటాలుగా కూర్చటం జరిగింది. రెండు, మూడు సంపుటాలు మాకు లభ్యం కాలేదు. దేశ సమస్యలు. ప్రజల సమస్యల పట్ల ప్రతాపరెడ్డిగారి దృక్పథాన్ని వివిధ కోణాలనుంచి చూపటానికి వీలుగా ఈ సంపాదకీయాలను ఎన్నుకోవడం జరిగింది. నలభై ఏళ్ళకు పైగా గోలకొండ పత్రికలను పదిలపరిచి మాకు ఈ కార్యసాధనలో సహకరించిన ప్రతాపరెడ్డిగారి కుమారులు శ్రీయుతులు యన్. యన్. రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము.
హైదరాబాదు
దేవులపల్లి రామానుజరావు
1-6-1989
డా॥ ఎల్లూరి శివారెడ్డి
విషయసూచిక
పుట.
3 |
6 |
1 |
3 |
4 |
7 |
10 |
12 |
16 |
18 |
20 |
21 |
23 |
26 |
28 |
31 |
35 |
36 |
38 |
40 |
42 |
44 |
45 |
47 |
49 |
50 |
53 |
55 |
58 |
61 |
64 |
67 |
70 |
72 |
74 |
76 |
78 |
79 |
80 |
81 |

82 |
84 |
86 |
90 |
91 |
92 |
94 |
95 |
97 |
101 |
103 |
107 |
109 |
111 |
114 |
116 |
120 |
122 |
124 |
127 |
129 |
131 |
132 |
XV
134 |
137 |
138 |
141 |
143 |
147 |
150 |
153 |
157 |
160 |
162 |
164 |
165 |
168 |
169 |
172 |
173 |
175 |
177 |
180 |
182 |
186 |
189 |
xvi
191 |
198 |
195 |
200 |
203 |
207 |
210 |
215 |
219 |
221 |
224 |
225 |
స్వవిషయము
(అక్షయనామ సంవత్సర నిజ చైత్ర బ॥ 13)
10 - 5 - 1926
అనేక విఘ్న ప్రతి బంధముల కోర్చి యెట్టకేలకు "గోలకొండ" పత్రిక నాంధ్రజనులకు సమర్పించుకొన గలిగితిమి. ఇదివఱకే విన్నవించిన రీతి నీపత్రిక యొక్క ముఖ్యోద్దేశము జనసేవయే కాని తదితర మేదియు గాదు. ఈ పత్రికా విషయమై కొన్ని సందేహములు తఱచుగా వినవచ్చుచున్నవి. వానినిందు మాచే నైనంతవరకు నివారింప బ్రయత్నించుచున్నాము.
ఈ పత్రిక వలన లాభమేమి? యని కొందరు ప్రశ్నించియున్నారు. వారెల్లప్పుడును బత్రికల జదువు వారే యైనను బత్రికల లాభము గనుగొనినట్టి వారలుగ గనుపింపరు. నేటి కాలమున నాగరికతయంతయు బత్రికలపై నాధారపడినదని యనవచ్చును. ప్రజలందుగాని, ప్రభుత్వమందుగాని, మంచిగనో చెడ్డగనో మార్పుగలిగించునది పత్రికల యొక్క మహాశక్తియే. ప్రపంచ మందలి పత్రికా ప్రచారము కల దేశములను బోల్చి చూచిన హిందూస్థానము చాల హీనస్థితి యందున్నది ప్రస్తుతము నిజాము రాష్ట్రమందు 65 లక్షల కన్న నెక్కు డాంధ్రులుండగా రెండు వార పత్రిక లుంట గొప్పలోటు. ఒక చిన్న తిరువాన్కూర్ సంస్థాన మందు నూర్ల కొలది నానా విధ పత్రికలుండ హైద్రాబాదులోని యాంధ్రులకై మూడవ పత్రిక యొకటి ప్రచారము చేసినందులకు మేము చింతింపము.
ఈ పత్రిక "రెడ్ల” కొఱకేర్పడినదని కొందరు శంకించి యున్నారు. రెడ్ల యొక్క అభివృద్ధిని గోరుచుండునదైన నితర శాఖల వారికి బ్రతికూలముగా నెప్పటికి నుండదని యందఱకును విశదపఱచుచున్నాము.
మేము హిందువులందే యన నేల మతాంతరావలంబకులందును భేదమేమాత్రమును జేయువారము కాము. ముఖ్యముగా నాంధ్రులలో నగ్ర జనులను వారిని మొదలుకొని యంత్య జన్ములను వారి వఱకును మేము సేవజేయ యత్నింపలము. ఇందులకై యందఱును దోడ్పడుదురు గాక.
ఈ పత్రిక చందా విశేషమేమో యని కొందఱు మిత్రులు మందలించిరి. బ్రిటిషు ప్రాంత మందలి యొకటి రెండు వార పత్రికలు తప్ప తక్కిన యన్ని పత్రికల కన్న దీని చందా తక్కువయని చెప్పగలము. అయిన నిది ప్రధమ ప్రయత్నమగుటచే నింతకన్న తక్కువ చేయజాలము. చందాదారులు విశేష సంఖ్యాకుకురై పత్రికకు - లాభమటుండనిండు - నష్టము రానిచో ముందు సంవత్సరము చందా తగ్గింప దలచియున్నాము.
నిజాము రాష్ట్ర మందలి జనులే యననేల మన దేశ మందలి యితర ప్రదేశము లందలి వారును ముఖ్యముగా వ్యవసాయముపై నాధారపడినవారు. ఈ పత్రిక యట్టి జనులకు జేతనైనంత వఱకు వ్యవసాయ సంబంధములగు వ్యాసములను వ్రాసియు వ్రాయించియు ప్రోత్సహించుచుండును. పరపతి సంఘములు (Co-Operative Society) వ్యవసాయకుల కెంతయో లాభకరములైనవి. వాని యుపకారములను జనులు సరిగా గ్రహించిన వారుకారు. ఏ తద్విషయమై తరచుగా మా పత్రిక యందు వ్రాయుచుందుము. ఈ పత్రిక హైద్రాబాదు రాష్ట్రములో విశేష ప్రచార మందుండగలదు. కావున తక్కువ సమాచారములను దెలుపుచు, బ్రత్యేకముగా నీ రాష్ట్రపు వార్తల ప్రకటించుచుందుము.
ఇదిగాక విద్యాభివృద్ధిని గుఱించియు, సంఘాభివృద్ధిని గుఱించియు దగు రీతుల బ్రయత్నించుచుందుము.
పై యంశములతో బాటు భాషాభివృద్ధికరములగు వాఙ్మయసేవయు చేయు చుందుము.
ఈ పత్రిక యింతవఱకే ప్రచురింపబడి యుండవలసినది. కాని మా స్వాధీనమునలేని యనేకాంతరాయములచే మే మాలసింపవలసి వచ్చెను. ఆంధ్రలోకము మమ్ము క్షమింతురని ప్రార్థన.
ఈ పత్రిక నిర్విఘ్నముగా దన విధిని నెరవేర్చుట యందు, దైవము, ప్రభుత్వము, ప్రజ, మాకు దోడ్పడుగాతయని ప్రార్థించుచున్నాము.
విజ్ఞాపన
10 - 5 - 1926
రెసిడెన్సీ హద్దులలో నున్న మా ముద్రణాలయము నుండి పత్రికను ప్రకటించుటకనుమతి యొసంగ బడక పోవుటచే, నిజాం ప్రభుత్వము వారి హద్దులలోనికి, ముద్రణా యంత్రమును మార్చవలసి వచ్చుట చేతను, పోస్టలు శాఖ వారనుమతి నిచ్చుటలో నాలసించుట చేతను, మేము, తొలుదొల్త ప్రకటించిన రీతిని పత్రిక నందజేయ జాలమైతిమి లేకుండిన పత్రిక యొక్క మాసము క్రిందటనే వెలువడి యుండెడిది.
రాబోవు పత్రిక వైశాఖ శు॥ 5 స్థిరవారమున వెలువడును. తదనంతరము క్రమముగ, ప్రతి బుధవారమునను శనివారమునను పత్రికలు ప్రకటింపబడును.
కీ. శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారు
14-7-1926
గడచిన 12 జూలైతో విఖ్యాత గ్రంథ కర్తలను, సంస్కర్తలును, నిష్కలంక దేశాభిమానులునునగు శ్రీ కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు స్మరణీయులై మూడువత్సరములు గడచినవి. నవీనాంధ్ర వాఙ్మయ పితామహులగు రావు బహాద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారి తరువాత, ఆధునిక వాఙ్మయమును పెంపొందించిన వారిలో శ్రీ లక్ష్మణరావుగారు అగ్రగణ్యులని చెప్పినచో అందతిశయోక్తి యుండదని మా తలంపు. విశ్వ విద్యాలయము నందు ఎం. ఏ. పరీక్ష యందుత్తీర్ణులై, ఆంధ్ర, సంస్కృత, వంగ, హిందీ, మహారాష్ట్రాది భాషల యందు నిరుపమాన పాండితీ వైభవమును గడించిన ఈ ఆంధ్ర సత్పుత్రుడు తన విజ్ఞానము నంతను ఆంధ్ర భాషామతల్లి సేవయందు వినియోగించి ఎడతెగని పట్టుదలతో, విసువు నెరుంగని యుత్సాహముతో, నిర్మల వర్తనముతో ఆదర్శప్రాయమగు జీవనము గడపిన ఈ మహాశయుని దేశీయులు విస్మరింపగూడదు.
శ్రీ లక్ష్మణరావుగారి సారస్వతసేవవారు విద్యార్థి దశయందు నివసించుచుండిన నాగపురము నందారంభమయ్యెను. మోరోపంత్ కృతమగు మహారాష్ట్ర కర్ణపర్వమునకు విద్వజ్జన సమాదరణీయమగు వ్యాఖ్యానము రచించిరి. "రామాయణీయమగు పంచవటి భద్రాచలము కడనున్నదా, నాసికవద్దనున్నదా” యను విషయమున మహారాష్ట్ర పండితులలో భేదాభిప్రాయములు కలిగి తీవ్రముగా వాదోపవాదములు జరుగుచున్న కాలమున, అట్టి వాదములందు ఉత్సాహముతో పాలుగొని భద్రాచలము వద్ద పంచవటియే రామాయణీయ పంచవటియని లోకమాన్య బాలగంగాధర తిలకు వంటి పండితవర్యులచే నొప్పించిరి. విజ్ఞానప్రదములగు అనేక మహద్విషయములను, "కావ్యమాల” యందు ప్రకటించి, నేటివరకు ఏ యాంధ్రునకును మహారాష్ట్రమున లభింపని యుత్తమ పదవిని ఆ భాషయందు సంపాదింపగలిగిరి. ఈ కాలముననే వీరు రచించిన ప్రథమ ఆంధ్ర గంథము “శివాజీ చరిత్రము" వెలువడెను.
తరువాత శ్రీ లక్ష్మణరావు గారి కార్యరంగము ఆంధ్రదేశమునకు మారెను. విఖ్యాతాంధ్ర భాషా పోషకులగు శ్రీ మునగాల సంస్థానాధీశుల దివానుగారు నియోజితులైరి. ఈ యుద్యోగము తరువాతి వాఙ్మయ సేవకు మంచి పునాది ఏర్పరచెను. తుదివరకు వారీ యుద్యోగముననే యుండిరి. దివాను కర్తవ్యములను వారు శ్రద్ధగా నిర్వహించ లేదనినచో అది యపరాధమగును; కాని మాకు వారితో గల పరిచయమును, వారి అనుదిన జీవితమును గూర్చిన యనుభవమును బట్టి చెప్పవలసినచో ప్రభువుగారు వీరితో మంత్రిత్వ కార్యముల నేసమయమున నిర్వర్తింపించు కొనుచుండిరో తెలియదు గాని, వీరు ఎప్పుడు వాఙ్మయ విషయక కార్యములందు నిమగ్నులైయుండిరని చెప్పగలము. 1909 వత్సరమున విజ్ఞాన చంద్రికా గ్రంథమాల నారంభించి వివిధ శాస్త్రీయ చారిత్రిక వాఙ్మయామాృత ధారలచే ఆంధ్రదేశీయులు హృదయ క్షేత్రములను ఫలవంతములుగ నొనర్చిరి. 1911 ప్రాంతమున వాఙ్మయ సేవా విషయికమగు ప్రచండమైన తుది ప్రయత్నము, అనగా "విజ్ఞాన సర్వస్వ" నిర్వహణము నారంభించి నిధనము నాటివారకు ఆ కార్యమును నిర్వహించి, "ఆ" భాగమును సుమారు 2000 పుటలలో మూడు సంపుటములుగా పూర్తి చేసి దేశీయుల కర్పించిరి. నాల్గవదగు “ఆంధ్ర సంపుటము" నకు పరికరముల కూర్చుచు, పరిశోధనము సల్పుచు," చాళుక్యులు దాక్షిణాత్యులే" యను వ్యాసమును వ్రాసి ముగించుచు ఆనాడే రాత్రి వేళ చెన్నపట్టణమున మరణించిరి.
ఈ మహాశయుని మహా సులభమును రసవంతమును నగు శైలియు ఎంతటి గహన విషయమునైనను కడు సుబోధముగా తెలియజేయు సామర్థ్యమును, దేశాభిమానాగ్నిని ప్రజ్వలింపజేయు మేధా విద్యుత్తును తలంచిన ఆశ్చర్యము కలుగకమానదు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వములోని వ్యాసములననేకులు కలిసి వ్రాసిరని చెప్పవచ్చును. కాని ముఖ్యములగు, వ్యాసములన్నియు వీరివే. "విజ్ఞాన చంద్రిక" లోని "హిందూ మహాయుగము" 'మహమ్మదీయ మహాయుగము' అను గ్రంథములను కళాశాల తరగతుల కుపన్యసించు ఆంగ్లభాషా పండితులు ఎంతయో యుపయోగించు కొందురని చెప్పిన వాని యోగ్యత ప్రకటితమగును. “స్మెల్సు" వ్రాసిన 'క్యారెక్టరు' లోని యొక యధ్యాయమును మాత్రము 'సద్వర్తనము' అను పేరుతో రచించి యుండిరి. మిల్లు, స్పెన్సరు, లబక్, మొదలగు ఆంగ్ల మహాశయుల గ్రంథ రాజముల చదివి ఇంగ్లీషు రాని ఆంధ్ర సోదరులకు జూపవలయునని వీరెంతో ముచ్చట పడుచుండిరి! కాని దేశ దురదృష్టము అందున కాటంకము కలిగించెను.
హైదరాబాదులో 1 సెప్టెంబరు 1901 నాడు శ్రీకృష్ణదేరాయల ఆంధ్రభాషా నిలయమును స్థాపించి, ఆంధ్ర భాషా విషయమున అంధకార బంధురముగా నుండిన ఈ ప్రాంతమున విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహాశయులలో శ్రీ లక్ష్మణరావుగారు ముఖ్యులు. నాల్గువత్సరముల క్రింద ఆంధ్ర జన సంఘమువారు 'పరిశోధక శాఖ'ను స్థాపించినప్పుడు వీరు ఉపసంఘము సభ్యత్వము నంగీకరించి, దివ్యములైన యాలోచనల దెల్పి, ఎంతో ప్రోత్సహించియుండిరి. చరిత్రాంశములకు నిజాం రాష్ట్రము గని యనియు, బ్రిటీషు ఆంధ్రులు ఈ ప్రాంతములను "అండమాను ద్వీపముల" వలె జూచుచుండుట తగదనియు, సోదరుల నందరను ఇచ్చట పరిశోధనము గావింప ప్రోత్సహించిరి. ఇట్టి నిష్కలంక సేవాపరాయణుని సర్వదా స్మరించి వారి యాదర్శమును ముందిడుకొనుట ధర్మమని దేశీయుల హెచ్చరించు చున్నాము.
లోకమాన్యుడు
4-8-1926
ఆధునిక కాలమున భారత వర్ష రంగమున నద్వితీయ విఖ్యాతితో తన పాత్రమును బ్రదర్శించిన మహా పురుషులలో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను మించిన వారు వేరొకరు లేరని చెప్పినచో అందతిశయోక్తి యుండదు. గడచిన 1 ఆగస్టు నాటితో నీ భారత పుత్ర రత్నము కీర్తిశేషుడై 6 సంవత్సరములు గడచినవి. ఆనాడు వివేకవర్ధనీ నాటకళాలయందు లోకమాన్యుని స్మరణార్థము జరుపబడిన సభా వృత్తాంతములు వేరొకచో ముద్రితములై యున్నవి.
లోకమాన్యుడు 23 జూలై 1856 నాడు బొంబాయి ప్రాంతము నందలి రత్నగిరి యందు సాధారణ కుటుంబమున జన్మించెను. 1872 లో ప్రవేశ పరీక్ష యందును, 1876 లో పట్ట పరీక్ష యందును మహా గౌరవ ప్రదముగ నుత్తీర్ణుడయ్యెను. తానభ్యసించిన న్యాయశాస్త్ర జ్ఞానమును జీవనోపాధికై వినియోగింపక, బీదతనమునే శరణ్యముగ గొని, దేశ కార్యములందు ప్రవేశించెను. జీవిత కాలమున నీ మహానుభావుడు, ఉపాధ్యాయుడుగను, గ్రంథకర్తగను, పత్రికా లేఖకుడుగను, ప్రజా నాయకుడుగను, దేశసేవ సల్పి జరామరణము లేని కీర్తి గడించెను. తలపెట్టిన ప్రతి కార్యమునందును చలింపని పట్టుదల, మొక్కవోని ధైర్యము, స్వార్థ రాహిత్యతయు, యాథార్థవాదిత్వము ఆ యనఘుని యందు వ్యక్తములగుచుండెను. ఉపాధ్యాయుడుగా పనిచేసి శిష్యులందు విజ్ఞానముతో పాటు దేశాభిమానాగ్నిని రగుల్కొల్పి 'నవీన మహారాష్ట్ర దేశమ"ను దానిని సృష్టించెను. "వేదములందలి మన ఉత్తర ధృవ నివాసము" (Our Arctic Home in the Vedas)ను, “మృగ శిర” (Orion)ను రచించి స్వదేశీయుల వలన ప్రశంసనందుటే కాక యూరపు ఆమెరికా ఖండములందలి దిగ్ధంతులగు పరిశోధకులను తన నవీన సిద్ధాంతములచేత ఆశ్చర్య సాగరమున ముంచివైచెను. కారాగారమునందు రెండవమారు వసించినకాలమున రచింపబడిన "గీతా రహస్య" మను ప్రచండ వైజ్ఞానిక గ్రంథము ఆంగ్ల, ఆంధ్ర, హిందీ, ఘూర్జరాది వివిధ భాషలందు అనువాదితమై భారత వర్షీయులకును, పరదేశీయులకును ఉత్తమ మార్గమును బోధించి నిరుపమాన యశమును గడించెను. “కేసరి”, “మరాటా" యను రెండు పత్రికలను నడపి, ఏ వారపత్రికకును మన దేశమున నేటివరకు లభించి యుండని వ్యాప్తిని కలిగించెను.
నాయకుడుగా రాజ్యాంగ క్షేత్రమున చేసిన కార్యములు ఆ బాల గోపాలము విదితములని చెప్పవచ్చును. రాజ్యాంగమునందు లోకమాన్యునకుండిన జనవశీకరణము మరే నాయకునకు నుండలేదనియు, ఆయన అనుచరుల సంఖ్య కోట్ల పరిమితి కలిగియుండెననియు తెలియుచున్నది. మొదటిసారి 1892 లో 12 మాసములును రెండవ మారు 1908 నుండి 1914 వరకు 6 సంవత్సరములును కర్మవశమున కారాగార శిక్ష ననుభవించి దేశీయులవలన నెక్కువ ప్రశంసను బొందెను. ఈ కర్మయోగి కారాగార జీవితమును ఉత్తమ గ్రంథరచనము నందును, పఠనము నందును వినియోగించి "సుఖ దుఃఖా సమేకృత్వా, లాభాలాభౌజయాజయౌ" యను గీతా వాక్యమును సార్థక పరచెను. రెండవమారు చెరసాల నుండి వచ్చిన తర్వాత ద్విగుణీకృతోత్సాహుడై, దేశీయ మహాసభయందు హిందూ మహమ్మదీయైక్యతకై, లక్నో నగరమున పాటుబడి కృతార్థుడై, ఆ సంస్థకు బలము చేకూర్చెను. హోం రూలు డిప్యుటేషన్ సందర్భమున ఆంగ్ల దేశమునకు జని రాజ్యాంగ సంస్కారములకై యత్నించియుండెను. ఇట్టి యాదర్శ ప్రాయమగు సేవ యొనర్చి తుదకు బొంబాయి నగరమున 31 జూలై 1920 నాడు 65 సంవత్సరముల ప్రాయమునందు భౌతిక దేహమును వదలి కీర్తికాయుడయ్యెను.
లోకమాన్యుని వర్తనము నందు ఎల్లప్పుడును ప్రస్ఫుటమగుచుండు యథార్థ వాదిత్వమున కొక తార్కాణము చూపెదను. 1918వ సంవత్సరమున ఇంగ్లాండునకు బోవుచు చైన్న పట్టణమున నుండిన దినములలో ఆంధ్రుల వలన సమర్పింపబడిన సన్మాన పత్రమునకు ప్రత్యుత్తర మొసగుచు ఇట్లు ప్రస్తా వించెను. "నేను నేడు ఆంధ్రులను మహారాష్ట్రులను ఏకముగా దలచుచున్నాను. కారణ మేమనగా మహారాష్ట్ర రాజ్యాంగ ధురీణులు అవలంబించిన రాజ్యాంగ సంస్కారము లన్నియు, విజయనగర సామ్రాజ్యమును పాలించుచుండిన ఆంధ్ర రాజులు చూపినవే. ఇందు వలననే మహారాష్ట్రులమగు మేము ఒక విధముగ ఆంధ్రులకు కృతజ్ఞులమై యుండవలసిన వారము. శ్రీ శివాజీ మహారాజును, ఆయన తరువాత మహారాష్ట్ర రాజ్యమును నడిపిన వారును విజయనగరసామ్రాజ్య రాజనీతి సూత్రములనే యనుకరించిరి. ఈ విధముగా నీ రెండు శాఖల వారికి కలిగిన సంబంధము నేటి వరకును స్థిరముగా నున్నది." ఈ విషయము చారిత్రికమే యైనను ఇంత విస్పష్టముగా నొప్పుకొనువారు మహా నాయకులలో సైతము అరుదని చెప్పవచ్చును.
లోకమాన్యుని పరహితాచరణమును, ఉత్తమ వర్తనమును, మనకు మార్గదర్శకముగ నుండుగాక!
విద్యా విధానము
28-8-1926
క్రిందటి వారము, విద్యా విధాన విషయమున సుప్రసిద్ధ మహాశయు లిద్దఱు తమ తమ యభిప్రాయముల వెల్లడించినారు. వీరు మద్రాసు విద్యాశాఖ మంత్రిగారు సర్. పరశురామ పాత్రో గారును, విఖ్యాత గ్రంథకర్తలును పండితులునగు డాక్టర్ బ్రజేంద్రనాథశీల్‌గారును. పాత్రోగారు చెన్న పట్టణమందును, సీల్‌గారు బొంబాయి నగరమందును, పట్టభద్రులకు పట్ట ప్రధాన మొనర్చునపుడిచ్చిన ఉపన్యాసములలో మఱుగుపఱచక వెలిబుచ్చిన యభిప్రాయము లెంతయు గంభీరములును, ప్రశంసార్హములునై యున్నవి. ఇవి విద్యా విధాయకులు, బాలురు, ఉపాధ్యాయులు గమనింపదగినవి. విద్య యొక్క లక్ష్యము బుద్ధి వికాసమని పాత్రోగారు నుడివియున్నారు. ఇది యెల్లరు ముఖ్యముగా మనసునందుంచుకొన వలసిన విషయము. కేవలము జీవనోపాధి గల్పించుట విద్య యొక్క పరమావధిగాదు. విద్య విజ్ఞానము కొఱకు గాని, ధనార్జము కొఱకు గాదు. దీనిని విద్యార్థులందఱు గమనించి విద్య యొక్క విలువను రూపాయలణాల దమ్మిడీలతో లెక్కింప కుందురు గాక.
ఆటుపైని, యెట్టిది కళాశాలయను విషయమున పాత్రోగారి యభిప్రాయ మెంతయు మాననీయము. జాతీయ జీవనమునకు వికాసమును, ప్రోత్సాహము నొసగునదియే కళాశాల. ఇట్టి ఉన్నతాదర్శమును నాచరణలోనికి దెచ్చునంతవఱకే కళాశాల గౌరవనీయము. విశ్వవిద్యాలయములు భావి పౌరుల కాటపట్టువులు. జాతీయభావము, సేవాశక్తి యీ విద్యాలయములందే పెరుగవలయును. కాని ప్రస్తుతము విద్యాలయముల స్థితి యెంతయు విచారకరము. ఈ యున్నతాశయాలన్నిటికిని వ్యతి రిక్తముగ కార్యక్రమములు జరుగుచున్నది. ఈ విద్యాలయములు విద్యార్థుల మానసిక సృష్టి శక్తి యభివృద్ధి జెందుటకు మారుగ నడుగంటుచున్నది. త్యాగము, ప్రజ్ఞాతిశయము, స్వాతంత్ర్యమును ప్రోత్సాహించుటకు మారుగా స్వార్థ పరాయణత్వము, సంకుచిత స్వభావము, పరాధీనత పెంపొందించు చున్నవి. శైశవ దశలో నున్న ఆంధ్ర విశ్వ విద్యాలయ మీ కొఱతల సరకు గొని, సంస్కరించి స్వధర్మ నిర్వహణమునకును, ఆత్మోపలబ్ధకిని ననుకూలించు నిజమగు విద్య నొసగి జాత్యభ్యుదయమునకు పాటు పడునని నమ్ముచున్నాము.
విద్యా విధానముగూర్చి సర్ బ్రజేంద్ర నాథ్ సీల్‌గారి సూచన లెంతయు మాననీయములు. ప్రాచ్య పాశ్చాత్య విద్యా వికాసముల మేళగించి, బాలురకు శిక్ష నొసగుట ఇప్పుడు మన సమస్యయై యున్నది. బ్రహ్మచర్యము,గురుకులము మొదలగు విధానముల కాలము పోయినది. అయినను ఆ విధానములోని గూఢమైయున్న భావములను, ఆశయములను మనము విసర్జింపరాదు. వానిని గొని, మన భిన్న పరిస్థితుల కన్వయించి, సానుకూలముగా, శుభప్రదముగా మన విద్యా విధానము నెఱపవలెను. ఈ సందర్భమున సీలుగారొక నూతన విషయమును సూచించియున్నారు. విద్యావిధానము వృత్తికిని స్థానిక పరిస్థితుల కనుగుణ్యముగా నుండునటుల నుండవలెనని వారి సలహా. దీని గూర్చి యెల్లరు నాలోచించుట యెంతయు నవసరము. ప్రత్యేక కళలకును, పరిశ్రమలకు ప్రత్యేక సదుపాయము లుండును. ఆ ప్రాంతపు బాలుర కా ప్రాంతపు కళలను గాని, నేర్చుకొనుట సులభముగా నుండును. మఱియు నా కళలు గాని పరిశ్రమలుగాని వృద్ధియగుట కెక్కువ యవకాశముకూడ నుండును. ఈ యంశమును విద్యాభివృద్ధియందును తద్వ్యాప్తియందు నభిమానులందఱు నాలోచింతురు గాక!
వ్యవసాయ విచారణ సంఘము
13-10-1926
ఈ సంఘము తాలుకు ముగ్గురు సభ్యులును, అధ్యక్షుడగు లిన్లిత్గో ప్రభువును శనివారము నాడు బొంబాయిలో నోడదిగిరి. వారచ్చటి నుండి తిన్నగా సిమ్లాకు బోయి, తదితర సభ్యులతో గూడి కార్యమున కుపక్రమింతురు. వ్యవసాయాభివృద్ధి, పశుసంపద, పశుచికిత్స, క్రొత్త పంటలు నూతన వ్యవసాయ పద్ధతులు, వీనిగూర్చి ప్రస్తుతము ప్రభుత్వము వారెట్టి చర్యను గొనుచున్నారు? ప్రస్తుతము యాన సౌకర్యములెవ్విః ఫలసాయ మే విధముగ నమ్మబడుచున్నది? వ్యవసాయపనుల కే విధమున ధనసహాయము జరుగుచున్నది? ఋణములకెట్టి యవకాశములుగలవు? కృషికుల క్షేమముతో సంబంధము గలిగిన ముఖ్యాంశము లెవ్వి? ఈ విషయముల గూర్చి యీ సంఘము వారు శోధన సలుపవలెను. కాని యీ శోధనాంశములలో నొక ముఖ్యమైన విషయమును విడిచివేసి యున్నారు. అది ప్రస్తుతపు కౌలు పద్ధతులు గూర్చిన చర్చ. కృషికుల స్థితి గతులు ముఖ్యముగా వీనిపై నాధారపడి యుండును. వ్యవసాయాభివృద్ధికిగల యవకాశములన్నియు వీని నాశ్రయించి యుండును. ఒక ఉదాహరణము దీనిని విశదపరచగలదు. ప్రస్తుతము బంగాళాదేశమున జమీందారీ పద్ధతి అమలులో నున్నది. దీనివలన వాస్తముగా భూమిని దున్నుచున్న రయితాభూమికి స్వామి కాజాలడు మరి ఫల సాయములో కొంత భాగమును రయితు నుండి గొని, దానిలో నుండి సర్కారు వారికి సిస్తు చెల్లించి, మిగిలినది తాననుభవించుచు, జీవించుచున్న జమీందారుడా భూమికి యజమాని. ఇట్లు భూమి దున్నువాడు భూస్వామికాడు. భూస్వామి రయితు భూమికి స్వతంత్రాధికారి కాడు. ఈ ద్వంద్వ స్వామ్యమువలన యనేక అనర్థములు మూడుచున్నవి. భూస్వామి యెక్కువ ఆదాయము వచ్చుననెడి యాశచే తన భూమిని యనేక రయితులకు పంచి యిచ్చును. దీనివలన భూమి యనేక క్షుద్ర భాగములుగా విభజింపబడి, వ్యవసాయములో అభివృద్ధి మార్గముల ప్రవేశ పెట్టుటకు వీలులేక పోవుచున్నది. రయితునకు జెందవలసిన ధనము భూస్వామికిని, తదితర మధ్య వర్తులకును జెందుచున్నది. సగటున బంగాళమున నొక్కొక్క జమీందారునకు రూ. 3 స్వామి భోగము వచ్చును. వీరు దీని నుండి 10 అణాలు మాత్రమే సర్కారువారికి సిస్తు కట్టి మిగిలిన రూ. 1-6-0 తామనుభవించుచున్నారు. వ్యవసాయమున నెట్టి పాలునుగొనక, హాయిగా పట్టణములలో గూర్చుండి, వీరి ధనము ననుభవించుచున్నారు. ఎండలో మాడి వానలో తడిసి, రేయింబవలు పొలములో బనిచేసిన కర్షకులకు నిజముగా నీ ధనము చేరవలసియున్నది. ఈ ధన సాహాయమున వారు సేద్యము నెంతయో అభివృద్ధి పరచియుందురు. కాని యిప్పుడా ధనము సోమరులకు జెంది వృధావ్యయముల పాల్బడుచున్నది. ఇట్టి ముఖ్యమైన కౌలు సమస్యను వ్యవసాయ కమిషను వారు సంశోధింపకుండు టెంతయు విచారకరము.
ప్రస్తుతము రయితులను పీల్చి పిప్పిచేయుచున్న పిశాచము ఘోరమైన ఋణ బాధ. భూమి ప్రస్తుతము యతి స్వల్పమగుట చేతను, తగు నీటి లేక పోవుట చేతనే, తదితర కారణముల చేతను రయితునకు సుఖజీవనోపాధిని కలిగించుటలేదు. గృహ పరిశ్రమలు నశించుటచే వేరు ఆదాయము లేదు. కోళ్ళను, పందులను, గొఱ్ఱెలను బెంచి వ్యాపారము చేయుట మనలో వాడుక కాదు. కాన సిస్తు కట్టుటకుగాని, పశువుల కొనుటకుగాని వివాహ శ్రాద్ధములకు గాని, సొమ్ము కావలసినప్పుడు మన బీద రయితు సాహుకారి వద్దకు బోయి ఋణమును దేవలసి వచ్చుచున్నది. ఈ ఋణము వడ్డీకి వడ్డీ చొప్పున అనతి కాలములోనే పెరిగి పాపమా రయితు రాబడి నంతయు మ్రింగివేయ సిద్ధపడును. ఈ ఋణమును దీర్చుట కారయితు వేరొక ఋణము జేయును. ఇట్లు ఋణము కొఱకు ఋణము చేయుచు రయితు తన జీవిత కాలములో నెన్నటికిని ఋణవిముక్తి నొందకున్నాడు. ఈ సమస్య గూర్చి శోధన సలుపు నెడ “రయితు వివాహములు, శ్రాద్ధములు చేయునవుడు విపరీత వ్యయముల చేయరాదు. రయితుల భార్యలు నగల యందలి యపేక్షను విడువవలెను; భూమిని స్వల్ప భాగములుగా విభజింపకూడదు; రయితు పొదుపు గలిగి జీవనయాత్ర గడుపవలెను; అప్పుడీ ఋణబాధ మాయమగును." అని యా రీతిగా నీ సంఘమువారు తమ శోధనాంతరము సూచనలు చేసిన నేమియు ప్రయోజనము లేదు. ఈ విష యము లన్నియు నిదివఱకే మన మెరుగుదుము. వీనిని మఱల వల్లించుటకు వేలకొలది రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేకముగా నొక సంఘమును నియోగింప నవసరములేదు. ఋణము చేయుట మోసమని యెల్లఱకును విశదమే. కాని విధిలేక రయితులప్పుల పాల్పడినారు, పడుచున్నారు. ఋణస్తులను ఋణ విముక్తుల జేయుటెట్లు? ఋణము చేయబోపు వారిని దాని నుండి మరల్చుటెట్లు: ఈ యంశముల గూర్చి యీ విచారణ సంఘము వారు మార్గముల జూపిన దేశీయులు కృతజ్ఞులయ్యెదరు.
ప్రస్తుతము వ్యవసాయశాఖవారు చేయుచున్న ప్రయత్నములలోను, అవలబించు పద్ధతులలోను, గొన్ని నిష్ఫలములును, నిష్ప్రయోజనములునునై యున్నవి. వీరు సలుపుచున్న శోధనలు విద్యకును, విజ్ఞానమునకును సంబంధించిన వగుచున్నవిగాని, ప్రకృతపు కర్షకుల వ్యవసాయ చిక్కులను పరిష్కరించుటలేదు. ఆమెరికాలో కృషికులు స్వయముగ వచ్చి, పంటలు పండించునపుడు తమకు గలుగుచున్న చిక్కుల నెల్లను వ్యవసాయ శోధకుల కెఱింగించెదరు. అటుపైని, యా సమస్యల గూర్చి పరిశోధన సంఘము వారు శోధన జేయుదురు. కాని మన దేశమున రైతునకును శోధన సంఘమునకును ఇట్టి సన్నిహిత సంబంధము లేదు. పరిశోధకులు తమకు దోచిన నేదియో నొక విషయము గూర్చి శోధన ప్రారంభింతురు. సంవత్సరములకొలది ప్రయత్నించి యేదియో నొక దానిని కనిపెట్టుదురు. కాని యది కేవలము వైజ్ఞానికముగ నుపయోగపడుచున్నది గాని, ప్రకృతపు సేద్యమునకు కక్కఱకు వచ్చుటలేదు. నారవిషయములలో నిపుణుడగు ఫిన్లో దొరగారెన్నియో సంవత్సరములు ప్రయాసపడి జనపనారను వేరు విధమున దీయుట కొక యంత్రమును కనిపెట్టిరి. కాని ఈ యంత్రము గూర్చి యే సేద్యగాడును శ్రద్ధ గొనలేదు. జనపనారదీయుట కిదివఱకొక సుగమమగు మార్గముండనే యున్నది. అందుచే యీ యంత్రము వారి కావశ్యము కాదు. వారి ముఖ్యావశ్యములు వేరు. వాని గూర్చి నూతనాంశముల వారికి దెలిపిన వారు శ్రద్ధ వహింతురు. కాని వానికి బదులీ క్రొత్త యంత్రము వారి కొసగిన వారు దానిని నిరసించుటలో నెట్టి వింతయు లేదు కదా! ఇట్టి దిక మీదట జరుగకుండునటులను. ప్రకృతపు సేద్యములోని సమస్యలను స్వంతముగగాని, వ్యవసాయకుల నడిగిగాని, దెలిసికొని మఱి శోధనకు గడంగు నటులను, ఈ సంఘమువా రేర్పాటు చేసినయెంతయు మేలు కలుగును. వ్యవసాయ శాఖకును, రయితులకును దగ్గఱ సంబంధమున్నగాని వ్యవసాయ మభివృద్ది చెందును.
ఈ సంఘము వారింకొక విషయమును తమ దృష్టి యందుంచు కొనపలెను. ప్రస్తుతము వ్యవసాయములో గమనింపబడుచున్న మన దేశీయ వాడకులను వారు గ్రహింపవలసియున్నది. మన దేశములో వ్యవసాయము నిన్న మొన్న నేర్చుకొనిన పరిశ్రమకాదు. అనేక వేల సంవత్సరముల నుండి నానాటికి వికాసము గాంచుచు వచ్చిన కళ. కాని మన పద్ధతులలో ననేక మహత్తరమైన వైజ్ఞానిక విషయములు నిగూఢమై యున్నవి. ఈ యంశమును ప్రస్తుత మనేక పాశ్చాత్య వ్యవసాయ శాస్త్రజ్ఞులు కూడ నంగీకరించి యున్నారు. కాన విచారణ సంఘము వారు మన పద్ధతులను తేలికగా నొక మూల ద్రోసివేయక, వానిని బూర్తిగ లెక్కగొని తగు మార్పుల సూచించవలెను. అట్లయినగాని వీరి సూచనలకు తగు విలువగాని ఫలముగాని యుండదు. ఈ విషయమున వివిధ రాష్ట్రీయ వ్యవసాయశాఖ మంత్రు లీ సంఘము వారికి దోడ్పడ గలరని నమ్ముచున్నాము.
వ్యవసాయ సమస్యలు
15-12-1926
వంగ రాష్ట్రములో నొక కలెక్టరుగానున్న ఖాన్ బహద్దరు మోమెన్ అనువారు వ్యవసాయపు కమిటీవారి యెదుట వ్యవసాయ విషయమై యిట్లుచెప్పిరి. "వ్యవసాయ శాఖలో వ్యయము చాల యగుచున్నది. గొప్ప వేతనములు కల యుద్యోగులే పెక్కురున్నారు. అటుకాక జిల్లా యుద్యోగులును ప్రదర్శకులును (Demonstrators) విశేషముగా నుండవలయును. సర్కారీ వ్యవసాయశాఖ జనులలో నాదరణము నొందినది కాదు. అనేక రైతులు సర్కారు ద్రవ్యము వ్యర్థముగా వ్యయమైనదని నమ్ముచున్నారు. అధికారులూరకే తిరుగుటే (సఫర్ చేయుట) కాని యే యుపయోగ కార్యముల చేయలేదని తలచుచున్నారు. పెద్ద యధికారులు రైతులను కలియుట లేదు?
ఇంతవరకును విద్యావంతులైన వారును, పరదేశీయులును, హిందూస్థానపు రైతునకు క్రొత్త సంగతులు తలకెక్కవనియు, చెప్పిన గ్రహింపరనియు నొక యపవాదము కల్పించియుండిరి. కాని వారింతచేసిన ప్రయత్నములేమి? పైవారి వాఙ్మూలము వలన వ్యవసాయశాఖ రైతునకర్థము కానిదిగా నున్నదనియు, వ్యవసాయాధికారులెట్టివారో రైతెన్నడును చూడలేదనియు విశదమయ్యే కదా! ఇక ముందై నను ప్రభుత్వమువారేకాక విద్యాధికుడైన ప్రతివాడును బీదరైతుపై కొంచెము శ్రద్ధ బూనవలయును. సర్కారువారి కందరికన్న నెక్కువ యాదాయము కలిగించు వారీ రైతులే. కొంచ మించుమించుగా సర్కారుకు లాభము కలిగించు విషయములో వీరికి తులదూగువారు త్రాగుబోతులు.
