Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/రాజ్యాంగ సంస్కరణములు

వికీసోర్స్ నుండి


రాజ్యాంగ సంస్కరణములు

4-5-1927

ఆధునిక కాలమున నిజాం రాష్ట్రము నందు రాజ్యాంగ సంస్కరణములు మహా ఘనత వహించిన నిజాం ప్రభువుగారి 16 దై 1326 ఫసలినాటి ఫర్మానుతో ఆరంభమైనవని చెప్పవచ్చును. ఈ ఫర్మాను అసాధారణ (గైరు మామూలి) జరీదా మూలమున ప్రకటించబడి యుండెను. శ్రీవారి ఈ ఫర్మాను వలన గలిగిన ముఖ్యమైన మార్పు యేదనగా, అంతకు పూర్వము ఎంతోకాలము నుండి రాజ్యాంగ సూత్రములన్నియు ప్రధాన మంత్రి యందు కేంద్రీకరింపబడి యుండ నా పద్ధతి దేశాభివృద్ధికి బాగుగా నుండదని శ్రీవారు తమ ఘన బుద్ధియందు నిశ్చయించి రాజ్యపాలనమునకై యొకసభ, "ప్రభుత్వ సభ” (బాబెహుకూమతు) అనుదాని నేర్పరచి దానికధ్యక్షునిగా విఖ్యాతులగు సర్ అలీ ఇమాంగారిని నియోగించి సభానియమములు, అధికారములు, అధ్యక్షుని ప్రత్యేకాధికారములు వివరముగా నిర్ణయించిరి. ఇదే ఫర్మాను చివర శ్రీవారు "మేము మా అమీరులను, అధికారులను, ప్రియ ప్రజలను ఈ క్రొత్త రాజ్యాంగ పద్ధతిని జయ ప్రదముగా జేయుదురుగాక యని కోరుచున్నాము" అని సెలవిచ్చిరి. ఈవిధమున శ్రీవారు పరిపాలనమున తమ ప్రజలకు సంబంధము, కలిగించు మహోద్దేశమును సూత్రప్రాయముగా జూపిరి.

తరువాతి సంవత్సరముననే శ్రీవారు మరియొక ఫర్మాను ప్రభుత్వ సభాధ్యక్షుని పేర జారీచేయించిరి. ఇది ప్రజా శ్రేయములను శ్రీవారు గౌరవింపదలచి, బ్రిటిషు హిందూ దేశములోని ఉత్తము ప్రజా ప్రాతినిధ్య పద్ధతిని మన శాసన నిర్మాణ సభయందు ప్రవేశ పెట్టగోరి ప్రకటింపబడినదై యున్నది. హైద్రాబాదు శాసన నిర్మాణ సభను బ్రిటిషు హిందూ దేశము నందలి శాసన నిర్మాణ సభల కేవిధముగను దీసి పోకుండ నుండునట్లు సంస్కరించుటకై అవసరమగు అంకెలను సంగతులను కూర్చి ప్రోవుచేయుటకు రాయ్ బాలముకుందుగారి యాజమాన్యమున నొక కార్యాలయము ఏర్పరుపబడెను.మునుపటివలెగాక ఎన్నికల పద్ధతి ఏర్పరుప వలయుననియు, (1)శాసన నిర్మాణము (2) ప్రశ్నోత్తరములు (3) తీర్మానములు (4) ఆదాయ వ్యయ నిర్ణయము మున్నగునవి శాసన నిర్మాణసభ యందు ప్రవేశపెట్టవలయు ననియు, కొలది సంఖ్యగల జాతుల హక్కుల కాపాడుటకు వలయు జాగరూకతలు నిర్ణయింపవలయు ననియు శ్రీవారి ఫర్మాను శాసించినది. దీని ప్రకారము వెంటనే కార్య స్థాన మొకటి ఏర్పడి సంవత్సరము కంటె ఎక్కువ కాలము పనిచేసి, వివిధములగు అంకెలను, సంగతులను తయారుచేసి రెండు సంపుటములచ్చు వేసి ప్రభుత్వము వారికి నివేదిక (రిపోర్టు) యుక్తముగ నర్పించిరి. సర్ అలీ ఇమాంగారు కూడ ఈ విషయమున తమ నివేదిక కూడ వ్రాసిరట. కాని పైవానిలో నేవియు ప్రకటింపబడలేదు.

