గోలకొండ పత్రిక సంపాదకీయాలు/రామనుగారిచ్చిన సనదు
రామను గారిచ్చిన సనదు
1-3-1933
There could be no question of the beauty of Telugu language, its poetry and mellifluous music The last alone was sufficient to include in the definition of an Andhra everyone from Cape comorin to the banks of the river Taptı - Tamilions Canarese and Malayalese no less than the Andhras themselves - because Telugu was the divine language which Thyagaraja used. Telugu is justly known as the Italian of the East
form Sir C. V. RAMAN'S Lecture
in Nizam College 21-2-1922.
ఇంత పొడవుగా ఇంగ్లీషు ఉదాహరణమేమని యింగ్లీషు తెలియని పాఠకులు ఆశ్చర్యపడవచ్చును. దాని యర్ధమిది
"ఆంధ్ర భాష యొక్క సౌందర్యము, దాని కవిత దాని మనోహరమగు సంగీతము వీని విషయమై యేమియు సందేహింప నవసరము లేదు. ఈ కడపటి గుణమగు గానమాధుర్య గుణ ముక్కటే ఆంధ్ర పద నిర్వచనములో కన్య కుమారి నుండి తపతీనదీ తీరము వరకు నివసించు జనులందరిని చేర్చుటకు తావిచ్చుచున్నది. తమిళులు, కన్నడీలు, మళయాళీలు వీరును ఆంధ్రులే యగుదురు. ఏలన త్యాగరాజు గానము చేసిన దీ దేవభాషయగు నాంధ్రమందే. తెలుగుభాషను ప్రాచ్యపు నిటలీ భాషయనుట న్యాయముగా నున్నది". అని సర్. చంద్రశేఖర వేంకటరామన్ గారు గతవారము నిజాం కాలేజీ ఆంధ్ర విద్యార్థులు తను సమర్పించిన సన్మాన పత్రమునకు జవాబుచ్చుచు ఆంధ్రమును ఆంధ్రులను గొనియాడిరి. ఒక యాంధ్రుడు తన యాంధ్రభాషను స్తోత్రము చేసికొనుటలో విశేషము లేదు కృష్ణదేవరాయలు శ్రీనాధుడు తన వీధి నాటకములు చెప్పిన “దేశభాషలందు తెనుగు లెస్స" అను వాక్యములనే మరల తన యాముక్తమాల్యదలో వ్రాసెను కాని మాయభిప్రాయమున సార్వభౌమ కవిగాని కవిసార్వభౌముడు గాని చెప్పిన వాక్యముల కన్న నేటి నోబిలు బహుమాన మందిన శాస్త్ర సార్వభౌముని వాక్యములే ఆంధ్ర భాషకు గౌరవము నిచ్చుచున్నది.
శ్రీనాథుడు "ఏదియెట్లున్న నాభాష కన్నడంబు" అన్నట్లు మన రామనుగారు “ఎవరేమన్నను సరే నేను ఆంధ్రుడను" అని అభిమానించుచున్నారు. వీరి మాతృభాష అరవమైనను వీరు ఆంధ్రమందే మంచి పాండిత్యము సంపాదించి ఆంధ్రుడనని చెప్పించుకొనుచున్నారు. ఇట్టి వీరు ఆంధ్రమునకై యిచ్చిన సనదును ప్రత్యాంధ్రుడు అందు ముఖ్యముగా ప్రతి నిజాము రాష్ట్రాంధ్రుడును చిత్రించికొనగలరని కోరుచున్నాము ప్రత్యేకముగా నిజాం రాష్ట్రీయుల విషయమై సూచించుట కొకటి కాదుకదా నూరు కారణములు కలవు
ఎట్లనగా మన రాష్ట్రములో నూటికి 50 వంతు జనులు ఆంధ్రులేయైనను కంటికి కలికము వేసికొని పగటి దివ్వటీలు పట్టుకొని రాష్ట్రమందలి కచ్చేరీ కచ్చేరీలో మూలమూలలందును వెదకి వెదకి వేసారినను ఒక తహసీల్దారుగాని, ఒక తాలూక్దారు గాని, ఒక మున్సిఫీ గాని తుదకు కార్కూనులుగాని అంతయేల కనిష్ఠము వ్యవసాయ శాఖలో గాని అది లేకున్న పశువుల డాక్టర్లుగాని దొరుకుట లేదు యథార్థముగా జూచిన ఒక హైకోర్టు న్యాయాధిపతి, బాబెహుకుమతులో నిద్దరు ముగ్గురు మెంబర్లు, తుదకు ప్రధానమంత్రి ఆంధ్రులుగానే యుండవలసి యుండెను. ఇది మొదటి యవస్థ.