ఇతర శాఖలపై, ఇతర విద్యలపై ఖర్చు పెట్టిన దానికన్న రైతులకు కావలసిన వ్యవసాయ విద్యపైనను, వ్యవసాయ శాఖపై నెంత వ్యయము చేసినను లోపములేదు. రైతులు విద్యాలోపముచేతను, తిన తిండిలేక దారిద్ర్యము చేతను, దినదినము క్షీణించుచున్నారని ఆచార్య రాయిగారు తమ యభిప్రాయముగా కమిటివారితో తెలిపెను. మరియు "పై రాయిగారు మొన్న మద్రాసులో నుపన్యసించుచు నొక్క ఇంగ్లీషుదొర భోజనము చేయు విలువగల పదార్థమును మన యంబలి త్రాగు రైతులు 40 మంది తినుచున్నారని యుదాహరించిరి. మరియు కొందరు తమ సాక్ష్యములో రైతులు దినదినము బాకీల పాలై క్షీణదశనొందుచున్నా రని నివేదించిరి. భూమి గుణము క్షీణించినది. మరల వీనిని సారవంతముగా నొనర్చుకొనుటకు రైతునకుశ క్తి చాలదు.ఎల్లప్పటికి నతడు సంవత్సరమంతయు నెండలో మాడి వానలో తడసి కష్టించి సంపాదించిన యా కొద్ది మొత్తమును సాహుకారి తన వడ్డీ క్రిందికే లాగుకొనుచుండగా రైతు భూములను వృద్ధిచేసి కొనకుండిన మానె, తాను జీవించుటెటులు?
కావున వ్యవసాయపు కమిటీవారు రైతులను ఋణముల పాలుకా కుండునట్లు చేయుటయెట్లు. వారిని విద్యావంతులను చేయుట యెట్లు, వారికి వ్యవసాయ శాఖలవలన నెట్లు లాభము గలిగింప జేయవలయు నను విషయములను చర్చించి దానికి తగిన సూచనం గావించిన దేశమునకు మహోపకారము చేసిన వారగుదురు.
శ్రీప్రభువుగారి జన్మదినోత్సవము
5-1-1927
మహా ఘనత వహించిన నిజాము ప్రభువుగారి జన్మోత్సవము రేపటిదినము రాజధాని యందును, ఇతర స్థలములందును రాజభక్తితో జరుపబడ నున్నది. నేటి నుండి మన ప్రభువుగారికి 43 వ సంవత్సరము ఆరంభమగు చున్నది. ఈ సుసందర్భమున, శ్రీ ప్రభువుగారిని, ఒక కోటి ఇరువది నాల్గు లక్షల ప్రజల పక్షమున మేము సవినయముగా నభినందించు గౌరవమును బడయుచున్నారము.
మన ప్రభువుగారు రాజ్య సింహాసన మధిష్ఠించిన నాటగోలె రాష్ట్రములో పెక్కు మార్పులు జరిగినవి. శ్రీ ప్రభువుగా రపార ప్రజ్ఞాబలయుతులు. వీరి కాలముననే యనేక ప్రసిద్ధ నిర్మాణములు జరిగెను. ఇంకను క్రొత్త క్రొత్త కట్టడములు జరుగుచున్నవి. రాజ్యాంగము నందలి విమర్శ నీయాంశముల శ్రీ నిజాము ప్రభువుగారు శ్రమయనక శ్రద్ధతో పరికించి స్వయముగా తగు నేర్పాటులు చేయుచుందురు.
మన ప్రభువుగారు రాజ్య భారమును వహించి (17) వత్సరములు కావచ్చినది. వీరి పాలనమున రాజ్యాంగమునందెన్నియో మార్పులు జరిగినవి. ముఖ్యముగ వీరి కాలముననైన విద్యాభివృద్ధియు కృతజ్ఞతా పూర్వకముగ గొనియాడదగియున్నది. ప్రారంభ విద్యయందు వ్యక్తమైన యభివృద్ధియే కాక, ఉన్నత విద్యలను రాజ భాషయగు ఉర్దూలో నేర్పుటకై శ్రీ ప్రభువుగారి వలన ఆదర్శపూర్వకముగ స్థాపింపబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయము మూలమున ఎంతయో యుపయోగము కలుగుచున్నది. నాల్గు వత్సరముల నుండి విశ్వవిద్యాలయమువలన స్నాతకులుగా జేయబడిన వారి సంఖ్య నాల్గు వందలకు మించినదని చెప్పవచ్చును. ఈ విశ్వవిద్యాలయము యొక్క 8 వత్సరముల యభివృద్ధి, మద్రాసు విశ్వవిద్యాలయమునకు సంబంధించిన నిజాము కాలేజి మున్నగు విద్యాలయముల మూలమున దాదాపు అర్ధశతాబ్దముననైన యభివృద్ధితో సమానముగా నున్నదని పలువురు వక్కాణించుచున్నారు.
పరిపాలనము యొక్క ఇతర శాఖలందును ఎన్నియో మార్పులు జరిగినవి. ఇవి యన్నియు ప్రజాహితము కొరకు శ్రీ ప్రభువుగారు శ్రద్ధతో నాలోచించి చేసిరి.
ప్రజా క్షేమ తత్పరులగు మన ప్రభువుగారి పక్షమున కొన్ని మాసముల క్రింద “సంస్కారములు" చేయబడునని ప్రకటింపబడినది. అట్టి సంస్కారములలో మొదటి కార్యముగా క్రొత్త యధికారులు నియమింపబడుచున్నారు. మాల్గుజారీయందు గొప్ప మార్పులు జరిగి ముఖ్యాతిముఖ్యమగు నీ శాఖ మూలమున దేశాభివృద్ధి కలుగునని మేము విశ్వసించుచున్నాము.
ఇచ్చట శాసన నిర్మాణ సభను ప్రజా ప్రాతినిధ్య పద్ధతిపైన సంస్కరించుటకు శ్రీవారు కొన్ని వత్సరముల క్రింద నాజ్ఞాపించిరి. ఈ విషయమున కావలసిన అంకెలను వివరములును సిద్ధము కూడనై నవి. గత మాసమున ప్రధానామాత్యులగు శ్రీ మహారాజా బహద్దరుగారు శాసన నిర్మాణ సభ యందు, అనధికార సభాసదులతో, సంస్కార విషయములను సానుభూతితో నాలోచింతుమని సెలవిచ్చి ప్రజలయందుత్సాహమును ప్రతిష్ఠింపజేసిరి. ఇది యంతయు మన ప్రభువుగారి ప్రజా వాత్సల్య విశేషము. శ్రీవారి జన్మోత్సవ సందర్భమున గాని ఇతర సందర్భమునగాని ముఖ్యముగా నీ సంస్కారము ప్రవేశపెట్టుట మహా శుభ ప్రదమనియు, పరిపాలనమునందు ప్రజల తోడ్పాటు నిజముగా మనరాజ్యమును దుర్భేద్యముగా నొనర్చుననియు వినయ పూర్వకముగ సూచించు చున్నాము.
శ్రీ ప్రభువుగారు ప్రజా క్షేమంకరులై చిరకాలము వర్ధిల్లుదురుగాక ! నిజాం రాష్ట్రవాసులు ప్రపంచమందలి ఏ నాగరిక రాష్ట్రవాసులకును స్వాతంత్ర్యమునందును, విద్యాధికములందును తీసిపోక స్వదేశాభ్యుదయమునకు తోడ్పడునట్లు పరమేశ్వరుడనుగ్రహించు గాక !
బ్రాహ్మ సమాజము
26-1-1927
గత 23 జనవరి భారత వర్షము యొక్క ఆధునిక చరిత్రమున ముఖ్య దిన మనుటకు సందియము లేదు. అది కీ. శే. రాజారామ మోహనరాయల వలన బ్రాహ్మ సమాజము స్థాపింపబడిన పవిత్ర దినమగుట చేత ప్రతి భారతీయుని వలనను స్మరింపదగినదై యున్నది.
భారత వర్షము మతములకు పుట్టినిల్లు. ఏ కాలమునకు దగిన విధమున ఆ కాలమున నిచ్చట మహా పురుషులుదయించిరి. "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” యని భారతీయ విజ్ఞానఖనియగు గీతావచనము. కనుకనే ధర్మ గ్లాని కలిగినపుడు ఈశ్వరానుగ్రహమున ధర్మ సంస్థాపనము జరుగుచు వచ్చుచున్నది.
బ్రాహ్మ సమాజము 23 జనవరి 1830 సం॥ యందు స్థాపితమైనది. అప్పటి దేశ స్థితి అందు ముఖ్యముగా వంగ దేశము యొక్క స్థితి చాల దుఃఖప్రదముగ నుండెననుటకు సందియము లేదు. ఏకేశ్వరోపానమునకై ఉపనిషత్కాలముననే ఖ్యాతి వహించియుండిన మన మాతృ దేశము మూఢాచారములకు లోనై, పరిశుద్ధమగు దివ్యమూర్తిని మరచెను. సంఘముననెన్నియో దురాచారములు ప్రబలి యుండెను. సహగమనము, శిశువులను గంగకర్పించుట, నరబలులు మున్నగునవి లెక్కకు మిక్కిలిగ నుండి అభివృద్ధికి వలయు శాంతతను దేశమున లేకుండజేసెను. జాతులలోను అంతర్జాతులలోను పలు భేదములు, అనేకములగు హెచ్చుతగ్గులు ఏర్పడి ఐకమత్యము శూన్యమగుచుండెను. హిందూదేశమున సమావేశములైన వివిధ మతములలో ఏక భావము కుదిరి తన్మూలమున భారత జాతి యనునది యుద్భవించుట అత్యవసరమగు స్థితి కలిగెను. అట్టి కాలమున, వివిధ మతములందలి విజ్ఞానము గ్రోలి, దాని హెచ్చు తగ్గుల నారసి భారత వర్షములోని యన్ని మతముల వారికి సామాన్యమును సమిష్టిదియు నగు నొక మత వేదికను నిర్మించిన గౌరవము బ్రాహ్మ సమాజమునకు చెందవలసి యున్నది. ఈ సందర్భమును పురస్కరించుకొని హైదరాబాదు బ్రాహ్మ సమాజము వారు నిన్నటి దినమున నుత్సవము సల్పిరి. ఈ సభ యొక్క వివరములు వేరొకచో గాననగును. బ్రాహ్మ సమాజము నవీన భారత జాతి యొక్క కళ్యాణమును సమకూర్చుగాక !
ప్రత్యేకాంధ్ర రాష్ట్రము
26-3-1927
మదరాసు శాసన సభలో నా రాజధానిలోని ఆంధ్ర జిల్లాను ప్రత్యేకరాష్ట్రముగ నేర్పరచుటకై ప్రతిపాదింపబడిన తీర్మానము బహు జనాభిప్రాయానుసారము అంగీకారమును పొందినవార్త ఏ ప్రాంతములందుండు వారైనను సరే ఆంధ్రులగు వారందరుకును మోదావహమనుట నిశ్చయము. మదరాసు రాజధానిలోని మా యాంధ్ర సోదరులు ఎన్నియో వత్సరముల నుండి ప్రతేక్య రాష్ట్రమును వాంఛించుచుండిరి. ఎన్నియో ఆంధ్ర మహాసభలందు ఆంధ్ర మహానాయకులు ఈ మహద్విషయమును ఆమోదించిరి. కాని ప్రభుత్వము వారు దీనిని విచారింపరైరి. ఇంత కాలమునకే తీర్మానము, ప్రాంతిక శాసనసభలోనే యగుగాక, జయప్రదముగ నంగీకరింపబడుట మా ఆంధ్ర సోదరుల భావి విజయమునకు సూచకమని మేము విశ్వసించుచున్నాము.
ప్రస్తుత తీర్మానము భారత ప్రభుత్వము వారి యంగీకారమును కూడ పొంది ఆ చరణములోనికి వచ్చుచో ఆంధ్రులయొక్క ఆదర్శము కొంతవఱకు ఫలించినదని భావింపవచ్చును కాని భారత వర్షములోని యాంధ్ర ప్రాంతము మదరాసు రాజధానిలోనే కాక, కొంత మధ్య పరగణాలందును కొంత నిజాం రాష్ట్రమునందును, మరికొంత మైసూరు సంస్థానమందును కలదు. బ్రిటిషు హిందూ దేశములోని యాంధ్రదేశము కాలక్రమమున ఒక రాష్ట్రముగ ప్రభుత్వము వారివలన నేర్పరుపబడవచ్చును. కాని బ్రిటిషు ప్రభుత్వము వారి తీర్మానములు దేశీయ రాజ్యములలో మార్పు కలిగింపజాలవు. కనుక నాల్గు పాలనముల క్రింద నున్న ఆంధ్రదేశము కొంతకాలము తరువాత మూడు పాలనముల క్రిందకు రాగలదు. అంతే నిజాం రాష్ట్రాంధ్రుల స్థితిలందు ఈ తీర్మానము సంపూర్ణ విజయము గాంచిన తరువాత కూడ ఎట్టి మార్పును కలుగు నవకాశము లేకున్నను, బ్రిటిష్ హిందూ దేశములోని సోదరుల వాంఛ నెరవేరినచో ఈ రాజ్యములోని యాంధ్రులును ఆనందింతురనుట నిశ్చయము. ఈ సందర్భమున నొక విషయము మాత్రము మాకు విచారము కలిగింపక మానదు. ఆంధ్ర మహాసభలందు ముఖ్యస్థానము వహించి ప్రత్యేకాంధ్రరాష్ట్ర తీర్మానమును బలపరచిన పలువురు మహాశయులు మొన్న శాసనసభ యందు ఈ ఉపపాదనము వచ్చినప్పుడు తమ తొల్లింటి ప్రతిజ్ఞలను మరచి తీర్మానమునకు ప్రతికూలముగా ప్రసంగించిరి. అట్టివారిని బేర్కొనవలసిన యవసరము లేదు. వారిని నిందింపను బనిలేదు. ఈ యంశము మన సోదరుల చిత్త స్థైర్య రాహిత్యమును కార్య భీరుత్వమును, మాత్రము ప్రకటించు చున్నది. ఇట్టి విచారకరములగు లోపములు మనల ముందైన వదలుగాక!
రాజ్యాంగ సంస్కరణములు
4-5-1927
ఆధునిక కాలమున నిజాం రాష్ట్రము నందు రాజ్యాంగ సంస్కరణములు మహా ఘనత వహించిన నిజాం ప్రభువుగారి 16 దై 1326 ఫసలినాటి ఫర్మానుతో ఆరంభమైనవని చెప్పవచ్చును. ఈ ఫర్మాను అసాధారణ (గైరు మామూలి) జరీదా మూలమున ప్రకటించబడి యుండెను. శ్రీవారి ఈ ఫర్మాను వలన గలిగిన ముఖ్యమైన మార్పు యేదనగా, అంతకు పూర్వము ఎంతోకాలము నుండి రాజ్యాంగ సూత్రములన్నియు ప్రధాన మంత్రి యందు కేంద్రీకరింపబడి యుండ నా పద్ధతి దేశాభివృద్ధికి బాగుగా నుండదని శ్రీవారు తమ ఘన బుద్ధియందు నిశ్చయించి రాజ్యపాలనమునకై యొకసభ, "ప్రభుత్వ సభ” (బాబెహుకూమతు) అనుదాని నేర్పరచి దానికధ్యక్షునిగా విఖ్యాతులగు సర్ అలీ ఇమాంగారిని నియోగించి సభానియమములు, అధికారములు, అధ్యక్షుని ప్రత్యేకాధికారములు వివరముగా నిర్ణయించిరి. ఇదే ఫర్మాను చివర శ్రీవారు "మేము మా అమీరులను, అధికారులను, ప్రియ ప్రజలను ఈ క్రొత్త రాజ్యాంగ పద్ధతిని జయ ప్రదముగా జేయుదురుగాక యని కోరుచున్నాము" అని సెలవిచ్చిరి. ఈవిధమున శ్రీవారు పరిపాలనమున తమ ప్రజలకు సంబంధము, కలిగించు మహోద్దేశమును సూత్రప్రాయముగా జూపిరి.
తరువాతి సంవత్సరముననే శ్రీవారు మరియొక ఫర్మాను ప్రభుత్వ సభాధ్యక్షుని పేర జారీచేయించిరి. ఇది ప్రజా శ్రేయములను శ్రీవారు గౌరవింపదలచి, బ్రిటిషు హిందూ దేశములోని ఉత్తము ప్రజా ప్రాతినిధ్య పద్ధతిని మన శాసన నిర్మాణ సభయందు ప్రవేశ పెట్టగోరి ప్రకటింపబడినదై యున్నది. హైద్రాబాదు శాసన నిర్మాణ సభను బ్రిటిషు హిందూ దేశము నందలి శాసన నిర్మాణ సభల కేవిధముగను దీసి పోకుండ నుండునట్లు సంస్కరించుటకై అవసరమగు అంకెలను సంగతులను కూర్చి ప్రోవుచేయుటకు రాయ్ బాలముకుందుగారి యాజమాన్యమున నొక కార్యాలయము ఏర్పరుపబడెను.మునుపటివలెగాక ఎన్నికల పద్ధతి ఏర్పరుప వలయుననియు, (1)శాసన నిర్మాణము (2) ప్రశ్నోత్తరములు (3) తీర్మానములు (4) ఆదాయ వ్యయ నిర్ణయము మున్నగునవి శాసన నిర్మాణసభ యందు ప్రవేశపెట్టవలయు ననియు, కొలది సంఖ్యగల జాతుల హక్కుల కాపాడుటకు వలయు జాగరూకతలు నిర్ణయింపవలయు ననియు శ్రీవారి ఫర్మాను శాసించినది. దీని ప్రకారము వెంటనే కార్య స్థాన మొకటి ఏర్పడి సంవత్సరము కంటె ఎక్కువ కాలము పనిచేసి, వివిధములగు అంకెలను, సంగతులను తయారుచేసి రెండు సంపుటములచ్చు వేసి ప్రభుత్వము వారికి నివేదిక (రిపోర్టు) యుక్తముగ నర్పించిరి. సర్ అలీ ఇమాంగారు కూడ ఈ విషయమున తమ నివేదిక కూడ వ్రాసిరట. కాని పైవానిలో నేవియు ప్రకటింపబడలేదు.
కాని ఏమి కారణమో, 1334 ఫసలి వరకు పర్యవసాన మేమియు తేల లేదు. ఈ వత్సరమున మహా ఘనత వహించిన ప్రభువు గారు మరల నీ విషయమున నొక యువ సంఘమును (ముగ్గురు సదరల్‌ముహాములును దివాన్ బహద్దరు జి. కృష్ణమాచార్యులును సభా సదులుగా గల దానిని) ఏయే రాజ్యాంగ సంస్కరణము లవసరమో నిర్ణయించి నివేదిక పంపుటకు దయాపూర్వకముగా నేర్పరచిరి. ఈ సంఘము వారు తమ నివేదిక నొక మాసము దినములలోనే ప్రభువు గారి ఆజ్ఞానుసారము ప్రభుత్వ సభ కంపిరి. ఇది జరిగియు నేటికి రెండు వత్సరములు దాటినది.
సుమారునాల్గు మాసముల క్రింద మన మహారాజా సర్ కృష్ణ ప్రసాదు బహాదురు గారు ప్రభుత్వ సభాధ్యక్షులైన తరువాత జరిగిన శాసన నిర్మాణ సభయొక్క మొదటి సమావేశమున, మౌల్వీ మహమ్మదు అస్గర్ బి. ఏ.; బారిస్టరెట్లా గారు రాజ్యాంగ సంస్కరణముల యావశ్యకతను శాసన సభాసదుల పక్షమున మహారాజా గారి యెదుట వ్యక్తీకరింపగా, మహారాజా బహాదరు గారు ఈ ముఖ్య విషయమును గూర్చి "సానుభూతితో నాలోచింతు" మని వాగ్దాన మొనర్చిరి.
కొన్ని మాసముల క్రింద బ్రిటిషు హిందూ దేశపు ఆంగ్ల పత్రికలు కొన్ని మన ప్రభువు గారిని గూర్చియు బ్రిటిషు ప్రభుత్వము వారు మన రాజ్యాంగములో జోక్యము కలిగించుకొన నిశ్చయించినారనియు అసత్య వార్తలు ప్రకటించునపుడు, మన ప్రభుత్వము వారు "ఈ వార్తలు అసత్యములనియు, రాజ్యాంగమునందు సంస్కారములు చేయవలయునని ప్రభుత్వమువారు తలంచుచున్నారనియు త్వరలోనే ఆ సంస్కారములు ఆరంభింపబడుననియు, ప్రజలకు తెలియుటకై ప్రకటనము గావించిరి. ఈ ప్రకటనము తరువాత కొన్ని మార్పులు జరిగినవి. 1. మహరాజా బహాదురు గారు ప్రభుత్వ సభాధ్యక్షులుగ నియోజితులైరి. 2. మాల్గు జారీ పోలీసు ఈ రెండు శాఖలను చేర్చి వీనికి మంత్రిగా కర్నలు ట్రేంచు గారును, 3. మాల్గు జారీ కార్యదర్శిగా మిస్టర్ టాస్కరు గారును, 4. సదరు నాజము కోత్వాలి అజ్లా పదవి పైన మిష్టర్' ఆర్మ్ స్ట్రాంగు గారును, 5. పారిశ్రామిక శాఖ యొక్క కార్యదర్శిగా మిష్టర్ కాలిన్సు గారును, 6. నాజము అత్యాత్ పదవికి నవ్వాబ్ తకీయార్ జంగుగారును నియోజింపబడిరి. ఇవి యన్నియు ఉద్యోగస్తులలో మార్పులే కాని రాజ్యాంగ వ్యవస్థలో మార్పులనుటకును వీలు లేదు. ప్రభుత్వ విధానములో 1329 ఫసలీలో నేర్పబడిన ప్రభుత్వ సభా (బాచె హుకూమతు) పద్ధతి తప్ప తరువాతి మార్పు ఇంకను ఏదియు జరుగలేదు. ఇది 1329 నుండి 1336 వరకు గడచిన (7) వత్సరముల ఉదంతము.
కనుక మహా ఘనత వహించిన మన ప్రభువు గారి సంకల్పమును, ప్రభుత్వ సభాధ్యక్షుల వాగ్దానములును, ప్రభుత్వము వారి ప్రకటనములును, రాజ్యాంగ సంస్కారముల విషయమున ఇంకను ఆలోచనములోనే యున్నవనియును ఈశ్వరానుగ్రహమున్నచో కార్య రూపమున వెలువడగలవనియు నమ్ముచున్నాము.
నాయకులు—ప్రజలు
11-5-1927
అసహాయోద్యమము ప్రజల హృదయమునందు నాటియున్నదని చెప్పుటకు నాగ్పూరు యందును అలీబాగు యందునూ జరుగుచున్న సత్యాగ్రహములే నిదర్శనములు. నాయకులు తమ భావములు మార్చుకొని రానురాను ప్రభుత్వమునకు సహాయపడుట కుద్యుక్తులగుచున్నారు. కానీ ప్రజలు మహాత్మా గాంధీగారి హితవును మరువలేదు. నాయకులయందు వాక్శూరత్వ మున్నంత కార్య శూరత్వము లేదు. ఒకరితో నొకరికి సరిపడక, అభిప్రాయ భేదములు కలిగి, నిరంతరము తగవులాడుచు, కాలము మారుకొలది నూతన రాజకీయ కక్షలు బయలుదేరదీయు చున్నారు. తమ చంచల అభిప్రాయములకు తోడ్పడుటకై దేశమునందు పర్యటనము సల్పి బలము కూర్చుకొనుటకు ప్రయత్నించుచున్నవారే కానీ దేశ విముక్తికై యెట్టి మార్గ మవలంబించవలయునో ఆ త్రోవ త్రొక్కుట లేదు. ఆరునెలల క్రిందట శాసన సభలకుపోయి ప్రభుత్వము వారి చర్యల ఖండించి ఆదాయ వ్యయముల అంగీకరించమనియు, ద్వంద్వ ప్రభుత్వములు కూలదోసెదమనియు, ఆర్భాటములు చేసి అమాయకులగు ప్రజల నుండి సమ్మతుల సంపాదించి శాసన సభా మందిరములకు జేరిరి. నాటినుండి నేటివరకు ప్రజలకు కలుగుచున్న కష్ట నిష్టురములు విచారించినవారు గానరారు. శాసన సభల యొక్క మొదటి సమావేశపు గడవు తీరినది. ఏవో కొన్ని తీర్మానములపై తీవ్రమగు ఉపన్యాసముల గావించిరి. సంగీతముచే చింతకాయలు రాలవన్నట్లు వీరి ఉపన్యాసముల వలన ప్రభుత్వము లొంగునా?
శాసన సభలనుండి విశ్రాంతి కలిగిన పిదప జాతీయ మహా సభాధ్యక్షులగు శ్రీమాన్ శ్రీనివాస అయ్యంగారు దేశమునందు పర్యటనము సలిపి తమ శాసన సభల ద్వారా స్వరాజ్యము పొందజాలమనియు, తాము ముందు దేశము పాలించుటకై అనుభవము సంపాదించుటకై వానలో చేరితిమనియు నుడివిరి.
ఇపుడు సర్వ రాజకీయ పక్షముల వారును కలసి నొక నివేదిక తయారు చేసి ప్రభుత్వమున కర్పించవలయునని ప్రచారము గావించుచున్నారు. లోగడ బీసెంటమ్మగారు తయారుచేసిన ఇండియా కామనువెల్తు బిల్లునకే దుర్గతి పట్టినదో విదితమే కదా! అయ్యంగారి నివేదిక వలన కలుగు లాభమేమి? ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘాధ్యక్షులు సహకారమునకు దిగుచున్నారు. ఈరీతి నాయకులందరును పెడమార్గమునకు దిగుచున్నా రనిన తప్పుకాదు. మన నాయకుల స్థితి యీ రీతి యుండ ప్రజలు మాత్రము వారి అభిప్రాయానుసారము మెలగక పూర్వము అసహాయోద్యమమునందే నిలచియున్నారు. ప్రభుత్వము వారు వంగరాష్ట్ర రాజకీయ నిర్బంధితుల విడుదల గావింపలేదని నాగ్పూరునందు అవరేగారి నాయకత్వమున ఆయుధ శాసన ఉల్లంఘనము జరుగుచున్నది. ప్రతినిత్యము స్త్రీలు పురుషులు ఆయుధపాణులై సివిలు లై నునందును ఊరేగుచున్నారు. పోలీసువారు మొదటి దినములలో కొందరిని అరెస్టు చేసిరి. కాని యిపుడు మౌనము వహించియున్నారు.
ఇదియే రీతి బొంబాయి రాష్ట్రమందలి ఆలీబాగు నందు పన్నులు ప్రభుత్వమున కొసగగూడదని తీర్మానించుకొని సత్యాగ్రహమునకు పూనుకొనిరి. గత సంవ్సతర మిచట రిసెటెలుమెంటు జరిగియుండెను. ఇందువలన పన్నులు హెచ్చింపబడెను. ఎన్నిసార్లు రైతులు మొరపెట్టుకొనినను అధికారులు గమనించలేదు. అందుచే వీరు సత్యాగ్రహమునకు పూనుకొనిరి. నాయకులెవ్వరో తెలియుట లేదు. కాంగ్రెసు అధ్యక్షులు అలీబాగునకు వెళ్ళి అచట స్థిరచిత్తులయి యుండవలయునని ప్రజలకు హితవు గరపిరి.
ఇంతియేగాక దేశమునందు మతావేశపూరితలగు నాయకులు కొందరు గలరు. వీరి ఉద్రేకపూరితమగు యుపన్యాసముల వలస అపుడపుడు హిందూ మహమ్మదీయ కలహములకు కారణమగుచున్నది. ప్రభుత్వము వారింతవరకే "విభజింపుడు, పాలింపుడు" - అను సూత్రమును అనుసరించి ఉద్యోగముల యందును, వోట్లయందును, మత భేదములు గల్పించి యున్నారు, వానికితోడు మత ప్రచారము తీవ్రరూపము దాల్చుటకు సహాయపడుచున్నది. ఇట్టివారి నాయకత్వము పోయిననేగాని దేశ విముక్తి సాధ్యపడ నేరదు. కనుక ప్రజలు వీరి అభిప్రాయములకు చెవి యొగ్గకూడదు.
దేశమునందు పరిస్థితులు ఇట్లుండ మేనెల 15 వ తేదీ బొంబాయి నగరమున కాంగ్రెసు కార్యనిర్వాహక సభ గూడుచున్నది. సభవారు పరిస్థితులు సమగ్రముగ చర్చించి యేమి తీర్మానింతురో అని అందరు కుతూహలపడు చున్నారు. కనుక ఇట్టి సందిగ్ధ స్థితియందు సభవారు పెడమార్గమునకు ద్రొక్కక దేశముయొక్క దాస్య విముక్తికై చక్కని మార్గము నిరూపించెదరు గాక.
ఆరవ నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ
25-5-1927
ఈ మహాసభ హైదరాబాదు నగరమునందు అమర్దాదు నెల యొక్క మొదటి వారమున జరుగునను వార్త ఇందుకు ముందే ప్రకటింపబడియుండుట పత్రికా పాఠకులకు విదితమైయున్నది. విఖ్యాత వంగ విదుషీమణియగు శ్రీమతి సరళాదేవిగారిందుకు అధ్యక్షురాలుగ నుండ నంగీకరించుట ఎంతయు ప్రోత్సాహకరముగ నున్నదనియు సభకొరకు నిర్ణయింపబడిన 6, 7 అమర్దాదులు బక్రీదు సెలవులగుటవలన స్థానికులకును, ముఖ్యముగా జిల్లాల వారికిని ఎంతయు అనుకూలముగా నున్నదనుట నిస్సంశయము. ఆహ్వాన సంఘ కార్యదర్శిగారు చేసిన ప్రకటనమునుబట్టి చూడగా, పర స్థలముల నుండి వచ్చు వారికి వలయు నేర్పాటులను క్రమముగా జరుగును కనుక ఈ సమావేశమునందు నిజాం రాష్ట్ర వాసులందరును కడునుత్సాహముతో పాల్గొనుట అత్యవసరమనియు సూచించు చున్నాము.
హైదరాబాదునందు జరుగుచున్న యుద్యమములన్నిటి యందును మన మహారాష్ట్ర సోదరులు అగ్రగాములై పనిచేయుచున్నారు. రాజ్యాంగ సాంఘిక, నైతిక, విద్యాది ప్రతి విషయమునందును వారే స్థాపకులు; వారే పోషకులు; వారే నిరుపమానముగ సేవచేయువారు: వారే ఎక్కువ ధనము వ్యయమొనర్చి దేశీయులందు ప్రబోధము కలిగించుచున్నవారు. గడచిన 25 సంవత్సరముల కాలములో ఈ నగరమున ప్రజాహిత జీవనమును నెలగొల్పి, దానిని ఇంతవరకు పోషించిన గౌరవము మహారాష్ట్ర సోదరులకు ముఖ్యముగా నాయక రత్నములగు న్యాయమూర్తి పండిత కేశవరావు, ధర్మవీర వామననాయకుగార్లకు చెందవలసియున్నది. వీరే సంఘ సంస్కారోద్యమమునకును గారకులు, పోషకులునై ఆరవ మహాసభవరకు సదుద్యమమును గొనివచ్చి దేశీయుల కృతజ్ఞతకు బాత్రులైయున్నారు. దురదృష్ట వశమున నిజాం రాష్ట్రంలోని యాంధ్రులలో ప్రజాహిత జీవనాసక్తి తగిన విధముగ పెంపొందుటలేదు. ఇందునకు గడచిన (5) సంఘ సంస్కార మహాసభలే తార్కాణములు. మొదట మూడు సభలును నాందేడు జిల్లాలో జరిగెను; కనుక తెలుగువారికి వాని గూర్చిన సంగతులే తెలియవని మా యూహ. నాల్గవ సభ హైదరాబాదునందు 1331 ఫసలీలో ఆచార్య కర్వేగారి అధ్యక్షత క్రింద జరిగెను. ఆ సభలో ఆంధ్ర యౌవనులు కొందరు పాల్గొనుటయు, మహాసభలో నుపన్యసించుటయు మే మెరుగుదుము. ఆ సభలో నాంధ్రుల కెట్టి ప్రాముఖ్యము లేకపోవుటచేతనే కొందరందునకు చింతిల్లి ఆంధ్రులలో ప్రబోధము లేకపోవుటయే అందునకు గారణముగ దలచి యట్టి లోపమును క్రమముగ దొలగించుకొన గృతనిశ్చయులై సభ యొక్క మూడవ నాటి రాత్రి (8 దై 1331 ఫ.) ఎనిమిది గంటలకు కీ. శే. టేకుమాల రంగారావు హైకోర్టు వకీలుగారి యింట సభచేసి హైదరాబాదు నగరమునందు మొట్ట మొదట ఆంధ్ర జన సంఘమును స్థాపించి, తరువాత ఆంధ్రోద్యమమును ఆంధ్ర జిల్లాలందు ప్రాకించిన యంశము మాకు బాగుగా జ్ఞప్తియందున్నది.
తరువాత గుల్బర్గాలో జరిగిన మహాసభ యందును పలు ఆంధ్ర జిల్లాల నుండి యౌవనులు వెళ్ళిన మాట నిజమే కానీ దానియందైనను వారి సంఖ్య దేశమునందున్న ఆంధ్రుల జన సంఖ్యనుబట్టి చూచినచో తృప్తికరముగా నుండ లేదు. వచ్చిన వారైనను మాధ్యమిక స్థితియందుండిన యువకులు. గొప్ప ద్రవ్యస్థితి గలవారుగాని వయో వృద్ధులుగాని అందు కాన్పింపలేదు. విషయ నిర్ణాయక సంఘమునందును వారి సంఖ్య చాల లోపించియుండెను. సభలో నుపన్యసించినవారు కూడ కొలది మందియే. వేయేల? ఈ తుది రెండు సభలును మహారాష్ట్ర సంఘ సంస్కార మహాసభలనదగియుండినవి కాని నిజాం రాష్ట్ర సంఘ సంస్కార సభలన్పించుకొనుటకు అర్హములుగా నుండలేదు. అందునకు గారణము మహారాష్ట్ర సోదరుల పక్షపాత బుద్ధికాదు. ఆంధ్రుల యుపేక్షాభావమే యని నొక్కి వక్కాణింపగలము.
రాబోవు మహాసభలో నధ్యక్షురాలు అఖిలభారత వర్ష ప్రాముఖ్యతగల శ్రీమతి సరలాదేవి అధ్యక్షురాలి యుపన్యాసము వేయి విధముల హిందీ భాష యందే యుండగలదు. ఈ విషయమున శ్రీదేవిగారికి సూచింపబడినదనియు మాకు దెలిసినది. కనుక కార్యక్రమము ఎక్కువగా హిందీ భాష యందే జరుగ వచ్చును. మన రాష్ట్రమునందు హిందువులు నాల్గు తరగతులుగా నున్నారని చెప్పవచ్చును. 1. మహారాష్ట్రులు 2. ఆంధ్రులు 3. కర్ణాటకులు 4. ఉత్తర హిందూస్థానము నుండి వచ్చి మన రాష్ట్రమున స్థిరనివాస మేర్పరచుకొనిన వారు. వీరందరకును హిందీభాష బాగుగనే తెలియును. ప్రజా సామాన్యమున కుపయోగపడునట్లు ముఖ్య తీర్మానముల పైన మహారాష్ట్రము, తెనుగు, కన్నడమున గూడ నుపన్యాసములు జరిగినచో అందరకును ఉత్సాహప్రదముగ నుండగలదు. కనుక దేశీయులందరును ఈ మహాసభ యందు ప్రతినిధులుగా బహుళ సంఖ్యలో జేరి జయప్రదముగా జేయుట ధర్మము.
హైద్రాబాదునందును జిల్లాలందును ఎన్నియో కాలేజీలును, ఉన్నత పాఠశాలలును కలవు. వానిలోని యాంధ్ర విద్యార్థులీ మహాసభ యందు చేరి తోడ్పడవలయును. ఆంధ్ర న్యాయవాదులు పూర్వమువలె నిది ఎవరి యింటిలోని పెండ్లియోయని తలంపక, మన సంఘమునకు దేనిని ముఖ్యమైనదిగా భావించి ఈ మహాసభ యెడ అభిమానము వహించవలయును. ఉద్యోగస్థులగువారును, చిక్కులు లేని ఈ సాంఘికోద్యమమున శ్రద్దగైకొని ముందంజ వేయుట యుచితము. పలుమాటలేల? నిజాం రాష్ట్ర ఆంధ్రులందరును ప్రతినిధులుగనో ప్రేక్షకులుగానో ఆహ్వాన సంఘ సభాసదులు గనో దీనియందు జేరి తమ యుత్సాహమును వ్యక్తపరుపవలయును. ఈ మహాసభ జయప్రదముగ సాగునుగాక.
పిక్టోరియల్ హైదరాబాదు
పై పేరనొక చిత్రపటమును కట్టించు నుద్దేశముతో ఆంధ్ర యౌవనులును, విఖ్యాత సేవా పరాయణులును అగు శ్రీయుత కృష్ణస్వామి ముదిరాజాగారు తమ చంద్రకాంత ముద్రాలయము పక్షమున వెలువరించిన ఇంగ్లీషు భాష యందలి నివేదనమును అందికొంటిమి. ఇది నిజముగ గొప్ప కార్యము. దీని యందు పటములు (500) లకు తక్కువ కాకుండ నుండును. ప్రతి పటమును గూర్చియు సంగ్రహాంశములు చేర్పబడగలవు. ఈ పటములు నాలుగు భాగము లుగ విభజింపబడి యుండును. 1. రాజ్యములోని గొప్పవారు 2, చారిత్రక మందిరములు, ప్రదేశములు 3. పారిశ్రామికములు. 4. ఇతరములు. డబల్ డెమ్మీ సైజున ("8" + 11 ") సంపుటము ప్రకటితమగునని నివేదికయందు కలదు. ఉద్యోగ ప్రియులగు పై ముద్రాలయము వారు, దేశీయులను రాజ పోషకులుగను (రూ. 500/-లు), పోషకులుగను (రూ.250/-), ఆభిమానులుగను (రూ. 100/-) వుండుటకు అంగీకరించి ఈ యుద్యమమున తోడ్పడ వేడుచున్నారు. ఆంధ్ర యౌవనుని ఈ యుత్సాహము ప్రశంసార్హము. దేశీయుల సహాయమునకు వీరు పాత్రులై యున్నారని సూచించుచు మా మిత్రులగు శ్రీకృష్ణస్వామి గారినీ మహోద్దేశమునకుగాను అభినందించుచున్నాము.
హిందూ సంఘ సంస్కార మహా సభ
15-6-1927
హైద్రాబాదులో మొన్న జరిగిన ఆరవ హిందూ సంఘ సంస్కార సభా చర్యలు పేరుచో ముద్రింపబడి యున్నవి. ఈ మహా సభ అత్యుత్తమముగా, జయప్రదముగా జరుపబడెననుటలో సందేహము లేదు. సభా భవనము నగర వాసుల చేతను, జిల్లాల నుండి వచ్చిన వారిచేతను పూర్తిగా నిండియుండుట ప్రజలందు కలుగుచున్న మార్పును సూచించుచున్నది. మరియు సభా తీర్మానములను శ్రద్ధతో విని వాని నామోదించుటలో మన రాష్ట్రపు జనుల సత్వరాభివృద్ధిని సూచించుచున్నది.
ఆహ్వాన సంఘాధ్యక్షుల యొక్కయు యధ్యక్షురాలు యొక్కయు, నుపన్యాసములు చాల బోధ ప్రదములైనవి. ఆహ్వాన సంఘ అధ్యక్షులయిన శ్రీయుత రామచంద్ర నాయకుగారు హైద్రాబాదులోని పరిస్థితులను, తామెట్లు రాజకీయ సభలను చేయజాలరో, తమకెట్లు విద్యా మతాది విధానములందు విశేషాధికారములు కావలయునో సూచించిన విషయములన్నియు ముఖ్యముగా గమనింపదగినవి. అధ్యక్షురాలగు సరళాదేవి చౌధరాణిగారి యుపన్యాసము గంభీర భావ గర్భితమైనది. ప్రతి వాక్యమును దీర్ఘాలోచనకు తావిచ్చునది. బ్రాహ్మణుల ధర్మమును వారు చూపి చెప్పిన విషయములు వారు స్వయముగా బ్రాహ్మణి యగుట చేతను, సత్యాధారములగుట చేతను నిరసింపబడక ప్రశంసింపబడెను. "బ్రాహ్మణత్వమునకు మారుగా నెప్పుడు బ్రాహ్మణుడే సంఘ నాయకుడయ్యెనో అప్పుడే పతన మారంభమయ్యెను”. ఇత్యాది వాక్యములు ఎంత తీక్ష్ణముగా నున్నను వానిలోని గంభీర భావమును గ్రహించుట అవసరము.
