Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మూడవ తరగతి ప్రయాణికులు

వికీసోర్స్ నుండి




మూడవ తరగతి ప్రయాణికులు

3 - 3 - 1928

ఉన్నవారి కందరు బెట్టుదురు అయ్య పెట్టును, అమ్మ పెట్టును, బంధువులు పెట్టుదురు, మిత్రులు పెట్టుదురు, తుదకు ప్రభువువారు కూడా పరామర్శింతురు కాని లేనివారిని అడుగు దిక్కులేరు. వారు నోరు విడిచి వేడినను విను దాతలు లేరు. ప్రభుత్వము మూడవ తరగతి రైల్వే ప్రయాణీకుల పట్ల అవలంబించు కార్యఫణతి కూడ నిట్లేవున్నది.

మూడవ తరగతి ప్రయాణికుల ఇబ్బందులు మూడుగా విభజింపవచ్చును. అందు మొదటిది రైల్వే చార్జీలు. గత దశ సంవత్సరములలో రైల్వే చార్జీలు క్రమక్రమముగా హెచ్చిపోయెను. ఇది ప్రయాణీకులకు, ముఖ్యముగా మూడవ తరగతి ప్రయాణికుల కెంతయో కష్టము కలిగించెను ఫ్రాన్సు, జర్మనీ ఇంగ్లండు మున్నగు దేశములకంటె మన దేశమెంతయో పేదది. మన దేశమున సుమారు 10 కోట్ల మంది తిండిలేక మలమల మాడుచున్నారని మొన్న మొన్ననే శాసన సభలో లాలా లజపతిరాయి గారు ప్రకటించిరి అయినను యూరోపు దేశములన్నిటిలో కంటె మన దేశమున రైల్వేలో సౌకర్యములు తక్కువగనున్నను, చార్జీలు మాత్రము ఎక్కువగ నున్నవి ఇది మన దురదృష్టము. కానీ ప్రభుత్వము వారి కష్టమును తొలగించుటకు ప్రయత్నింప కుండుట శోచనీయము 1927-28 సంవత్సరమున రైల్వేవలన 12 కోట్ల 75 లక్షల రూపాయలు లాభము కలిగినది. ఇది పూర్వపు వత్సరము కంటె 3 కోట్ల 75 లక్షలు అధికము. అందుచే నార్తు వెస్టర్ను, ఈస్టు ఇండియను, గ్రేటు ఇండియను పెనిన్సులారు రైల్వేలలో చార్జీలు కొంతవరకు తగ్గింతురట తక్కిన రైల్వే కంపెనీలతో చార్జీలను తగ్గింప ఉత్తర ప్రత్యుత్తరములు మాత్రము జరిపెదరట. కానీ ఈ ఉత్తరములవలన నెట్టి లాభమును గలుగదు ప్రభుత్వమువారు పట్టుదలతో వీటి విషయమై శ్రద్ధ వహించి కంపెనీల వారికి ఒత్తిడి కలిగించినగాని ఎట్టి ప్రయోజనము నుండదు. అదియునుం గాక పై మూడు రైల్వేల లోన 50 మైళ్ళకు మించిన ప్రయాణములకు మాత్రమే మైలుకు నాలుగు దమ్మిడీల చొప్పున తగ్గింతురు కాన ఇది బీదలకు, పేద రైతులకు ఉపశాంతి నొసగ జాలదు. మన రైతుల ప్రయాణములు సర్వ సామాన్యముగా 50 మైళ్ళ లోపునే యుండును అట్టి తరి ఈ క్రొత్త ఏర్పాటు వలన చాలినంత మేలు కలుగుట లేదు.