కాని ఏమి కారణమో, 1334 ఫసలి వరకు పర్యవసాన మేమియు తేల లేదు. ఈ వత్సరమున మహా ఘనత వహించిన ప్రభువు గారు మరల నీ విషయమున నొక యువ సంఘమును (ముగ్గురు సదరల్‌ముహాములును దివాన్ బహద్దరు జి. కృష్ణమాచార్యులును సభా సదులుగా గల దానిని) ఏయే రాజ్యాంగ సంస్కరణము లవసరమో నిర్ణయించి నివేదిక పంపుటకు దయాపూర్వకముగా నేర్పరచిరి. ఈ సంఘము వారు తమ నివేదిక నొక మాసము దినములలోనే ప్రభువు గారి ఆజ్ఞానుసారము ప్రభుత్వ సభ కంపిరి. ఇది జరిగియు నేటికి రెండు వత్సరములు దాటినది.

సుమారునాల్గు మాసముల క్రింద మన మహారాజా సర్ కృష్ణ ప్రసాదు బహాదురు గారు ప్రభుత్వ సభాధ్యక్షులైన తరువాత జరిగిన శాసన నిర్మాణ సభయొక్క మొదటి సమావేశమున, మౌల్వీ మహమ్మదు అస్గర్ బి. ఏ.; బారిస్టరెట్లా గారు రాజ్యాంగ సంస్కరణముల యావశ్యకతను శాసన సభాసదుల పక్షమున మహారాజా గారి యెదుట వ్యక్తీకరింపగా, మహారాజా బహాదరు గారు ఈ ముఖ్య విషయమును గూర్చి "సానుభూతితో నాలోచింతు" మని వాగ్దాన మొనర్చిరి.

కొన్ని మాసముల క్రింద బ్రిటిషు హిందూ దేశపు ఆంగ్ల పత్రికలు కొన్ని మన ప్రభువు గారిని గూర్చియు బ్రిటిషు ప్రభుత్వము వారు మన రాజ్యాంగములో జోక్యము కలిగించుకొన నిశ్చయించినారనియు అసత్య వార్తలు ప్రకటించునపుడు, మన ప్రభుత్వము వారు "ఈ వార్తలు అసత్యములనియు, రాజ్యాంగమునందు సంస్కారములు చేయవలయునని ప్రభుత్వమువారు తలంచుచున్నారనియు త్వరలోనే ఆ సంస్కారములు ఆరంభింపబడుననియు, ప్రజలకు తెలియుటకై ప్రకటనము గావించిరి. ఈ ప్రకటనము తరువాత కొన్ని మార్పులు జరిగినవి. 1. మహరాజా బహాదురు గారు ప్రభుత్వ సభాధ్యక్షులుగ నియోజితులైరి. 2. మాల్గు జారీ పోలీసు ఈ రెండు శాఖలను చేర్చి వీనికి మంత్రిగా కర్నలు ట్రేంచు గారును, 3. మాల్గు జారీ కార్యదర్శిగా మిస్టర్ టాస్కరు గారును, 4. సదరు నాజము కోత్వాలి అజ్లా పదవి పైన మిష్టర్' ఆర్మ్ స్ట్రాంగు గారును, 5. పారిశ్రామిక శాఖ యొక్క కార్యదర్శిగా మిష్టర్ కాలిన్సు గారును, 6. నాజము అత్యాత్ పదవికి నవ్వాబ్ తకీయార్ జంగుగారును నియోజింపబడిరి. ఇవి యన్నియు ఉద్యోగస్తులలో మార్పులే కాని రాజ్యాంగ వ్యవస్థలో మార్పులనుటకును వీలు లేదు. ప్రభుత్వ విధానములో 1329 ఫసలీలో నేర్పబడిన ప్రభుత్వ సభా (బాచె హుకూమతు) పద్ధతి తప్ప తరువాతి మార్పు ఇంకను ఏదియు జరుగలేదు. ఇది 1329 నుండి 1336 వరకు గడచిన (7) వత్సరముల ఉదంతము.

కనుక మహా ఘనత వహించిన మన ప్రభువు గారి సంకల్పమును, ప్రభుత్వ సభాధ్యక్షుల వాగ్దానములును, ప్రభుత్వము వారి ప్రకటనములును, రాజ్యాంగ సంస్కారముల విషయమున ఇంకను ఆలోచనములోనే యున్నవనియును ఈశ్వరానుగ్రహమున్నచో కార్య రూపమున వెలువడగలవనియు నమ్ముచున్నాము.