ఈ సంఘ సంస్కార మహా సభా తీర్మానములు అనేకములు హిందూస్థానమందన్ని ప్రాంతములందును జరుగునన్ని సంస్కార సభలలో ప్రవేశపెట్టబడి సాధారణముగా నామోదింపబడునట్టివి. స్త్రీ విద్యా వ్యాపకత్వమును గురించినట్టియు, సర్వ జనైక్యతను గురించినట్టియు, అస్పృశ్యతా మద్యపాన బాల్య వివాహ శుల్కాది దోష నివారణ విషయికముల గురించినట్టియు, మున్నగు తీర్మానములు సర్వసాధారణములైనవే. ఒకటి రెండు తీర్మానములు విశేషముగా చర్చింపబడెను. అందు విధవా వివాహమొకటి. దీని విషయమై విశేష కాలము వాదోపవాదములు జరిగెను. తుదకు బహుజనాంగీకారముగా వితంతూద్వాహము అందు ముఖ్యముగా బాల వితంతూ వివాహములు అంగీకరింపబడెను.
హైదరాబాదు రాష్ట్రమునకు సంబంధించిన తీర్మానములు సభవారు చేయుట చాల యుక్తముగా నున్నవి. ఖాన్గీ పాఠశాలల శాసనమును బహిరంగ సభల నిరోధించు శాసనమును, రద్దు చేయవలయునని యీ సభ కోరెను. "గ్రంథాలయ వార్షికోత్సవములను ఆపివేసినందులకీ సభవారు తీవ్రముగా ఆక్షేపించుచున్నారు." -ఈ తీర్మానము సూర్యాపేట సభల విషయమైనది. గ్రంథాలయ ఉద్యమమును రాజకీయమునకే సంబంధమును లేనిది. బరోడా వంటి సంస్థానమీ యుద్యమమునకు చేయుచున్న సహాయము బ్రిటిషిండియా యందును కానరాదు. ఇట్టి వానిని నిరోధించుట జ్ఞానమును నిరోధించుటయై యున్నది. ఈ నిరోధములు ముందు వుండకూడదని సభ కోరుట చాల సమంజసము.
భైక్షుక వృత్తిని నిరోధించు శాసనమును గురించి మా పత్రికలో నిదివరకే మా యభిప్రాయము నిచ్చియుంటిమి. ఇది చాలా యవసరమైనది. దేశమందీ మూలమున ప్రబలిన సోమరితనమును ఫలవంతమగు మార్గములందు ప్రసరింపజేయుట దేశ దారిద్ర్యమును పోగొట్టుట యగును.
మొత్తము పైన తీర్మానము లన్నియు దీర్ఘ సమాలోచనా ఫలితములని చెప్పునొప్పు. సభా కార్యక్రమములు చక్కగా జరిగెను. కానీ వానిని ఆచరణ యందుంచుట యొక్కటి మిగిలిన పని. ఇచ్చట మన లోపము విశేషము. వేయి సులభముగా చెప్పవచ్చును గాని యొక్కటి సక్రమముగా దీక్షతతో నాచరించుట కష్టము. మనలో కార్య దీక్షతకు మనము ప్రాముఖ్యత నొసగు వరకు మనకు గౌరవము కలుగదు. ఈ సభ వారు దేవీ చౌధురాణి గారి యధ్యక్షతతో జరుపుటచే ఈ రాష్ట్రవాసులలో గొప్ప సంచలనము కలిగించిన వారైరి. సభా కార్యక్రమము విశేష భాగము ఉర్దూలో జరిగెను. కానీ కొందరు మహారాష్ట్రమందు మాట్లాడుటచే మహారాష్ట్రేతరులకు ఉత్సాహభంగమయ్యెను. సభయందు హిందూస్థానీలో నుపన్యాసములు జరుగవలెనని కొందరి యాందోళనము కూడ జరిగెను. ఇట్లు ప్రత్యేక భాషా పక్షపాతము సభవారు చూపకుండిన చాలమేలుగా నుండెడిది. ఈ సభకు పూర్వము కొన్ని సంవత్సరములు ఈ సభలు జరిగియుండలేదు. ఇక ముందిట్టి లోపము లేకుండునట్లుగా సక్రమముగా సభలు జరుగునని నమ్ముచున్నాము. ఇంతియ కాక యీ సభయందు మహారాష్ట్రుల తీసికొనినంత ఆంధ్రులు తీసికొనకపోవుట శోచనీయము. ముందు సభలందైనను ఆంధ్రులు ఉత్సాహముతో విశేష సంఖ్యాకులుగా చేరి శ్రద్ధ వహింతురని నమ్ముచున్నాము.
వరంగల్లు కళాశాల
30-7-1927
ఓరుగల్లు మున్నొకప్పుడు ఆంధ్ర దేశమునకు రాజధానిగ నుండెనని సర్వజనులకు తెలిసేయున్నది. కాల ప్రవాహమున ఎన్నియో మార్పులు జరుగుచున్నవి. భారతదేశ మంతటను కీర్తి బడిసిన కాకతి సామ్రాజ్య మస్తమించెను. వాటిగోలె నీ పట్టణము అంధకార బంధురమై యుండెను. దయామయులగు మన ప్రభుత్వమువారు వరంగల్లును ఆ ప్రాంతమునకు ప్రధాన స్థలముగ నేర్పరచి పూర్వ గౌరవమును నిలిపిరి. గత మూడు సంవత్సరముల క్రితము తెలంగాణమునకు ముఖ్య పట్టణమయ్యెను. ప్రాంతాధికారి నియమింపబడెను. కానీ కళాశాల లేని లోపముండెను. ఆంధ్రులు హైద్రాబాదుకు వచ్చియే ఉన్నతవిద్య పొందుచుండిరి. గత రెండు సంవత్సరముల క్రింద మహారాష్ట్ర ప్రాంతమున రెండు కళాశాలలు స్థాపింపబడగ ఆంధ్రుల కన్నులు దెరచిరి. ఓరుగల్లు నందొక కళాశాల స్థాపించుటకు ప్రయత్నించిరి. తత్ఫలితముగ నిపుడు కళాశాల యేర్పాటు గావింపబడినందులకు పౌరుల కృషియును, ప్రభుత్వము వారి ఆదరణయును, ప్రశంసనీయము. ఈ కళాశాల ఆంధ్రులు పౌర్వస్వత్యము బడయుటకు మార్గదర్శక మగుగాక . అయినను ఒక సంగతి వినుచున్నాము. ఇందు ఆంధ్రము సంస్కృతమునకు తావు ఒసంగబడలేదట. ఆంధ్ర భాషకు ముఖ్యస్థానమగు ఓరుగల్లునందే ఆంధ్రమునకు ప్రాముఖ్యము లేనిచో ఇంతకన్న వేరు దౌర్భాగ్యము వుండనేరదు. ఇది నిజమే అయినచో ఇట్టి లోపము ప్రభుత్వమువారు వెంటనే తీర్చెదరని నమ్ముచున్నాము.
ఇంగ్లాండునకు పోవు విద్యార్థులు
27-8-1927
ఈ వారమున మన రాష్ట్ర వాసులగు పలువురు విద్యార్థులు వివిధ విద్యలు నభ్యసించుటకై ఇంగ్లాండునకు పోవుచున్నారు. వారిలో ముఖ్యులు రాజా శ్రీనివాసరావు కార్వాన్కరు బి. ఎ., దామోదర రెడ్డి బి. ఎ., వేనేపల్లి లక్ష్మారావు బి. ఏ., రాంరావు కోరట్కరు, కిషన్‌రావు ఆత్రే బి. ఎ., డాక్టరు బోర్గాంకరు గార్లును మరికొందరు మహమ్మదీయ యువకులునై యున్నారు.
పై వారిలో మొదటివారు ఇచ్చటి విఖ్యాతులగు జాగీరుదార్లు. పూర్వము అవ్వలు తాలూక్దారు పనిచేసిన రాజా శ్రీనివాసరావు గారి మనుమలు. రెండవ వారు పోలీసు మొహతెమిం పదవి యందున్న శ్రీయుత కొండారెడ్డిగారి పుత్రులు. మూడవవారు నల్లగొండ జిల్లాలోని కొప్పోలు దేశముఖులును, నిజాం రాష్ట్ర వెలమ జన సంఘ కార్యదర్శులును అగు శ్రీయుత వేనేపల్లి నరసింహారావు గారి సోదరులు. నాల్గవవారు పండిత కేశవరావు గారి పుత్రులు. వీరు ఇదివరకే సీమకు వెడలిపోయినారు. అయిదవ వారు శ్రీయుత హనుమంతరావు ఆత్రే బి.ఎ. గారి కుమారులు. ఆరవవారు గోపాలరావు వకీలు గారి పుత్రులు.
ఈ వారమునందు పైన పేర్కొన్న యౌవనుల గౌరవార్థమై యనేక విందులు, టీ పార్టీలు జరిగినవి. కాశీనాధరావు వైద్య, రామచంద్ర నాయకు బారిష్టరు గార్ల భవనము నందును, కర్ణాటక యువజనుల పక్షమునను, కర్ణాటక పక్షమునను, ఆంధ్ర కుటీరము నందును, వివేక వర్ధనీయందును, రెడ్డి హాస్టలు నందును, ఇంకను పలు తావులందును ఇట్టివి కొన్ని బాహుళ్యముగను, కొన్ని ప్రత్యేకముగను జరుపబడినవి.
ఈ విద్యార్థులలో యెవరెవరే విద్య నభ్యసించుటకై పోవుచున్నారో వివరములు తెలియలేదు. అయినను భ్యారిష్టరీకిని, వైద్యమునకును అర్థ శాస్త్రము కొరకును అనుచున్నారు. న్యాయవాద వృత్తియందు ఉన్నత విద్య నభ్యసించ వలయునన్న మన దేశమునందే తగిన సంస్థలున్నవి. అదియును గాక సీమకు వెడలి యీ విద్యను చదివి వచ్చిన వారెందరో ఇపుడు కలరు. ఇపుడు దేశమునకు వారి అవసరము లేదనియే చెప్పవచ్చును. వైద్యమునందు ఎం.బి.సి.ఎం. ఉన్నత పరీక్షకు కూడ హిందూ స్థానమునందు శిక్షణ నొసంగబడుచున్నది. అట్టి యున్నత వైద్య పరీక్షలలో కడతేరి కొన్నాళ్ళు అనుభవము సంపాదించి ప్రత్యేక విషయమును గూర్చి ఇంకను తెలిసికొనవలయునన్న సీమకు వెడలుట యుపయోగ కరమే.
ప్రస్తుతము భారతీయులు పరిశ్రమల యందును, ఇంజనీరింగు, సైన్సు యందును ప్రవీణులు గావలసియున్నది. దేశసంపద అభివృద్ధి పరచుటకీ విద్యలే మూలాధారములు. అన్ని దేశముల వారి కన్న మనము పరిశ్రమల యందు వెనుకబడి యున్నాము. విదేశీయులు చిన్న చిన్న వస్తువుల సిద్ధపరచి కోట్లకొలది ధనమార్జించుచుండ మనము యుద్యోగములకొరకు పెనుగులాడుచున్నాము. వారిచే తయారు చేయబడిన వస్తువుల జీవితావసరములుగా జేసికొని వారికి దాసులమై జీవితముల గడుపుచున్నాము. మన దేశమునందు మిక్కుటముగ పండుచున్నట్టి ముడి పదార్థముల విదేశములకు చౌకధరలకు ఎగుమతిచేసి వాని వలననే తయారు కాబడిన వానికి హెచ్చు వెలల నొసంగి గైకొను చున్నాము. పరిశ్రమలయందు మనము నిపుణులమై యున్న ఇట్టి ముడి వస్తువుల నుండి యెన్నియో అవసర పదార్థములు సిద్ధపరచి లాభము పొందవచ్చును గదా! వారి దేశములకు పోయి మనము నేర్వదగినది ముఖ్యముగా యీ విద్యలే. ప్రస్తుతము దేశమునకు కావలసినవి ఇవియే. ఆర్థిక స్వాతంత్ర్యమున కివియే, మూలాధారములు. కాన సీమకు వెళ్ళు విద్యార్థులు పూర్వాభిప్రాయములు విడచి తమకును, దేశమునకును లాభకరమగు విద్యల నార్జించుట శ్రేయస్కరము లేనిచో వీరు వెచ్చించు వేల కొలది ధనము వృధా యనదగును. స్వదేశమునందే యుండుట మేలు కనుక పై విద్యార్థులందరును ఆలోచించెదరు గాక.
యౌవనులగు వీరందరకును ఈశ్వరుడు ఆరోగ్యమును ప్రసాదించి వీరి ఉత్తమోద్దేశములను నెరవేర్చి పిమ్మట సులభముగ స్వస్థలముల జేర్చుగాక యని ప్రార్థించుచున్నాము.వీరు తమ దేశమునకవసరమగు పాశ్చాత్య విద్యల నభ్యసించి దేశమును, దేశీయులను, దేశ సంప్రదాయములను సదా దృష్టియందు వుంచుకొని, దేశసేవకై ద్విగుణీకృతోత్సాహముతో కృతార్థులై మరలివత్తురని నమ్ముచున్నాను.
ఐకమత్య సందేశము
3-9-1927
భారతదేశము నందు సంఘ ద్వేషము దిన దినము ప్రబలుచున్నది. ఎటుచూచినను హిందూ మహమ్మదీయ తగవులు గాన్పించుచున్నవి. స్వల్ప కలహములే మత యుద్ధములుగా మారుచున్నవి. ఇంతవరకు ఎన్ని సభలు జరిగినను, ఎన్ని సంధి పత్రములు వ్రాసికొనినను ఫలితము అన్యధా పరిణమించినది. భారతదేశమిట్లు అధోగతి పాలగుచుండ ఏ శాంతిప్రియుడు విలపింపకుండును? దేశమునందు అల్లరులు జరుగుచుండిన యే సంఘము వారికై నను లాభము కల్గునా?
ఈ విషమ పరిస్థితులు వీక్షించుటచే రాజ ప్రతినిధులగు ఇర్విను ప్రభువుగారి హృదయము కరిగినది. వారు అన్ని పక్షముల వారి యందు ఐకమత్య మవసరమని తలంచిరి. వీరి ప్రసంగము ఫలితముగ సిమ్లా చల్లని ప్రదేశమున సర్వ రాజకీయ పక్ష నాయకులు సమావేశమై ఈ విషయమై ఆలోచించి దేశీయులకు విన్నపము ప్రకటించిరి. అందరు ఐకమత్యముతో నుండవలయునని ప్రబోధించిరి; లేనిచో జాతీయ వికాసము కలుగనేరదని విలపించిరి. నాయకులందరును తమ భేదములు విడనాడుకొనుటకు సమ్మతించిరి. అయినను ఇట్టి విన్నపముల వలన పరిస్థితులు చక్కబడునా? "ఐకమత్యము, ఐకమత్యము" అని ఒక వంక చల్లని ప్రదేశము నందుండి నాయకులు యుద్ఘోషించుచుండ వేరొక వంక కాన్పూరు నందు పరస్పర కలహము జరుగుచునే యున్నది కదా?
దేశము నందు శాంతి సమకూరుటకు దేశీయుల భావములు మార్పు గాంచవలయును. నాయకులు ప్రజలకు ఆదర్శప్రాయులు గనుక వారు మున్ముందు తమలోగల భేదాభిప్రాయములు విడనాడుకొని ఏక కంఠముతో జన సామాన్యమునందు ప్రచారము గావించవలయును. అందరు నొకే మార్గమునకు దారి చూప వలయును. ద్వేష భావములు ప్రజ్వరిల్లజేయుచున్న సంఘములను, వ్యక్తులను బహిష్కరించ వలయును. అపుడే మైత్రి సమకూరును గాని వట్టి విన్నపముల వలనగాదు. ఒకరి మతమును ప్రవక్తలను ఒకరు గౌరవించవలయును. ఈ సందర్భమున మౌల్వీ లియాకత్ హుసేన్ సా॥ ప్రకటించిన విజ్ఞప్తి యెల్లరు గమనింపదగినది. గోవధ విషయమై ముసల్మానులు పోరాడనవసరము లేదనియు, బక్రీదు సందర్భమున గోవులను వధించుటకు బదులు, వానిని కొనుటకై వెచ్చించు ధనము ధర్మ కార్యములకై వినియోగించవలెననియు, వారు సూచించుచున్నారు. ఇదే విధముగ మసీదుల యెదుట వాద్యము లాపుటకు ఖురాను విధించుటలేదని వీరి తలంపు. హిందువులు గూడ ఇతరులను తమ మతమునందు చేర్చుకొనిన ఆక్షేపింపకూడదని వీరి అభిప్రాయము. హుసేన్ గారు తమ సోదరులను పై విషయముల గూర్చి అంగీకరింపజేసి దేశమునందు ఐకమత్యము స్థిరముగ నాటుకొనునట్లు జేయుదురుగాక. ఇరు సంఘముల వారును హృదయ పరివర్తనము గావించుకొనిన భేదము లన్నియు సమసిపోగలవు. హిందూ మహమ్మదీయ మైత్రి సాధ్యమైనదే. దీనికి నాయకుల కలయికయే ముఖ్యావసరమై యున్నది. భారతదేశము నందు త్వరలో సంఘ ద్వేషము సమసిపోవు గాక.
నన్నయ భట్టారక వర్ధంతి
21-9-1927
శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభాషా నిలయమువారు గత శనివారము నాడు నన్నయ భట్టారక వర్ధంతి జరిపి యుండిరి. ఆ సభా వృత్తాంతమును స్థలాంతరమున ముద్రించి యున్నారము ఇట్లు కవుల వర్థంతులను జరపునట్టిది ఈ నిలయమొక్కటియే సకలాంధ్ర భూభాగమున గనపడుచున్నది. భాషాభివృద్ధికై ఏర్పడిన గ్రంధాలయములిట్టి మంచి పద్దతి నేల యనుకరింపగూడదో మాకు దోచకున్నది. హైదరాబాదులోని గ్రంథాలయములవారైనను తాము ప్రత్యేక సభలను సమావేశపరచుటకు అనుకూలము లేనిచో, నిలయమువారిలో జేరి సభ కెక్కుడు ప్రాతినిధ్యమిచ్చి, మిగుల యాకర్షణీయముగ నొనర్పకుండుటకు గారణము దురూహ్యము. నిర్వివాదమయిన ఇట్టి భాషావిషయ కోపన్యాసము లందు మనము ఏకముఖముగా ప్రవర్తించిననేగాని, జనులయందు భాషాభిమాన బీజములు నాటుటకు అవకాశము కలుగజాలదు. ఆయా గ్రంధాలయాధికారులు ఈ విషయమును గూర్చి యాలోచించెదరుగాక !
ఇక సభావృత్తాంతమును గమనించినచో అది మిగుల నిరుత్సాహకరముగ నున్నదని తెలుపుటకు చింతించుచున్నాము ఒక బాలేందు శేఖరముగారు చెప్పిన నాలుగు మాటలుతప్ప శ్రీ సోమయాజులుగారేమి, అధ్యక్షులగు ప్రభాకరరావుగారేమి, నన్నయభట్టు భారత రచనా విశేషములనుగూర్చి సుంతైనను ముచ్చటించ లేదు భారతము నెవ్వరు వరించుటలేదేయని వాపోయినంత మాత్రమున లాభము లేదు. నన్నయభట్టు రచనయందలి మేలిగొనముల నెత్తి చూపి, శ్రోతలను ఆకర్షించి వారికా గ్రంధము జదువు సబిలాష పుట్టినట్లుగా ఉద్బోధించవలయును అధ్యక్షులవా రయినను “ఎవ్వతె వీవు... అటజనించె..." అను మనుచరిత్ర పద్యముల నుద్ఘాటించిరేగాని నన్నయ పద్యరత్నములను ఉదాహరించి యుండలేదు ఆయా సమావేశ విషయములను బురస్కరించుకొని, ఆయా కవుల గ్రంధములను సారస్వత దృష్టితో విమర్శించిననేగాని సామాన్య జనులయందు భాషాభిమాన బీజములు నాటుటకును, ఆంధ్రభాష యౌన్నత్యమును జాటుటకును అవకాశముండదని మా యభిప్రాయము లేనిచో ఇట్టి సభలు సోమయాజులగారు సెలవిచ్చినట్లు ఈ కాలపు సాంవత్సరిక సంధ్యావందనములగును కార్యనిర్వాహకులు ఈ విషయములను గమనించెదరుగాక!
భారతాది గ్రంధములు ఈ కాలమువారు పఠించుటలేదని అధ్యక్షులవారు సెలవిచ్చిరి. కానీ ఈ విషయమున మేము అధ్యక్షులతో నేకీభవించజాలము పూర్వ కవులకును, గ్రంధములకును ఈ కాలమునందే ఎక్కువ ప్రచారము గలదని మా యభిప్రాయము ఇట్టి వర్థంతులు జరుపుకుండుటయు, గ్రంథాలయములు స్థాపించి యందు పూర్వకవుల గ్రంధములకు అర్హస్థానము ఒసంగు చుండుటయు, వేదికలపై భాషావిషయక ఉపన్యాసములు జరుపుచుండుటయు ప్రజలదృష్టి యెట్లు ప్రసరించుచున్నదో తెలియగలదు. అంతియెగాక, పాఠశాలలందును, కళాశాలలందును, విద్వాన్ మొదలగు పరీక్షలకును, పూర్వగ్రంధములు పఠనీయములై యుండుట క్రొత్త విషయముగాదు.మరియు ఆంధ్ర భారతీతీర్థ మొదలగు ప్రజా సంస్థలును ఈ విషయమున చక్కని కృషి సలుపు చున్నవి ఏ మాస పత్రికను, ఏ వార్తాపత్రికను తిలకించినను పూర్వగ్రంధములను స్తనశ ల్యపరీక్షచూసి చర్చించు వ్యాసములు పెక్కు గనిపింప గలవు రాజులును, భాగ్యవంతులును తమ ద్రవ్యమును కవుల పోషణమునకును, భాషాభివృద్ధికిని సద్విని యోగము చేయుచుండుటకు ఉదహరణములు లేకపోలేదు. ఈ యంశము యధ్యక్షులకు అనుభవైక వేద్యము ఇవన్నియు శుభసూచకములు. పూర్వకవుల ప్రతిభ దినదినము హెచ్చి దివ్యతేజస్సుతో వెలుగుచున్నది. అయినను సజీవమయిన భాష మార్పులు చెందుచుండుట ప్రకృతిసిద్ధము అందుచే మనము నిరుత్సాహము చెందనవసరములేదు పూర్వ కవుల ప్రతిభను ఊతగా గైకొని, నవీనోత్సాహముతో ప్రత్యాంధ్రుడూ ఆంధ్ర భాషాభివృద్ధికై ముందుకు నడుచుచుండునుగాక!
మన రాష్ట్రాభివృద్ధి
8-10-1927
ఆర్థికశాఖా మంత్రులగు నవాబు హైదరునవాజుజంగ్ బహాదురు ప్రకటించిన 1337 ఫసలీ ఆదాయవ్యయ పట్టిక చాలా యుత్సాహకరముగ నున్నది ఈ సంవత్సరము క్షామ నివారణము, అభివృద్ధి శాఖ, మొదలగు నిధులకు నిలువ యందు మొత్తము పోగ 44 లక్షలు నిలువ యుండునని అంచనా వేయబడినది. మన రాష్ట్రము యొక్క ఆర్థిక పరిస్థితులు చక్కబరచి తగిన మొత్తము వ్యయ పరచుచు నిలువ చూపుచున్న మన ఆర్థిక శాఖ మంత్రులెంతయు ప్రశంసనీయులు
రిజర్వు నందు మొత్తము 15 కోట్లన్నర సంవత్సరాంతమున నుండునట్లు అంచనా వేయబడినది ఈ మొత్తము నుండి సగము 1934 సంవత్సరమున రైల్వే కొనుటకు వెచ్చింపబడును. అపుడు రైల్వే కంపెనీ మన ప్రభుత్వము వారి స్వాధీనమునందే యుండును. ఇంతియ కాక కాజీపేట బెల్హరుషా రైల్వే పని పూర్తిజేయుటకును కొన్ని ఇతర ఇనుపదారులను వేయుటకును తగిన మొత్తము నిర్ణయింపబడినది పై రైల్వే నిర్మాణమునకును, ఇర్రిగేషనునకును, 136 లక్షలు నిర్ణయింపబడినవి ఇపుడు నిర్మాణము నందున్న ప్రాజెక్టులన్నియు పూర్తినొనరింపబడును
బడ్జెటు నందు ఆయా శాఖల కొరకు కొంత మొత్తము ప్రత్యేకింపబడును కాని శాఖాధికారులు వానిని ఉపయోగించక నిలువ యుంచెదరు దీనివలన ఆయా శాఖల యందు జరగవలసిన అభివృద్ధికి ఆటంకములు కలుగుచున్నవి ప్రభుత్వము వారిచే వ్యయపరచుటకై నిర్ణయింపబడిన మొత్తము యేల యుపయోగింపబడదో దురూహ్యము. ఈ సంవత్సరము యూరోపియను అధికారులు నియమింపబడుటచే వ్యయమునందు రెండు లక్షల హెచ్చినట్లు మంత్రిగారు సూచించుచున్నారు రాష్ట్రము నందుగల ఇట్టి ప్రోత్సాహకరమగు మార్గములను ఉపయోగపరచుకొను సమర్ధులు కావలయునని నవాబు సాహెబు వాంఛించుచున్నారు
బ్రిటిషు ఇండియాలో ధన లోపముచే ప్రజావాంఛితములు నెరవేరజాలకున్నవి మన రాష్ట్రమున ప్రతి సంవత్సరము నిలువ హెచ్చుచున్నను రాష్ట్రాభివృద్ధికరములగు యెన్నియో కార్యములు చేయబడుట లేదు. ఈ సంవత్సరము రైల్వే, ఇరిగేషను మొదలగు వాని కొరకు కొంత మొత్తము నిర్ణయింపబడిన మాట సత్యమే కాని విద్యాభివృద్ధి యందును, ఇతర ప్రజా సౌకర్యముల కొరకును యెంత వ్యయ పరచినను తక్కువయనియే చెప్పవచ్చును ఉస్మానియా విశ్వవిద్యాలయము రాష్ట్రము యొక్క విద్యాభివృద్ధికి మార్గము చూపినది. ఎందరో పట్టభద్రులు తయారగుచున్నారు. అయినను విద్యావిధానము పాశ్చాత్య పద్ధతిపై నుండుటచే విద్యాధికులలో నిరుద్యోగము వ్యాపించుచున్నది. ఈ నిరుద్యోగము సమసిపోవుటకు పరిశ్రమలు, వాణిజ్యము, వ్యవసాయము మున్నగు కళాశాలలు స్థాపించుట యుత్తమము. వీని వలన విద్యార్థులు స్వతంత్రముగ జీవయాత్ర గడపుటకు మార్గము ఏర్పడును. ఉద్యోగములకై పెనుగులాట తగ్గిపోవును.
మొవాజినా యుత్సాహకరముగ నున్నపుడు పన్నుల భారము తగ్గించుట కూడా యుత్తమము బ్రిటిష్ ఇండియాలో పోస్టల్ రేట్లు హెచ్చగా ఇచట కూడా మనీ ఆర్డరు కమీషనులు అణా నుండి రెండణాలు చేయబడినది ఈ రీతి కొన్ని కమీషనులు హెచ్చినవి ఆదాయము నందు లోటు లేనపుడు ఈ కమీషన్ రేట్లు తగ్గించిన బాగుగ నుండును. దేశీయ పరిశ్రమలు వృద్ధి నొందుటకై వాని పైన గల శుంకము గైకొనుట లేదు ఇదే విధముగ రాష్ట్రము నందు ఒక ప్రదేశము నందుండి వేరొక ప్రదేశమునకు ఎగుమతి చేయబడు దేశీయ వస్త్రములు. ఇతర సామానుల పైనను సుంకములు తగ్గించుట పరిశ్రమల అభివృద్ధికి కారణమగును.
దయామయులగు ప్రభుత్వమువారు ఇట్టి మార్పులు గావించెదరని మా ఆశయము
రై య త్
19-10-1927
పై పేరుతో నొక ఉర్దూ వార పత్రిక ఆజూరు చివర వారము నుండి ఆంధ్ర యౌవనులును, దేశసేవా తత్పరులును అగుముందుముల నరసింగరావుగారి సంపాదకత్వమున వెలువడనున్నది నిజాం రాష్ట్ర వాసుల యందు విజ్ఞానము వ్యాపింప జేయుటయు, నిజాం ప్రభువుగారి పాలనములో నున్న ప్రజా సమూహమున పరస్పర సానుభూతి కలిగించుటయు ఈ పత్రిక ముఖ్యోద్దేశము. చిరకాలము నుండి ఇట్టి ఉర్దూ పత్రిక నిజాం రాష్ట్రము నుండి వెలువడ వలయునని ఎందరో కోరుచుండిరి. తుదకు పరమేశ్వరుని కృప వలన ఆ సంకల్పము నెరవేరినది ఇట్టి కార్యమునకు యుత్సాహవంతులగు సరసింగరావు గారు పూనుకొనుట ఎంతయు ప్రశంసనీయము ఈ పత్రిక ప్రజలు ప్రభుత్వము మధ్యవర్తిగ నుండి చిరంజీవియై వర్ధిల్లుగాక యని కోరుచున్నాము ఉర్దూ భాష తెలిసిన వారందరును ఈ పత్రికాధిపతిని ప్రోత్సహించెదరని నమ్ముచున్నాము.
ఆంధ్ర మహాజన సభ
16-11-1927
ఈ మహాజన సభ అనంతపురములో శ్రీయుత ఒ. లక్ష్మణస్వామి గారి యాజమాన్యమున సమావేశమయినది. అధ్యక్షుల ప్రారంభోపన్యాసము భావగర్భితమై ఒప్పుచున్నది ఆంధ్ర మహాసభ ఏర్పడి పదునైదు సంవత్సరములు గడచినను ఆంధ్ర సభల యుద్దేశము పూర్తికానులేదని వీరు నిరూపించిరి. ఆంధ్ర రాష్ట్ర సమస్య యింకను పరిష్కరింపబడలేదు. చిత్తూరు జిల్లా వారికిగల అభిప్రాయభేదములు త్వరలో తొలగిపోయి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము జరుగునని తలచెదము ఈ విషయమై ఆంధ్ర మహాసభ శ్రద్ధవహించవలసి యున్నది. ఆంధ్రులలో వివిధ రాజకీయ పక్షములున్నను ఈ విషయమై అందరు ఏకాభిప్రాయులై ప్రయత్నించెదరని నమ్మెదము
రెండవది ఆంధ్ర విశ్వవిద్యాలయము. విశ్వవిద్యాలయ కార్యాలయము స్థాపింపబడి ఒక సంవత్సరము గడచిపోయినను ఇంకను ప్రత్యేక విద్యా విధానము ఆచరణకు రానులేదు. విశ్వవిద్యాలయ కార్యస్థానము గూర్చియే తగవులాట జరుగుచున్నది ప్రతి ప్రాంతము వారును తమ ప్రాంతమునకే కార్య స్థానమున్న గౌరవము లభించవలెనని పోరాడుచున్నవారే కానీ మొత్తము పైన అన్ని ప్రాంతముల ఆంధ్రుల అందుబాటులో నుండవలయునని విచారించుట లేదు. ఇకనయినను కాల హరణము చేయక సభ్యులు తగు నిర్ణయము చేయుదురు గాక!
అధ్యక్షులగు లక్ష్మణస్వామి గారు ఆంధ్రోద్యమము ద్వారా గ్రంథాల యోద్యమము విరివిగా వ్యాపించినదనియు ఇక ముందు ఆంధ్ర వికాసమునకు ఇట్టి సంస్థలే మూలాధార మనియు వాక్రుచ్చిరి ఆంధ్ర మహాసభ ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధి కొరకు పాటుపడవలయు ననియు, ఆంధ్రుల ప్రత్యేక శక్తులు విజృంభింపవయునన్న అన్ని విధముల జీవితమునకు ప్రోత్సాహము కలుగవలెననియు, దీనికి జాతీయ వాఙ్మయము అవసరమనియు, ఇవి యన్నియు స్థాయి సంఘమువారు పూనుకొనవలయు ననియు సూచించిరి
కొన్ని సంవత్సరముల నుండి ఆంధ్రులు రాజకీయ విషయములందే పాల్గొనుచున్నారు కాని సాంఘిక, వాఙ్మయాభివృద్ధి కొరకు శ్రద్ధ వహించుట లేదు. అందుచే ఆంధ్ర మహాసభ నిర్వీర్యమయినది ప్రతి సంవత్సరము సమావేశములు జరుగుచున్నవి, కాని కార్యాచరణలేదు. గత సంవత్సరము మద్దూరి అన్నపూర్ణయ్యగారు కార్యదర్శిగా నియమింపబడుటచే వారు కొంతవరకు మహాసభా తీర్మానములు ఆచరణకు దెచ్చుటకై ప్రయత్నించిరి ముఖ్యముగా కార్యదీక్ష కావలసియున్నది కనుక స్థాయి సంఘము చేయవలసిన పని యెంతేని గలదు
ఆంధ్ర మహాసభ అన్ని ప్రాంతములలో నున్న ఆంధ్రుల అభివృద్ధికొరకు ప్రయత్నింపవలయును రాజకీయ విషయములలో ఒక ప్రాంతము వారికి వేరొక ప్రాంతము వారికిని భేదమున్నను సాంఘిక, ఆర్ధిక విషయములలో భేదము వుండజాలదు ఈ సభ చెన్న రాజధానిలోని ఆంధ్రుల కొరకే ప్రయత్నించినచో అందు విశేషమేమి? ఆంధ్ర దేశములోని కొన్ని ప్రాంతములవారు విద్యాది విషయములలో వెనుకబడి యుండవచ్చును అంత మాత్రమున అట్టి వారిని వేరుపరచుటకు వీలువుండదు వారి అభివృద్ధికి కూడ మార్గము చూపుచుండవలయును అపుడే ఆంధ్ర మహాసభ యనిన ఏ ప్రాంతములో నుండు ఆంధ్రుల కయినను గౌరవోత్సాహములు కలుగును. సభానామము, ఉద్దేశము సార్థకమగును. మహాసభవారు ఈ విషయమున శ్రద్ద వహించెదరా?
ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల సన్మాన సభ
3-12-1927
మొన్నటి దినమున మన పురోద్యానములోని టౌనుహాలు మందిరమునందు గత వత్సరమున ఉస్మానియా విశ్వవిద్యాలయము నందు పట్ట పరీక్షలందు ఉత్తీర్ణులైన యౌవనులకు విశ్వవిద్యాలయము నందు పట్ట పరీక్షలందు ఉత్తీర్ణులైన యౌవనులకు విశ్వవిద్యాలయ పక్షమున గౌరవించుటకును, పట్టము లొసగుటకును సభ సమావేశమయ్యెను ఇట్టి సభ సంవత్సరమున కొకమారు ప్రతి విశ్వవిద్యాలయ పక్షమునను జరుపబడుచుండును. దీనిని ఇంగ్లీషున “కాన్వొకేషను సభ” యని పేర్కొనెదరు మన విశ్వవిద్యాలయ పక్షమున జరిగిన ఈ సభ మూడవది.
విశ్వవిద్యాలయ చాన్సెలరులగు శ్రీ రాజా రాజాయాస్, రాజా సర్ కిషన్ ప్రసాద్ బహద్దురు యమీసుస్సల్తసతు గారు గంభీరమగు నొక ఉపన్యాసమును చదివిరి వీని అచ్చు ప్రతులు సభాసదులకు పంచి పెట్టబడినవి. ఈ ఉపన్యాసమునందు మహా ఘనత వహించిన మన ప్రభువుగారి యౌదార్యమును, నవాబ్ హైదర్ నవాజు జంగుగారి సామర్థ్య విశేషములు పొగడబడినవి. మన విశ్వ విద్యాలయము యొక్క ప్రత్యేక లక్షణము ఉర్దూ భాషను విజ్ఞాన సాధనముగా నుపయోగించుట యని చూసిపి ఇంత మాత్రమున విజ్ఞాన సోపానముల దాటితిమనుకొనుట పొరపాటనియు, ముందు పొందవలసిన అభివృద్ధి ఎంతేని కలదనియు వచించిరి విద్యావంతులకు జీవనాధారములు కల్పించవలసిన విషయము ముఖ్యమనియు మన విశ్వవిద్యాలయమున సాంకేతిక విద్యలకు మంచి స్థానము ఒసగబడవలయు ననియు హిందూదేశము యొక్క రాజకీయ, ఆర్థికాభివృద్ధి, దేశములందు మత విద్వేషములును, హ్రస్వ దృష్టులును సమసి పోయిననే కాని ప్రాప్తించజాలదనియు నిర్ణయించిరి. సహకార విద్యాశాఖ, బోధనాభ్యసన శాఖ, ఫ్రెంచి, జర్మనీ మున్నగు ముఖ్య పాశ్చాత్య భాషల శాఖ, పరిశోధన శాఖ ఏర్పరుపబడవలయునని సెలవిచ్చిరి. ఇపుడు భాషాంతరీకరణ శాఖవారు పఠనీయ గ్రంధములను కొన్నిటిని ఇంగ్లీషునుండి ఉర్దూలోనికి వ్రాసి పెట్టినంత మాత్రమున చాలదనియు, విశ్వవిద్యాలయపట్టభద్రులు వాఙ్మయమున ఉత్తమ గ్రంధముల ప్రవేశపెట్టి విజ్ఞాన సంపదను వృద్ధివరచుట తమ ధర్మముగా తలంచవలయుననియు హెచ్చరించిరి. తుదకు పట్టభద్రులను సంబోధించి చెప్పిన వచనములలో మూడే ముఖ్య విషయములు
1 నౌకరి వృత్తిపైన ఆధారపడి యుండక ఇతర వృత్తుల నవలంబింపుడు
2 శారీరక స్థితిని బాగుచేసుకొనుడు.
3 స్వయం సహాయ సూత్రము నమ్ముడు. అనునవియే ఆ ముఖ్య విషయములు
ఈ మహోపన్యాసములోని ప్రధాన సూత్రమొకటి ప్రభుత్వమువారును, దేశీయులును జ్ఞప్తియందు వుంచుకొనదగియున్నది అదేదన
"...కాని ఏ దేశము నందైనను విద్యాభివృద్ధి కేవలము ప్రభుత్వము యొక్క ప్రయత్న మాత్రమున జరుగలేదు యూరోపు ఖండములోని విశ్వవిద్యాలయముల మాట చెప్పవలసిన పనిలేదు. బ్రిటిషు హిందూ దేశములోని ప్రభుత్వమువారి విశ్వవిద్యాలయములకు కూడ ఎన్నోయో విరాళములు గొప్ప గొప్పవి లభించినవి"
ఈ సూత్రమును మహా ఘనత వహించిన మన ప్రభుత్వము యొక్క విద్యాశాఖవారి దృష్టిని ఆకర్షింపదగినది గడచిన 50 సంవత్సరములలో విద్యాశాఖవారు చేసిన పని దేశమునందు నూటిలో ముగ్గురుకంటే నెక్కువ మందికి వ్రాయను, చదవను నేర్పుటకంటె ఎక్కువగ లేదు. నూటికి 97 మంది నిరక్షరులై యజ్ఞాన దశయందున్నారు వీరికి విద్య లభించి మానవ నామమునకు అర్హులు కావలయునన్నచో ప్రజా సహాయము లేకుండ సంభవించదు ప్రజా సహాయమునకు ఆటంకములగు విద్యా శాఖవారి శాసనములను ప్రభుత్వము వారు రద్దుపరచినగాని ప్రజా సహాయము లభింపదని మా అనుమానము విద్యాశాఖవారు ఇపుడైనను తమ పొరపాటుకు శ్రద్ధ వహించెదరా?
కాంగ్రెసు కర్తవ్యము
28-12-1927
భారతదేశ స్వరాజ్య సమరమున 1928 వ సంవత్సరము యొక్క ప్రాముఖ్యత నిర్ణయింప నేటి దేశీయ మహాసభ యొక్క బాధ్యతయై యున్నది 1927 వ సంవత్సరమున 'స్వదేశి' ఉద్యమము ప్రారంభమయ్యెను 1914 వ 'హోము రూలు' ప్రచారము రగుల్కొనెను 1921 వ అసహాయోద్యమము ప్రబలెను ఈ జాతీయ ఝంఝా మారుతములు సక్రమమగు పదముల వీచునటుల బోధించి శాసించి కాంగ్రెసు వన్నె కెక్కినది. 1928 వ సంవత్సరము కూడ నొక సంధిసమయము భారతవర్ష స్వరాజ్యార్హత నిర్ణయింప సైమను కమీషను వచ్చుచున్నది గత భారతదేశ స్వాతంత్ర్య సౌభాగ్యమో లేక దాస్య దౌర్భాగ్యమో నేడు పరిష్కారము కాగలదు. ఈ పరిష్కారము శుభ ప్రదముగ జరుపుట నేటి కాంగ్రెసు కర్తవ్యము.