ఇక రెండవది ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఆంధ్ర భాషకు ప్రాముఖ్యత లేనే లేకపోయెను. కావున ఇర్విన్ ప్రభువుగారు (వారికి పరమేశ్వరుడు దీర్ఘాయ్యుమిచ్చి రక్షించుగాత) మన రాష్ట్రమందు వేంచేసి నప్పుడు మన ఉర్దూ యూనివర్సిటీ యితర భాషల వారికిని అనగా అందరికిని ప్రీతి పాత్రముగా నుపయోగ కారిగా నుండవలెనని సెలవిచ్చియుండిరి కాని వారి మాట యరణ్యరోదనమై పోయెను
ఇక మన రాష్ట్రీయ సోదరుల దృక్ఫధమెట్టిదో కనుగొందము హాష్మీగారు ఇటీవల బుల్లెటిను పత్రకలో ప్రఖ్యాతికి వచ్చిన తమ ఉర్దూ హిందూ దేశ చరిత్రలో ఆంధ్ర వాఙ్మయము కన్నడ, అరవ వాఙ్మయ మంతటి ప్రాచీనముది కాదని యింకయు నేమేమో వ్రాసిరి వారి కస్సలు తెనుగు ఓనమాలైనవచ్చునో లేదో కాని వాఙ్మయము విషయములో గొప్ప యభిప్రాయమిచ్చిరి. ఇచ్చినను తప్పులేదు. వారి పుణ్యము వారాంధ్రమును త్రొక్కండి ధ్వంసించండి అనక పోయిరి.
మా సోదరులు రహబరు పత్రిక సంపాదకులు 4-5 ఏండ్ల క్రిందట ఉర్దూ తప్ప తక్కిన భాషలను పాతములో (ఆఖ్బిజమీన్) నికి త్రొక్కి నుసిజేసి తూరుపెత్తి బూడిదచేసి గంగలో కలిపిరండని ముద్దు ముద్దుగా హితబోధచేసి యుండినది మా యాంధ్ర సోదరులు - అభిమాన లేశమైన యుండిన కదా - మరచిపోయినట్లున్నది ఇట్టి ప్రేమకల వాతావరణములో నిజాం రాష్ట్రాంధ్రులు మృతప్రాయులగుచుండ పూజ్యులైన సర్ చంద్రశేఖరుగారు అమృతసేచనము చేసి జీవము నిచ్చిరి
ఇచ్చటి యాంధ్రులు జీవచ్ఛవంబులై కళదక్కి దినదినము క్షీణించి బోయీలై మూటలు మోయుటలో ఆదిహిందువులై ఆయాలు, గౌండాలగుటలో పాచకులై గరిటెత్రిప్పుటలో గుమస్తాలై కలము సాము చేయుటలో యపూర్వ పాండిత్య ప్రకర్షను జాటుచున్నారు దీనికి కారణము వారే కాని యితరులు కారు వారికి తమ భాష రోత ఇంత ఉర్దూ డొక్క శుద్ధియైన రెడ్డి దేశముఖులు, వెలమదొరలు గోలకొండ వ్యాపారీ దేశ పాండ్యాలు తమలోతాము కలసినప్పుడు ఆంధ్రమందు మాట్లాడుటకు సిగ్గు-ముగ్ధకున్నంతటి సిగ్గు-ఉర్దూలో మాట్లాడుటలో “సరదా” చూపించెదరు. ఇక ఆంధ్రభాష "కాటిక కంటి నీరు చనుకట్టు పయింబద నేల యేడ్వదో" యోజింపుడు మన రాష్ట్రీయాంధ్రులకు ఆంధ్రము రోత ఆంధ్ర పత్రికలు చెత్త, ఆంధ్రులందరు చెంచులుగా తోచుచున్నట్లున్నది. నిన్ననే రెడ్డి విద్యాలయములో ఆసేత శీతనగర పర్యంతముగా ప్రఖ్యాత పాండిత్యముచే వికాశించుచున్న హిందూ విద్యాపీఠ మహాధ్యక్షులైన "ధృవ” గారిట్లు సెలనిచ్చిరి. "మాతృభాష యందభిమానముండవలెను. మాతృభాషలో నాలోచింపవలెను - మాతృభాషలో చదువవలెను. అట్లు చేసిననే గాని జాతి వృద్ధి పొందజాలదు."
ఇటీవల గాంధీ మహాత్ములు సహితము “ఆంధ్ర భాషను నేను నేర్వ గోరుచున్నాను గాని యీ ప్రభుత్వమెప్పుడు జూచినను నన్ను జైలులో నిర్బంధించుచున్నది. ఏమి చేయుదును" అని సెలవిచ్చిరి. కావున నెవ్వరిని బోయి విచారించినను తుదకు రహెబరు దక్కనులో గూడ విచారించి చూచినను మంది భాషల "అఖ్సిజమీను"లో వేయండి గాని మా భాష విషయములో నోరెత్తివా ఖబడ్దార్ అందురు గాని యదేమి గ్రహచారమో యదేమి కాలవైపరీత్యమో, యదేమి కర్మ పరిపాకమో యెవరికి తెలివివచ్చినను మన నిజాము రాష్ట్రాంధ్ర సోదరులలో నెన్నడు భాషాభిమానము నెన్నడు ఐక్యమత్యము, ఎన్నడు సర్వతోముఖాభివృద్ధి కలుగవలెనో యా దయ్యమునకే యెరుక.