ప్రయాణికుల రెండవ కష్టము రైల్యేయుద్యోగుల వలన సంభవించుచున్నది. బుకింగు క్లర్కులు, టిక్కెటు కలెక్టరులు స్టేషను మాస్టరుల అక్రమ చర్యలు అందరికి దెలిసినవే. పెద్ద కుటుంబములు తీర్థయాత్రలకు వెడలుతరి, వారికి సౌకర్యముగా ఒక కంపార్టుమెంటునో, డబ్బానో ఏర్పాటుచేయుటకు ఎన్నియో పాట్లు పడుదురు. ట్రెయిను ప్లాటు ఫారము మీద వున్నప్పుడు, ఆతురత తోడ బరుగెత్తుకొని వచ్చి టిక్కెటు వేడు పల్లెటూరి రైతు చిక్కులను వారినే విచారించవలెను. దారిని బోపు ప్రయాణీకులను ఎక్కువ సామానున్నదని పీడించి, దక్షిణ సమర్పించనచో, వారి ప్రయాణమునకు ఆటంకము గలిగించుట కొన్ని సందర్భములలో కలుగుచున్నది దినుసులు ఎగుమతి చేయుటకును గాను గూడ్సు వాగినులను కోరు వర్తకులు, స్టేషను మాస్టరుల దాసాను దాసులు, ఇటువంటి ప్రవర్తనమును పరిశీలించి, నిందితులను శిక్షించుటకుగాను ఒక విచారణ సంఘమును ఏర్పరచవలెనని జోషిగారు కోరిరి. ఈ చర్యలను శ్రద్ధతో పరిశీలింతునని వాగ్దాన మొసగుచు, ఇట్టి సంఘమవసరమని రైల్వే శాఖాధికారి త్రోసివేసెను ఈ వాగ్దానము ఎంతవరకు నెరవేర్తురో చూడ వలసి యున్నది.

మూడవది ప్రయాణికుల సౌకర్యములకు సంబంధించినది మొదటి, రెండవ తగరతి ప్రయాణికుల నుండి వచ్చు డబ్బు కంటె మూడవ తరగతి వారి వలన వచ్చు డబ్బు పది రెట్లు అధికమయినను, రైల్వేవారు వీరి సౌకర్యమును బాటించుట లేదు. తగినన్ని డబ్బాలు వుంచకపోవుట చేత, సుఖముగా కూర్చుండుటకు కూడ తావు దొరకుట లేదు స్టేషనులో మంచినీటి వసతి గాని, మరుగుదొడ్డి సౌకర్యములు గాని సరియైనవి లేవు. తిను పదార్ధములు, వెయిటింగు రూములు, ఎంత అశుభ్రముగ నుండునో అందరికి అనుభవమే. ఇట్టి హీనపు స్థితిగతులను చక్కబరచుటకు రైల్వే మంత్రిగారు ఎట్టి ఏర్పాటును జేయరైరి సానుభూతి మాత్రము కొరతలేకుండా ప్రకటించిరి కానీ దీని వలన గలుగు లాభమేమి ?

నిజాం రైల్వేలో గూడ పైన పేర్కొనిన ఇబ్బందులు గలవు. బెజవాడ నుండి ప్యాసింజరు బండిలో ప్రయాణము చేయువారికి, నోరు ఎండి ప్రాణము పోయినను, అనేక స్టేషనులలో గుక్కెడు మంచినీళ్ళు దొరకుట దుర్లభము. సికింద్రాబాదు స్టేషనులో ప్రయాణీకులు ఎండలో మలమల మాడవలసినది గాని ప్లాటుఫారము మీదగాని, వంతెన మీదగాని కప్పు లేదు. టిక్కెట్టు కలెక్టరుల జులుము అందరకు విదితమే అన్ని రైల్వేల కంటేను ఈ రైల్వే కంపెనీ వారికి లాభమెక్కువగా నున్నది కానీ రైల్వే చార్జీలలో చిల్లిగవ్వ యైనను తగ్గించుట లేదు. దీని గూర్చి ప్రభుత్వము వారు కొంతలో కొంత శ్రద్ధ పుచ్చుకొనిననే గాని పరిస్థితులు మారవు