సైమను కమీషను పట్ల భారతీయులు ఎట్లు ప్రవర్తింపవలెను? సహకారమా ? బహిష్కారమా? ఇది ప్రస్తుతపు ముఖ్య సమస్య కొందరొక పద్ధతియు మరి కొందరు వేరొక పద్ధతియును అవలంబించిన దేశమునకు అనర్ధము.అన్ని సంఘములు తమ శక్తులొకచో క్రోడీకరించి, ఏక దీక్షతో, దేశ విముక్తి కై పాటుబడిన గాని లాభము లేదు. ఇట్లు ఈ సంఘములకు మైత్రిని, ఐకమత్యమును, కార్యదీక్షయు నొసగుట కాంగ్రెసు విధియైయున్నది. సాంఘిక స్పర్థలు, రాజకీయ కక్షలు, మతవైషమ్యములు వీటి నన్నిటిని మ్రింగివేయగల దేశభక్తి ప్రతిమనుజుని హృదయములోను కాంగ్రెసు నెలకొల్పి ప్రజ్వలింపవలెను.
కేవలము తీర్మానములు వలన లాభములేదు. ఆ తీర్మానములు వలన లాభములేదు. ఆ తీర్మానములు కార్య రూపముగ పరిణమింపవలెను. ఆశయముల పై కంటె సాధనములపై నెక్కుడు లక్ష్యముంచవలెను అప్పుడే ఈ సమావేశములకు, చర్చలకు ప్రయోజనము వుండగలదు ప్రస్తుతము సమావేశ మయిన దేశీయ మహాసభ యీ ఐకమత్యము నొనగూర్చి, జాతీయాభిమానము పురిగొల్పి, సక్రమ సాధన సంపత్తి నొసగి, దేశవిముక్తికి కారణభూత మగుగాక!
ప్రజా ప్రబోధము
1-2-1928
మన ప్రధానమంత్రి గారగు మహారాజా బహద్దరు గారు గత వారమున చేసిన పర్యటన సందర్భమున జిల్లాలోని ప్రజలు వారి కర్పించిన వినతి పత్రములును, విజ్ఞాపనములును, మన రాష్ట్రమున ప్రజలందు క్రమముగా కలుగుచున్న ప్రబోధమునకు నిదర్శనమై ఒప్పారుచున్నది గుల్బర్గా నగరమున న్యాయవాదులు, వర్తకులు, విద్యాశాఖాధికారులు, హిందూ ప్రజలు, మిల్లులవారు వేర్వేరుగా వినతి పత్రములను అర్పించుకొనిరి అట్లే ఉస్మానాబాదు ప్రజలును సర్వతో ముఖముగ నొక వినతి పత్రమును ప్రధానమంత్రి గారి కొసగి తమ కష్ట నిష్ఠురములను ప్రభుత్వమున కెరుక పరచిరి.
ఈ పర్యటనమున ప్రజలు వినతిపత్రముల ద్వారా తమ యాశయముల ప్రభుత్వము వారికి తెలుపుట ముఖ్యముగ వెనుకబడియున్న మన రాష్ట్ర ప్రజల విషయమున ఒక నూతన పద్ధతి యని చెప్పవచ్చును. మన చుట్టుపట్టుల నున్న బ్రిటిషు ఇండియాలోను, నాగరికములగు ఇతర దేశీయ సంస్థానము లందును, ప్రజలు తమ కోర్కెలను, అవసరములను ప్రభుత్వము వారికి ముఖాముఖిగా తెలియజేసి వారి వలన ప్రత్యుత్తరముల బడయుటకు శ్రేష్ఠములగు పద్ధతులు కలవు సభలలో ప్రతినిధులు ప్రభుత్వము వారిని ప్రశ్నలు అడిగి వెంటనే వారి యుత్తరములను బడయు విధానమున్నది. కాని మన శాసన సభ యింకను అట్టి సంస్కార మొందనందున, మనము ప్రజా పక్షమున కష్ట నిష్ఠురములను పత్రికలందు వ్రాసికొని సంతసించుట తప్ప మన మొరలను ప్రభుత్వము వారికి తెలుపుకొనుటకును వీలు లేక యున్నది ప్రభుత్వము వారేమి సెలవిచ్చెదరో తెలిసికొనుటకును వీలులేక యున్నది ప్రభుత్వము వారేదేని సంస్కరణ మొనర్చినచో మన కోర్కెకు, విజ్ఞాపనమునకు ప్రత్యుత్తరము వచ్చినదని సంతసింప వలసినదే కాని, ప్రభుత్వోద్దేశములను తెలిసికొనుటకు ఎట్టి సాధనము మన చేతులలో లేనందున, దయామయులగు ప్రభుత్వము వారి సానుభూత వాక్యములను వినజాలకుంటిమి ఇట్టి లోపమును ఒక విధముగ తొలగించుటకు వినతి పత్రములు అర్పించి ప్రత్యుత్తరము బడయు నీ నూతన పద్ధతి చాల మంచిదని మా తలంపు. ఈ పద్ధతినే, ప్రతి జిల్లా ప్రజలను ప్రతి తాలూకా ప్రజలను, ప్రధానమంత్రిగారు గాని శాఖ మంత్రులు గాని తమ ప్రాంతములకు దయచేసినప్పుడు అవలంబించు చుండినచో చాల ఉపయోగకారి కాగలదు.
మన ప్రధానమంత్రిగారి యెదుట చెప్పుకొనబడిన ప్రజావసరములను మూడు విధములుగ భాగింపవచ్చును 1. స్థానికావసరములు 2. ప్రత్యేక సంఘ అవసరములు 3. ప్రజావసరములు
మొదటి వానిలో రోడ్లు, నీటి వసతులు వెలుతురు మున్నగువాని యేర్పాటులు చేరియున్నవి ఇవి ఆ ఆ స్థలము వారికే సంబంధించి యుండును కనుక ఇవి అన్నిటికంటె ముఖ్యములు, సులభముగా తీర్పదిగినవియు. రెండవవానిలో, ప్రజలలోని ఒక ప్రత్యేక సంఘమునకు మాత్రము సంబంధించిన విషయములు గలపు గుల్బర్గాలోని హిందూ ప్రజలు హిందువులకు గల కష్ట నిష్ఠురములను, అవసరములను తెలుపుకొని యున్నారు. తాము ప్రజా సమూహములలో నూటికి 53 మంది చొప్పునగల గొప్ప సంఘమై యుండినను, తమకు గొప్ప యుద్యోగములు లభింపకుండుట, మునుపు దొరకుచుండినవియు తక్కువ యగుట, తమ మత విషయక కార్యములకు ఆటంకములు కలుగుచుండుట, తమ తమ సంబంధ సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వము వారి మత శాఖ (ఉమూరే మజహబి) లో ఒక హిందూ అధికారి నియోగింప వలయుననుట ఇటీవల నాశనము చేయబడిన దేవాలయములను బాగుచేయ వలయుననుట మున్నగునవి మనవి చేసికొనియున్నారు. ఇట్లు తమ కోరికలను ప్రభుత్వము వారికి మనవి చేసికొనుటలో హిందువులు మంచి మార్గము నవలంబించిరి. అడిగిన గాని అమ్మ కూడపెట్టదు కదా! ప్రభుత్వమువారును వాని విషయమున ఎంత త్వరగా శ్రద్ధ వహించిన అంత మంచిదని మా యభిప్రాయము.
మూడవ వానిలో మన రాష్ట్రములోని అన్ని తెగలవారికిని, అధికారులందరికిని, సంబంధించిన విషయములు కలవు. 1. లోకల్ ఫండు సభలలోని సభా సదులను ప్రజలు ఎన్నుకొను పద్ధతి ప్రవేశపెట్టవలయుననుట ఇంతవరకు నీ సభలలో ప్రభుత్వ నియోజితులేయున్నారు ప్రారంభదశలో ఇది అవసరమయినను నేడు అట్టి యవసరము లేదనవచ్చును గత నలువది వత్సరముల నుండి యీ సభలలో అధికారేతర సభాసదులను కూడ ప్రభుత్వాధికారులు ఏర్పరచుచున్నారు. కాని యింత మాత్రము చాలదు. ఈ తాతల నాటి పద్ధతిని వదలి యిప్పుడు నాగరిక రాష్ట్రములలోనున్న పద్ధతిని ప్రవేశపెట్టవలయునని ప్రజల కోర్కె 2 పెద్ద బస్తీలలో మజ్లీ సె సఫాయీ (మునిసిపాలిటీ) లను స్థాపించవలయుననునది ఇప్పుడిట్టి మజ్లిసు హైద్రాబాదునందు మాత్రము కలదు. అదియు సంపూర్ణ దశలో లేదు అస్వతంత్ర స్థితిలోనున్నది దానిని గూర్చి చిత్తు శాసనము గడచిన 30 ఏండ్ల నుండి మన శాసన నిర్మాణ సభలోపడి యున్నది బ్రిటిషు ఇండియాలో 5 వేల జన సంఖ్య కంటే మించిన ప్రతి బస్తీ యందు ఇట్టి సంఘములున్నవి కనుక మనవారును అట్లు చేయించవలయునని ప్రార్థించుచున్నారు 3. శాసన నిర్మాణ సభా సంస్కరణము అనగా దీనిలో ఇప్పుడున్నట్టు గాక ప్రజాప్రతినిధులను ఏర్పరుపవలయుననియు, ప్రజాశయములు ఈ విషయమును ఇదివరకే మహా ఘనత వహించిన మన ప్రభుత్వము వారు ఏడేండ్ల నుండి ఆలోచించుచున్నారు. ఉత్తమ పరిపాలనమునకును నిదర్శనములగు నీ సంస్కారములను ప్రభుత్వమువారు త్వరలో ప్రసాదించగలరని మా యభిప్రాయము 4 విద్యా విషయములు ఖాన్గీ పాఠశాలల విషయమున చేయబడిన నిర్బంధ శాసనమును రద్దుచేయుట, ప్రారంభ విద్య, మాధ్యమిక విద్య విద్యార్ధి యొక్క మాతృభాషలోనే గరుపబడవలయుననుట, ప్రారంభ విద్య ప్రజా స్వాధీనముచేసి ప్రభుత్వమువారు సహాయము మాత్ర మొసగుట మంచిదనుట మున్నగునవి సూచింపబడినవి
ఇట్లు ప్రజలు ప్రభుత్వమువారి ముఖాముఖిగా అడుగ గలుగుట నూతనమైన ప్రజా ప్రబోధముగ భావించుచు దీనికి కారకులగు వారిని మేము మనఃపూర్వకముగ నభినందించుచున్నాము.
సంఘ దౌర్బల్యము
8 - 2 - 1928
ఇందూరు మహారాజు గారు మరల పత్రికల చర్చలలో ప్రధానులైరి. వీరికిఇదివరకే ఇద్దరు భార్యలున్నారు ఇంతటితో నిలువక వారు అమెరికా కన్యను వివాహమాడ నెంచినారు క్రైస్తవ న్యాయానుసారముగా నొక పురుషుడు ఒక స్త్రీ కన్న నెక్కుడుగా స్త్రీలను వివాహమాడరాదు. కాని హిందూ, మహమ్మదీయ మతములలో నిట్టిది ఎంతవరకు అయినను సాధ్యమై యున్నది. కావున మహారాజు గారు ఈ అమెరికా స్త్రీని హిందూ మతములో జేర్చి మూడవ వివాహమును గావింప నిశ్చయించిరి.
హిందూ సంఘములో నెవ్వరును ఈ స్త్రీని శుద్ధిచేసి హిందువుగా జేయ సమ్మతింప మిచే ముసల్మాను సంఘము వారు వీరిరువురిని ముసల్మానులనుజేసి వివాహము చేయుటకు అంగీకరించిరట ఈ వార్త కొందరి హిందువులకు రుచించదయ్యెను. తమ మతము యొక్క జనాభాలో నిద్దరు తగ్గిపోవుదురను భీతిచే మహారాజు గారికి తమ భావి వధువును హిందూ స్త్రీనిగా మార్చెదమని ఆహ్వాన మంపినారు.
ఈ వార్తలను జూచిన సత్యాన్వేషణ పరులందరు విచారపడ వలసియున్నది. నేడు ప్రపంచములో మతములన్నియు సంఖ్యను వృద్ధిచేయ గోరుచున్నవి గాని ప్రపంచమును వృద్ధి చేయ గోరుట లేదు ఈ కన్య కామమే ప్రధానము కలదై మతాంతరము స్వీకరించుచున్నదే కాని క్రైస్తవ మతమున కన్న హిందూ మతములో విశేషములు వున్నవని యెంచి మత స్వీకారము చేయుట లేదు. ఇట్లు చేయుట వలన నామె కుభయ మతములు కూడ బోధ కాలేదని విశదమగును. పైగా హిందూ మహమ్మదీయులు మత వ్యాప్తితో పరస్పరముగా పోటీలు కలిగియుండుట యుభయ సంఘములకు నష్టదాయకముగా నున్నది. సంఘము వృద్ధి కావలయుననిన మతములోని లోపములను బాపికొనవలయునే కాని లోపములను మతములో వృద్ధి చేయకూడదు
ఆంధ్రోద్యమము :
ఈ రాష్ట్రమందలి యాంధ్రోద్యమమును గురించిన విషయములు వేరుచో ప్రకటింపబడినవి. నిజాం రాష్ట్ర ఆంధ్రులలో నిరుత్సాహమునకు ఇపుడు అవసరమేమియు గనబడదు న్యాయబద్దులై సంఘాభివృద్ధికి మార్గదర్శకములగు ఉద్యమముల నెవ్వరును బ్రతిఘటింపజాలరు. ఉన్నత న్యాయస్థానపు తీర్పు ఇప్పుడందరకును తెలిసిన విషయము. అట్టిచో వాఙ్మయాభివృద్ధికిని, సాంఘికాభివృద్ధికిని, ప్రభుత్వోద్యోగులు ఆటంకములు కలిగింపనేరరు కొంత కాలము క్రిందట హైద్రాబాదులో జరిగిన హిందూ సాంఘిక మహాసభలో ఆంధ్రులు చాలా కొలదిగా నుండి యుండిరి. దీనివలన మనము మహారాష్ట్ర సోదరుల కన్న వెనుకబడి యున్నారమని విశదమగును. కావున ఇకముందైనను మనమీ లోపములను బాపికొనవలయును. రాష్ట్రీయ ఆంధ్రులు అందరును శ్రద్ధ వహింతురుగాక.
స్త్రీ విద్యా మహాసభ
15 - 2 - 1928
స్త్రీల యభివృద్ధి యెడ నానాటికి శ్రద్ధ హెచ్చుచుండుట సంతోషకరము. అందును, తమ అభివృద్ధికై పురుషులపైననే ఆధారపడియుండక, స్త్రీలు తమంతట తామే ప్రయత్నములు సలుపుచుండుట ప్రశంసార్హము, శుభకరము. కొలదికాలమునుండి, ప్రతి యేడును ఏదియో యొక స్త్రీల సమావేశము జరుగుచునే యున్నది. తీర్మానములలో తమ ఆశయములను, కోరికలను ప్రకంటిచుచు సంఘమున సంచలనము కలిగించుచునే యున్నారు. కానీ తదితర సమావేశముల కంటె మొన్నటి ఢిల్లీ సమావేశము కొన్ని విషయములలో నెగడదగినది. అలీగఢ్ విశ్వవిద్యాలయమునకు వైస్ ఛాన్సలర్‌ను, స్త్రీల అభ్యున్నతికై, విద్యా వ్యాప్తికై నిరంతర కృషి సలుపుచున్న భోపాలు మహారాణిగారీ సమావేశమునకు అధ్యక్షత వహించుట యెంతయు అదృష్టమనవచ్చును. అదియును గాక పాశ్చాత్య విజ్ఞాన పారీణయగు ఇర్విను ప్రభ్వి తమ అమూల్యమగు సందేశము నొసగి, ఈ సమావేశ సమాలోచనములకు వన్నెదెచ్చిరి. భారతదేశమందలి వివిధ ప్రాంతముల నుండి ప్రతినిధులు విచ్చేసి ఈ సభ యందు పాల్గొని, విపుల చర్చ యనంతరము గావింపబడిన తీర్మానములకు విలువను అపాదించిరి
స్త్రీలకు విద్య అత్యవసరమనియు, విద్యా వ్యాప్తికి పలు భాషలు, పేదరికము, అజ్ఞానము, ఉపేక్ష, ప్రతికూల ప్రజాభిప్రాయము, సాంఘిక నడతలు, ఆచారములు, రాజకీయములు, అంతరాయములు కల్పించుచున్న వనియు, బాల్యవివాహము, పరదాపద్ధతి నిరసించవలెననియు, ధృవపరుచుటలో విశేషమేమియు లేదు ఇవి యందరికి తెలిసిన విషయములే ఇందు ప్రశంసింప దగిన దేమియు లేదు.
ఈ సమావేశమును ముఖ్యముగా మూడు విషయములకై మేము అభినందించుచున్నాము. అందు మొదటిది బాలికలకు నిర్బంధ ప్రాధమిక విద్య ముఖ్యమని నిర్ధారణ చేయుచు, దీనికై ప్రభుత్వము వారిని, స్థానిక సంఘము లను, తగిన ఆర్థిక సౌకర్యముల నొసగవలెనని కోరునది కేవలము అస్పష్టముగ, ప్రయోజన హీనముగ, విద్య కావలెనని ఉపన్యాసములిచ్చి తనివిజెందక యా కోరిక కార్య రూపముగ ఫలవంతమగుటకు గాను ప్రభుత్వమును హెచ్చరించుట సమంజసము. స్థాయి సంఘము వారీ తీర్మానమును అనుసరించి విద్యాశాఖాధికారులకు ఒత్తిడి కలుగజేసినచో మంగళకరమగు ఫలితములు బడయవచ్చును.
ఈ సందర్భమున భోపాలు మహారాణి గారి సూచన యెంతయు బొగడ దగియున్నది ప్రభుత్వము వారు పూనుకొనిన వరకు చేతులు ముడుచుకొని వేచియుండుట యుక్తము కాదు. అదియునుంగాక భారత ప్రజలు కడుపేదవారు. సగటున ఒక్కొక్కరికి నెలకు రూ.2-8-0 మాత్రమే ఆదాయమని గమనించవలెను. ఇట్టి తఱి, ప్రతి గృహస్థును తమ బిడ్డల విద్య గూర్చి తగినంత ధనము వెచ్చింపలేడుగదా! ఇట్టి నిరుపేదల కొరకు ఒక మంచి పద్ధతిని మహారాణి గారు సూచించియున్నారు. విద్యావతి యగు ప్రతి స్త్రీయును తన తీరుబడి కాలములో కొంత సమయమీ బీద బిడ్డల బోధనకై వినియోగించినచో దేశమునకు అమూల్యమగు సేవచేసిన వారగుదురు. దీని వలన దీని వలన ప్రస్తుతపు పాఠశాలల కొరతయు, ఉపాధ్యాయుల కొరతయు కొంత వరకు దీరును
స్త్రీ విద్యా నిరూపణ గూర్చి జరిగిన చర్చ కొనియాడదగిన రెండవ విషయము. నేటి బాలికల విద్యావిధానము, బాలుర విద్యావిధానమునే అనుకరించి యున్నది ఇది సరియయిన పద్దతి కాదు దీని వలన స్త్రీ విద్య యొక్క ముఖ్యాశయములు విఫలమయి పోవుచున్నవి శారీరక, మానసిక, నైతికాభివృద్ధికి దోడ్పడునది విద్య పురుషుల ప్రయత్నములకు చేదోడు వాదోడుగ నుండి, కష్ట సమయములలో నాదరణ నొసగుచు, గృహమును శాంతి సుఖధామముగ చేయుటకుగాను విజ్ఞాన వికాసము నొసగుట స్త్రీ విద్య యొక్క ముఖ్యాశయము. పురుషుల కొరకు ఏర్పరచబడిన విద్యా విధానమును అనుసరించి యుండినచో, స్త్రీ విద్య యీ ఆశయమును పూర్తిచేయజాలదు అట్టి విద్య నిష్ఫలము.
స్త్రీల యవసరములు వేరు. వానిని గుర్తెరిగి తదను గుణ్యముగ విద్య గరుపవలెను. అనుదిన జీవనమున కుపయోగపడునటుల గృహమేధి అర్థ శాస్త్రము, (Domestic Economy) ఆరోగ్య సూత్రములు, చేతి పనులు మున్నగునవి వీరికి తప్పక గరుపవలెను తదుపరి కళలు, శాస్త్రములు మొదలుగా గల ఉన్నత విద్యలు వలయువారు అభ్యసించుటకయి ప్రత్యేకముగ ఏర్పాటులు చేయవచ్చును విద్యా విధానములో ఇండియా నేడొక మార్గ సంధిని జేరి యున్నది. ఇక మీదట స్త్రీలు ఏ మార్గము నవలంబించవలెనో నిశ్చయించునెడ పై విషయమును శ్రద్ధతో గమమనించవలెను.
ఇక మూడవ విషయము ఉపాధ్యాయినుల ఆవశ్యకత బోధకులు (Teachers) సభ్యతా సూత్రధారులు. ఏ జాతి ప్రతిభయైనను వీరి కృషి ఫలితమే చిన్న పిల్లల బోధనకు పురుషులకంటె స్త్రీల నియోగించుట శ్రేష్ఠము. శాంతి, సహనము, సానుభూతి వీరియందు ఎక్కువ అందుచే చిన్నపిల్లల మనోవైఖరిని గ్రహించుట యందును, తదనుగుణ్యముగ బోధించి పాఠముల నచ్చ జెప్పుటయందును వీరు విజయవంతులుగ నుందురు. ఈ యవసరమును, బాలికా పాఠశాలల యవసరములను, పూర్తిజేయుట కెందరో సుశిక్షితులగు ఉపాధ్యాయినులు కావలసియున్నారు ఒక స్త్రీ కేవలము పరిజ్ఞానమున్నంతమాత్రముననే సద్బోధకురాలు కానేరదు. దీర్ఘ దృష్టి, స్వార్థ త్యాగము, వృత్తియందు శ్రద్ధా భక్తులు, కలిగియుండవలెను. విద్యా బోధన అత్యుత్తమ వృత్తి యనియు దాని నవలంబించుట గౌరవ ప్రదమనియు ప్రతి బోధకురాలును నమ్మి కార్యమునకు ఉపక్రమించవలెను అప్పుడే వారి కృషి దివ్యమగు ఫలితములకు కారణమగును. ఈ ఉన్నత పదవిని స్వీకరించుటకు ఉత్తమ తరగతుల స్త్రీలు పూనుకొనవలెను. ఈ వృత్తి యెడ నేడుగల తూష్ణీం భావము మాని, భక్తి మర్యాదలతో జూచి, బోధకులకు సౌకర్యములు కలిగించుచు, ప్రోత్సాహము నొసగిన గాని ఈ అవసరము పూర్తి కాజాలదు. అంతవరకు విద్యా వ్యాప్తికి నిరోధము కలుగుచునే యుండును. కాన ఈ బోధకుల శిక్షణ కొరకు ప్రభుత్వము వారు బోధనాలయముల స్థాపించు నటుల స్త్రీ విద్యా సంఘము వారు ఒత్తిడి కలిగించవలెను.
మూడవ తరగతి ప్రయాణికులు
3 - 3 - 1928
ఉన్నవారి కందరు బెట్టుదురు అయ్య పెట్టును, అమ్మ పెట్టును, బంధువులు పెట్టుదురు, మిత్రులు పెట్టుదురు, తుదకు ప్రభువువారు కూడా పరామర్శింతురు కాని లేనివారిని అడుగు దిక్కులేరు. వారు నోరు విడిచి వేడినను విను దాతలు లేరు. ప్రభుత్వము మూడవ తరగతి రైల్వే ప్రయాణీకుల పట్ల అవలంబించు కార్యఫణతి కూడ నిట్లేవున్నది.
మూడవ తరగతి ప్రయాణికుల ఇబ్బందులు మూడుగా విభజింపవచ్చును. అందు మొదటిది రైల్వే చార్జీలు. గత దశ సంవత్సరములలో రైల్వే చార్జీలు క్రమక్రమముగా హెచ్చిపోయెను. ఇది ప్రయాణీకులకు, ముఖ్యముగా మూడవ తరగతి ప్రయాణికుల కెంతయో కష్టము కలిగించెను ఫ్రాన్సు, జర్మనీ ఇంగ్లండు మున్నగు దేశములకంటె మన దేశమెంతయో పేదది. మన దేశమున సుమారు 10 కోట్ల మంది తిండిలేక మలమల మాడుచున్నారని మొన్న మొన్ననే శాసన సభలో లాలా లజపతిరాయి గారు ప్రకటించిరి అయినను యూరోపు దేశములన్నిటిలో కంటె మన దేశమున రైల్వేలో సౌకర్యములు తక్కువగనున్నను, చార్జీలు మాత్రము ఎక్కువగ నున్నవి ఇది మన దురదృష్టము. కానీ ప్రభుత్వము వారి కష్టమును తొలగించుటకు ప్రయత్నింప కుండుట శోచనీయము 1927-28 సంవత్సరమున రైల్వేవలన 12 కోట్ల 75 లక్షల రూపాయలు లాభము కలిగినది. ఇది పూర్వపు వత్సరము కంటె 3 కోట్ల 75 లక్షలు అధికము. అందుచే నార్తు వెస్టర్ను, ఈస్టు ఇండియను, గ్రేటు ఇండియను పెనిన్సులారు రైల్వేలలో చార్జీలు కొంతవరకు తగ్గింతురట తక్కిన రైల్వే కంపెనీలతో చార్జీలను తగ్గింప ఉత్తర ప్రత్యుత్తరములు మాత్రము జరిపెదరట. కానీ ఈ ఉత్తరములవలన నెట్టి లాభమును గలుగదు ప్రభుత్వమువారు పట్టుదలతో వీటి విషయమై శ్రద్ధ వహించి కంపెనీల వారికి ఒత్తిడి కలిగించినగాని ఎట్టి ప్రయోజనము నుండదు. అదియునుం గాక పై మూడు రైల్వేల లోన 50 మైళ్ళకు మించిన ప్రయాణములకు మాత్రమే మైలుకు నాలుగు దమ్మిడీల చొప్పున తగ్గింతురు కాన ఇది బీదలకు, పేద రైతులకు ఉపశాంతి నొసగ జాలదు. మన రైతుల ప్రయాణములు సర్వ సామాన్యముగా 50 మైళ్ళ లోపునే యుండును అట్టి తరి ఈ క్రొత్త ఏర్పాటు వలన చాలినంత మేలు కలుగుట లేదు.
ప్రయాణికుల రెండవ కష్టము రైల్యేయుద్యోగుల వలన సంభవించుచున్నది. బుకింగు క్లర్కులు, టిక్కెటు కలెక్టరులు స్టేషను మాస్టరుల అక్రమ చర్యలు అందరికి దెలిసినవే. పెద్ద కుటుంబములు తీర్థయాత్రలకు వెడలుతరి, వారికి సౌకర్యముగా ఒక కంపార్టుమెంటునో, డబ్బానో ఏర్పాటుచేయుటకు ఎన్నియో పాట్లు పడుదురు. ట్రెయిను ప్లాటు ఫారము మీద వున్నప్పుడు, ఆతురత తోడ బరుగెత్తుకొని వచ్చి టిక్కెటు వేడు పల్లెటూరి రైతు చిక్కులను వారినే విచారించవలెను. దారిని బోపు ప్రయాణీకులను ఎక్కువ సామానున్నదని పీడించి, దక్షిణ సమర్పించనచో, వారి ప్రయాణమునకు ఆటంకము గలిగించుట కొన్ని సందర్భములలో కలుగుచున్నది దినుసులు ఎగుమతి చేయుటకును గాను గూడ్సు వాగినులను కోరు వర్తకులు, స్టేషను మాస్టరుల దాసాను దాసులు, ఇటువంటి ప్రవర్తనమును పరిశీలించి, నిందితులను శిక్షించుటకుగాను ఒక విచారణ సంఘమును ఏర్పరచవలెనని జోషిగారు కోరిరి. ఈ చర్యలను శ్రద్ధతో పరిశీలింతునని వాగ్దాన మొసగుచు, ఇట్టి సంఘమవసరమని రైల్వే శాఖాధికారి త్రోసివేసెను ఈ వాగ్దానము ఎంతవరకు నెరవేర్తురో చూడ వలసి యున్నది.
మూడవది ప్రయాణికుల సౌకర్యములకు సంబంధించినది మొదటి, రెండవ తగరతి ప్రయాణికుల నుండి వచ్చు డబ్బు కంటె మూడవ తరగతి వారి వలన వచ్చు డబ్బు పది రెట్లు అధికమయినను, రైల్వేవారు వీరి సౌకర్యమును బాటించుట లేదు. తగినన్ని డబ్బాలు వుంచకపోవుట చేత, సుఖముగా కూర్చుండుటకు కూడ తావు దొరకుట లేదు స్టేషనులో మంచినీటి వసతి గాని, మరుగుదొడ్డి సౌకర్యములు గాని సరియైనవి లేవు. తిను పదార్ధములు, వెయిటింగు రూములు, ఎంత అశుభ్రముగ నుండునో అందరికి అనుభవమే. ఇట్టి హీనపు స్థితిగతులను చక్కబరచుటకు రైల్వే మంత్రిగారు ఎట్టి ఏర్పాటును జేయరైరి సానుభూతి మాత్రము కొరతలేకుండా ప్రకటించిరి కానీ దీని వలన గలుగు లాభమేమి ?
నిజాం రైల్వేలో గూడ పైన పేర్కొనిన ఇబ్బందులు గలవు. బెజవాడ నుండి ప్యాసింజరు బండిలో ప్రయాణము చేయువారికి, నోరు ఎండి ప్రాణము పోయినను, అనేక స్టేషనులలో గుక్కెడు మంచినీళ్ళు దొరకుట దుర్లభము. సికింద్రాబాదు స్టేషనులో ప్రయాణీకులు ఎండలో మలమల మాడవలసినది గాని ప్లాటుఫారము మీదగాని, వంతెన మీదగాని కప్పు లేదు. టిక్కెట్టు కలెక్టరుల జులుము అందరకు విదితమే అన్ని రైల్వేల కంటేను ఈ రైల్వే కంపెనీ వారికి లాభమెక్కువగా నున్నది కానీ రైల్వే చార్జీలలో చిల్లిగవ్వ యైనను తగ్గించుట లేదు. దీని గూర్చి ప్రభుత్వము వారు కొంతలో కొంత శ్రద్ధ పుచ్చుకొనిననే గాని పరిస్థితులు మారవు
బాల్యవివాహ నిషేధము
11 - 4 - 1928
"సోదరులారా ! తేజోరాసులగు పురుష సంతతికై ప్రార్థింపు"డని వివేకానందుడు భారతీయుల నుద్బోధించెను. కాని తేజోమతులగు మాతలు లేనిదే సారవంతమగు సంతతి గలుగుటెట్లు" ముక్కుపచ్చలారని బాలికలకు పుస్తె కట్టుచున్నప్పుడు విజ్ఞానహీనులగు భార్యలు, వికాస దూరులగు మాతలు, నిర్బంధ బాలవిధవలుతప్ప వీరమాతలు ఎటునుండి వత్తురు?
బట్ట కట్టుటకూడ నెరుగక, మూర్తీభవించిన ప్రకృతి దేవతలవలె జీవించు వన్యజాతులలోగూడ లేని యీ ప్రకృతి ధర్మ విరుద్ధమగు దురాచారము హిందూసంఘము నావేశించి, పీల్చి పిప్పి చేయుచున్నది. బాల్యవివాహముల మూలమున హిందూజాతి శారీరక బలము స్రుక్కి పోవుచున్నది; మనోవికాసము మరుగువడి బోవుచున్నది, నైతికదృష్టి నీరసించి పోవుచున్నది, దాంపత్య సౌఖ్య మడుగంటుచున్నది, సంఘశాంతి విలోపమగుచున్నది ప్రతి సంవత్సరము నీ ఘోర పిశాచమునకు వేలకొలది అమాయక బాలికలు బలియయి, తమ యావజ్జీవమును దుర్భర దుఃఖముతో గడుపుచున్నారు మూఢవిశ్వాసములకు బలియగుచున్న విధవల సంఖ్య నానాటికి పెరిగిపోవుచున్నది. 1921వ జనాభా ప్రకారము, 5 సంవత్సరముల లోపలనే భర్తలను కోల్పోయినవారు 19 వేలును 5 నుండి 10 సంవత్సరముల లోపువారు 85 వేలును, 10 నుండి 15 సంవత్సరములవారు 234 వేలును గలరు మొత్తముమీద స్వయంకృతాపరాధమేదియు లేకనే దుర్భర వైధవ్య దుఃఖము లనుభవించుచున్నవారు 329 వేలమందిగలరు. తరుణుల కంటి నీటిచే మసిబట్టిన వంటయిండ్లు తడుచుచున్నంతకాలము హిందూ జాతికి శుభము చేకూరదు
బాల వితంతువుల వివాహము పేరెత్తినచో ఆర్య ధర్మములు అడుగంటి పోవునని పూర్వాచార పరాయణులు గగ్గోలు పెట్టుదురు. కాని ఆర్య ధర్మములను శ్రద్ధతో పాటించుటకు ప్రోత్సాహమొసగుచు ఆర్య గృహమునకు వన్నెదెచ్చు వివాహ విధానమును ఈ పూర్వాచార పరాయణులు ఏల అంగీకరింపరో తెలియకున్నది
ఈ పూర్వాచార పరాయణుల నస్తతత్వము కడు చోద్యమయినది. చీమలకు నూకలు వేయుదురు, పాములకు పాలు బోయుదురు, పిట్టలకు ధాన్యము జల్లుదురు, గోరక్షణకయి ప్రాణము లర్పింతురు, కాని తమ కూరిమి బిడ్డలు కలకాలము దుఃఖమున దూలు చుండ నించుకేనియు చలింపరు. ఇతరు లెవరైన ఈ అమాయకపు కన్యల వెతల బాప యత్నించినచో వారిపైబడి హింసింతురు. వీరు బాల్యవివాహమును నీతితో ముడివైతురు ఈ నీతిని మతముతో పెనవైతురు. ఈ మతమను కొరడాను బుచ్చుకొని స్త్రీ జాతి నంతటిని చావగొట్టు చున్నారు. వారీ శరీర పాటవమును అణచి వేయుచున్నారు, స్వాభిమానము చంపివేయుచున్నారు, మనో వికాసమును మూల ద్రొక్కుచున్నారు.
కాని యీ దురాచారదాసుల యధికారము చిరకాలము సాగనేరదు హిందూ సాంఘికులు మేలుకొని, యిట్టి సాంఘిక దౌర్జన్యములను బాపుటకై సత్వరముగ ప్రయత్నించిననే గాని హిందూ సంఘము నంతటిని మొదలంట కలచివైచి కలవర పరచు యువతీయువకుల తిరుగుబాటు జరుగగలదు సామాన్యపు యోచనాపరుడగు ప్రతివాడును ఉత్తమ సాధ్వులు, వీరమాతలు కాగల తరుణీమణుల కాంతివంతములగు జీవితములు శుష్క జీవితములుగసు, నిరర్థకములుగను, పరిణమించుట జూచి సహింపజాలడు, జాలిగుండె గలవాడెవ్వడును ఈ ఘోరపాపమును కలకాలము కనులార జూచి సైరింపలేడు.
బాలవితంతువుల సమస్య సమసిపోవలెనన్న బాల్యవివాహములు నిషేధించుటయే యత్యుత్తమమగు మార్గము దీనికి మొదటి మెట్టుగ 1925 లో నిషేక వయోపరిమితిని 12 నుండి 14 సంవత్సరములకు హెచ్చింపవలసినదని ఢిల్లీ శాసనసభలో సర్‌హరిసింగుగారు ప్రతిపాదించిరి అప్పుడు ప్రభుత్వము వారు తటస్థులుగ నుండి, యీ తీర్మానమును దేశమందలి వివిధ సాంఘికులు యభిప్రాయ ప్రకటనకై నానారాష్ట్రముల కంపిరి. మొత్తము మీద దేశములో నధిక సంఖ్యాకులు దీనికి సుముఖముగానే యభిప్రాయమిచ్చిరి మొన్నటి శాసనసభ జంకుచు ముందు కింకొక దాటువేసెను గత నెలలో హరవిలాస శారదగారు 18 ఏండ్లలోపల బాలురకును, 14 ఏండ్లలోపల బాలికలకును వివాహము చేయుట న్యాయవిరుద్ధమనియు, దండనీయమనియు ప్రతిపాదింప అది సభ వారిచే యంగీకరింప బడెను. ఇది దేశీయుల యభిప్రాయము కొరకై త్వరలో ప్రకటింపబడును. అన్ని ప్రాంతములవారును దీనికి ప్రోద్బల మొసగి హిందూ సంఘమును తేజోవంతముగ జేయుదురని నమ్ముచున్నాము
పరిపూర్ణముగ అంగవికాసము నొందని బాలికలను సంరక్షించుటకై యింతకుముందే వివిధ దేశీయ సంస్థానములలో శాసనములు గలవు. బరోడాలో బాలురకు 18 లోపలను, బాలికలకు 14 లోపలను వివాహములు నిషేధించి యున్నారు కాశ్మీరములో కూడ నిట్టి శాసనమే విధింపబడి యున్నది. కొండాల్ కోట, మైసూరు, ఇందూ సంస్థానములలో నిట్టి చట్టములే కలవు. రాజకోట సంస్థానములో రెండు నెలల క్రిందటనే బాలికలకు 15 ను బాలురకు 19 ను వివాహ యోగ్యవయస్సుగ శాసింపబడెను ఇట్లీ సంఘసంస్కార విషయమున దేశీయ సంస్థానములు ముందంజ వేయుచుండుట ప్రశంసార్హము
నిజాం రాష్ట్రమునకు కూడ బాల్యవివాహనిషేధ శాసనమొకటి అత్యవసరము, మన రాష్ట్రములో వేయింటికి 500 బాలికలకు 15 సం॥ లోపలనే వివాహము జరుగుచున్నది అందుచే బాలవితంతువుల సంఖ్య కూడ ప్రబలముగ నున్నది మొత్తము మనరాష్ట్రములో పదిన్నర లక్షల విధవలు గలరు వీరిలో సుమారు 4 లక్షల మంది 15 సంవత్సరము లోపువారే. కాబట్టి స్థానిక స్త్రీసంఘములొక బాల్య వివాహనిషేధ సంస్థ నేర్పాటు చేసి, ఢిల్లీలో నుండి మహారాణిగారిచే స్థాపింపబడిన కేంద్ర సంఘముతో సంబంధము లేర్పరచుకొని, ప్రజలలోనీ విషయమయి ప్రచారము సలిపి, నిజాము ప్రభుత్వము వారికి మహాజరులంపి, ఈ దురాచారమును మాన్ప బ్రయత్నింతురని హెచ్చరించు చున్నాము.
మన విద్యాశాఖ
21 - 4 - 1928
1335 ఫసలి నివేదికయే మనకిప్పుడు లభ్యమైన నివేదిక. ఈ నివేదికలో మన విద్యాపరిస్థితులు కొంత చర్చింపబడినవి. దాని నుండి యనేకాంశములు మనము గమనింపవలసిన వున్నవి.
