గోలకొండ పత్రిక సంపాదకీయాలు/రాజకీయములు - నిజాం రాష్ట్ర ప్రజలు
రాజకీయములు నిజాం రాష్ట్ర ప్రజలు
9-11-1932
మన రాష్ట్రములోని ప్రజలందు విద్య చాలా తక్కువగా నున్న సంగతి అందరకును విదితమే. అందును విద్యాధికులనబడు వారిలో కూడ ఇతర విషయక విజ్ఞానము ఎంతయో యున్నను రాజకీయవిషయములను గూర్చిన జ్ఞానము చాల లోపించి యున్నది ఇందునకు అనేక కారణములు చూపవచ్చును అయినను, ముఖ్య కారణము మా దృష్టి కొకటి కానవచ్చుచున్నది అది యేమి? రాజకీయ విషయములను కష్టించి బాగుగా దెలుసుకొందమను ఉత్సాహమును, దానికొరకు శ్రమ చేయు పట్టుదల లేకపోవుటయే యని చెప్పవచ్చును. బ్రిటిషు ఇండియాలో విశేషముగా రాజకీయ విషయక జ్ఞానమున్నది కదా అది పత్రికల ముఖమునను, గ్రంథముల రూపమునను వచ్చుచున్నది కదా అట్లుండియు మన రాష్ట్ర వాసులకు రాజకీయ విషయములు జ్ఞానము అలవడుటకు కారణమేమని ఎవరైన ప్రశ్నించవచ్చును కాని యథార్థమేమనగా, బ్రిటిషు ఇండియా రాజకీయములకును, మన రాజకీయములకును హస్తిమ శకాంతరమున్నది అచ్చటి ప్రతి రాజకీయ తత్వమునకు ఉపయోగించజాలదు.
మన రాష్ట్రపు రాజకీయముల స్థితి మొదటి నుండియు వేరు విధమైనది. కనుక దీని క్రమ వికాసము చాలవరకు భిన్నము కనుక మొదటి మన రాష్ట్రము యొక్క పాలన నిర్మాణము ఎట్టిదో, దానిని బట్టి పాలించు మంత్రి మండలము యొక్క అధికారము లెట్టివో పాలనా విధానమున మంత్రి మండలము, అధికారమునకు మించి మ॥ఘ॥వ॥ ప్రభువుగారి అంగీకారము పొందవలసిన విషయము లేవియో' శాసన నిర్మాణ సభకు ఎంతవర కధికారములు కలవో, శాసన నిర్మాణ సభలో ప్రవేశపెట్టకయే ఏయే విషయములలో ప్రభుత్వము వారు నియమము లేర్పాటు చేయుటకు వీలు కలదో, మహా ఘనత వహించిన శ్రీ ప్రభువుగారు స్వయముగ ఫర్మాను ద్వారా ఆజ్ఞ ఇచ్చిన మీదట శాసన నిర్మాణ సభలో చట్టముల చిత్తులు ప్రవేశ పెట్టవచ్చునో కూడదో, ప్రభుత్వమునందు ఏయే శాఖలు కలవో, దేని కర్తవ్యము లెట్టివో ఇట్టి సూక్ష్మ విషయములు తెలిసి కొనినదే రాజకీయ విషయములలో వాద వివాదము సల్పబూనుట అపాయహేతువగును ఈ విషయమును దృష్టి యందుంచియే కాబోలును మన ప్రభుత్వమువారు ప్రతి సందర్భములోను రాజకీయ విషయములలో జోక్యము పుచ్చుకొనవలదని హెచ్చరించుచు రాజకీయ విషయికమైనట్టిదిగాని, రాజకీయములగు ఫలితములు కలిగించు నట్టి గాని సభలను సమావేశపరుప అనుజ్ఞ నీయకున్నారు. ఇటీవల ఆంధ్ర జన కేంద్ర సంఘ కార్యదర్శి పేర వ్రాసినట్టి లేఖలో ప్రభుత్యమువారి విషయమునే ప్రకటించియున్నారు.
మా యభిప్రాయన ప్రభుత్వము వారి లేఖ యొక ముఖ్య తత్వమును ప్రతిపాదించుచున్నది. అదేదన రాజకీయ విషయిక జ్ఞానము బాగుగా సంపాదింపకయే రాజకీయ సభలు జరుపవలదను నదియే యా తత్వము. కనుక దేశీయులు రాజకీయములను పఠించవలయును. ప్రభువుగారి యాజ్ఞలను, మంత్రిమండల నిర్మాణ విధానమును, కార్య పరంపరను, పరిపాలనా నివేదికలను, అప్పుడప్పుడు ప్రభుత్వము వారు ప్రకటించుచుండు ప్రత్యేక గ్రంథములను, విద్యా విధానమును, ప్రజారోగ్య సమస్యలను, ఎగుమతి దిగుమతులను గూర్చి నట్టియు అంకెలను, భూమ్యాదాయ విషయములను బాగుగా దెలిసికొనవలయును మన శాసన నిర్మాణ సభయొక్క అధికారములను, సభ్యుల నెన్నుకొను పద్ధతియును, కార్యక్రమ విధానమును సవివరముగా నెరుంగవలయును గొప్ప విద్యాధికులు కూడ ఇట్టి యంశముల దెలిసికొనకపోవుట చాలా విచారకరము ఇట్టి జ్ఞానము సంపాదించినచో మనము రాజకీయ విషయములను చర్చించ నర్హుల మగుదుమా? ముమ్మాటికి కాము!
ఇట్టి పరిజ్ఞానము లభించవలయు నన్న, ప్రస్తుతము రాజధాని నగరమున నిట్టి గ్రంధ సంగ్రహము గల భాండాగారము కావలెను నిదివరకు ఉన్న గ్రంథాలయములలో దాదాపుగా అన్నియు ఇతర విధమైన పుస్తకములే కాని పై విషయముల గ్రహించుట కుపయోగించునవి లేవు. ఈ భాండాగారము నందు మన రాష్ట్రపు రాజకీయ గ్రంథములకు ముఖ్య స్థానముండవలయును. అవసర మైన సందర్భములలో పోలిక తెలిసికొనుటకై ఇతర రాష్ట్రముల నివేదికలు మున్నగునవి తెప్పించి యుండవచ్చును. రాజకీయ విషయముల విజ్ఞానమునకుగల ప్రాముఖ్యతనుబట్టి, ఇట్టి గ్రంథ సంగ్రహము చాల అవసరమైనది కీ శే కేశవరావుగారిట్టి గ్రంధ సముదాయము అవసరమని తలంచి యుండిరి. కాని వారి జీవిత కాలమునందు ఈ పని జరిగి యుండలేదు ఇట్టి పని ఇప్పుడు సమర్థులగు దేశాభిమానులును ప్రారంభించిన యెడల మన భవిష్యత్సంతానములకు చాల లాభకారియగును. ఈ విషయము దేశీయులు ఆలోచించి కార్య రూపమునకు తెత్తురని విశ్వసింపుచున్నాము.