హిందూస్థానమందు ప్రతి రాష్ట్రములో విద్యా పరిస్థితులు దిన దినమభివృద్ధి చెందుచున్నవి. మన రాష్ట్రమందు కూడ నభివృద్ధియైనదనియు నివేదికా సంవత్సరములో 97 పాఠశాలలును, 14 వేల విద్యార్థుల సంఖ్యయు వృద్ధియయ్యెనని తెలుపుచు ప్లేగు కరువు వంటి కాలములో కూడ నింతవృద్ధియగుట చాల సంతోషమని నుండివినారు. కాని యధార్ద పరిస్థితులెట్టివో యించుక విమర్శింతము. మన సర్కారు వారు ఈ 1335 లో విద్యపై సుమారు 74 లక్షలు వ్యయపరచినారు అనగా మొత్తము ఆదాయములో సుమారు పదవ భాగము (నూటికి 10 వంతున) ఖర్చు అయ్యెను సాధారణముగా నిట్టి వ్యయము మరి యే రాష్ట్రమువారును జేయరని అందురు కాని యింత స్వదేశ సంస్థానములను బోల్చిచూచిన యీ యభిప్రాయమును సవరించుకొనవలసివచ్చును మైసూరు రాజ్యము వారు 61 లక్షల రూపాయలు (కల్దారు) కర్చు పెట్టుచున్నారు. అనగా ప్రతి మనుష్యునిపై వారు 1-0-8 ప్రకారము ఖర్చు చేయుచున్నారు మన రాష్ట్రములో 0-8-0 (ఎనిమిది అణాలు) మాత్రమే ప్రతి వానిపై వ్యయము చేయుదురు మరియు తిరువాన్కూరు సంస్థానములో 42 లక్షల రూపాయీలు విద్యకై వినియోగించి యున్నారు. అనగా సర్కారీ వసూలలో నూటికి 18 ప్రకారము వ్యయ పఱచినారు దీని వలన మన రాష్ట్రములో విద్యపై యింకను వ్యయ పఱచిన నష్టము లేదని విశదమగును. ఇంక విద్యావంతుల సంఖ్యలను గూర్చి కొంత చర్చింతము మన రాష్ట్రములో మొత్తముపై 4098 పాఠశాలలును 2 లక్షల 58 వేల విద్యార్థులును నున్నారని తెలుపబడినది. అనగా మొత్తముపై విద్యార్ధుల సంఖ్య 14 వేలు హెచ్చెనుగాని ఖాన్గీ పాఠశాలల వ్యవస్థ మాత్రము గమనింపదగి యున్నది. ఈ 1335 లోని తీరు నెలలోనే ఖాన్గీ పాఠశాలల చట్టము బయలు దేరెను. కావున దాని ఫలిత మేమన -
1334 ఫసలీలో | పాఠశాలలు | విద్యార్ధులు |
- | 4053 | 76654 ఉండిరి |
1335 ఫసలీలో | 1255 | 29626 ఉండిరి |
దీనిపై విమర్శన యవసరము లేదు. ఏది యెట్లున్నను మొత్తముపై మన విద్యా పరిస్థితులితర సంస్థానముల కన్న చాల వెనుకబడి యున్నవని సర్కారువారే యొప్పుకొనియుండిరి గత సంవత్సరము హైద్రాబాదు విద్యా మహాసభలో తమ యధ్యక్షోపన్యాసములో నవాబు జుల్ఘదర్‌జంగు బహాద్దరు గారు యిచ్చటను విద్యా ప్రాముఖ్యత నొప్పికొని శోకించి యుండిరి బరోడాలో నూటికి 14 గరు విద్యావంతులై యుండ మన రాష్ట్రములో నూటికి ముగ్గురు కూడ విద్యావంతులు లేరు. ఇక తిరువాన్కూరు స్థితి యెట్టిదో చూడుడు. అది మన రాష్ట్రములో పదియవ భాగము కన్న చిన్నది అచ్చట 583 పాఠశాలలున్నవి. సుమారు 53 లక్షల విద్యార్ధులున్నారు మన రాష్ట్రములో 15 చదరపు మైళ్ల కొక పాఠశాల యున్నది తిరువాన్కూరులో ప్రతి 25 మైలుకొక పాఠశాల యున్నది. లేక యిట్లు లెక్కించి చూడుడు తిరువాన్కూరులో ప్రతి వేయి మందికొక పాఠశాల యున్నది ఇచ్చట ప్రతి 3400 మందికొక పాఠశాల యున్నది. మైసూరు రాష్ట్రములో మొత్తము 8212 పాఠశాలలున్నవి 3 లక్షల 20 వేల విద్యార్థులిందు చదువుచున్నారు మైసూరు సహితము మన రాష్ట్రములో మూడవ భాగమున్నది. (29 వేల చదరపు మైళ్ల వైశాల్యము) మరియు దాని జనసంఖ్య సుమారు 60 లక్షలు కావున అచ్చట ప్రతి 750 మందికొక పాఠశాల యున్నది. అనగా పాఠశాల సంఖ్యలో తిరువాన్కూరు కన్నను మేలుగా నున్నది.
ఇట్లు మన రాష్ట్రముపై రాష్ట్రములతోపాటుగా ఖర్చు పెట్టనున్నను, నవే కేతర స్వదేశ సంస్థానములకన్న విశేషముగా వ్యయము చేయుచున్నను విద్యావంతుల సంఖ్య యేల హెచ్చుటలేదు ద్రవ్యమును సరియైన వితరణతో వ్యయము చేయుట లేదని దీనివలన విశదమగు చున్నది. హైద్రాబాదు రాష్ట్రములో ఐదేకళాశాలలున్నవి. దీనిలో నొకటి స్త్రీల కళాశాల, ఈ స్త్రీల కళాశాలలో 3 గురు విద్యార్ధినులు చదువు చున్నారు ఈ ఐదింటిపై 5 లక్షలు ఖర్చు పెట్టినారు. ఇందు చదువు విద్యార్థుల సంఖ్య 1000 వీరిపై యింతమొత్తము వ్యయమగు చున్నది. అనగా ప్రతి విద్యార్ధిపై 459 రూపాయలు ఖర్చగుచున్నది. కాని హైస్కూలులోని ప్రతి విద్యార్థిపై 11-6-2 మాత్రమే ఖర్చగుచున్నది అనగా ఒక కళాశాల విద్యార్థిని చదివించు ఖర్చులో 40 ప్రైమరీ విద్యార్ధులను చదివించ వచ్చును. ఇట్లు చూపించుటవలన ఉత్తమ విద్య (Higher education) కూడదని మా యభిప్రాయముకాదు దానితో పాటుగా ఖాన్గీ పాఠశాలలపై కోపగించుకొనునట్లు కాక ప్రైమరీ పారశాలలపై యెక్కుడు శ్రద్ధవహించి విద్యావ్యాపకము చేయవలెనని మేము హెచ్చరించుచున్నాము
ఈ రాష్ట్రములో వెలువడినట్లుగా స్త్రీవిద్య మరి ఎచ్చటను వెలువడియుండ లేదు. ఈ నివేదిక కాలమున చదువుచుండిన బాలికల సంఖ్య 34 వేలు మాత్రమే స్త్రీ విద్యను వృద్ధి పరచిననే కాని రాష్ట్రములో విద్యాపరిస్థితులు చక్కబడవు. ఇట్లుచేయవలయుననిన రాష్ట్రీయ భాషలగు తెనుగు, మరాఠీ, కన్నడములలోనే స్త్రీలకు బోధచేయవలెను ఇప్పుడు నగరమందుండు పాఠశాలలో సహితము బాలికలకు తమ తమ మాతృభాషలో విద్యనేర్చు, సరియైన నేర్పాటులు లేనప్పుడు జిల్లాలలో నెవరడుగుదురు ఎంతవరకు రాష్ట్రీయ భాషలకు ప్రాధాన్య మొసగరో యంతవరకు విద్యావంతుల సంఖ్య యిట్లే యుండును
ఈ సందర్భమున ప్రజలకు గూడా తమ కర్తవ్యమును సూచింపవలసి యున్నది రైతుల నుండి ప్రతి గ్రామమందును తమ పన్నులతో బాటుగా లోకల్పండు పన్ను అని రూపాయికి 1 అణా చొప్పున వసూలు చేయుదురు ఆ యణాలో 3 పైసాలు (నాల్గవ భాగము) విద్యకని సర్కారు వారు ఏర్పాటు చేసి యున్నారు ఈ ద్రవ్యమును ప్రతి గ్రామమందును సంపూర్ణముగా వినియోగించునట్లు రైతులు చూచుకొనవలయును
అడుగనిది అమ్మయైన పెట్టదు సర్కారు వారు తమ ప్రజలు వృద్ధికి రావలెననియే నిరంతరము తాము పాటుపడుచున్నామని చెప్పుచుందురు. అట్టిచో మన యభివృద్ధికి కారాణములగు విషయములందు మనమేల సర్కారు వారిదృష్టిని ప్రసరింప జేయకూడదు?
మన విద్యావిధానము
25 - 4 - 1928
గత సంచికలో నిజాం రాష్ట్రపు విద్యాశాఖగూర్చి కొన్ని యంశములను దెలిపియుంటిమి రాష్ట్రపు విద్యాలయముల సంఖ్యయు విద్యార్థుల మొత్తమును, ఈ శాఖకై హెచ్చింపబడుచున్న ధనము గూర్చియు, దెలిపియున్నాము. ఇక మన విద్యాపద్ధతి గూర్చి యించుక దెలుపవలసి యున్నది.
ఏ భాషలో విద్యగరుప వలెను? ఈ సమస్య విద్యా విధానములో మిక్కిలి ప్రాముఖ్యమైనది బ్రిటిషు ఇండియాలో ప్రతి కళాశాలలోను ఇంగ్లీషులోనే బోధనా విషయములన్నియు గరపుచున్నారు మూడవ తరగతిలో ఇంగ్లీషు ప్రారంభించి, బాలుడు పై తరగతులకు బోవుకొలది నీ భాషకు ప్రాముఖ్యత హెచ్చిపోవుచున్నది ఈ పద్ధతి మూలమున విద్యాలయములలో గరుపబడు విద్య నిస్సారమై, తేజోహీనమై, విద్యార్థుల ప్రతిభాశక్తిని అభివృద్ధి పరచుటకు బదులు, మొద్దువారిన మెదడు గలవారినిగా జేయుచున్నది. ఈ లోపమును పరిగణించి, నేడు వివిధ ప్రాంతములందు దేశభాషలోనే విద్య గరపుటకు యత్నములు జరుగుచున్నవి. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనము గూడ నీ సూత్రముపైననే యాధారపడి యున్నది.
మన రాష్ట్రపు విద్యా విధానములో కూడ ఏదేశ భాషయగు ఇంగ్లీషు భాషకు అసమంజమగు ప్రాముఖ్యత నొసగి, ప్రజలలో విజ్ఞాన వ్యా ప్తి సరికట్ట కూడదనెడి భావముతో ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపింపబడియున్నది. దేశభాషలో గరపబడు విద్యయే సులభముగను సువ్యక్తముగను బాలుర మనస్సు కెక్కుననెడి కారణమే ఈ విద్యాలయముకు కాధారము సూత్రము సర్వజనాంగీకృతమే. కాని నేటి విశ్వవిద్యాలయములో ప్రధానస్థాన మాక్రమించుచున్న ఉర్దూభాష దేశభాషయా? రాష్ట్రములోని ఒక కోటి 25 లక్షల ప్రజలలో ఉర్దూ మాట్లాడువారు 13 లక్షలమంది మాత్రమే అట్టిచో ఉర్దూభాషకు ప్రాముఖ్య మేల?
ఈ రాష్ట్రమున 1921 వ సంవత్సరపు జనవరి గణనము వలన వేయింటికి,
తెలుగు మాట్లాడువారు - 482
మహారాష్ట్రము మాట్లాడువారు - 264
కన్నడము మాట్లాడువారు - 123
ఉర్దూ మాట్లాడువారు - 104
గలరని దెలియుచున్నది ఇట్టితరి ఉర్దూ భాషకు మన విద్యా విధానమున ప్రధమ స్థానమేల యియ్యవలెను? ఇది దేశభాషలో విద్య గరపవలెననెడి సూత్రమునకు విరుద్ధము గాదా ?
ఉన్నత విధ్యయేకాక, మాధ్యమిక విద్యకూడ విద్యార్ధి మాతృభాషలో కాక విదేశ భాషయు ఇంగ్లీషులోనో, లేక పరభాషయగు ఉర్దూలోనో వివిధ విషయములను బోధించుచున్నారు. ప్రాధమిక ప్రారశాలలో మాతృభాషలోనే పాఠములు చెప్పవలెనని ప్రభుత్వమువారి విద్యా ప్రణాళికలో నున్నను, మొత్తము మీద ఇటుల జరుగుట లేదు.
మన రాష్ట్రములో విద్యా వ్యాప్తి చీమ నడకతో సాగుచుండుటకీ పద్ధతియే చాలవరకు కారణమని మా అభిప్రాయము మన తాతలనాటి వీధి బడులలో వ్రాయుట, చదువుట, గణితము, మాతృభాషలోనే బోధింపబడుచుండెను. దీని మూలమున విద్యార్ధులకు సులభముగ నలవడుచుండెను ఈ దృఢమగు పునాదిమీద, జాతీయ భాషలో, జాతీయ పద్ధతుల ననుసరించి గట్టబడిన విజ్ఞాన మందిరము సర్వాంగ సౌష్టవము గలిగి, శక్తివంతమై కలకాలము నిలుచుచుండెను కాని నేటి విద్యావిధానమిందుకు విరుద్ధమైయున్నది బాల్యమున ప్రతివానికిని విజ్ఞాన తృష్ణ ప్రబలముగ నుండును బాలురకు ప్రకృతిలోని ప్రతి చిన్న వస్తువును, వారికి ఆశ్చర్యము గొలుపును, చీమ మొదలుకొని ఏనుగువరకు, ఇసుక రేణువు మొదలుకొని మహోన్నత పర్వతమువరకును వారికి ఆనందదాయకములే. కట్టెపుల్ల మొదలుకొని సూర్యచంద్ర గ్రహములవరకును వారికి ఆట వస్తువులే. విశ్వమంతయు వారికి లీలారంగమే అందుచే వారు ప్రతివస్తువు గూర్చియు ఇదియేమి ? ఎందుకిటులున్నది? ఎటుల పుట్టినది? తుదకేమియగును ? మున్నగు ప్రశ్నలు కుతూహలముతో వేయుచుందురు వారికా విషయములను సులభముగ గ్రాహ్యమగు నటుల తేట మాటలతో, మాతృభాషలో బోధించుట యత్యుత్తరమగు విద్యావిధానము ఇట్లు గరపిన విద్య, బాలురకానంద దాయకముగ నుండుటయేకాక, వారి కోమల మేధస్సునకెట్టి కష్టములేకయే. వారి యందిముడును. కాని నేడిటులు గాక బడికి పోవుచున్న ఆరేండ్ల పసి బాలుడు తిన్నగ గీతయే గీయజాలని కాలమున అర్థహీనమును, ఉత్సాహ భంగములును నగు ఓన మాలును, ఏ బీ సీ, లను, అలీబ్బేలను నేర్చుకొనుటకు గాను తల బ్రద్దలు కొట్టుకొనవలసి వచ్చుచున్నది మాతృభాషలోని అక్షరములను నేర్చుటే చాలు దీనికి తోడుగ నోరు తిరుగని వింత శబ్దములు గల కొంకిరి గీతలను నేర్చుకొనుట బాలునికింకెంత దుర్భరముగ నుండునో వేరుగ జెప్ప నక్కరలేదు. ఇట్టి పరిస్థితులలో బాలుడు బడి దొంగయైనచో నొక వింతయా ?
ఇంతేకాదు, ఐదవ యేట బాలుడు పాఠశాల ప్రవేశించి 16 వ యేట మెట్రికు ముగించెనను కొందము. ఈ 11 సంవత్సరములలో కనీసము 7 సంవత్సరములు, ఒక కొత్త భాషనేర్చుటతోడనే పూర్తియగుచున్న వనవచ్చును. ఈ కాలమునే విజ్ఞాన ప్రాప్తికి వినియోగించియున్నచో, బాలుడెంతయు ప్రజ్ఞావంతుడై యుండును. కాబట్టి ఉర్దూ మాతృభాష కాని వారికి నేటి విద్యా విధానము వలన ఎన్నదగిన లాభమేమియు గలుగుటలేదు ఇంగ్లీషు భాష నేర్చుకొనుట కుక్కిరి బిక్కిరి యగుచున్న వారిపై ఉర్దూ బండ నొకదానిని వేయుటయే దీని ఫలితము ఉన్నత విద్యా విధానములో కాకున్నను, ప్రాధమిక మాధ్యమిక విద్యాలయములలో మాత్రమీ విధాన మంతరింపవలెను
ఆంధ్ర సభలు
12 - 5 - 1928
సూర్యాపేటలో జరుగుచున్న సభలలో ముఖ్యమైనదేది ? రాష్ట్రపు ఆంధ్ర జనులందఱికి యుత్సాహమునకు గురియైనదేది ? కేంద్రసంఘ వార్షికోత్సవము ఆ సంఘము వారికి సంబంధించినదే. గ్రంథాలయ మహాసభ కొంతవఱకు ఆంధ్రులలో పిన్న పెద్ద లందఱికి సంబంధించినదే యైనను, ఒక విధమున కేవలము గ్రంధాలయోద్యమ ప్రచారకులకును గ్రంధాలయ ప్రతినిధులకును సంబంధించినదే యన జెల్లును. వర్తకసంఘ వార్షికోత్సవపు కార్యక్రమమున ఆ సంఘ సభ్యులే పాల్గొనగలరు. ఆంధ్రలోక మంతటికిని, ప్రతి సంఘమునకును సంబంధించినది మహిళా మహాసభయే కాని యిందు పురుషులు పాల్గొనజాలరు ఇట్టి తఱి రాష్ట్రీయాంధ్రు లందఱికిని శ్రద్ధాభక్తులకును గురియయిన సభ యొకటి యత్యవసరమని వేరుగ జెప్పనక్కర లేదుకదా! ఏ జాతివాడైనను, ఏయుద్యమమునకు సంబంధించినవాడైనను విద్యార్ధియైనను, ఉద్యోగియైనను, యువకుడైనను వృద్ధుడైనను ఉత్సాహావేశములతో బాల్గొని, దానంగలుగు శుభఫలముల ననుభవింపగలుగు సభయొకటి యవసరము అట్టి సభలోనే మన రాష్ట్రపు ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధి గూర్చి చర్చింపవచ్చును
సంఘసంస్కార సభ మన రెండవ యవసరము. బ్రిటిషు ఇండియాలోని ఆంధ్ర సంఘమున జరుగుచున్న సంస్కారములోని శతాంశమైనను మన రాష్ట్రమున జరుగుటలేదు బాల్యవివాహములు, నిర్బంధవైధవ్యము, పడుపువృత్తి మున్నగు దురాచారములు పూర్తిగ రూపుమాయనప్పటికిని, ఈ యాచారముల హైన్యత, దుష్ఫలితములు, ప్రజలెల్లరు గ్రహించుచున్నారు వారి భావవైఖరి మారినది శ్రీవిద్య యత్యావశ్యమని యెల్లరు సమ్మతించుకున్నారు స్త్రీల దాస్య శృంఖములను ఎగురగొట్టవలెనని అందరు అంగీకరించు చున్నారు ప్రత్యేకాంశముల విషయమున యభిప్రాయ భేదములున్నప్పటికిని, ముఖ్యమగుపై సూత్రముల విషయమున సాంఘికులందరేకాభిప్రాయులై యున్నారు. కాని రాష్ట్రవాసులలో నిట్టి మనోసంస్కార మింకను జరుగలేదు. రాష్ట్రపు సంస్కార మహాసభ యొకటి యున్నను దాని కార్యక్రమ మంతయు హిందీలోనో, మహారాష్ట్రముననో జరుగుచుండుటచే దాని గూర్చి యాంధ్రులలో నుత్సాహము ప్రబలుటలేదు ఆ సభా తీర్మానములు పామర జనులకు తెలియుట లేదు అందుచే ఆంధ్రజన ప్రజాభిప్రాయ మొకటి (Public opinion) కలుగుట లేదు దీనివలన సంస్కార సూత్రము లామోదించువారు సహితము, తదనుగుణముగ ప్రవర్తించుటలేదు. అందుచే రాష్ట్రీయాంధ్రులలో సంస్కార సూత్రములను వెదజల్లుటకొక సంస్కార సభ యవసరము అందు జరిగెడు తీర్మానములు ఆంధ్ర లోకమంతటికిని వెల్లడియగును. ఆ తీర్మానములకు ప్రజాభిప్రాయ ప్రోద్బలముండును గానవాని నమలు జరుపు యాంధ్రు లందరికిని తప్పనిసరి యగును
మూడవది ఆంధ్ర యువక మహాసభ ఆంధ్రుల భావ్యోన్నతి వీరి పైననే యాధారపడి యున్నది. నేటి యువకులే రేపటి పౌరులు. సంఘ దురాచారముల నడుగంట వలెనన్నను, వాఙ్మయము నవీన కళలతో శోభించవలెనన్నను, ఆంధ్రజాతి శక్తిమంతమై, సారవంతమై, ఆత్మవిశ్వాసము, స్వాతంత్ర్య దీక్ష, దేశభక్తిగలిగి పేరు గాంచవలెనన్న యువకులే నడుముగట్టి కార్యరంగమున కురకవలెను ఈ బాధ్యతను తెలిసికొనుటకును, సాధనములలు యుటకుగాను, రాష్ట్రీయాంధ్ర యువకుల సభ యొకటి గావలసి యున్నది
ఈ సభలను వైభవముతో జరుపుటకు సమయము చాలినంత లేదు అయినను నిరుత్సాహపడక పట్టుదలతో పని జేసినచో సభలు విజయవంతముగ మాత్రము జరుగకపోవు హైద్రాబాదు యువకమండలి వారివిషయమై ప్రబల యత్నములను సలుపుచునేయున్నారు. సూర్యాపేటాహ్వాన సంఘమువారు శ్రద్దవహించిన చాలును మండలి సహాకారముగాని, శక్తివంచనలేక కృషి సల్పినచో తప్పక జయము చేకూరును ఈ సభలవలన రాష్ట్రీయాంధ్రులలో నొక నూతన చైతన్యము గలుగునని మా దృడనమ్మకము కాబట్టి ఆహ్వానసంఘమువారు సంశయములను వెనుకకు ద్రోసి, వెంటనే కార్యసాధనమునకు పూనుకొందురని హెచ్చరించుచున్నాము.
కీర్తిశేషులైన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు
20 - 6 - 1928
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి అకాల మరణముచేత ఆంధ్రదేశము అత్యుత్తముండును, స్వార్థత్యాగియు, సాటిలేని ప్రజ్ఞావంతుడును నగు నొక సత్పుత్రుని గోలుపోయినదనుట నిర్వివాదాంశము. వీరు హిందూ దేశమందును, ఆంగ్లదేశమందును, ఉత్తమ విద్య నభ్యసించి, ఆంగ్ల విశ్వవిద్యాలయములో గొప్పదగు పట్టమును బొంది, మాతృదేశమునకు వచ్చి తమ ప్రజ్ఞా విశేషమును మొదటి బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాల యొక్క సేవయందును, తరువాత భారత దేశోభ్యుదయమున కత్యంతావసరముగ నుండిన ఆ సహాయోద్యమునందును ఉపయోగించిరి. గాంధీ మహాత్మునిచే ప్రతిపాదింపబడిన పవిత్రోద్యమము, హిందూదేశమును కాశ్మీరము నుండి కన్యాకుమారి వరకును, సింధు ప్రాంతము నుండి బర్మా వరకును ఉత్సాహముతో ఉఱ్ఱూత లూపుచుండిన ఆ దినములలో - ఎంతటి పిరికివానినైనను శాంతునిగను ఎంతటి మితభాషినైనను వక్తగను, ఎంతటి తీవ్ర స్వభావము కలవానినైనను శాంతునిగను మార్చిన ఆ దినములలో- ఆంధ్ర దేశమున మన ఆంధ్ర రత్నము ప్రదర్శించిన సామర్ధ్యము అనన్య సామాన్యమని వక్కాణించగలము మన ఆంధ్రరత్నము మూలముననే కదా చీరాల పేరాలలోని ప్రజలు రవి యస్తమింపని సామ్రాజ్యము వశమునగల ఆంగ్ల ప్రభుత్వమును కొంతవరకు భయ విస్మయాకుల చిత్తముగా నొనర్చి, అసహాయోద్యమ చరిత్రమున ఆ జరామరమగు నొక యధ్యాయమును కల్పించినది 31 మార్చి 1921 నాడు అఖిల భారత జాతీయ సభోప సంఘము బెజవాడయందు సమావేశమై, భారతవర్షము నుద్ధరింప కంకణబద్ధులైన మహానాయకుల యెదుటను, లక్షకు మించి కూడిన ఆంధ్ర ప్రజాసమ్ముఖమునను, దేశ బంధు చిత్తరంజనుదాసు, "చీరాలకు నేటి దినము గవర్నరు లార్డు పెంట్లండా? కాడు కాడు! దుగ్గిరాల గోపాలకృష్ణయ్యయే"యని ఉచ్చెస్వసనమున చేసిన ప్రకటనము, అచ్చటినుండి ఆ యానందమును కొంత యనుభవించిన వారికిప్పటికిని తలచుకొనినప్పుడు చెవులందు ప్రతిధ్వనించుచున్నది! ఇట్టి నాయక వర్యుడు ఇంకను చేయవలసిన కార్యము ఎంతయో యుండ యశః కాయుడగుట భారత వర్షీయులను, అందు ముఖ్యముగా ఏ ప్రాంతమందున్న వారైనను సరే ఆంధ్రులందరును దుఃఖ సముద్రమున ముంచుననుట నిక్కము. పరమేశ్వరుడే ఆంధ్ర సోదరుని యాత్మకు శాంతిని, వారి కుటుంబమునకు ధైర్యమును ప్రసాదించుగాక ! ఆంధ్ర దేశమున నిట్టి స్వార్ధత్యాగులు పెక్కుమంది జనించి భారత వర్షాభ్యుదయమునకై ప్రయత్నింతురు గాక!
సంస్థానాధీశులు
10 - 10 - 1928
బట్లరు కమిటి నియామకము వలన స్వదేశ సంస్థానాధీశులలో అలజడి కలిగినది. వారు తమ నిరంకుశ పరిపాలనము నిలుపుకొనుటకై తీవ్రముగా ప్రయత్నించుచున్నారు లండను నగరముననున్న సంస్థానాధీశులకు న్యాయవాద ప్రముఖులు తోడ్పడుచున్నారు బ్రిటిషు పత్రికలు, ఆంగ్లో హైందవ పత్రికలు, వారి ఆశయములను బలపరచుచున్నవి ఈ పత్రికల యుద్దేశము భారతీయుల స్వతంత్ర్యోద్యమమున కడ్డు దగులుటయే కదా! వీరి ప్రధాన న్యాయవాదులగు సర్ లెస్లీ స్కాంటుగారి యభిప్రాయము లెట్టివో ప్రపంచమునకు తెలసినవి. వారి ఆలోచనానుసారము మన సంస్థానాధీశులకు మెలంగుచు హిందు స్థానమునకు కళంక మాపాదించుటకై పూనుకొనుచున్నారు
బట్లరు కమిటీ వారి నెల 15 వ తేది విచారణ ప్రారంభించెదరు సంస్థానాధీశులు తమ కోర్కెలు న్యాయవాదుల ద్వారా తెలిపెదరు అయినను కమిటీవారు సంస్థానములందలి ప్రజల యొక్క అభిప్రాయమును వినుటకై నిరాకరించుట శోచనీయము ఇటులగుచో వీరి మొఱ లాలపించు వారెవరు? వీరి యిబ్బందులు తీర్చువారెవరు? కొందఱు సంస్థానాధీశులు తమ ప్రజలను తీరని యిక్కట్టులు కలిగించుచున్నారు కొన్ని చోట్ల పన్నుల భారమధికముగానున్నది. స్వదేశ సంస్థానములయందు విద్యాభివృద్ధి లేదు వాక్స్వాతంత్ర్యము ముద్రణ స్వాతంత్ర్యము లేదు. ఇట్టి విషమ పరిస్థితులు సంస్థానములందున్న బట్లరు కమిటీవారు జోక్యము కలిగించుకొనకుండుటేలనో తెలియకున్నది
నెహ్రూ సంఘము వారు సంస్థానముల సమస్య అనుకూలముగా నిర్ణయించిరి. దాని వలన సంస్థానాధీశులకే పెక్కు లాభములు కాగలవు కాని సంస్థానములందలి ప్రజలకు గాదు. అయినను వారు భారత ప్రభుత్వమునకు లొంగియుండుట తమకవమానకరమని భావించుచున్నారు. సర్ లెస్లీస్కాటు మున్నగు వారు తమ కోర్కెలు ఫలింపజేయుదురని ఆశించుచున్నారు అట్టి యెడ స్వదేశీయుల ఆలోచన వారికెటుల గిట్టును? లెస్లిస్కాటు మున్నగు వారు తమ దేశమునకనుకూలించు విధానమునే జొప్పించుటకు ప్రయత్నించెదరు కాని, భారతీయుల మేలుకై వారేల పాటుపడెదరు? బ్రిటిషు సైన్యములు సంస్థానములను రక్షించుటకవసరమని ఆంగ్లేయ పత్రికలు వ్రాయుచుండుట లేదా?
ఒక విషయము మాత్రము జ్ఞప్తియందుంచుకొన వలయును. పూర్వము స్వదేశ ప్రభువుల మూలముననే భారత జాతి దాస్య శృంఖములలో బడినది. ఇపుడు శృంఖములను ద్రెంపుటకై కృషి సలుపుచుండ మఱల సంస్థానాధీశులే అడ్డు తగులుచున్నారు. భారతీయులు వీరి దృక్పధమును కీర్తింపజాలరు. స్వదేశీయుల గౌరవము వలననే వీరి కీర్తి యినుమడించును గాని పాశ్చాత్యులకు దాసులగుటచే కాదు. అయినను పెక్కు సంవత్సరముల నుండి వేరొక జాతికి లోబడి యున్నవారికి స్వతంత్ర భావములెట్లు కలుగును ?
ఆంధ్ర సభలు
24 - 11 - 1928
నవంబరు నెల 17, 18 తేదులలో నంద్యాలయందు ఆంధ్ర మహా సభ ఆంధ్ర రాష్ట్రీయ సభ గోరక్షణ సభ సమర్థులగు అధ్యక్షుల యాజమాన్యమున జయప్రదముగ జరిగినవి ఇదివరలో మేము సూచించిన రీతిగా ఆంధ్రమహా సభాధ్యక్షులగు ఆచార్య రాధాకృష్ణయ్య గారు ఆంధ్రులలో యుత్సాహమునకు తోడు కార్యదీక్ష యవసరమని నుడివిరి ఎన్నియో విద్యా సంస్థలు, ఉద్యమములు కార్యదీక్ష, లేనందున సన్నగిల్లినవి కనుక నీవిషయము గమనించుట ముఖ్యాతి ముఖ్యము
ఈ సంవత్సర మేలకో ఆంధ్ర మహాసభవారు నిజాం రాష్ట్రాంధ్రులపై తమ దృష్టిని ప్రసరింపజేసిరి రాజకీయ రాహిత్యసభలు సమావేశ పరచుటకు ప్రభుత్వాజ్ఞ అనవసరమనియు, నిజాం ప్రభుత్వము వారు ఇదివరకున్న అంక్ష తొలగించ వలయుననియు తీర్మానము గావించిరి ఇదియెంతయు ప్రశంసనీయము అయినను అఖిలాంధ్ర దేశము గూర్చి ఇంకను శ్రద్ధవహించుట లేదు. స్థాయి సంఘము వారు తగు రీతి పని జేయుటలేదు
రాష్ట్రీయ సభయందు నెహ్రూ నివేదిక అంగీకరింపబడుట శుభప్రదము. కాంగ్రెసు ఆదర్శము మార్చుటకై తీర్మానము తేబడెను. కాని అధ్యక్షులు క్రమ విరుద్ధమని త్రోసివేసిరి సైమను సంఘమును బహిస్కరించుటకై నిశ్చయింప బడెను ఇక తీర్మానముల ఆచరణకై నాయకులు కృషి సలిపెదరని నమ్మెదము. ఇది వాద వివాదములకు సమయము కాదు. లాలాజీవలె నిరంతరము నాయకులు కార్యాచరణయందే నిమగ్నులై యుండవలయును అది నివేశ స్వాతంత్ర్యమా? సంపూర్ణ స్వాతంత్ర్యమా యను చర్చ ఇక ముందుండదని తలంచెదము. ఆంధ్రులు తమ కర్తవ్యము నిర్వహించెదరు గాక !
ఆంధ్ర విశ్వ విద్యాలయము
5 - 12 - 1928
ఈ విశ్వ విద్యాలయము యొక్క అకెడెమిక్ కౌన్సిలు వారు ఆంధ్రభాష మూలక విద్యను నిరాకరించిరి భారతదేశ మంతటను దేశభాషలో విద్య గఱపవలయునని తీర్మానించుచుండ వీరిట్లు తీర్మానించుట శోచనీయము. ఇక ఆంధ్ర విశ్వ విద్యాలయ అవసరమేమి కలదో మాకు తెలియకున్నది. మద్రాసు విశ్వవిద్యాలయము వలన విద్యా ప్రచారము జరుగలేదా? ఉద్యోగులను తయారుచేయు విశ్వవిద్యాలయములను నెలకొల్పి ప్రజలధనము వృధాపరుచుట యేల? ఇంతవఱకును కేంద్ర స్థల నిర్ణయము జరుగలేదు ఇప్పుడు భాష నిర్ణయము జరిగినది ప్రత్యేక లక్షణములతో నెలకొల్పబడునని చెప్పుచుండిన వైసు చాన్సెలరు లగు కట్టమంచి రామలింగారెడ్డిగారేమి చేయుచున్నారో వారికే తెలియును.
నిజాం రాష్ట్ర గ్రంథాలయములు
23 - 1 - 1929
కొంత కాలము క్రింద రహెబరె దక్కన్ సంపాదకులు నిజాం రాష్ట్రములోని గ్రంథాలయములపై రాజద్రోహపు స్థలములని ఘోరమగు నిందను ఘోరతరమగునట్టి యుద్ధముచే మోపియుండిరి. కేంద్ర సంఘ కార్యదర్శిగారు వారికి నేరము నిరూపింపుమని జవాబు వ్రాయగా జవాబులేదు మరియు పండిత కేశవరావుగారు కూడ రహెబరె దక్కన్‌కు జాబు వ్రాసి యే కారణముతో నట్లు వ్రాసిరో తెలుపుమనగా నా జాబునే ప్రకటింపక పోయిరి ఇట్టి చర్యకలవారు జవాబేమియ్యగలరు. ఈ రెంటిని బట్టి వీరు శుద్ధాబద్ధమును బల్కినారని తేలినది కాని అంతటితో గ్రంథాలయముల కర్తవ్యము తీరలేదు ప్రతి గ్రంథాలయ సభ్యులును సమావేశమై యీ రహెబరు యొక్క రోత వ్రాతలను ఖండించి తీర్మానములు చేసి మాకును ఆ పత్రికకు కేంద్ర సంఘ కార్యదర్శిగారికిని నితర పత్రికలకును పంపుదురు గాక! చేయమని మేమప్పుడే సూచించి యుంటిమి కాని యేలనో యింకను నెవ్వరును నట్లు చేయలేదు. ఇట్టి నిందారోపణమును జేయు పత్రికను నందరు నిరసింతురుగాక!
సావర్కర్ ప్రవాసము
16 - 2 - 1929
బెజవాడ దుర్గా విలాసమునందు సమావేశమైన ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు సంఘ సభవారు సావర్కర్‌గారి ప్రవాస కాలమును మరింత కాలము హెచ్చించి నందులకు ప్రభుత్వము వారి చర్యను ఖండించుచు నొక తీర్మానమును గావించిరి సావర్కర్ యువకుల నాయకుడు దేశమునకై పాటుబడిన యోధుడు నేటికిని ప్రభుత్వపు దారియందు తగుల్కొని శల్యావశిష్టుడైయున్న వీరుడు ఇక వారి విడుదలకై తీర్మానములు గావించిన లాభములేదు. యువకులగు వారు సక్రమ యాందోళన జరిపి సావర్కర్‌ను తిరిగి తమ యందొకనిగా కలుపు కొనవలయును. అప్పుడే మనయొక కార్యమును సాధించిన వార మగుదుము.
ఫాదిరిల దౌర్జన్యము
23 - 3 - 1929
నిజామాబాదు జిల్లాలోని ఆర్మూరు తాలూకాయందు ఇబ్రాహీం పట్టణము, వేశకొండ మున్నగు గ్రామముల ప్రజలు మహాఘనత వహించిన నిజాము ప్రభుత్వము వారి ప్రభుత్వసభ (బాబెహూకూమతు) పేర పంపుకొనిన యొక సంఘ విజ్ఞప్తి మా కార్యస్థానమునకు వచ్చినందున దానిని వేరొక తావున ప్రకటించి యున్నాము
ఈ విజ్ఞప్తిలో క్రైస్తవ మత బోధకులు గ్రామస్థులను తిప్పలు బెట్టు చున్నట్టును, వారి మత కట్టుల నాచరించుట యందాటంకములు కలిగించు చున్నట్టును, స్త్రీలు నీరు తెచ్చుకొనుచుండ వారిని బుద్ధి పూర్వకముగా నంటుకొని వారి నపవిత్రపరచుచుండే నట్టును, బలవంతపెట్టి జనులవద్ద నుండి చందాలు వసూలు చేయుచుండి నట్లును ఇంకెన్నెన్ని యో అవాచ్యములగు పనులు జరుపుచున్నట్టును తెలియు చున్నది ప్రభుత్వము వారికి పంపుకొనబడిన ఈ విజ్ఞప్తియందు అబద్ధము లుండగూడదు ఇందలి యంశములను కొంత అతిశయోక్తులుగా దలచినను, యదార్థముగా నిర్ణీతమగు భాగము కూడ చాల భయంకరమును, మతసహిష్ణుతకు భిన్నమును, క్రైస్తవ మతబోధకులందు కనబడు ఉత్తమ సాత్త్విక వర్తనమునకు విరుద్ధముగను ఉన్నది విజ్ఞప్తిలో చెప్పబడిన చర్యలు ఇతర మతస్థుల వలన తరచుగా జరిగియుండుట వినుచున్నాము. కాని క్రైస్తవ మతబోధకులిట్టి పద్ధతులు తమ మత వ్యాప్తికై యవలంబించుట విని యుండలేదు. అధమ పక్షమున ఈ రాష్ట్రమున నీ సంగతులు అకృత పూర్వములు. ఇట్టి స్థితిలో నేటి కాలమున, ఇరువదవ శతాబ్దమున నిజాము రాష్ట్రములో క్రైస్తవ మత బోధకులు ఈ నవీన మార్గము నవలంబించుటకు కారణము సూక్ష్మముగా నాలోచింపదగి యున్నది. పై గ్రామముల ప్రజలు క్రింది యుద్యోగస్తుల ----- నీదౌర్జన్యముల గూర్చి మొఱపెట్టుకొనిన మీదట కొంత చర్యను పోలిన అధికారులు జరిపి తరువాత ఉపేక్షవహించిరని విజ్ఞప్తివలన తెలియుచున్నది ఇట్టి విచారణ మేమి' ఇటీవల మహాఘనత వహించిన మన ప్రభువుగారు ఒక ఫర్మాణ జారీ చేసియుండిరి దానిలో క్రింది యధికారులు గ్రామములలోని మత కక్షలలో ఏదో యొకవైపుచేరి రెండవ పక్షము వారికి అన్యాయము కలుగచేయు చున్నట్టు సూచన చేయబడినది. ఆది మహమ్మదీయ యధికారుల విషయమేమో యని తలంచితిమి. ప్రభుత్వాధికారులలో చాల మంది దాదాపుగా నందరును మహుమ్మదీయులేయగుటవలన - హిందూ మహమ్మదీయ మతముల వారికి కక్షలు వచ్చినప్పుడు అధికారులు మహుమ్మదీయుల పక్షము వహించుచు హిందూ ప్రజల కన్యాయము చేసియుండుటను మన ప్రభువుగారు ఫర్మానులో సూచించి యుందురనుట నిశ్చయము, కాని ఆర్మూరు తాలూకాలోని పైసంగతులకు అట్టికారణము కూడ కనుపడదు.
ఎట్లయిననేమి, విజ్ఞప్తిలోని వార్తలు సత్యములే యైనచో - అవి కొంతవరకైన సత్యములే యైయుండవచ్చును ప్రభుత్వాధికారులు తక్షణమే విచారించి ప్రజలకు నెమ్మది కలిగించుట యవసరము. హిందూ ప్రజలు ఈ రాష్ట్రమున సంఖ్యలో అందరిని మించినవారము, ప్రభుత్వాధికారమునందు ప్రాముఖ్యతలేని కారణముననో మరే దౌర్బల్యము వలననో, ఎప్పుడు నిస్సహాయత్వమును ప్రకటించుకొనుట సంభవించు చున్నది. ఇది చాల సంతాపకరము .
పోలీసుమంత్రి గారగు కర్నలు ట్రెంచిగారు ఆంగ్లులు. క్రైస్తవ మతస్థులు సర్వసమత్వమును కోరు స్వభావము కలవారు. ప్రభుత్వ సభలో మెంబరులు. ప్రస్తుత విజ్ఞప్తిలోని చిక్కులను తొలగించి జనులందు నమ్మకమును, నెమ్మదిని వ్యాపింపజేసి, పరమతస్థుల దుండగములను అణుగునట్లొనర్చుట వారి విధియైయున్నది తక్షణమే ప్రభుత్వమువారు తమ విధిని నెరవేర్చుదురు గాక!
హైదరాబాదు పరిశ్రమలు
27 - 4 - 1929
మన ప్రభుత్వమువారు హైద్రాబాదు పరిశ్రమల యభివృద్ధికై యొక కోటి రూపాయీలు ఇచ్చియున్నారని వినుటకు చాల సంతోషమగుచున్నది ఈ కోటి రూప్యములీ క్రింది విషయములందు వ్యయపఱచుట వారి యుద్దేశమై యున్నది
1. గృహ పరిశ్రమలకు (Cottage Industries).
2. పరిశ్రమ యంత్రముల పరిశోధనకు
3. రాష్ట్రములోని యార్థిక పారిశ్రామిక విచారణకు .
4. పరిశ్రమ పరిశోధన సహాయమునకు.
5. ఇచ్చటగాని బయటగాని యువకులు పరిశ్రమలకై యభ్యసించిన వారికి సహాయము చేయుటకు.
ఈ యుద్దేశములు నిరభ్యంతరముగా నుత్తమమైనవి ప్రతి దేశము నేటి కాలమున పరిశ్రమలపై విశేషముగా నాధారపడియున్నది మన రాష్ట్రములో నింతవరకెవ్వరు పరిశోధక పండితులుగాని, శాస్త్ర పరిశోధకులుగాని, చారిత్రక పరిశోధకులుగాని, నూతన వస్తు నిర్మాతలుగాని (Inventors) యుత్పత్తి గాకుండుట చూడ నాశ్చర్యముగా నున్నది. లేకున్న నేటేట డజనుల కొలదిగా విద్యార్థులు విదేశములకున్నత విద్యానిమిత్తమై పోయి ప్రతి సంవత్సరమును లక్షల కొలదిగా సర్కారు వారి ద్రవ్యమును తినినను లాభము లేక పరిణమించుచున్నది. నిజాము రాష్ట్రములో నేత పరిశ్రమ మున్నగు పరిశ్రమలు సర్కారు వారిచే ఏల నడుపబడును? వాణిజ్యాది శాఖ యొకటి యున్నది. కాని యింతవరకు చెప్పుకొనగలిగినంతటి ఫలితము మనకు గనుపించలేదు. ప్రస్తుతము ప్రభుత్వము వారీ కోటి రూప్యములను వ్యయము చేయ నిశ్చయించి నందున ముందు గొప్ప గొప్ప మార్పులీ పరిశ్రమ శాఖవలన రాష్ట్రమునందు గలుగునని విశ్వాసము కలదు గృహ పరిశ్రమల యభివృద్ధి మొదటి స్థానమలంకరించి యున్నది. దీనిని నిజముగా నభివృద్ధి చేయనెంచిన మహాత్మగాంధీ గారి రాట్నమును గూడ గొంత పరీక్షించి చూడవలయును. మగ్గములు అగ్గువయు, శ్రేష్ఠమైనవియు, లాభకరములైనవియు, గ్రామములకు సులభముగా నేర్చుకొనుటకు వీలుగలిగినట్టివియు, చూచి ప్రచార మందుంచవలయును.
పరిశ్రమ యంత్రముల ప్రచారము (Demonstration) రెండవ కార్యముగా ప్రభుత్వమువారు నిర్ణయించినారు నగరములలో ప్రదర్శించుకొనిన నెవరికిని లాభములేదు మరియు ప్రదర్శించు యంత్రములు విశేషముగా వ్యవసాయ సంబంధముగాను, రాష్ట్రపు పరిస్థితులనుబట్టి యీ సంబంధమైనవిగాను నుండవలయును ఈ యంత్రముల ప్రదర్శనము గ్రామములో గావలయును ప్రతి గ్రామమునకు బోయి చేయుటకు మారుగా గ్రామజనులు విశేషముగా గూడునట్టి జాతరలలో జూపింపవలయును మన రాష్ట్రములో ప్రతి జిల్లాయందును గొప్ప గొప్ప జాతరలు జరుగుచుండును. కొన్ని కొన్ని జాతరలలో వేనవేల జనులు కూడుచుందురు. అచ్చట త్రాగుడు విశేషముగా నుండుటయే కాననగును దానికి మారుగా నిట్టి ప్రదర్శనములు చూపించిన వారికెంతయో లాభకరముగా నుండును మేమెన్నియో మారులీ విషయమై వ్రాసియుంటిమిగాని చెవిటి ప్రభుత్వమునకు చెవుకెక్కుట లేదు.
నిజముగా నీ కోటి రూప్యములను సద్వినియోగము జేయవలయుననిన ప్రజలకు లాభమగు మార్గములందు దీనిని వినియోగ పరచవలయును. మొత్తము పై ప్రభుత్వమువారి యౌదార్యమును ప్రశంసించుచు వారి ద్రవ్యమును నధిక సంఖ్యాకులగు రైతులకు లాభకరమగు మార్గములలో వినియోగంతురని మరొక మారు నమ్ముచున్నాము
మా అయిదవ సంవత్సరం
7 - 5 - 1930
మా పాఠకుల యాదరము వలనను, ప్రభుత్వానుగ్రహమువలనను మేము తిన్నగా నాల్గవ సంవత్సరమును దాటించితిమి ఈ సందర్భమున మేము నివేదించుకొనదలచిన విషయములు చాలాలేవు మా నాల్గవ సంవత్సరము హిందూస్థానమందేగాక, నిజాము రాష్ట్రమందు కూడ చాల ముఖ్యమైనది. ఈ సంవత్సరమందే మహాత్మా గాంధీగారు తమ యపూర్వ యుద్ధమును ప్రారంభించిరి. సర్వ ప్రపంచ దృక్పధమును మార్చివైచు నీ యుద్యమము ప్రపంచ మందద్వితీయమై యున్నది. ఈ మహోద్యమము మూలలందుండు మా నిజాము సోదరులను గూడ కొందరి నాకర్షించినది.
ఇట్లాకవంక బ్రిటిషు హిందూ స్థానములో తిరుగుబాటు జరుగుచుండ ఉపన్యాసములిచ్చుటకుగాని, యాందోళనము చేయుటకుగాని జనులు వెనుదీయక బ్రిటిషు ప్రభుత్వమును ముప్పతిప్పల పెట్టుచుండ మన నిజాము రాష్ట్రములో మా నాల్గవ సంవత్సరకాలమందు పోలీసు గష్తీ యొకటి బయలుదేరెను దాని వలన రాజకీయసభలుగాని, రాజకీయేతరములు కాని చేయుటకు వీలులేకపోయెను సర్వప్రపంచమందు సర్వహీనస్థితియందుండిన మన విద్యార్ధికి తోడుగా నీ యవసర నిర్బంధములు మా ప్రజలపాలిట సుందరకంకణములై పొటమించినవి, బ్రిటిషు ప్రభుత్వమువారి దాతృత్వ మెంతటిదో కాని యచ్చట చిన్న చిన్న బాలురుసు, స్త్రీలును, సభా వేదికలపై యెక్కి యిష్టము వచ్చినట్లు వాగుచుండ వారిజోలికి పోయిన పాపమునకు పోకపోయిరి కాని మా రాష్ట్రములో రాజకీయములననేమియో తెలియని యమాయక ప్రజలు కేవల విద్య సంబంధపు సభల చేసికొందుమనిన వానికై నెలలకొలది కార్యభారములు జరిపి.............వారినిగరానీలో సభలు............. వచ్చుచున్నవి. ............. వంక వాగ్బంధన విధానము ...............వృద్ధి నొందుచుండ నింకొ............పత్రికా ధ్వంసకము ప్రారంభమయ్యెను. సుమారు మూడు సంవత్సరములనుండి రైతుల పక్షముననే తన కలము నుపయోగించిన రయ్యతు పత్రికనోట నీరుపోయు వారైనను లేక దిక్కులేని చావు చచ్చెను పాపము 9 వారములైన సరిగా ప్రపంచ వెలుతురు చూడని (న్యూయీరా) పత్రిక పురిటిలోనే గంతుకొట్టెను ఇంక మా గోలకొండ, రహబరె దక్కన్, సుబెదక్కన్, పత్రికకు మందలింపుచే భీతి కలిగెను. మన రాష్ట్రములో పదియవ భాగమైన తిరువాన్కూరు సంస్థానములో సుమారు 600 పత్రికలున్నవి కాని మన రాష్ట్రములో 6 పత్రికలైనను సరిగా లేవు. మా రాష్ట్రమున దినపత్రికలు పత్రికలే కావు మా ఉర్దూ దినపత్రికలు పలుమారు సంపాదకీయములే వ్రాయవు మా ఉర్దూ పత్రికలకు సంవత్సరమున ఒక్కొక్క తంతి వార్తకూడ రాదు। బుల్లెటిన్ పత్రికను పట్టుకొని రాత్రి కూర్చుని దానిని అనుకూలమున్నంత వరకు తర్జుమా చేసికొని ప్రొద్దుననే అచొత్తి బయటపడునట్టివి మా దినపత్రికలు ఇక మా బుల్లెటిన్ కూడ విదేశ వార్తలను నిచ్చుటలో చాల యాలస్యము చేయుచున్నది ఈ పత్రిక లన్నింటిలో మన రాష్ట్రములోని జిల్లాలలో నేమి జరుగుచున్నదో తెలియనే తెలియదనవచ్చును. ఈ జిల్లాల వార్త లిచ్చుటలో మా గోలకొండయు, నిజాము విజయము తప్ప తక్కిన పత్రిక లిచ్చుటయే లేదనిన యతిశయోక్తి కాదు!!
ఇట్టి స్థితిలో యిట్టి యంధకారములో మేము తగుల్కొనియున్నాము. ఇక మా యాంధ్రుల సంగతి కొంత విచారింతము. ప్రస్తుత రాజకీయ హద్దులను బట్టియు, మా రాష్ట్ర భూగోళమునుబట్టి యేమి మద్రాసు భూగోళమునుబట్టి యేమి నిజాము రాష్ట్రము వేరు, మద్రాసు రాజధాని వేరు కావున ఉభయ ప్రభుత్వములు బ్రిటిషు ఆంధ్రులను నిజాము ఆంధ్రులనుండి విడదీసి యున్నారు. అయినను నీ యుభయాంధ్రులలో సామీప్యసారూప్యములు లేకపోలేదు. 64 లక్షల సోదరులను దక్షిణ ఆఫ్రికాకు పోయిన కూలీలనుగా తక్కిన యాంధ్రులు చూడజాలరుగదా! అయినను అటులే చూచుచున్నట్లు మాకు గోచరించుచున్నది.
ఈ రాష్ట్రములో తెలంగానా మరట్వాడ ముఖ్య రాజ్య విభాగములు, అందు తెలంగానాలు 64 లక్షలు యాంధ్రులు, మరాట్వాడాలు 32 లక్షల మహా రాష్ట్రులును గలరు మహారాష్ట్రుల సంఖ్య తెలుగు వారలు సగమే యుండినను బ్రిటిషు రాజ్య మహారాష్ట్రులు - అనగా బొంబాయి రాజధానిలో మహారాష్ట్రులు తమ సోదరుల యెడ అత్యంత సానుభూతి చూపుచున్నారు పత్రికలందేమి, గ్రంథములందేమి, సభలందేమి, సర్వ విధములవారు తమ ప్రాంతములలో తమ సోదరుల విషయమై శ్రద్ధ పుచ్చుకొనుచున్నారు. ఈ శ్రద్ధ కొంచము శ్రుతి మించినదిగా కూడ నున్నది. కావుననే కొందరు మా రాష్ట్రమునుండి 'షేరు బదల్' అయిరి కొన్ని మహారాష్ట్ర పత్రికలు రాష్ట్రములోనికి రాకుండ నిషేధింపబడెను కొన్ని మహారాష్ట్ర గ్రంధములు కూడ నిషేధింపబడెను.
ఇది యిట్లుండ మా మద్రాసు రాజధానిలోని యాంధ్ర సోదరులు మాకేమి చేసిరని ప్రశ్నించుచున్నారు. అచ్చట పత్రిక లిక్కడి వార్తలనే ప్రకటించుట లేదు. నిజాము రాష్ట్రపుటాంధ్రులకు బ్రిటీషు రాష్ట్రపు జనులకు కాంగ్రెసు యెట్లో అట్లు ప్రధానమైన ప్రధమాంధ్ర మహాసభ జరుగగా దాని వార్తయైన యచటి పత్రికలు ప్రకటింపకపోయెను. ఇక ముఖ్యోపన్యాసములలో తీర్మానములు అచ్చువేయు దాతలెవరు? మొత్తము పై మాయనుభవమున మహారాష్ట్రులలో నుండునంతటి ప్రేమ మా యాంధ్రులలో లేదు
ఇక మా రాష్ట్రములోని యాంధ్రుల స్థితిని విచారింతము. మీ సోదర రైతులను పాటకపు జనులను వర్తకులును - అనగా ఆంధ్రులందరు యవాచ్యహీనస్థితులు నుండినందులకు వర్తక రైతు సంఘములే తార్కాణము. ఈ సంఘముల ముఖ్యోద్దేశము ప్రజలు తమపై యన్యాయమైనట్టి దౌర్జన్యము లెవ్వరును చేయకుండుటకై యాత్మ సంరక్షణము చేసికొనుట అనగా వీరికింతవరకు కష్టములే కలుగుచున్నవని దీని భావము.
నిజాము రాష్ట్రము ఏ శతాబ్దములో వృద్ధికి రావలయునో యెన్నడు సర్వసంస్థానములందు నిజాముగా యుత్కృష్టమైనదని యనిపించు కొనునో, మా జ్యోతిష గణితములో నగోచరముగా నున్నది మేము మాత్రము మా శక్తి కొలది ప్రజా సేవ చేయుచుందుము. కాని ప్రజలు మాత్రము, తమ ధర్మము నెరవేర్చుట లేదు మేము పైన వర్ణించిన నీసమగ్రపు ఉర్దూ దిన పత్రికలకు ద్రవ్యము హెచ్చుగా నిచ్చికొనుటలో గౌరవము అని భావించు సోదరులనేకు లున్నారు వారందరి దృక్పధము మారినట్లైన నిజమైన పత్రికలేవియో బయట పడును. కుక్క కూనలలో మంచివేవి యని పరీక్షించుటకై వాని నన్నింటిని బావిలో వేయుదురు. అని పనికి రానివి యడుగునకు పోవ... మం... చివి యీదుకొని వచ్చును ఇటులే మా రాష్ట్రములోని సర్వ పత్రికల చందాదారులను పత్రికలను పరీక్షింపవలెను.
ఈ సంవత్సరము మేము.............లో నొక ముఖ్యముగు..........చేయుచున్నాము ప్రజల యొక్క అభివృద్ధి తృప్తికరముగా నుండుట పత్రిక యొక్క పరిమాణమును పెద్దగా చేసి 12 పుటల నుండి 16 పుటల వరకు ప్రతి తడవ యిచ్చివేయుచున్నా...ము ఈ సైజులో ప్రచురించుట యుండుననగా పూర్వము సైజుకన్న రెండు వేలు పెద్దదిగా చేయుట యని పాఠకులకు నివేదింపనవసరము లేదు
ఇంత వరకు మాయందు అభిమానముంచి మాకు తోడ్పడిన సోదరులకు అందు ముఖ్యముగా మా రాజపోషకులకు, పోషకునికి, అభిమానులకు, విలేకరులకు మేము కృతజ్ఞతా వందనము అర్పించుచున్నాము. పత్రిక చిన్నది. కార్యము పెద్దది. మా రాష్ట్ర సోదరుల అభిప్రాయమును గాని, వ్యాసములు గాని, ప్రచురించుటలో, మేము స్థల సంకోచముచేత అనేక మారులు ఆలస్యము చేయుటయో, లేక ప్రచురింపకపోవుటయో కావించి యుందుము. ఈ లోపములను మన్నించి యందరును మాకు దోడ్పడుదురని ప్రార్థించుచున్నాము.
సరోజినీదేవి గారి నిర్బంధము
24-5-1930
సరోజినీదేవి గారు హైదరాబాదు నందు జన్మించిన వీరనారీమణి యని ఎల్లరు ఎరిగిన విషయమే వీరు కేవలము చిన్న ప్రాయమునుండియే తమ మేధాశక్తిని జూపి ఎల్లరుల మెప్పును బడసిరి. వీరు హిందూ దేశమున కొనర్చిన సేవ అపారమైనదని అట్టి వారు నేడు కేవలము దేశ సేవ జేయుటవల్ల కారాగార గృహమునకు పోవలసి వచ్చినప్పుడు వీరిని అభినందింపని వారెవరుండగలరు.
సరోజినీ దేవిగారు మొదటి నుండియు తన జీవితము దేశ సేవయందే గడపిరి అందుచే వీరి సేవకు మెచ్చి హైందవులు వీరిని కాంగ్రెసు అధ్యక్షులుగా గూడ నొక సంవత్సరము నెన్నుకొనిరి హైందవ స్త్రీలలో ఇప్పటికిని ఉన్నత స్థానము నలంకరించిన వారు వీరొకరే తర్వాత గూడ దేశ సేవా తత్పరులై అమెరికా ఖండమునకు వెళ్ళి మిస్ మేయోగారు వ్రాసిన "మదర్ ఇండియా" గ్రంథమువల్ల జరిగిన దుష్ప్రచారమును తమ వాఙ్మాధుర్యముతో నణంచివేసిరి. అక్కడనున్న ఆరు నెలలును వీరు హిందూదేశమునకై చేసిన కృషి అపారము. వీరి కృషిని మెచ్చుకొనియే వచ్చిన కొన్ని దినములకే వీరిని భారత మహిళా మహాసభ కధ్యక్షులుగా నెన్నుకొనిరి తరువాత గాంధీగారి ఉద్యమము రాగానే దానియందు హృదయ పూర్వకముగ పాల్గొని అతని మన్నన బడసి తుదకు వారి తదనంతము అదే ఉద్యమమునకు నాయకురాలుగా నియమింపబడిరి ఇట్టి నియతపదవి యందుండగ వారు చేసిన కృషి పత్రికా పాఠకుల కెల్లరకు విదితమే. ఇపుడు వీరికి దేహ మస్వస్థతగ నున్నదని తెలియుచున్నది కాబట్టి ఇట్టి భారత నారీ రత్నమునకు ఇంక నినుమడింతలు దేశ సేవ నొనర్చుటకై భగవంతుడు చిరాయురోగ్యము నిచ్చుగాత!
రామప్ప దేవాలయము
9-7-1930
ఓరుగల్లులోని రామప్ప దేవాలయము పునర్నిర్మాణము గూర్చి నైజాము ప్రభుత్వము వారు పదునాలుగువేల రూపాయల విరాళము నొసంగుట వేరుచో ప్రకటింపబడిన వార్తలవలన తెలియును ఈ దేవాలయములు ములుగు తాలూకా పాలము పట్టు అను నొక గ్రామమునకు రెండుమైళ్ళు దూరమున మహదరణ్యములో గలవు. పిల్లల మర్రి, నాగులపాడు, పానగల్లు దేవాలయములకన్నను నీ దేవాలయముల శిల్పము మిగుల మనోహరముగానున్నది. పదునొకొండవ శతాబ్దమునాటి యాంధ్రుల శిల్పమును జూడదలతుమేని రామప్ప గుడి యందు మూర్తీభవించియున్నది. అచట గల శిలా శాసనముల వలస నీ యాలయము రుద్రదేవుని యనంతరము గణపతి రాజ్యారంభమున రేచర్ల గోత్రేయుడగు రుద్రసేనానిచే గట్టబడినటులందెలియుచున్నది.
చరిత్రాంశములతో నిండియున్న నిట్టి ప్రదేశమును కాపాడుటకు తలపెట్టిన ప్రభుత్వము వారిని మేమెంతేనియు నభినందించుచు, ఇట్టులే ఇతర ప్రాంతములందున్న ప్రదేశముల కాపాడ సలహానిచ్చుచున్నాము.
ఉర్దూ నిఘంటు
23-8-1930
మన ప్రభుత్వము వారు ఉస్మానియా విశ్వవిద్యాలయమునకై పడరాని పాట్లు పడుచున్నారు. ద్రవ్యమును ఉదారముగా ఖర్చు పెట్టుచున్నారు ఇంతకు పూర్వము తర్జుమా శాఖపై మన ప్రభుత్వము వారు వ్యయము చేసిన విషయము విమర్శించియుంటిమి ప్రకృతము ఉర్దూ నిఘంటువొకటి సిద్దము చేయుటకై మౌల్వీ అబ్దుల్హఖ్ గారిని వినియోగించి యున్నారని వినుటకు చాల సంతోషమైనది. మౌల్వీగారు ఉరుదూలో అపూర్వ పాండిత్య ప్రకర్షను కలవారని వినుచున్నాము అట్టివారిని నీయుత్తమ కార్యమునకై వినియోగించుట ప్రశంస నీయమే?
కాని ఒక్క విషయము మాత్రము విమర్శనీయము. మౌల్వీసాహెబు గారికి ప్రతి నెలకు 1000 రూపాయిల జీతముపై పది సంవత్సరముల వరకే పని యిచ్చియున్నారు అనగా వీరి పని పూర్తిచేయు వరకు రూ 1,20000 జీతము పొందుదురు.
ఇంతటి తోడనే పూర్తిగాదు ఇదంతయు సమగ్రమైన తర్వాత దీని అచ్చు వేయించవలెను ప్రభుత్వము వారి అచ్చు శ్రేష్ఠముగా నుండును వారి కాగితము ఉత్తమ గ్లేజు గలవిగా నుండుట కేమి సందేహము. ఇదంతయు పూర్తి అగువరకు 20 లేక 30 వేలు ఖర్చు అగును.
ఇన్ని రూపాయిలు ఖర్చుపెట్టి ఒక్క నిఘంటువును తయారుచేయుచున్న భాషయెంత ధన్యమైనదో యూహించుడు. ఆంధ్ర దేశమందు వేదము వేంకటరాయశాస్త్రి కన్న మించిన పండితుడు లేకుండెను. అట్టి వారిచే సూర్యరాయాంధ్ర నిఘంటు ప్రారంభము చేయించినప్పుడు వారికి నెలకు 250 రూపాయల కన్న నెక్కుడియ్యలేదు. కాని యీ ఉరుదూ నిఘంటువు చాల అదృష్టముతో గూడినట్టిది. ప్రభుత్వమింత ఖర్చు పెట్టుచున్నను ఉరుదూ తెనుగు నిఘంటుకు మాత్ర మొక్క పైసా కూడ యిచ్చుటకు బుద్ధి పుట్టలేదు. ఎవరి సహాయము లేకయె స్వయముగా ఏండ్ల పర్యంతము కష్టించి యుత్తమ పద్ధతిపై మనరాష్ట్ర నివాసి యగు కొండల్‌రావుగారు అను ఆంధ్రుడు ఉరుదూ తెనుగు నిఘంటువును వ్రాసి ముద్రించుటకై ప్రభుత్వ సహాయము కోరగా నతనికేమియు దొరకకపోయెను. బహుశః ఇది నిఘంటువు ఉరుదూ భాషకు లేక ఉరుదూ మాట్లాడు వారికి లాభకారి కాదేమో!
ఇంతియకాక మేము శ్రీమంతు రాజారాజేశ్వరరావు బహద్దురు దోమకొండ సంస్థానాధీశులు కేవలము నిఘంటువేకాక ఉర్దూ సర్వస్వమే(Encyclo Paedia) వ్రాసియున్నారు వారు వ్రాసి యుంచిన నిఘంటు గ్రంధము లొక రెండెడ్ల బండి మోతకు తక్కువ కావు అది మేముచూచి చాల ఆశ్చర్యపడి యున్నాము. మౌల్వీ గారికి పునః పరిశ్రమ లేకుండ శ్రీమంతు రాజాగారే వ్రాసి యున్నారు కావున ప్రభుత్వము వారు శ్రీరాజులుగారి యనుమతి పొంది వారి గ్రంధమును అవసరముండిన మౌల్వీ గారితో పరిశోధన చేయించి ముద్రించుట యుక్తముగా దోచుచున్నది. ప్రజల ద్రవ్యము విశేషముగా నీపద్ధతి వలన వ్యయము కాదు.
మహాత్మజీ జన్మదినం
20 - 9 - 1930
మహాపురుషుల జీవితములు సాధారణ ప్రజల కాదర్శప్రాయములు, ప్రజలు వర్థంతులు జరిపి మహాపురుషుల గౌరవింతురు భారతదేశమున నీ యాచారము పూర్వకాలము నుండి వచ్చుచున్నది శంకరాచార్య, రామానుజాచార్య మున్నగు మతాచార్యుల యొక్కయు రామ, కృష్ణ మున్నగు పురాణకాల పురుషుల యొక్కయు జయంతులు భారతదేశమందంతటను, ఇప్పటికిని జరుపబడుచున్నవి.
ప్రపంచమందంతటను ప్రఖ్యాతి గాంచినట్టియు అహింసా సిద్ధాంతముచే జయము పొందవచ్చుననియు చాటిన మోహనదాసు కరంచంద్ గాంధీగారి 62వ జన్మదినము నిన్న తటస్థించినది వీరు వృద్ధులైనను యువకోత్సాహముతో భారతదేశ స్వాతంత్ర్యమునకు తీవ్రమైన కృషి సలుపుచుండుటచే ప్రపంచమునందన్ని దేశములవారు ముగ్ధులగుచున్నారు వీరి శాంతి సందేశమున కన్ని జాతులవారును జోహారు లొసగుచున్నారు. యుద్ధము వలన విసిగిన పాశ్చాత్యులు వీరి విధాన మవలంబించుటకు కుతూహలపడుచున్నారు కొందరు పాశ్చాత్య మతాచార్యులు గాంధీజీ క్రీస్తు అవతారమని కీర్తించుచున్నారు
గాంధీజీ దక్షిణాఫ్రికాయందును, భారతదేశమునందును, చేసిన త్యాగ మపారము తమ సర్వస్వమును దేశమున కర్పించిరి తుదకు భారత స్వాతంత్ర్యమునకు తమ ప్రాణముల కూడ నర్పింపయున్నారు. ఈ యుత్కృష్ట పురుషుడు, నిరాండంబరజీవి, త్యాగి, యోగి యొక్క జీవితము ప్రపంచమునందలి అన్నిదేశముల వారికిని, అన్నిజాతుల వారికిని, ఆదర్శప్రాయముగ నున్నది వీరి శాంతి సందేశము వలన ప్రపంచములో ముందు యుద్ధభయ ముండజాలదు, సర్వేశ్వరుడు వీరికి ఆయురారోగ్యముల నొసగి, భారత స్వాతంత్ర్యమునకు పాటుబడుటకు సహాయపడుగాత!
మన స్థితిగతులు
6 - 12 - 1930
స్వదేశీలీగుపక్షమున నిన్న దేవీదీస్‌బాగులో జరిగిన బహిరంగసభ చాల ముఖ్యమైనదని చెప్పవచ్చును ఈ సభ కధ్యక్షత వహించిన పండిత కేశవరావుగారు కరోద్గిరి మహిసూలు వలన ప్రజలకు నష్టము కలుగుచున్నదని అంకెల ద్వారా తెలిపిరి. ఈ కరోద్గిరి మహిసూలు (సుంకపు పన్ను కొన్ని వస్తువులపై మూడు నాలుగుసార్లు తీసికొనబడును ) ఈ దేశమునందు తయారగు వస్తువులే నగరమునకు గొనితెచ్చినవానిపై పన్ను విధించుట చోద్యముగ నున్నది. ఈ విషయ మొక యుదాహరణము వలన బాగుగ తెలియగలదు ఒక నేతగాడు షోలాపూరము నుండి నూలు తెప్పించిన మొదలు ఈ నూలు ఈ రాష్ట్రమునకు దిగుమతి చేయబడినందున దానిపై సుంకము వసూలుచేయబడును ఆ నేతగాడు ఈ నూలుతోనే నేసిన వస్త్రములను విక్రయమునకు దెచ్చిన మరల సుంకము వసూలు చేయబడును ఆ వస్త్రములనే ఒకడు కొని వేరొకచోటికి తీసికొని పోయిన అవి క్రొత్త వస్త్రములని సుంకము విధింపబడును ఈ ప్రకారము సుంకము అందగట్టుటచే ఇచటి పరిశ్రమలకు తీరని నష్టము కలుగుచున్నది. మేమిదివరకెన్నియోసారులు సూచించినట్టు దయామయులగు ప్రభుత్వమువారు దేశీయ పరిశ్రమ అభివృద్ధి జెందవలయునని కోరుదురేని ఈ కరోడ్గిరి మహిసూనులును వెంటనే తొలగించవలయును.
రామచంద్రనాయకు బారెట్లగారు హైద్రాబాదు ప్రస్తుత ఆర్థికస్థితిని దెలిపి విద్యాధికులను గ్రామముల స్థితి బాగుపరుచుటకు పూనుకొనుటకై ప్రబోధించిరి ఫజలుల్రహామాన్ సా॥ తెలిపినట్లు ప్లేగు, కలరా మున్నగు అంటువ్యాధుల వలన జనసంఖ్య తగ్గుచున్నది ప్రజలకు వైద్య సహాయము లభించుటలేదు. ప్రజలు విద్య నేర్చినవారు కానందున ప్రభుత్వమువారు చేయునున్న సహాయము నుండి యైనను లాభము పొందుటలేదు. గ్రామముల పారిశుధ్యము కూడా బాగులేదు. అందువలననే మరణసంఖ్య అధికముగ నున్నది ఎల్లప్పుడు ఏదో యొక వ్యాధి ప్రబలుచుండును ఈ విషయమున ప్రభుత్వమువారికన్న ప్రజలే తగుకట్టుబాట్లు చేసికొనవలసియున్నది గ్రామములో విద్యావంతులు తమ తోడి సోదరుల క్షేమ లాభములను దృష్టియందుంచుకొని వారికి ఆరోగ్య విషయమునను, యితర విషయములందును బోధ గావించిన కొలది దినములలో గ్రామముల స్థితిగతులు కొంతవరకైనను బాగుపడుననుటలో సందియముండదు.
మాడపాటి హనుమంతరావు పంతులుగారు నుడివినటుల తెలంగాణములోనే కల్లుదుకాణము లధికముగ గలవు. మత్తు పదార్థముల గ్రోలుటకు ప్రభుత్వమువారి పద్ధతియే ప్రోత్సహించు చున్నదని దేశాభిమాను లనుకొనుచున్నారు. ఆబ్కారీ ఆదాయము ప్రతి సంవత్సరము పెరుగుచుండుటయే దీనికి నిదర్శనము. మత్తుపదార్ధముల ధరలు హెచ్చిన వానిని యుపయోగించు వారి సంఖ్య తగ్గుచుండుట లేదు. కనుక ప్రభుత్వమువారు త్వరలో త్రాగుడు పద్ధతి నిర్మూలించుటకు నూతన పద్ధతి ప్రవేశ పెట్ట వలయును
ఇచట దేశపురోవృద్దికై పాటుబడువారే అరుదు ఉన్న వారై నను ప్రచారము చేయదలచినను బహిరంగ సభల గష్తివలన ఆటంకము కలుగుచున్నది. ప్రభుత్వమువారు బహిరంగ సభలకై అనుమతి నొసంగుచున్నను సభా సమావేశకులకు అనుమతి పొందుటకు కొంత కాలము ప్రయత్నింప వలసివచ్చుచున్నది. దీనిచే సమయము మించిపోయి చేయదలచుకొనిన సభవలన అంతగా లాభము కలుగుచుండుట లేదు. దేశము నందావరించి యున్న అంధకారమును తొలగించుటకు ప్రస్తుతము ఉపన్యాసములే అవసరమై యున్నవి ప్రజలలో ప్రబోధము కలిగిన వారపుడు కార్యాచరణకై గడంగుదురు కనుక దేశాభివృద్ధి కలుగవలయునన్న ఈ బహిరంగ సభల గూర్చిన గష్తీని ప్రభుత్వమువారు వెంటనే రద్దుచేయవలయును ప్రభుత్వమువారు రాజకీయ సభలకై అనుమతి పొందవలయునను నిర్బంధముంచినను ఉంచవచ్చును, కాని విద్యా, సాంఘిక విషయిక సభలకై ఎట్టి నిర్బంధముల నుంచరాదని మేము కొరుచున్నాము.
దేశ భాషలు – కచ్చేరీల వ్యవస్థ
21-2-1931
ప్రధమ ఆంధ్ర మహాసభలో గత వత్సరము చేయబడిన తీర్మానములలో 17 వ తీర్మానమిట్లున్నది
"గ్రామస్థులకు అనుకూలముగా నుండుటకై మున్సిఫి అదాలతులలోను, సబ్ రిజిస్ట్రారు కచ్చేరీలలోను వృవహారమంతయు ఇంగ్లీషు ఇలాకాలో వలె జనుల దేశభాషయందే జరుపుట అత్యవసరమని ఈ మహాసభ వారు ప్రభుత్వము వారికి సూచించుచున్నారు"
పై తీర్మానము ననుసరించి కేంద్ర సంఘ సభ్యులును మహబూబు నగరము జిల్లా వాస్తవ్యులును నగు శ్రీయుత ఎం. నారాయణరావు గారు (హైకోర్టు వకీలు) న్యాయ శాఖాధికారులతో నుత్తర ప్రత్యుత్తరములు జరిపి దేశ భాషల ప్రాముఖ్యతను సూచించిరి. "న్యాయ స్థానముల వ్యవస్థ యందు తక్షణమే మార్పు అవసరము" అను విషయమును గురించి “మన్షూర్” పత్రికలో శ్రీ నారాయణ రావుగారు వ్రాసియుండిరి
న్యాయ స్థానముల వ్యవస్థతో అమీరుల కింత సంబంధము గలదో నంతకంటే నెక్కువ సంబంధము బీదలకును, గొంగళ్ళను కప్పుకొను తెగలవారికిని గలదు ధనవంతులకంటె నెక్కువగా బీదసాదల హక్కులు సంరక్షింపబడుట ఆత్యవసరము మన న్యాయ స్థానముల ప్రస్తుత వ్యవస్థ యందనేక లోపములుండుటం బట్టి ఈ విషయమున ఫలవంతముగ లేదు. జనులకు న్యాయము ప్రసాదింబడుటలో లోపభూయిష్ఠమైన వ్యవస్థ తన పర్యవసానమును గలిగించుచున్నది. ప్రస్తుతము ప్రతి దినము అదాలతులలోని పనులయందు ముఖ్యముగా గనబడు లోపమును గురించి మాత్రమే విచారింతము దీనిని నివారించుటకు న్యాయశాఖ యొక్క ఉన్నతాధికారులును, ప్రభుత్వము వారును ప్రయత్నించెదరుగాక!
మన న్యాయ స్థానములలో వ్యవహరింపబడు భాష ఉర్దూయై యున్నది. జన సామాన్యము వాడుకొను భాషలు మహారాష్ట్రము, కన్నడము, తెలుగు, సాక్షులు తమ సాక్ష్యమును గూడ స్వభాషయందే నొసగుచున్నారు నిందితులు గూడ సహృదయాంతర్గత భావములను తమ మాతృ భాషయందే వెల్లడి చేయుచున్నారు సాక్షుల యొక్కయు, నిందితుల యొక్కయు భావములను సరిగా తేటపరచునట్టి మార్గమున నేడవి గ్రంధస్థ మొనరింపబడుటయే సరియైన న్యాయపద్ధతి యగును ఇట్టి రికార్డు పైననే న్యాయ పరిశీలన జరుగవలెను కాని దురదృష్టవశమున న్యాయ శాఖలో పనిచేయు అధికారులు దేశ భాషలందు ప్రవేశము గలవారు కారు సాక్షులకు, నిందితులకు అదాలతు భాష తెలియదు. వీరిరువురి మధ్య అనగా అధికార వర్గము సాక్షులు నిందితుల పరస్పర భావములను వెల్లడించుటకు భాషాంతరీకరణము చేయువారు కావలసివచ్చు చున్నది ఈ కార్యము సులభమైనదిగను, అంత ముఖ్యమైనది గానిదిగను తలపడుచుండుట గూడ దురదృష్టమే పరస్పర భావ ప్రకటన కార్యము కఠినమైన భాషాంతరీకరణ కార్యభారము అసాధారణమైన ప్రజ్ఞతో గూడికొనినదై యున్నది తర్జుమా చేయుటకు నియమింపబడు ఉద్యోగులు ఉభయ భాషా ప్రవీణులై యుండుటవసరమై యుండును. కాని అమలు తద్విరుద్ధమై యుండుట మనము చూచుచున్నాము. ఈ పద్ధతి నిర్మూలింపబడుటత్యావశ్యకము నిందితుల వాఙ్మూలములు వారి మాతృ భాషయందే గ్రంధస్థ మొనరింపబడుటయే ముఖ్యమైన పని ఇట్లే చేయవలెనని నియమముండినప్పటికిని మిసళ్ళు జూచినచో నూటికొక నిందితుని వాఙ్మూలమైనను మాతృ భాషలో రికార్డు చేయబడుచున్నదా యను సందేహము గలుగును భాషాంతరీకరణ మొనర్చువారు గూడ అంత విశ్వాసపాత్రులును, ఉభయ భాషా ప్రావీణులునుగను లేకుండుటచే వారు చెప్పు దాని పైన సంపూర్ణ విశ్వాసముంచుటకు వీలు లేదు. కనుక వీనిపై నాధారపడియుండు తీర్పులు న్యాయ పధమున నుండకపోవుట గూడ కొన్ని సమయములందు సంభవించును. మనరాష్ట్రములోని ఉన్నత న్యాయ సభ యొక్క ప్రధాన న్యాయాధీశులు అనేక పర్యాయములు గష్తీల ద్వారాను, ఆహకాయుల మూలమునను నిందితుల యొక్క వాఙ్మూలములను వారి మాతృభాష యందే రికార్డుచేయవలెనని నియమ మేర్పరచియున్నారు ఇట్లు జరుపుటకు వీలులేనిచో భాషాంతరీకరణ మొనర్చుటలో చాలా జాగ్రత్త వహింపవలెనని హెచ్చరించియున్నారు. ఈ విషయమునందెంత వరకు శ్రద్ధవహింపబడుచున్నదో సృష్టమే. అదాలతులతో సంబంధము గల వారందరునునైక కంఠముతో నీ విషయమున అదాలతు పని, వ్యవస్థ ప్రయోజనకారిగా లేదని చెప్పగలరు. ఈ విషయము ముఖ్యమైనదని వాదించుటకు మేము వెనుదీయము కాని ఇంతకంటె నెక్కువ లోపము గనబడుచున్నందున "ఉత్తముండకంటె అత్తముండమేలు" అని మాత్రము చెప్పవలసి వచ్చుచున్నది
మనరాష్ట్రములోని దివానీ భాగమునందు గౌరవన్యాయాధిపతులకు మూడవ దర్జా అధికారములు గలవు. మున్సిపులకు ఫౌజ్దారీలో జిల్లామెజిస్ట్రేటు యొక్కయు, దివానీలో 1000 రూ. అభియోగములను విచారించు అధికారములు గలవు. బ్రిటిషు ఇండియా కంటె ఈ విషయమున మనమెంతో ముందున్నాము మన తాలూకాలలో నుండు ప్రతి యొక్కనికిని అన్నిటికంటె నెక్కువయైన న్యాయస్థానము నుండి న్యాయము బడయు సౌకర్యమున్నది కానినిట్లు నిర్భయముగా చెప్పుటకు హృదయకంపముగలుగుచున్నది. ఏలననగా మనము నిజమైన న్యాయమును బడయుట లేదు. ఇందుకు ముఖ్యమైన కారణమునరయుదము గొప్ప అధికారములు గల మన మున్సిఫి మెజిస్ట్రేటుల వద్ద వాఙ్మూలముల నిచ్చు సాక్షులలోను, కక్షదారులలోను నెక్కువ భాగము అదాలతీ భాష దెలిసిన వారు కారు న్యాయస్థానము (అదాలత్ )నకు దేశభాషల పరిచయము లేదు భాషాంతరీకరణమొనర్చు ఉద్యోగులు నియమింపబడియుండరు. కనుక తీర్పు చెప్పువారు తమకు తెలియని భాషలో జరుగు వ్యవహారమును నెట్లు పరిశీలించగలరు? ఈ పరిస్థితులలో “దుబాసి" (తర్జుమాపనిచేయువారు) సామాన్యముగా అదాలత్ చప్రాసీయో లేక హాజరున్న వారిలో నెవరోయైయుండిన ముఖ్యమైనట్టియు, బాధ్యతాయుతమైనట్టియు కార్యభారమును నిర్వహించి న్యాయస్థానమునకు న్యాయపరిశీలన కార్యమునందు తోడ్పడుదురు. తర్జుమాయైనను మక్కికిమక్కిగాని వాడక మాటలలోగాని జరుగదు. కొన్ని వేళలందు వీరు చెప్పునదొకటి వారు చెప్పునది మరి యొకటియై యుండును కనుక సరియైన న్యాయమును బడయుట మిక్కిలి దుస్తరమగుట సంభవించును, కనుక ఉన్నత న్యాయశాఖాధికారులీ విషయమున శ్రద్ధవహించి ఈ లోపమును తొలగించుటకు కృషి సలిపెదరని నమ్ముచునియ్యది వారి విద్యుక్త ధర్మమని హెచ్చరించుచున్నాము
ఈ విషయమును అధికార వర్గము ఒక్క జవాబుతో తెల్పివేసెదరని మాకు తెలియును ప్రస్తుత మెట్టి యేర్పాటు చేయుటకు "గుంజాయిషు" లేదని చెప్పుటయే వారి జవాబై యుండును న్యాయము ప్రసాదింపబడుటలో నీజావాబు తృప్తికరమైనదిగా జాలదని ప్రపంచమంతకును విదితమైయున్నది కనుక అధికార వర్గము జనసామాన్యము యొక్క అవసరమును ప్రజాభిప్రాయమును చేయూతగాగొని ప్రభుత్వము నీ విషయమున బలవంతపెట్టవలెను న్యాయశాఖా వ్యవస్థయందు విస్పష్టముగా గానవచ్చుచున్న నీ కళంకమును దొలగించుటకు కృషిసలుపవలెను జనులు సరియైన న్యాయమును బడయవలెననుటయే మా దృష్టియందున్న విషయము. వ్యవస్థను విమర్శించి కళంకములను ఆక్షేపణ పూర్వకముగా జూపించవలెననెడి యుద్దేశ్యమే మాత్రముగాదు. ప్రజాభిప్రాయముతో బాటు అధికార వర్గము యొక్క సహాయముతో ప్రభుత్వము వారి దృష్టినిప్పట్ల నాకర్షించుటయే మాయాశయము. కనుక లక్షల కొలది రూప్యములు రాష్ట్రతర ప్రాంతములకై వినియోగింప బడుటయు రాష్ట్రయుల యోగక్షేమమున కత్యంతవసరమైన వ్యయమునకై గుంజాయిషు లేదనుటయు సరియైన పద్ధతిగాజాలదు కనుక ప్రభుత్వమువారీ విషయమున శ్రద్ధవహించెదరుగాత
ప్రతాపరుద్ర జన్మదినోత్సవము
28 - 3 - 1931
శా. శ 1176 అను ఆనందనామ సంవత్సర చైత్ర శు॥ 5 ల రోజున (25-3-1254) కాకతీయ సామ్రాజ్యము నేలిన ప్రతిభాశాలియగు ప్రతాపరుద్ర సార్వభౌముడు జన్మించిన దినమని స్థానిక చరిత్ర చరిత్రవలనను ప్రతాపరుద్ర చరిత్రవలనను తెలియుచున్నది. ఇట్టి మహా పురుషుని జన్మదినోత్సవము జరిపి ఆ మహనీయుని యశోగానము గావించుట ఆంధ్రుల శ్రేయోభివృద్ధి కవసరమని గత బుధవారమునా డొక బహిరంగ సభ రెడ్డి గ్రంధాలయ భవనమునందు ఆంధ్ర యువకులు సమావేశ పరచిరి. ఇట్టి కార్యము చేత ఆంధ్ర యువకులు ఇతరులకు మార్గదర్శకులగుటయే గాక ఆంధ్రుల జీవితములను ధన్యము గావించిరి.
ఈ సభకు ముఖ్యోపన్యాసకులుగ నుండిన మారేమండ రామారావు పంతులు ఎం ఏ గారే యీ యుత్సవమునకు కారకులని చెప్పవచ్చును. ఏలయన ఆంధ్ర యువకు లీ వీరుని యుత్సవము సలుపవలయునని చాలకాలము నుండి తలంచు చున్నను, ఏ తేదీన జరుపవలయునో సందేహించు చుండిరి. కాని శ్రీ రామారావు గారు చైత్ర శు॥ 5 రోజున ప్రతాపరుద్రుని జన్మదిన మని నిర్దారణ పరచి ఆ మహానీయుని యశోగానము గావించుటకు ఆంధ్రులకు మార్గము చూపిరి.
జాతీయోన్నతికి వీరపూజ ముఖ్యాతి ముఖ్యము. వీరుల స్మరణయే జాతిని తేజోవంతముగను, శక్తిమంతముగను, నొనర్చును. దేశాభిమానమునకును, జాతీయాభిమానమునకును, వీరపూజయే మూలకందము. కనుక ఇట్టి సభలు ప్రతి వత్సరము జరుగుచుండ వలయును ఇపుడు జరిగిన యుత్సవమునకు తగినంత వ్యవధి లేకుండుట చేతను, కొన్ని అనివార్య కారణములు సంభవించుట చేతను, వైభవముగ జరుపుటకు వీలులేక పోయెను. అయినను ముందు సంవత్సర మీ యుత్సవము ఆంధ్రవీరుని ప్రతిభకు తగిన వైభవముతో ఆంధ్ర యువకులు జరిపెదరని ఆశించెదము.
ఈ సందర్భమున నొక్కమాట జెప్పనిది నుండజాలము. ఏ మహావీరుడు కాకతీయ సామ్రాజ్యము సఖండముగ నేలనో, ఏ వీరుడు రణరంగమున పోరి రాజ్యమును, ప్రాణములను నర్పించెనో, ఎ ఆంధ్ర చక్రవర్తి నామము సర్వదా స్మరించుకొనవలసి యున్నదో, అట్టి శ్రీప్రతాపరుద్ర చక్రవర్తిని ఓరగల్లు నివాసులు మరచిపోయిరి. కాననే ఆ ప్రదేశమునందు మాంద్యము తాండవ మాడుచున్నది. ముందైనను ఈ వీరుని స్మరించిన నీ మాంద్యము తొలగ గలదు. కనుక రాబోవు సంవత్సరము ఓరుగల్లు నివాసులు ఈ యుత్సవము మహావైభవముతో జరిపి తమ ధర్మమును నిర్వహించెదరు గాత!
మా యాఱవ సంవత్సరము
9 - 5 - 1931
నేటికి మా గోలకొండ పత్రికకు అయిదు సంవత్సరములు పూర్తియైనవి. నిజాము రాష్ట్రమందు ఆంధ్ర పత్రికలకు అయిదవ సంవత్సరము గండము అని మా మిత్రులు చెప్పెడివారు. ఎట్లయినననేమి మా కా గండము తప్పినది.
మా అయిదవ సంవత్సరములో ప్రపంచమంతటను గొప్ప మార్పులు జరిగెను. బ్రిటిషు హిందుస్థానములో ముఖ్యముగా నెన్నడును జూడనట్టి సంచలనము జరిగెను దేశమంతయు సత్యాగ్రహతత్వముచే నిండిపోయెను వేలకొలది జైలుకు పోయిరి. వేలకొలది దెబ్బలు తినిరి. అనేకులు ప్రాణము లర్పించిరి. తుదకు గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగెను కాని యిట్లు అచ్చట ప్రచండ సంచలనము జరిగినను మా రాష్ట్రము మాత్రమే చిక్కులు లేక సుఖముగా నుండుట విశేషము అయినను బ్రిటిషు హద్దులపై యావరించెడి భావములు గాలిచే నిచ్చటికి కొన్ని గొట్టకొని వచ్చిన వనుట నిస్సందేహము మన రాష్ట్రము నుండి గోల్మేజు సభకు ప్రభుత్వ ప్రతినిధులు వెడలియుండిరి. సభలో మన ప్రభుత్వ నియోజితులు మన రాష్ట్రమును గూడ ఫెడరల్ ప్రభుత్వములో చేర్చుటకు యంగీకరించియున్నారు.
ఈ యంగీకారము చాల ముఖ్యమైనది ఏలన సివిల్ పద్ధతిలో మన రాష్ట్రము చేరినట్లైన......ప్రజా ప్రాతినిధ్య సంస్థ లేర్పడుట తధ్యము
గత సంవత్సరమందు మన రాష్ట్రములో...... మార్పులు విశేషముగా లేవు ..... సం॥లో అయిన ఖాన్గీ పాఠశాలల గష్తీ.......... రెండేండ్ల క్రిందటి 53 వ సభల గష్తీయును యుండిన మార్పులు జరిగినవని చెప్పగలుగు...... కాని ప్రజల మొరలు మన ప్రభుత్వము చెవికింకను బాగుగా నెక్కలేదని మాకు వ్యసనము కలుగుచున్నది ప్రజలే రీతిగా నేడ్చిన నింపుయుండునో, యాయేడ్పు ఎప్పుడు మన ప్రభుత్వ......యమును గరిగించునో యెవ్వరును దారి ...... వారు లేరై రి
గత సంవత్సరమందు ఆంధ్రులు కొంత దేశ... కార్యములు చేసినారు ముఖ్యముగా దేవర... సభ పేర్కొన దగినది. కాని యాంధ్రులలో కార్యదీక్ష చాలా తక్కువ. ఆంధ్రుల యభివృద్ధికి ఆంధ్రులే యాటంక పడువారు కాని యితరులు... ప్రతి గ్రామమందును పటేలు పట్వారీలు, దొరలు, దేశ పాండ్యాలు తమ తమ... జనులసేవ చేసినట్లైన యాంధ్రా... లోనే కాగలదు...
స్థితి యింకను హైక్య మొందుటలో నేమి సందేము. ప్రజలను పీడించి బ్రతుకుట రాక్షసకృత్యము. ప్రజల నోరు కొట్టి తమ కడుపులు నింపుకొనుట పైశాచము. ప్రజలను నిర్ధనులనుగా జేయుటడాకూలపని. ప్రజల నిరక్షరాస్యులనుగా నుంచుట నా స్తికత. ప్రజలే గ్రామమున కలంకారభూతులు. ప్రజలే దేశ సంపదలకు మూలకములు. ప్రజల యభివృద్ధి సర్వతో ముఖాఖి వృద్ధి. వారి నాశనమే సర్వనాశము .
ఈ సూత్రములను ప్రతి' విద్యావంతుడును, ప్రతి ధనికుడును దృష్టి యందుంచుకొని తమ సోదర ప్రజలను వృద్ధికి దేగలుగుదురు గాక !
మన రాష్ట్రములో పత్రికా పఠనాభిలాష యింకను చాల తక్కువ బ్రిటిషు హిందూ స్థానములో ఘోర కల్లోలములు జరుగుచుండినను గాంధీగారి పేరు విననివారు కొందరున్నారు. పేరు వరకు వినినవారు గాంధీగారు జైలు నుండి యెప్పుడు వచ్చెదరు అని ప్రశ్నించువారున్నారు. మన ధనికులకు మొకద్దమాలపై యున్న యభిలాషలో శతాంశముకాదు సహస్రాంశమైన పత్రికలపై నుండిన వారు తరించగలరు
కచ్చేరీ వ్యవహారములపై ఖర్చు పెట్టు దానిలో సహస్రాంశము పత్రికలపై కర్చుపెట్టినవారు వృద్ధికి వత్తురు. తుదకు వారు తమ విదేశీ సిగరేట్లకు దినమునకు నాలుగణాలు వ్యయముచేయుదురు. కాని పత్రికలకై వారమునకు రెండణాలు వ్యయము చేయనొల్లరు. మేము మా పత్రికా స్థాపనా కాలము నుండియు రెండంగములు దృష్టిపధమందుంచుకొని దేశీయుల సేవజేయు చున్నాము మొదటిది యాంధ్ర భాషా సేవ. రెండవది జాతికుల వివక్షత లేక నిష్పక్షపాతముగా నాంధ్రులలో సర్వశాఖలవారి యొక్క సత్వరాభివృద్ధికై పాటుపడుట.
మన రాష్ట్రీయాంధ్రులలో విద్యావంతులమని చెప్పికొనువారిలో విశేషము వంతువారు మాతృభాషాభిమానములేని వారు అనేకులగు దొరలలో (అనగా కేవలము రెడ్లే కాదు వెలమలు, గోలకొండ వ్యాపారులు కూడ నీ దర్జాలో చేరిన వారు) వీరిలో జాతీయత కానరాదు వీరి వేషములబట్టి యెవరును వీరిని హిందువులని చెప్పజాలరు. వీరి భాషయు తెనుగు గాదు విశేషముగా హుర్దూ భాషయందే వ్యవహారములు జరుపుచుందురు అట్టిచో నాంధ్ర పత్రికలనినవారికి తలనొప్పి కలుగుటలో విచిత్రమేమియులేదు. మేము సర్వ శాఖలవారి యభివృద్ధికిగాను బాటుపడు విషయమునకు మా పాఠకులే సాక్షులు.
కాలము మారుచున్నది. నవీన భావములు ప్రబలుచున్నవి. దాని కనుగుణ్యముగా మనమును మన భావములను సవరించుకొనవలెను మన సాంఘికాచారములలో ననేకములీ నవీన కాలమునకు పనికిరావు రాజకీయముగా సహితము మనము చాల వెనుకబడియున్నాము మన రాష్ట్రములో ప్రజలకు రాజకీయాధికారములననేవో తెలియవు. ప్రపంచమందంతటను రాజకీయములు జనులకు ముఖ్య ప్రాణవాయువై యున్నవి ఏ రాజ్య వ్యవహారములు ప్రజల యనుమతిపై నడుపబడునో యా రాజ్యమందే రాజకీయ జ్ఞాన మున్నదని చెప్పవలెను. ఏ రాజ్యమందు రాజకీయమందు ప్రజలకు ........... లేదో యా దేశపు జనులకును చెంచువారికిని చాల భేదము లేదు కావున మేము ప్రజలకును ప్రభుత్వమునకు సూచించున దేమన మన రాష్ట్రములో ప్రజల తెలివి తేటలను వృద్దికి తేవలనని వారికి మునిసిపాలిటీలలో శాసన సభలలో ప్రాతినిధ్య మొసగవలెను
ఆంధ్రులందఱకును మా పత్రికను ప్రోత్సహించుట ధర్మమైయున్నది. ఈ రాష్ట్రమందలి యాంధ్రుల యాదరము తక్కువయగుటచేతనే అయిదు సంవత్సరములు సేవచేయు చుండిన 'నీలగిరి', 'తెనుగు' పత్రికలు గొప్ప నష్టమునకు లోనై యాగిపోయెను అదేవిధముగ "సుజాత" పత్రిక బహు నష్టమునకు పాలై నిలిచిపోయెను ఒకవేళ పత్రికలలో లోపముండినను ఆంధ్రులు వానిని భరింపవలెను తమ బిడ్డ మురికిదని యెవరును పెంటపై పారవేయరు కదాః మన యాంధ్రపత్రిక లిచ్చట ఉర్దూ దినకత్రికలకన్న నెన్నటికిని తక్కువ యైనవి కావని ఘంటాపధముగా చెప్పగలము కాని యదేమి వ్యామోహమో అనేకాంధ్రులు ఉర్దూ పత్రికలను (చదువ లేకున్నను) చేతబట్టిన నది కేవలము హస్తభూషణమే కాక గౌరవప్రదమని కూడ తలతురు మేనత్తకు మీసము లతికించినంత మాత్రముననే పిన్నబ్బ కానేరదు, కావున మా పాఠకులు మాచేయు సేవ మా పత్రికావశ్యకత, ఆంధ్రోద్యమమున కిది మూలకందమని తలచి మమ్మాదరించుటను బ్రశంసించుచు తక్కిన విద్యావంతులను, ధనికులను నీ పత్రికను బహుళముగా నాదరించు నీటుల ప్రోత్సహింతురని కోరుచున్నాము ఈ పత్రిక చిరస్థాయిగానుండి యాంధ్రుల ప్రతిభను దశదిశల ప్రసరింప జేయుటలో నగ్రస్థాన మలంకరించుటకై మా హితచింతకులందఱును చేయూత నొసగుదురు గాక!
మా పత్రికకు వ్యాసములును, వార్తలను పంపి, మాకు తోడ్పడిన విలేఖరు లందఱికిని మేమెంతయు కృతజ్ఞులము ముందుకూడ ఇదేవిధముగ సహాయపడెదరని కోరుచున్నాము.
ఆంధ్ర మహా సభలు
1 - 7 - 1931
ఈ నెల 27 వ తేదీన ఆంధ్రభాషాభిమానులును, ఆంధ్ర ప్రముఖులును స్వార్థత్యాగులునునగు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి యాధిపత్యమున గుంటూరు నందు ఆంధ్ర మహా సభ సమావేశమయ్యెను. ప్రకాశంగారు తమ యధ్యక్షోపన్యాసము నందు భావి భారతదేశ పరిస్థితులను వివరముగ చర్చించిరి. గత భారత స్వాతంత్ర్య సమరమున పాల్గొని అధిక కష్టములకు పాల్పడి, అహింసా వ్రతానుసారముగా సమరమును విజవంతముగా కొనసాగించిన ఆంధ్ర సోదర సోదరీమణులను ప్రశంసించిరి భాషా ప్రయుక్త నిర్మాణావశ్యకతను వివరముగా తెలియపరచిరి గత రౌండు టేబిలు మహాసభయందు సింధుదేశమును ప్రత్యేక రాష్ట్రముగా నొనర్చుట కనుమతింపబడెను. కాని సుమారిరువది సంవత్సరముల నుండియే ప్రత్యేక రాష్ట్రమునకై యాందోళనము సలుపబడుచున్న ఆంధ్రరాష్ట్రము గూర్చి యందెట్టి సూచనయుగావింప బడలేదు ఆంధ్ర రాష్ట్రము నుండి వెడలిన ప్రతినిధులలో నొకరుగూడ నిందుకై చర్చించలేదు. వీరు ప్రజాభిప్రాయము నేమాత్రమును నీసభయందు వెల్లడింప లేదు ఇందుచే వీరు ప్రజాప్రతినిధి యర్హతను బొందలేదనియు, ముందు జరుగబోపు సభలో తప్పక ప్రజాప్రతినిధులు బోవలసిన యావశ్యకత గలదనియు, ప్రజలు ప్రభుత్వ నియోజత ప్రతినిధివర్గము వలన నేమాత్రమును లాభము పొందజాలరనియు, తేటతెల్లమగు చున్నది.
పంతులుగారు హిందూ మహమ్మదీయ సమస్య గూర్చి అమూల్యాభిప్రాయము నొసగిరి. వీరు సంయుక్త నియోజక వర్గములు దేశాభివృద్ధికి మూలకారణములని నుడివిరి. ప్రస్తుతము భారతదేశమందీ సమస్యకు ప్రాముఖ్యత కలిగినది. మహమ్మదీయులలోని జాతీయ పక్షము వారికిని షాకతలీ పక్షమువారికినీ పరస్పర విరోధములుదయించినవి ఈ రెండు పక్షముల వారిని సమాధానపరచుటకై ప్రధమము నుండియు భూపాలు నవాబుగా రత్యంత ప్రశంసనీయమగు కృషి సలిపిరి కాని దేశ దురదృష్టమువలన నది విఫల మైనట్లు సిమ్లాలో జరిగిన సమావేశమువలన విదితమగుచున్నది. భారతదేశమునందు హిందూ మహమ్మదీ యొక్యతను కాక్షించు మహానుభావులందరును, మహమ్మదీయులలో నధిక సంఖ్యాకులును, ముఖ్యముగా జాతీయ వాదులందరును, సంయుక్త నియోజకవర్గములనే వాంచించుచున్నారు. కొన్ని దినముల క్రిందట నిచటికి విచ్చేసి సుమారారు వారము లిచట నివసించినట్టియు, లాహోరులోని జమీందారు పత్రికా సంపాదకులైనట్టియు మౌలానా జఫరలీఖాన్ సా॥ గూడ సంయుక్త నియోజక వర్గములే కోరుచు ప్రస్తుత స్థితిగతులనుబట్టి పది సంవత్సరముల వరకు ప్రత్యేక నియోజకవర్గము లుండవలయుననియు, తదుపరి సంయుక్త నియోజక వర్గములు కావలయుననియు, యభిప్రాయ మొసగిరి. దీనికి జాతీయ పక్షము వారొప్పుకొనినను షాకతలీ పక్షమువారు ఇందు మరికొన్ని కఠినతమములగు నిబంధన లేర్పరచిరి ఇక ముందైనను వీరు సమాధానమునకు వత్తురో లేదో చూడవలసి యున్నది. ప్రకాశంపంతులుగారు హిందూదేశ అంతస్సమస్యయగు నిది పరిష్కారముగాకున్నను రౌండుటేబిలు మహాసభ యందు పాల్గొనవలయునని యభిప్రాయమును వెల్లడించిరి. గాంధీ మహాత్ముడును, కాంగ్రెసు కార్యనిర్వాహక సభ్యులును, దీనినే యంగీకరించినారు కదా! ప్రకాశంగారు సంస్థాన ప్రజల యధికారమును గూర్చి వివరముగ చర్చింపకున్నను పటియాలా మహారాజుగారు సమాఖ్య విధానమునకు సమ్మతింపక నూతన విధానమును సూచించుట గూర్చి తీవ్రముగా ఖండించి యితర సంస్థానాధీశులు వీరి యభిప్రాయమునకు సమ్మతిని తెలుపనందున సంతసించిరి సంస్థానాధీశులు బ్రిటీషిండియాతో బాటు సమాఖ్యలో చేరవలయునని వీరు సలహా నొసగిరి
మొత్తముపై వీరు భారత దేశాభివృద్ధికరములగు నట్టియు, భావ్యభివృద్ధికి ఆటంకములగు నట్టియు, విషయములన్నిటిని చర్చించిరి. వీరు ముఖ్యముగా కోరినట్టి విషయమగు ప్రత్యేకాంధ్ర రాష్ట్రమును గూర్చి ముందు జరుగబోవు రౌండు టేబిలు సభలో విచారణకు వచ్చుననియు, గాంధీమహాత్ముడు ఈ విషయమును గురించి శ్రద్ధ వహించుటకు సమ్మతించుటచే నిది సఫలమగుననియు, విశ్వాసము కలుగుచున్నది దీని కొరకు ఆంధ్రులు తమ యావచ్ఛక్తిని వినియోగించెదరు గాక అంతః కలహముల చెలరేపి ఈ మహదాశయమునకు విఘ్నము కలిగింపకుందురు గాక!
ఆంధ్ర మహాసభలు
4-7-1931
గత సంచికయందు ఆంధ్ర రాష్ట్రీయ మహాసభాధ్యక్షులగు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రారంభోపన్యాసమును విమర్శించుచు ప్రత్యేకాంధ్ర నిర్మాణావశ్యకత యెంతవరకు గలదో నిరూపించి యుంటిమి. ఇక ఆంధ్ర మహాసభయం దేమి తీర్మానింప బడినదో చూతము అధ్యక్షులగు వరహాగిరి వేంకట జోగయ్య పంతులుగారు ఆంధ్ర దేశమును ప్రత్యేక రాష్ట్రముగ నొనరింపవలయుననియు, ఇందుకుగాను ఆంధ్రదేశమున కన్ని విధముల అర్హత గలదనియు, నొక్కి వక్కాణించి యున్నారు. ఇట్టి ప్రాముఖ్యమగు విషయమున ఏ బుద్ధిమంతునికైనను భేదాభిప్రాయముండదని చెప్పగలము. ఆంధ్ర మహాసభ యొక్క తొమ్మిదవ తీర్మానము ఇట్లు గలదు ..
"స్వరాజ్య నిర్మాణమునకు భాషాప్రయుక్త రాష్ట్రము లావశ్యకముగాని రాబోవు రాజకీయ సంప్రదింపులలోను, రాజ్యాంగ నిర్మాణము నందును, ఆంధ్ర దేశమును ప్రత్యేక రాష్ట్రముగ నిర్మించు నేర్పాట్లు గావింపవలెనని యీ సభవారు మహాత్మాగాంధీ గారికి విన్నవించు చున్నారు.”
ఈ తీర్మాన మెంతయు సమంజసమై యున్నది. రౌండు టేబిలు మహాసభలు గాంధీ మహాత్ముడొకడే కాంగ్రెసు ప్రతినిధిగా వెడలు చున్నాడు గాన ఇట్లు తీర్మానింపబడినది మహాత్ముడు భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనసూత్రమును అంగీకరించియున్నాడు. అందువలననే కాంగ్రెసు సంస్థలు యీ విధానము ననుసరించి నెలకొల్పబడినవి
ఆంధ్ర మహాసభయందు గావింపబడిన తీర్మానములలో ముఖ్యమైనది మరియొకటి గలదు. ముందు ఆంధ్ర మహాసభను ఆంధ్ర రాష్ట్రీయ సభతో గాక ప్రత్యేకముగ జరుపవలయునను తీర్మానము.ఇందువలన ఆంధ్రోద్యమ ప్రచారము తీవ్రముగ జరుగ గలదని తలంచ వచ్చును ఈ రెండు మహాసభలొకసారి జరుపబడు చుండుటచే ఆంధ్ర మహాసభ ప్రాముఖ్యత తగ్గిపోవు చున్నది. ఎల్లరి దృష్టిని రాష్ట్రీయ సభయే ఆకర్షించు చున్నది స్థాయి సంఘసభ లపుడపుడు జరుగనందున దేశములో చలన మెంతమాత్రము లేకున్నది. ఇకనైనసు తీర్మానానుసారము స్థాయి సంఘము వారు ప్రతి మాసము గూడి అంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు గాను తీవ్రమైన ప్రచారము చేయవలయును
ఇంతియే గాక గుంటూరునందు మరికొన్ని మహాసభలు జరిగినవి. వీనిలో హిందీ మహాసభకు ధర్మ వీర వామన రామచంద్రనాయకుగా రధ్యక్షత వహించిరి. వీరు రాష్ట్ర భాషయగు హిందీ యావశ్యకత నిరూపించుచు భావగర్భితమైన యుపన్యాస మొసగిరి హిందీ భాషకు రాష్ట్ర భాషయగుట కన్ని విధముల అర్హతగలదని తెలిపిరి వీరు సూచించినటుల విద్యాశాఖవారు ప్రతి పాఠశాలలో హిందీ బోధించుట కేర్పాట్లు గావించెదరని కోరుచున్నాము.
దరిద్రనారాయణుడు
3 - 10 - 1931
దరిద్రనారాయణుడగు గాంధీమహాత్ముడు భారతదేశమున యవతరించి నిన్నటికి 62 సంవత్సరములు గడిచెను. ఈ మహాత్ముని దివ్యనామముతెలియని వ్యక్తి లేడనిన అతిశయోక్తి కానేరదు. గాంధీ మహాత్ముడు కోట్లకొలది బీదలకు సేవ జేయుటకును, వారిని యుద్ధరించుటకును యవతరించెను. తన యుద్దేశమును నెరవేర్చుటకై నేటికిని అహోరాత్రులు కృషి సలుపుచున్నాడు. మహాత్మునికి ప్రేమ, సత్యము, అహింస యను మూడు గుణములు మూలాధారములు అహింసయే విజయాస్త్రము ప్రేమవలననే శత్రువులను కూడ లోబరుచుకొన గలుగుచున్నాడు. భారతదేశములోని కోట్లకొలది బీదల దుస్థితి గాంచి సహించ లేక తాను గూడ ఐచ్చిక దారిద్ర్యమును స్వీకరించెను. వారిని యుద్ధరించుటకై రాట్న పరిశ్రమ లేవనెత్తెను రాట్నమే బీదలకు భుక్తి నొసగునని ప్రపంచమునకు చాటెను ఇది యొక పిచ్చి యని పలువురు పరిహసించసాగిరి నేడయ్యదియే సుదర్శనచక్రముగా మారినది విదేశ వస్త్రములను భారతదేశమున దిగుమతి కాకుండ జేయుచున్నది నిరుద్యోగులకు పని గల్పించినది. భారతీయులకు స్వదేశీపై ప్రేమ గలిగించినది. మహాత్ముడి రాట్నమును ప్రజల హర్నిశములు ద్రిప్పవలయునని కోరుచున్నాడు ఖద్దరే సర్వదా ధరించవలెనని హెచ్చరించుచున్నాడు ఖద్దరువలన భారతీయులలో కలిగిన నూతనోత్తేజము గత సత్యాగ్రహ సమరమున ప్రపంచమునకై విదితమైనది బ్రిటిషు ప్రభుత్వము వారిని భయకంపితుల గావించినది. నిర్బంధప్రయోగములన్నియు వ్యర్థమైనవి సత్యము, అహింసపై ఆధారపడినచో జయము తప్పక చేకూరునను విశ్వాసము ప్రజలలో యుద్భవించినది వేయేల ఖద్దరువలన భారతదేశమున నూతనశకము ప్రారంభమయ్యెను. ఈ శకమునకు మూలపురుషుడు గాంధీ మహాత్ముడు. ఈయన బోధించుచున్నది ఖద్దరు మంత్రము. ఈ మూడక్షరములు జపించిన వారికి భుక్తియు, ముక్తియు సమకూరును ధైర్వస్థైర్యములు గలుగును. ఇట్టి మంత్రమును జపించి ముక్తిబడయని దేశీయులుండజాలరు గదా!
గాంధీ మహాత్ముడు ప్రజల ఆర్థికస్థితి చక్కబెట్టుటకై పూనుకొనుటయే గాక దేశమునందు వ్యాపించిపోయిన దురాచారములను కూడ పెరికివేయుటకై పూనికొనెను మహాత్మునికి ముఖ్యముగా అస్పృశ్యత అమానుషమైనదిగా గన్పట్టెను భూతదయ బోధింపబడునట్టి భారతదేశమున తోడిమానవుల కుక్కల కన్న హీనముగా జూచుట మానుషలక్షణమునకు యోగ్యముగాదని తలంచి, అస్పృశ్యతానివారణమునకై భారతీయులకు ప్రబోధించెను ఈ దశాబ్దములో అంటరానితనము చాలవరకు తొలగిపోయినది దేశాభిమానుల ప్రయత్నమువలన నింకొక దశాబ్దములో అంటరానితనము పేరు లేకుండ సమసిపోగలదు.
గాంధీ మహాత్మునికి దైవముపై భక్తి మెండు. ప్రతి కార్యమునకు దైవ సహాయ మపేక్షించుచుండును ఉదయము సాయంత్రము భగవత్ ప్రార్థన సలుపును. దీని యొక్క యావశ్యకత ఇతరులకు బోధించుచుండును. ఇటీవల రాజవూతానా యెడలో నొక విద్యార్థి ప్రశ్నకు జవాబొసగుచు ఆత్మకు దైవప్రార్థనయను ఆహార మత్యవసరమనియు, ప్రార్ధన జేయు కొలది మానవునికి పరమేశ్వరునిపై విశ్వాసము హెచ్చుననియు బోధించెను మహాత్మునికి భగవద్గీతలోని నిష్కామయోగము మూలకందము. పరమేశ్వరునిపై నిట్టి అచంచల భక్తి యున్నను కొందఱు మతాభిమానులవలె మతమను పిచ్చిలోబడి ఇతర విషయములను వర్జించువాడు కాడు తన మతమే శ్రేష్ఠమని ఇతర మతము వారితో వాదించువాడు కాడు తన మతమెట్లు శ్రేష్ఠమో, ఇతరుల మతము కూడ నట్టిదే యని భావించువాడు సర్వమత సహనము మహాత్మునికి విలువలేని భూషణము. ఏ మతము సిద్ధాంతముల నుండి యైనను సద్విషయములను స్వీకరించుటకు సంసిద్ధుడు. కనుకనే అన్ని మతముల వారును, అన్ని జాతుల వారును, గాంధీ మహాత్ముని ప్రేమించుచున్నారు.
గాంధీ మహాత్ముడు రాజకీయవేత్త గాడని కొందఱు వాదించెదరు అయ్యిది నిరాధారమని తెలుపుటకు ఇటీవల రాజకీయ విషయములో అవలంబించుచున్న వైఖరి వలన గాన నగును. ఏ విషయము నందైనను మహాత్ముడు సత్యముపై నాధారపడి యుండును నిష్కపటముగను, మొగమోటము లేకుండును, తన అభిప్రాయములను వెల్లడించును ఇతరులను లోబరచుకొనవలెనని అసత్యములాడడు ఇతరులకు నష్టము కలిగించ వలయునని అతని యుద్దేశము కాదు గతవారము లంకాషేరు ప్రజల దుస్థితి గాంచి పరితపించెను వారికి తగిన సహాయము చేయుటకై ప్రయత్నించెదనని వాకృచ్చెను అట్టి సుగుణములన్నియు గాంధీ మహాత్ముని యందు పుంజీభవించి యుండుటచేతనే భారతీయులు ఆయన నొక అవతార పురుషునిగ భావించు చున్నారు ప్రపంచ మంతటను ఖ్యాతి యినుమడించు చున్నది.
మహాత్ముడు ప్రశంసా వాక్యములతో తృప్తి నొందువాడు కాడు. రాట్నము చేపట్టిననే అతనికి సంతృప్తి కలుగును. మహాత్ముని కత్యంత ప్రియమైన విషయము ఖద్దరు. మనము ధరించుటకు సిద్ధపరచుటకై ప్రయత్నించుట, ఇతరులకు బోధించుట మన కర్తవ్యమై యున్నది. అపుడే ఆ దరిద్ర నారాయణుని పూజించిన వారమగుదుము. దీని వలన మన కిహపరములందును మోక్షము గలదు. గత సమరమున తయారు చేయబడిన కోట్ల కొలది విలువగల ఖద్దరు నిలువయున్నదనియు, అయ్యిది విక్రయించి మరల ఖద్దరు ఉత్పత్తికై బీదలకు పనిగల్పించ వలెననియు, కాంగ్రెసు మహా సభాధ్యక్షులగు సర్దారు వల్లభభాయి పటేలు గారు హెచ్చరించుచున్నారు. గాంధీ మహాత్ముడు మన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుటకై దూరదేశమున నున్నాడు. అట్టియెడ మన కర్తవ్యము మనము నిర్వహించి ఆయనకు తృప్తిగలిగించుట మన విధ్యుక్త ధర్మము. దరిద్ర నారాయణుని సంకల్పమునకు విజయము కలుగుగాక!
GPS.3 (1)
తృతీయాంధ్ర మహాసభ
23-1-1932
ఎన్నడును గష్తీనిషాన్ 53 దెబ్బ యింత బాగా తగిలియుండలేదు. రెండు సంవత్సరములుగా ఆంధ్ర మహాసభలకు అనుజ్ఞ సులభముగా నెల పది పూటలకు ముందే దొఱకుచుండెను కాని యీ తృతీయాంధ్ర మహాసభా గ్రహచారమేమో పాపము ఇంక 13 దినములే మిగిలియున్నను నింతవరకు అనుజ్ఞ దొఱకలేదు ఆంధ్రులందఱును తహతహపడుచున్నారు ఒక దిక్కు కొల్లాపురములో వందలు వ్యయముచేసి మంటపములు సిద్ధముచేయు చున్నారనియు, నింతవరకు ఆ కార్యమునకై యెంతయో వ్యయమైనదనియు వార్తలు వచ్చు చున్నవి.
మఱియు కొల్లాపురము వారు ఈ సభలకు ప్రతికూలముగా నున్నారనియు, తాము తమ సంస్థానము హద్దులతో సభలుచేయ నియ్యమనియు ననుచున్నారని వినుచున్నాము సంస్థానము వారు సభలు రాజకీయములు కానంత వరకు, రాజద్రోహము చేయునవి కానంతవరకు తుదకు మతభేదములు యనుజ్ఞ నియ్యనొల్లరో యర్థమగుట లేదు. గష్తీనిషాను 53 వారికి వర్తించదని తలచినారా? ఖాల్సాకు మాత్రమే యీ గష్తీ వర్తించును మాకిది వర్తించదని వారు అనజాలరు
ఇప్పుడీ వ్యవహారము బాబెహుకూమతు వరకు పోయినదని వినుచున్నాము. ఒక వేళ బాబెహుకుమతు వారు సభ సంస్థానమందు చేయగూడదు, కావలసిన ఖాల్సాలో నెచ్చటనైనను చేయుడు. సెలవిత్తము" అని తీర్మానించిన (అట్లు చేయరని మా దృఢ విశ్వాసము) దీని ఫలితము చాల వికారముగా పరిణమించునేమో! ఇట్టి యాజ్ఞను ఆధారముగా గొని యికముందు కొల్లాపుర సంస్థానమందేకాక యే యితర జాగీరునందుకు తదధికారులు సభలనుచేయ నియ్యరని చెప్పవచ్చును. అట్టిచో సంస్థానములందుండు ప్రజలు చాలా కష్టముల పాలగుదురు తమకు విద్యకావలెనని, తమను వెట్టిచాకరి చేయించవలదని, తమకు గ్రంధాలయము కావలెనని, తమ ప్రభవులతో నెట్లు చెప్పుకొందురు ఇప్పటికైనను ఆలస్యమైనను బాబెహుకూమతు వారు ఈ 2-3 దినములలో సెలవిత్తురని విశ్వసించుచున్నాము
ఈ యాంధ్రసభలు చాల నిరపాయములనియు ప్రజాహిత సంస్థలనియు, రాజభక్తి కలవనియు, మన నిజాము రాష్ట్ర పత్రికయగు మన్షూనుచేత సనదు పొందుటయే కాక నిచ్చటికి 500 మైళ్ళ దూరమున నున్న మద్రాసునుండి ఇంగ్లీషులో వెలువడు హైద్రాబాదు హెరాల్డు పత్రికచేతను మంచి సర్టిఫికెట్టును పొందినది. ఒకవేళ కొల్లాపుర అధికారులకు తెలియకున్న నీ సభ విషయమై మా బాబెహుకూమతు వారికి బాగుగా తెలియును
హైద్రాబాదు సివిల్ సర్వీసు
2 - 3 - 1932
బ్రిటిషు ఇండియా ఐ. సి. యస్ పరీక్షలెట్లో, మైసూరు సంస్థానములో మైసూరు సివిల్ సర్వీసు పరీక్షలెట్లో, మన రాష్ట్రములో హైద్రాబాదు సివిల్ సర్వీసు పరీక్షలట్లు ఏర్పాటుఅయి అనేక సంవత్సరములైనది ప్రతి సంవత్సరము 52 విద్యార్థులను ఈ సర్వీసులోనికి తీసుకొనుచున్నారు. కాని యీ పరీక్షలలో మనకు బ్రిటిషు ఇండియాకును, మైసూరునకు చాల భేదమున్నది బ్రిటిషు ఇండియాలోని పరీక్షలకే విద్యార్థులు బి ఏ. పరీక్షయందుత్తీర్ణులై యుండవలెను. ఆ విద్యార్థులు పరీక్షయియ్య వలసిన విషయమంతయు, ఇంగ్లీషులోనే యుండును ఒక్క పత్రికమాత్రమే ఏదైన యొక ప్రాచీన భాషలో (Classical) నుండును.
మన రాష్ట్రములోని పరీక్షా విషయములో బహుకాలము నుండి ఏ కారణముచేతనో హిందువులు కృతార్థులగుటలేదు ఒక్కొక్క సంవత్సరమొక్క హిందువు సహితము సర్వీసునకెన్నుకొనబడడు ఇట్లు అనేక సంవత్సరముల నుండి జరుగుచున్నది. దీనికి కారణములు చాలమందికి సరిగా తెలియదు హిందువులకు ప్రోత్సాహము ప్రభుత్వమువారు కలిగించుట లేదని జనులనుకొనుచున్నారనియున్నది సరికాదనియు ప్రభుత్వ పక్షమున యొక ప్రకటన కావింపబడెను. ప్రభుత్వమువారిట్లు అనుచున్నారు.
"సెలక్షను బోర్డువారు హిందువులకు ప్రతికూలముగా నున్నారని యనుచున్నారు. కాని ఎన్నికలను జేయునప్పటి యంకెలజూచిన ప్రభుత్వము వారికందఱును సమానులేయని విశదమగును. నియమముల ప్రకారము వయస్సులో ముల్కీ యగుటలో, ఆరోగ్యవిషయములోనే విద్యార్థి తృప్తికరమగు నిదర్శనములను జూపించునో యతడు దరఖాస్తు ఇయ్యవచ్చును దరఖాస్తులను విచారించునపుడు ప్రభుత్వమువారు హిందులయెడ ప్రత్యేకముగా రియాయతీ ఛేయుచుందురు. ఆఖరు నియామకము పరీక్షా ఫలితమును బట్టి యుండును. పరీక్షకులు విశేషముగా రాష్ట్రమునకు బయటనుండువారే యుందురు. అట్టిచో ముసల్మానులయెడ పక్షపాతమెట్లుచేయనగును. ఈయేడు సంవత్సరముల సంఖ్యలను జూచిన హిందువులు తక్కువసంఖ్యలో దరఖాస్తులిచ్చుచున్నారు. అది హిందువులతప్పే అయినను, వారిలో నెక్కు వమందినే నామకరణము చేయుచున్నాము 16-32 లోని సంఖ్యల జూచిన 100 మంది హిందూ దరఖాస్తులలో 60 మంది నామకరణమైనది కాని...... ముసల్మాను దరఖాస్తులలో 298 మాత్రమే నామకరణమైనది పోటీ పరీక్షలోనే హిందువులు క్రిందబడి పోవుచున్నారు”
ఇది ప్రభుత్వము వారి సమాధానము ప్రభుత్వము వారు హిందువుల విషయములో చూపించెడు ప్రేమకు మేము కృతజ్ఞులము మరియు ప్రభుత్వము వారు ప్రజల పక్షమునుండి నేవిధమైన యాక్రోశము కలిగినను వెంటనే దాని విషయమున తమ యభిప్రాయమును వెల్లడించుట చూడ వారి ప్రజానురాగము వెల్లడియగుచున్నది అందుచేత మేము ప్రభుత్వము వారికి రెండు మూడుసూచనలు చేయసాహసించుచున్నాము పైప్రకటనలోని విషయములలోకొన్ని సమాధానములు మాకు సరిగా నచ్చలేదు నామకరణము అనునది వేరు. పరీక్షా ఫలితముగా నియామకమువేరు. నామకరణములో హిందువులనెక్కువగా తీసికొనినంతనే హిందూ విద్యార్ధులకు లాభములేదు హిందువులలో నూటికి 60కి మారుగా 95 తీసికొని ముసల్మానులలో నూటికి 5 మందినే నామకరణము చేసి రనుకొనుడు. పరీక్షా ఫలితముగా ముసల్మానులు 5 లో 4 గురిని తీసికొని హిందువులలో 95 లో నెవ్వరినిగూడ గెలిపించక యుండవచ్చును. కావున పై నామకరణ సంఖ్యలవలన లాభములేదు. మనకు కావలసినది అసలు నియామకములు
హిందువులు నిశ్చయముగా చాలకొలది మందియే దరఖాస్తులిచ్చుచున్నారు. అది హిందువుల తప్పేయనుట కొంత నిజమను కొందాము కాని యంతయు హిందువుల తప్పుకాదు ఈ 15 - 20 ఏండ్లుగా హిందువు లెందఱు ముసల్మాను లెందరు ఎన్నుకొనబడినారు ముసల్మానులే నూటికి 95 ప్రకారము తీసికొనబడి యున్నారు. ఇది చూచియే హిందువులకు దినదినము ధైర్యము తక్కువై లాభములేని యీ విశ్వప్రయత్నములేల యని మానుకొనినారు సాధారణముగా ప్రతి మనుష్యుడు ఎదుటి వాని భావము గుర్తించి పనిచేయును ఎదుటి వాడు తనకు సుముఖుడు కాలేడని యొకనికి తెలిసిన వాడు వాని దగ్గఱకే పోడు ఎదుటివాడు తనయందు ప్రీతియున్నదని వాడు గుర్తుపట్టిన వాని దగ్గఱకు తాను పోవుటయే గాక తన బంధువులను గూడ బిలిచికొను పోవును ఏ సంవత్సరమైన హిందువులు హెచ్చుగా తీసుకొనబడిన దాని ఫలితము మఱుచటి సంవత్సరమే విశదమగును, హిందువు లెక్కువ సంఖ్యతో ప్రయత్నింతురు ఇదియే దీని రహస్యము.
ఇక యొక ముఖ్య విషయమును గమనింపవలసియున్నది. హిందువుల నామకరణము హెచ్చుగా నుండినను వారెందుకు పరీక్షలో కృతార్థులు కారు ఒకవేళ యిచ్చటి వారు పరీక్షకులుగా నుండిన పక్షపాతము చూపి యుందురని తలపవచ్చును. కాని యందఱును బయటివారే కదా పరీక్ష చేయునది
ఈ వాదము బాగుగానే యున్నది. కాని మా యభిప్రాయమున బయటివారు కూడ ముసల్మానులే యుండవచ్చునని హిందువులు తలుచుచున్నారు. ఏలయిన విశేషముగా పరీక్షా పత్రములు ఉర్దూ సంబంధము కలవే అందుచేత ఉర్దూ వచ్చిన ముసల్మానులే ఈ పరీక్షకులుగా నుండిన విచిత్రము కాదు. అయినను ఈ విషయములో మాకాక్షేపణము లేదు
మేమాక్షేపించునది పరీక్షా పద్ధతియే! పరీక్షలో మొత్తము 500 గుణములు. అవి యిట్లు విభజింపబడినవి
ఇంగ్లీషు ప్రశ్నా పత్రిక | 100 |
ఉర్దూ వ్యాసము | 100 |
ఇంగ్లీషు నుండి ఉర్దూకు, ఉర్దూ నుండి ఇంగ్లీషుకు తర్జుమా | 100 |
ఆధునిక సమస్యలు ఇంగ్లీషులో 50, ఉర్దూలో 50 | 100 |
నోటి జవాబులు | 100 |
మొత్తం | 500 |
ఈ 500 నూర్లలో నోటి జవాబులు.............. మూలకము కానందుచే అందు భాషా జ్ఞానము..... అభిప్రాయ జ్ఞానమే ప్రధానము కాన అదిపోగా మిగతా 400 గుణములలో ఉర్దూ కొరకై 250 గుణములున్నవి. అనగా ఉర్దూ మాతృ భాష కలవారికెక్కువ సౌకర్యమున్నది. తక్కిన వారికి లేదు దీని వ్యాఖ్యాన మేమన హిందువులకు కష్టము ముసల్మానులకు సులభము ఇదియే హిందువులు వెనుకబడుటకు ముఖ్య కారణము ఇదెట్లున్నదన ఉరుకుడు పందెములో కొందఱిని అడ్డు లేక చక్కగా ఉరుకుమనుటయు మరికొందఱిని తట్టుకపడు కట్టె అడ్డము పెట్టి ఉరుకుమనుటయు నెట్లో ఆట్లు (Running races Huddle race) సాధారణముగా అధికారులలో నడుమ పందెము (Walking race) ఉండును. అందు ముసలివారిని, పొట్ట పెరిగినవారిని, నడుము విరిగిన వారిని, నడ్డి వచ్చిన వారిని 100 గజముల దూరము ముందుగానే నిలిపి బాగున్న వారిని వెనుకబెట్టి పందెము నడుపుచుందురు ఈ సర్వీసు పందెము కూడ అట్లే కనబడుచున్నది. 'యోదుల్ ఖద్మతు "లకు మన రాష్ట్రములో "ముల్కీ జబాను" పరీక్ష కలదు అట్లే యీ సర్వీసు వారికిని తెనుగు మహారాష్ట్రము, కన్నడములో నేదియైననొక భాష పెట్టి దానికని 100 మార్కులైన పెట్టిన అపుడు సంగతులు తెలియగలవు
మన రాష్ట్రములో పుట్టి తెలంగాణాలో పెరిగి నౌకరీలు చేయు గొప్ప అధికారులు తమ ప్రజల భాష యెరుగని వారు వందల కొలది యున్నారు. అట్లే మరట్వాడాలో. ఇపుడు హిందువులను 400 మార్కులలో 250 మార్కుల ఉర్దూ ప్రశ్నలకు సివిలు సర్వీసులో వ్రాయు మనిన తమ భాష కాకున్నను వారెట్లో ప్రయత్నించుచున్నారు హిందూ విద్యార్థులు ఉర్దూలో నూటికి 40 వచ్చిన పరీక్షలో కృతార్థులగుదురను కొందము ముసల్మాను విద్యార్థుల సౌకర్యార్థమై మరాటీ తెనుగు కన్నడ భాషలలో నేదేని యొకదాని యందు నూటికి 20 మాత్రమే గుణములు వచ్చిన కృతార్థులుగా చేయుటకై మే మొప్పు కొందుము
కావున హిందువులకు సౌకర్యములు తక్కువ దానిపై ప్రోత్సాహము లేకుండుట, అందుపై ఉర్దూలో విశేష భాగము పోటీచేయుట యివియే వారికి ఆటంకములు కలిగించుచున్నవి ఉర్దూ రాజకీయ భాష అనునది మాకు తెలియును. మరియు నితర భాషలు ముల్కీ భాషలనియు మాకు తెలియును ప్రభుత్వము వారికి తల్లిలేని పిల్లలపై యింకను యెక్కవ శ్రద్ధ యుండవలెను, లేకున్న (యతీంఖానా) లుండి యేమి ఫలము ఇప్పుడు “యతీంఖానా”లో చేరిన తెలుగు, మరాటీ, కనడీలకు మంచి గుఱుతుగల గొల్లభామ గడ్డిపాలనైన పోసి పెంచినచో మరి కొంత కాలము జీవింపగలవు
భిక్షా నిరోధక శాసనము
30-3-1932
మన సిఫాయివారు మూడెండ్లుగా మంత్రాలోచన జేయుచున్నారు భిక్షా నిరోధము చేయుదమా వద్దా అని మనము ఇంగ్లాండులో పూర్ లా (బీదవారి శాసనము) అనునది చేసిన 300 ఏండ్ల తర్వాతను భిక్షాశాసన మవసరమా లేదా అని యాలోచించుట మన సాంప్రదాయమున కేమియు విరుద్ధము కాదు
మన రాష్ట్రములో బీదవారుండున దెవరికి తెలియదు హిందుస్థానములో 7 కోట్ల మంది ఆన్నమో రామచంద్రా యనుచు ఉగాది పండుగ నాటి నుండి హోలీ పండుగ వరకును ఒక్కనాడును రెండు పూటలలో కడుపునిండ అన్న మెరుగక యున్నారని బ్రిటిషు, ఇండియా అధికారులే చెప్పియున్నారు ఇక హైదరాబాదు రాష్ట్ర విషయమేమి చెప్పవలెను.
అందుపై అజుడు అహమదుగారే కాక, రహబరువారే కాక, హెరాల్డే కాక, తుదకు మన ప్రభుత్వము వారును ముసల్మానులు బీదవారిని నిర్ణయించినారు వారికీ శాసనము చాలా సహాయము చేయును.
శాసనము చేసిన కేవలము భిక్షా నిరోధములో లాభము లేదు సర్కారువారు భిక్షకులలో కుంటి గ్రుడ్డి ముదుసలిముతక, అనాది వారిని పోషించి తీరవలెను వారికి (బైతుల్ మాజురీన్) అనాథాలయములు కట్టి అందు వారిని బలవంతముగా నుంచవలెను వారికి మంచి భోజన వసతుల నేర్పాటు చేయవలెను. తక్కిన మొండి బిచ్చగాండ్లను బిచ్చమెత్తనీయకూడదు మన దేశములో మంచి పెల్వానుల వంటివారును యువకులును, బిచ్చమెత్తుటయే ముఖ్య వ్యాపారముగాను, అందొక కులాచారముగాను నుంచుకొని యున్నారు. బుడుబుడుకల వారు బాలసంతువారును నాటకములలోని రాజాలవలె నానారంగుల బట్టలతో బిచ్చ మెత్తుదురు దొంగ సన్యాసులు, పక్కిరులు, జోగులు, జంగములు మందిని మోసము చేయుచుందురు కత్తులు మ్రింగువారు, పెద్దమ్మ భక్తులమని పెద్ద పెట్టెను మోసకొని కొరడాలతో శరీరమంతయు రక్తములుకారు హింసించుకొనువారును పెద్ద బందల పొట్టలపై పెట్టుకొని యుండువారును, రోడ్లపై త్రాగుబోతువలె దొర్లుచు శరీరమంతయు భూతముల రీతి రంగురంగుల పట్టెలతో చిత్రించుకొని బిచ్చమెత్తు వారును వేలకు వేలు గలరు మొండి బిచ్చగాండ్రు తమకిచ్చిన సరే లేకున్న తిట్టిపోవువారును వేలకుగలరు ఇక పాముల వారు, కోతులాట వారు, గంగిరెద్దుల వారు, ఎలుగుబంటు వారు, జంతువులబట్టి ఆడించి బ్రతుకు వారొక కొందరు, వీరందరును శరీరదార్ఘ్యము కలిగియు బిచ్చమెత్తుట వలన దేశసంపదకు నష్టము ఈ సరుకు పనికిరాని సరుకు (Un Prodective) వీరందఱిరి ప్రభుత్వమువారు పనిచూపవలెను ప్రభుత్వము వారి కంట్రాక్టు పనులును చెరువుల పనులును, ఇట్టి యితర పనులును మొదలు వీరితో పని తీసుకొనునట్లేర్పాటు చేయవలెను వీరట్లు చేయకుండిన వీరిని జైయిలున పెట్టి యుంచి వీరినుండి పనితీసుకొనుచు ఎన్నడు వీరికి బుద్ధివచ్చి పనిచేయుట కొప్పు కొందురో ఆనాడు వదలవలెను
ఈ శాసనము కేవలము నగరమునకే కాక రాష్ట్రమంతటికి గావించిన చాల మేలుగా నుండును. మేము మూడు సంవత్సరముల క్రిందటనే యీ విషయముగ మాయభిప్రాయ మిచ్చియుంటిమి. ఇప్పుడైనను కేవలము అభిప్రాయములతో తృప్తిపడక మా పురపాలకసంఘము వారి శాసనమును వెంటనే గావింతురని నమ్ముచున్నాము.
మన ప్రభుత్వము వారి పాఠము
30 - 3 - 1932
రెండు వారముల క్రితము శ్రీ ప్రభువుగారు లక్నోలోని బాలికా పాఠశాలలో నిచ్చిన యుపన్యాసము వేరుచోట ప్రకటించుచున్నాము. శ్రీవారెంతటి ఘనమైన సంస్కారులో దానివలన విశదమగును. శ్రీవారి యాదర్శము కేవలము ముసల్మానులకే కాక హిందువులకును అనుకరణీయము. మన రాష్ట్రములో ముసల్మానులలో పరదా పద్దతి విశేషము ఈ పరదా ఘోష అనుపదములు ఉర్దూలో నెట్టి యర్థములున్నవో సంస్కృతములో మాత్రము తగిన యర్ధములే కలవైయున్నవి. పరద యనగా నితరులకిచ్చుట, ఘోషయనగా శంఖము పూరించుట ఈ యవస్థలు రెండును పరిహార్యములే
పరదా వలన స్త్రీలకేకాక పురుషులకును చాల ఇబ్బందులు కలుగుచున్నవి మన రాష్ట్రములో పరదా పూర్తిగా ముదరిపోయియున్నది ముసల్మానులను జూచి హిందువులును పరదాలోనికి దిగినారు ముఖ్యముగా మన ఆంధ్రులలోనే యీ ఆచారము ప్రబలిపోయినది మహారాష్ట్రులలో లేదనవచ్చును అంధ్రులలోను అందరిలో లేదు ముఖ్యముగా శ్రీమంతులగు రెడ్లు అనగా దేశముఖులు, జాగీర్దారులు, వెలమదొరలు గోల్కొండ వ్యాపారులు ఈ గోషాపై పట్టుదల చాలా కలవారు
శ్రీ నిజాం ప్రభువంత మహామహులే గోషాను వదిలి యుండ యిక తక్కిన వారికీ యభిమానమేల? యథారాజా తధాప్రజా యనునట్లు ప్రజలును ఈ యుత్తమాదర్శమును గ్రహించి యాచరించుకొందు గాక
ఈ పర్దాపోయిన హిందూ ముసల్మానుల యైకమత్యము కూడ చేకూరు ననిన అనేకుల కాశ్చర్యము కలిగింప వచ్చును. కాని దూరముగా ఆలోచన చేసిన యథార్థమని విజ్ఞులు గ్రహింప గలరు. మనదేశములో దురాచార ములు త్వరగా పట్టుబడుటయు, నవి వదిలించుట దుర్ఘటమగుటయు చారిత్రకానుభవము చెప్పగలదు తుర్కీ వంటి పరదా రాజ్యమే సంపూర్ణముగా నొక్క దినములో పరదాను గాలికి విసరి వైచెను మన రాష్ట్రములో సహితము శ్రీ ప్రభువుగారి యుపన్యాసానుసారము హిందూ ముసల్మానులందఱును త్వరలో పర్దా ఘోష వదులు కొందురు గాక
పరదా వదులుట మంచిదా ఉంచుట మంచిదా యను విషయములో మౌల్విలును, దొరలును, ఉంచుటయే మంచిదని వాదింప వచ్చును. పాశ్చాత్య దేశములో పర్దా లేనందున స్త్రీలు చెడిపోవు చున్నారనియు, ఎక్కడ జూచిన విడాకులే జరుగుచున్నవనియు వ్యభిచారములు జరుగుచున్నవనియు అజ్ఞులు కొందఱు పాశ్చాత్య స్త్రీలపై నిందలు మోపుచున్నారు. కాని వారు యధార్థము తెలియక తమ దురభిప్రాయములను వెల్లడిచేసి కొనుచున్నారు. ఏ జాతిలో వ్యభిచారము హెచ్చుగా నుండునో యా జాతికి గౌరవము గాని ఔన్నత్యముగాని యుండనేరదు ఇంగ్లీషు వారిలో అనేక అనుకరణీయములైన ఉత్తమ గుణముండుట చేతనే వారు మనదేశములో 3 లక్షల మందియే యున్నను 3500 లక్షల జనులమైన మనలను సునాయాసముగా లోబఱచుకొని పరిపాలనము చేయు చున్నారని అట్టి ఇంగ్లీషు వారిని, మరియు నితర పాశ్చాత్యులను మనము బాగుగా నెఱుగక వారి సాంఘిక మర్యాదలు మనకర్ధము కాకను, మన సాంఘిక మర్యాదలకు విరుద్ధముగా కనిబడినంతనే మనకవి సరిపడకుండుట చేతను మనలో ప్రబలిన సంకుచితాభిప్రాయములచే మన సోదరులు అనేకులు వారిని దూషింతురు........
మన రాష్ట్రమందలి కాగిత పరిశ్రమ
27 - 4 - 1932
ఇంతవరకును మనరాష్ట్రములో కాగితముల పరిశ్రమలు పూర్తిగా లేవని భావింప జనదు. మనరాష్ట్రములో నేటికిని రెండుమూడు తావులందు కాగితములు తయారు చేయబడుచున్నవి. ఔరంగాబాదు నగరమునకు 10 మైళ్ళ దూరములో ఎల్లోరా గుహల సమీపమందు ఒక గ్రామము "కాగజ్‌పూర్ " అని అన్నది. దాని పేరును బట్టయే దాని సంగతి తెలియును. కాగజ్ అనుఫార్సీ పదము నుండియే మన తెలుగులో కాగితము లేక కాగిదము అని యేర్పడినవి సంస్కృతమందు పత్రము అని యందురు. పత్రమనగా ఆరు. ప్రాచీన కాలము నుండి మొన్న మొన్నటివరకు మన పూర్వులు దక్షిణమున తాటి యాకులపైనను, ఉత్తరమున భూర్జపత్రములపైనను వ్రాయుచుండిరి. అందుచేతనే పూర్వవాసనా విశేషముచేత నేటికిని కాగిదములను సంస్కృతములో పత్రములని యందురు
కాని కాలము మారినది పాశ్చాత్య దేశములో అచ్చు పనులు వృద్ధియైన కొలదియు, గ్రంథములసంఖ్య హెచ్చైనకొలదియు, కాగిదముల యవసరము విశేషమయ్యెను. అందుచేత పాశ్చాత్య దేశములలో కాగిదముల యంత్రాలయములు వేలకొలది గలవు
మన హిందూస్థానములో బెంగాలులోను మద్రాసు రాజధానిలోను మొత్తముపై మూడే కాగితముల యంత్రాలయము లుండినట్లు కనబడుచున్నది. అందుచేత మన దేశములో నీ పరిశ్రమ యొక్క యవసరము చాలగలదు. ఈ యంశమును దృష్టి యందుంచుకొనియే మన రాష్ట్ర ప్రభుత్వము వారు మన రాష్ట్రములో నీ పరిశ్రమను స్థాపించవచ్చునా లేదా స్థాపించిన లాభముండునా లేదా యను విషయములను నిర్ణయించుటకై కొందరి శాస్త్రజ్ఞులను నియమించిరి వారు తమ పరిశోధనా ఫలితముగా నొక నివేదికను సిద్ధము జేసిరి అట్టి నివేదిక యొకటి యా యభిప్రాయార్థమై మాకు ప్రకటనశాఖ ద్వారా పంపబడినది
ఈ నివేదికలో హిందూస్థానములో ప్రతి సంవత్సరము 1 లక్ష టన్నుల తూకముగల కాగితము బయటినుండి దిగుమితి యగుచున్నదనియు నిప్పుడుండు హిందూస్థానపు యంత్రాలయములలో 45 వేల టన్నుల కాగితమే తయారగుచున్నదనియు, తెలిపినారు. మన రాష్ట్రములో ప్రతి సంవత్సరము 1600 టన్నుల కాగితము దిగుమతి యగుచున్నదని 1335-1340 ఫసలీల లెక్కల నుండి చూపించినారు.
ఈ కారణములచేత మన రాష్ట్రములో కాగితపరిశ్రమ యవసరమని తోచినది. దీనికి తగిన స్థలము తగిన ధనము తగిన యితర సౌకర్యములన్నియు గావలసి యున్నది కాగితము సిద్ధము జేయుటకు బొంగులు (వెదురు లేక గోవా కట్టెయని కొందరందురు) ఆదిలాబాదు జిల్లాలో విశేషముగా కలదు. ఈ జిల్లాలో నేలబొగ్గుగనుల సామీప్యమునుబట్టి బొంగుల సమృద్ధినిబట్టి నీటి వసతినిబట్టి, కూలీల యవసరమునుబట్టి మంచెరియాలయును సిరిపురమును చాలా తగిన స్థలములనియు నీరెంటిలో సిరిపురమే పైచేయి యగుననియు నివేదికలో నిర్ణయించినారు.
నివేదికలో సంవత్సరమునకు 5000 టన్నుల కాగిదమును తయారుచేయుట కంచనా వేయబడినను 10 వేల టన్నులవరకును తయారు చేయుటలో నిబ్బంది యుండదని చూపియున్నారు. 5000 టన్నులు సిద్ధమైనను మన రాష్ట్రముయొక్క అవసరములు పోగా బ్రిటిషు హిందూస్థానమునకు 3000 టన్నులకు పైగా ఎగుమతి జేయవచ్చును.
ఈ యంత్రాలయమునకై 50 లక్షల ధనము అవసరమని నివేదికలో చూపియున్నారు. ఇట్లు ఖర్చు పెట్టి స్థాపించిన దానిలో ప్రతి టన్ను కాగితములకై 366 రూపాయలు ఖర్చగునని యంచనా వేసినారు ఇపుడు మార్కెట్‌లో ఒక టన్ను కాగితములు 500 రూపాయలప్రకార మమ్ముదురనియు ఈ లెక్క ప్రకారము ప్రతి టన్ను పై రూ. 134 లాభము దొరుకుననియు యీ ప్రకారము లెక్కించిన నూటికి రూ. 5-11-0 ప్రకారము లాభము కలుగగలదనియు జూపినారు. ఇది మంచి లాభమే
ఇంతవరకు వేదికలోని ముఖ్యాంశములను జూపినారు ఇక నీ యంత్ర స్థాపన యవసరమా లేదా యను విషయమాలోచింతము. మన రాష్ట్రములోనికి వచ్చు కాగితములకై ప్రతి సంవత్సరము మనము 6 లక్షలకన్న హెచ్చుగా ఖర్చు పెట్టుచున్నాము మరియు ప్రభుత్వమువారే బహుళ యీ మొత్తములో నాల్గవ మొత్తము ఖర్చు పెట్టుచుండవచ్చును మన రాష్ట్రములో నీ పరిశ్రమకయి కావలసినన్ని సౌర్యములుండినపుడెందులకు దీనిని ప్రారంభింపకూడదు. ఈ కార్యమును ధనికులెవ్వరయిన చేయుదురేమోయని ప్రభుత్వమువారూరకుండిన లాభములేదు ధనికులెవ్వరును క్రొత్తక్రొత్త మార్గములలో లక్షలు వ్యయము చేయుటకై సంసిద్ధులుగా నుండరు ప్రభుత్వమువారే దీనిని స్థాపించవలయును లేదా ప్రభుత్వమువారు హెచ్చుభారము వహించి మిగత భారమునకై వాటాల పద్ధతిపయి ప్రజలను భాగస్థులను జేర్చుకొనవచ్చును. మొత్తముపై ప్రభుత్వము వారే యీ కార్యాలయమును స్థాపించుట సమంజసము దానికి అనుకూలమైన సమయముకూడ నిదే సమయము!
స్వవిషయము
7 - 5 - 1932
ఎటులో నొకరీతి యీ పత్రికకు ఆరవ సంవత్సరము సంపూర్ణమయ్యెను ఈ సంవత్సర కాలమందు మా కార్థికపు చిక్కులు విశేషమయ్యెను నిజాం రాష్ట్రము వారికే ప్రత్యేకముగా నిదొక్కటియే వార్తా పత్రికయుండినను ఆరు సంవత్సరములుగా దీని విలువను ప్రజలు గమనించుచుండినను ఆదరము మాత్రము హెచ్చుటకు మారుగా తచ్చగుచున్నది ఇది మా దురదృష్ట విశేషము. ఈ పత్రిక నేదేని బాల జాడ్యముల చేతనో, భూతములు సోకుట చేతనో క్షయరోగము చేతనో, పుటుక్కున ప్రాణము గోల్పోయి నిలచిపోయిన తర్వాత అది మా దృరదృష్టమగుటకు మారుగా నిజాము రాష్ట్రాంధ్రుల దురదృష్ట మనుటలోనేమియు సందేహముండదు ప్రకృత పరిస్థితులలో క్రొత్త పత్రికలకు సెలవు దొరకుట నభః పుష్పమువంటిదే! కావున నికముందు ఆంధ్రులు దేనిమూలమున నిజాము రాష్ట్రాంధ్రోద్యమమును, నిజామాంధ్రుల యభివృద్ధియు, నార్తిచే హాహాకారములు చేయు నోరులేని పల్లెటూరి జనుల త్రాణణ్యతయు, దుర్మదాంధుల దౌష్ట్య దౌర్జన్యముల క్షైణ్యతయు, నీ రాష్ట్రమందు జరుగుచున్నదో యట్టి గోలకొండ పత్రికను నిలుపుటయా? నీల్గించుటయా? యీ సమస్యను పరిష్కరించు భారము ఆంధ్రులదై యున్నది. మేమెన్నడును ప్రత్యేక కులము జాతికి సంబంధించిన పద్ధతిపై పత్రికను నడపకుండిన మేమెన్నడును స్వార్థలాభము గోరి మా ఖజానాను వృద్ధి చేసికొన గోరకుండిన నిజాము రాష్ట్రాంధ్రులు తప్పక మాకు సహాయము చేయవలెను.
నిజాం రాష్ట్రాంధ్రులకే కాక ప్రజలకంతయు సంబంధించిన సమస్యలను గురించి చర్చించునదీ గోలకొండ పత్రిక యొక్కటియే యని యందఱు గుఱ్తెరుగుదురు గాక! బ్రిటిషాంధ్ర పత్రికలు తమ సంపాదకీయమందు సంవత్సరమున కొకనాడైనను మన సమస్యలు చర్చించునట్లు కానరాదు గష్తీ నిషాన్ 53 అనునదేమి పురాణమో, వారికి తెలియదు. 1334 ఫసలీలోని ఖాన్గి పాఠశాలల గష్తీ వారి కెరుకలేనట్లే మన ఆజీజహ్మదుగా రెవరో వారికి తెలియదు. మన రహబరుగారును, నహీఫాగారును నేమేమి వ్రాయుచుందురో యీ పత్రికల స్వరూపమెట్లుండునో పాపము వారెన్నడును చూచినవారు కారు. మొన్న మొన్న మన ప్రభుత్వమువారు ప్రకటించిన కమ్యూనిక్ విషయమై అనుకూలముగనో ప్రతికూలముగనో తమ తమ యభిప్రాయములను బ్రిటిషు ఆంధ్రదేశమందలి పత్రికలో నొక్క పత్రికయైనను చర్చించరాదా? ఏ మూలనో నున్న అమృతబజారు పత్రికయు, నెందోకల బొంబాయి క్రానికల్, లీడర్ మాడరన్ రెవ్యూ వంటి పత్రికలు చర్చించియుండ 70 లక్షల ఆంధ్ర సోదరులకును నితరులవలె సంబంధించిన యీ నేటి సమస్యపై పెదవులపై ఆంధ్ర సోదరా అని యుచ్చరించుచు సోదరులే లకో మౌనముద్ర వేసికొని కూర్చుని యున్నారు మన రాష్ట్రములో చందాదారులు మాత్రము విరివిగా మన “సోదరులకు" దొరికిన చాలునేమో!
ఇట్టి క్లిష్టసమయములందు స్థితి యెట్లున్నదో పాఠకులేమి యెరుగుదురు. ఆర్థికపు చిక్కు లొకప్రక్క, ప్రజాహిత మొకప్రక్క, ప్రభుత్వ భయ మింకొక ప్రక్క అన్నియు పెనగొనియుండినను మా “కలమును" నేరాళ్ళపై చెడకుండ నడిపించుకొనుచు వచ్చియున్నాము
మా యారవ సంవత్సరమున ప్రజలకు చాల ఆర్థికపు కష్టనష్టములు కలిగెను. ఈ కారణముచే మేము చందాను సహితము నష్టమైనను తక్కువ చేయుదమా అని ఆలోచించితిము కాని మా కిదివరకే నష్టములు కలిగినందున మా యభిప్రాయమును మానుకొనవలసివచ్చెను.
మాలో లోపము లేమైన నుండిన పాఠకులు మాకు సూచించగలరు. పాఠకుల సూచనలు మా పత్రికలో ప్రకటించుటకును సంసిద్ధులముగానున్నాము. అట్లు ప్రకటించి బహుజనుల సమ్మతమైన నా ప్రకార మాచరించుకొందుము. మా యుద్దేశము ప్రజల యొక్కయు, శ్రీ ప్రభువు యొక్కయు మనదేశము... అనగా నిజాము రాష్ట్రము యొక్క యు సేవజేయుటయే యని మేము పలుమారులు చెప్పియుండినను జ్ఞాపకార్థము మరల యిప్పుడు సూచించుచున్నాము. ప్రభుత్వము యొక్క యుద్దేశములను ప్రజలకు తెలుపుటయు, ప్రజల యాశయములను ప్రభుత్వమునకు ఎఱిగించుటయు మా ముఖ్యోద్దేశము.
గత సంవత్సరము మేము చేసిన ప్రజాసేవ చాల కొలదియే యని మేమెరుగుదుము. ఈ సంవత్సరము మా పాఠకులును, ప్రభుత్వమువారును మాకు తోడ్పడి ఇతోధిక సేవ జేయుటకు ప్రోత్సహింతురని కోరుచున్నాము.
మన రాష్ట్ర పరిశ్రమలు
25 - 6 - 1932
బహు కాలమునుండి మన రాష్ట్రాభివృద్ధిని, తద్వారా ప్రజల యభివృద్ధిని గోరునట్టి పూజ్యులైన మ॥ఘ॥వ॥ మన ప్రభువుగారు మన రాష్ట్రములో పరిశ్రమ శాఖను నేర్పాటుచేసియున్నారు ఇదెంతయు సంతోషింపదగిన యంశము ఇంతియ గాక శ్రీ ప్రభువుగారు మూడు సంవత్సరముల క్రిందట పరిశ్రమాభివృద్ధి కని 1 కోటి రూప్యములను ప్రత్యేకించుట కాజ్ఞాపించిరి. ఈ యొక్క యంశమే మన యజమానులకు తమ ప్రియమైన ప్రజలందుగల ప్రేమను జాటుటకు తగియున్నది. ఆర్థికశాఖా మంత్రులగు సర్ హైదరు నవాజుజంగు నవాబుగారును తమ యపూర్వ శక్తి సామర్ధ్యములను ప్రకటించి పరిశ్రమల కింత గొప్ప మొత్తమును సంపాదించియుంచిరి కాలిన్సుగారును ఈ పరిశ్రమ శాఖాధ్యక్షులై తమ యావచ్ఛక్తిని వినియోగించి, యీ రాష్ట్రమందు దినదినము పరిశ్రమలే కాక వ్యాపారమును, సహకార సంఘములును, వ్యవసాయమును సత్వరాభివృద్ధి పొందుటకై చాల పాటుపడుచున్నారు.
మన రాష్ట్రములో ప్రాచీనమునుండి కొన్ని పరిశ్రమలు చాల యభివృద్ధిలో నున్నవి కేవలము నిజాము రాష్ట్రమందేకాక బ్రిటిషిండియాకును మన సరకులు దిగుమతి యగుచున్నవి. బీదరు, పెంబర్తి, ఔరంగాబాదు, ఒరంగల్, ఆలంపూరు, వంటి స్థలములు, లోహపు పనులకును, నేత పరిశ్రమలకును చాల ప్రసిద్ధి చెందినట్టివి. ఇప్పుడిప్పుడు గాజు పనులును, సబ్బు పనులును, మిల్లు బట్టలును, సిగరేట్లును, మన రాష్ట్రములో తయారగుచున్నవి. సిగరేట్లు కొరకై కొక క్రొత్త పొగాకు నిపుణుని పిలిపించియున్నారు. వ్యవసాయులకై జాతరలందేకాక ప్రతి సంవత్సరము రెండుమారులు జిల్లాలలో వ్యవసాయ ప్రదర్శనములు చేయుచున్నారు ఇన్ని సౌకర్యములుండియు ప్రజలు దీనివలన లాభము, పొందకుండిన అది ప్రజల తప్పే యనవలెను ప్రజలకు పరిశ్రమల విషయమై సహాయము కాని, సలహాలు కాని కావలసి యుండిన పరిశ్రమ శాఖాధ్యక్షులగు కాలిన్సుగారికి వ్రాసికొనిన వెంటనే వారికి తగు సహాయము చేయుచున్నారు
ప్రభుత్వము వారికిని నొక సూచన గావింపదలచుచున్నాము. మన రాష్ట్రములో సిద్ధమగు వస్తువులను మొదలు ప్రభుత్వ కార్యాలయములును, తర్వాత అధికారులును, కొనునట్లు ప్రోత్సాహము చేయవలెను. మన రాష్ట్రపు సబ్బులను మన రాష్ట్రమందలి వైద్యాలయము లన్నింటికి సబ్బులపై కరోడిగిరి హెచ్చుగా తగిలించిననేగాని మన సబ్బులు వృద్ధికి రావు. అదే ప్రకారము మన కచ్చేరీలకు కావలసిన "సాదర్ " మన రాష్ట్రములో తయారైనవే తీసికొనవలెను
రెండవ సూచన యేమన మన జనులు సాధారణముగా బీదవారగుట చేత పెద్ద పెద్ద కార్ఖానాలు పెట్టించిననవి కొలది మంది ధనికులకే పనికి వచ్చును కావున నట్టి వానికన్న విశేషముగా గృహ పరిశ్రమలకే సహాయము జేసిన బీదలకు చాల లాభము కలుగును. నేత మగ్గములలో డేనిష్ యంత్రము వంటి మంచి యంత్రములను నేతగాండ్ర కిచ్చి వారికాపని నేర్పించిన బాగుండును అదే విధముగా సర్. పి. సి. రాయిగారు “దేశీరంగ్" అను గ్రంథములో వ్రాసినట్లుగా స్వదేశీ రంగులను తయారుచేయుటకు జనులకు నేర్పవలెను
ఇప్పుడు నేయునట్టి తివాసీలు, జంపుఖానములు (పత్రంజీలు) మేలైనవి శీఘ్రముగా అగ్గువగా నేయు పరికరముల చూపించవలెను
ఇట్టివే తక్కువ ఖర్చుతో నెక్కువ లాభము కలిగి బీదవారు సహితము కొద్ది మొత్తముతో జీవించగలుగు పరిశ్రమలను వృద్ధి చేయుదురని గోరుచున్నాము.
బాలికల ఉన్నత పాఠశాల
2 - 7 - 1932
శుక్రవారము నాడు రెడ్డి బోర్డింగులో బాలికల ఉన్నత పాఠశాల యొక్క బహుమాన ప్రధానోత్సవము జరిగేను ఆ సభకు వచ్చిన ప్రేక్షకులు అనేకులు స్థలము జాలక వాపసు పోవలసివచ్చి బాలికల విద్య యందిప్పుడు మన ఆంధ్రులందు గాఢమైన అభిమానము కలుగుచుండినందులకు చాల సంతోషము పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య కూడ రెండింతలైనది. ఈ పాఠశాలను నింతటి పట్టుదల తోడను, అభిమానము తోడను, శ్రద్ధతోడను దినదినాభివృద్ధి గావించినట్టి శ్రీయుతులు మాడపాటి హనుమంతరావు గారును, వడ్లకొండ నరసింహారావు గారును చాల ప్రశంసింపదగినవారు ఆంధ్రులందరును వీరు చేయుచున్న కృషికై గర్వించవలసినది. ఇట్టి యుద్యమము మహారాష్ట్రులందును లేదు. వారు బాలురకు వివేకవర్ధనీ సంస్థను నడిపించుచున్నను మన హనుమంతురావు గారు తదితరుల సహాయముచే నీ బాలికల సంస్థను నడిపించుట నంతకన్న హెచ్చైన పని.
కాని ఈ పాఠశాలకు ధనికుల యాదరణ లేదు ప్రభుత్వమువారి యాదరణ అంతకు తక్కువయ్యెను. ఉస్మానియా విద్యా పీఠము యొక్క ఉద్దేశములలో మొదటి యుద్దేశము జనుల మాతృ భాషలో విద్య నేర్పించుటయై యున్నది. అది యట్టిదనియే భావించి మాలవ్యా వంటి గొప్పవారు దానిని శ్లాఘించిరి మన బాలికల పాఠశాల పూర్తిగా మన విద్యా పీఠము యొక్క యాదర్శములనే అమలు నందుంచుచున్నవి మన ప్రభుత్వము వారు దీనినికముందైనను ఉస్మానియా విద్యా పీఠములో చేర్చికొని, దీనికి ద్రవ్య సహాయము చేసి తోడ్పడుదురని తలచుచున్నాము.
మొన్నటి సభను జయప్రదముగా జరుపుటకు కారకులైన అధ్య క్షురాలగు శ్రీరాణి కుముదినీ దేవీ గారిని, శ్రీ రాజా వేంకటరామరెడ్డి బహద్దరు గారిని, శ్రీ మాడపాటి హనుమంతరావు గారిని శ్రీ వడ్లకొండ నరసింహారావు గారిని, మేము మనఃపూర్వకముగా ప్రశంసించుచున్నాము
రెడ్డి విద్యార్థి గృహము
20-8-1932
గత వారములో రెండు దినములు రెడ్డిహాస్టలు యొక్క వార్షికోత్సవము జరుపబడినది వ॥లుత్ఫొద్దౌలాగారి యుపన్యాసమును, రెడ్డిహాస్టలు నివేదికను వేరుచో ప్రకటించియున్నాము. రెడ్డి హాస్టలు 1327 ఫసలీలో స్థాపింపబడెను. ఈ కొలది కాలములో హాస్టలు భవనములు, గ్రంథములు మున్నగునవి సుమారు రెండు లక్షల విలువగలవగుటయు గ్రంథాలయములో 9000 గ్రంథములుండుటయు, విద్యార్థులు 163 గ్గురు ఉండుటయు చూడ దీని యభివృద్ధిని గూర్చి ఆంధ్రు లందరును సంతోషింపవలసి యున్నది. ఇట్టి సంస్థ హైదరాబాదు రాష్ట్రములో మరొక్కటి లేదనవచ్చును రెడ్డి హాస్టలు అధికారవర్గ మీ విషయమై ప్రశంసాపాత్రులుగా నున్నారు నవాబు లుత్ఫోద్దౌలాగారు సెలవిచ్చి నటుల రాజబహద్దరు వేంకటరామారెడ్డి ఓ బి. ఇ గారు ముఖ్యముగా ప్రశంసాపాత్రులు. ఈ వసతి గృహ పక్షమున వ్యయసాయమున కనువగు భూమి సంపాదించుటయు, నందు హాస్టలున కవసరమగు కూరగాయలు పండించుటయు, విద్యార్థులే యెక్కువగా దీనిలో శ్రద్ధ వహించుటయు చూడ నీ వసతి గృహము యొక్క భావిధశయింకను ప్రశంసా పాత్రముగా సుండగలదని నమ్ముచున్నాము
ఈ వసతి గృహమునకు ఈ 14 సంవత్సరముల నుండి ప్రభుత్వ సహాయము లేదని వినుట మాకాశ్చర్యము కలిగించు చున్నది అన్ని సంస్థల కన్న నీ సంస్థ ప్రభుత్వ సహాయము పొందుటలో నగ్రస్థానము వహింపగలిగినది ఏలన నవాబులుత్ఫోద్దౌలాగారు సెలవిచ్చినటుల రెడ్లు నిజమైన ముల్కీలు ఇతరులవలె వీరు ఇతర ప్రసంగములలో జిక్కుకొనువారుకారు వీరికి భూమి తప్ప వేరే యాధారము లేదు. కావున వీరు ప్రాచీనము నుండియు నీరాష్ట్రమందే నివసించి ఈ రాష్ట్రములో సుఖ దుఃఖముల ననుభవించిన వారు. వీరిలో ---- జాగీరులు, మక్తాలు సంస్థానములు కలవారు కలరు. అనగా వీరి పూర్వులు ప్రభుత్వమునకు అపారమైన సహాయము చేయుటచే ప్రభుత్వ వారును కృతజ్ఞతా సూచకముగా వీరికిట్టి యినాముల నిచ్చినారు రెడ్లు మన రాష్ట్రపు జనసంఖ్యలో నూటికి 15 వంతుననున్నారు ఇట్టి బహు సంఖ్యాకుల వలన సర్కారీ మాల్గు జారీలో వీరివంతు అగ్రస్థానము వహించుచున్నది ఇట్టి సంఘములో బాలుర విద్యాభివృద్ధికి ప్రభుత్వమువా రవశ్యము తోడ్పడవలసియుండెను ప్రభుత్వము వారును నీ హాస్టలునకు సహాయము చేయువిషయములో నాలోచించు చున్నారని వినుటకు సంతసించు చున్నాము.