Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మహారాజా బహద్దరు వారి ముల్కీ భాషా ప్రేమ

వికీసోర్స్ నుండి


మహారాజా బహద్దరు వారి ముల్కీ భాషా ప్రేమ

23 - 4 - 1936

మన రాష్ట్రములో హిందూ ముసల్మానుల ఐకమత్య స్థాపనము - మాటల చేతనేగాక కార్యముల చేతను - పెదవులచేతనే గాక హృదయము చేతను - కావించువారు ఎవరైన కలరా యనిన ఒక్కరు మాత్రము నిస్సంశయముగా కలరని పూని పలుకుచున్నాము. ఎవ్వరన మహారాజా సర్ కిషన్ ప్రసాదు బహద్దరు గారు గొప్ప దాత ఉదారుడు, పండితుడు, కవి, నానాభాషలందు ప్రవీణుడు విశాల హృదయుడు పూర్వపు మొగలాయి దర్బారు సిలుకు సముద్రము వంటి విశాల హృదయుడు నిష్పాక్షికుడు ఇట్టివారి అభిప్రాయములు చాల విలువ చేయునవి.

మొన్న ఉస్మానియా ట్రైనింగు కాలేజీ సాంవత్సరికోత్సవములో అధ్యక్షతా పీఠము నుండి వారు సెలవిచ్చిన మాటలలో ఈ క్రింది మాటలు ముల్కీలకు చాలా విలువ గలవి.

"గ్రామముల పాఠశాలలను పరీక్షించగా నాకు తెలియవచ్చిన, నేను తెలిసికొనిన విషయములను బట్టి యింత మాత్రము సూచన మాత్రము చేయుట చాలుననుకొందును అది యేమన - కొన్ని సంవత్సరములకు పూర్వము దేశభాషల విషయమై యుండిన నియమముల పరిపాలనలో విశేషముగా మార్పు కావింపబడుటచే విద్యా బోధకులకు (ముల్కీ) దేశ భాషలందు ప్రావీణ్యత తక్కువయి పోయినది దీని ఫలితముగా గ్రామ పాఠశాలలలోని విద్యార్థులకు కష్టము కలిగినది."

ఈ వాక్యములు అక్షర మక్షరము సత్యమని మేము చెప్పవలసిన పని లేదు నవ్వాబ్ మెహదీయార్ జంగు బహదరు గారే మహారాజాగారికి అదే సభలో జవాబు నిచ్చుచు నిట్లు సెలవిచ్చిరి "విద్యాశాఖ యొక్క వైశాల్యమును బట్టి ఏకదమ్మున మార్పులు చేయవలెనని ఆశ పెట్టుకొనుట తప్పు క్రమక్రమముగా ప్రతి విషయముపై దృష్టిని సారించి సంస్కరించవలసి యుండును... ...... దేశ భాషలను గురించి నాకు పూర్తిగా శ్రద్ధ కలదు క్రమశః దానిని గురించిన సంస్కారములు చేయబడును....

ఉన్నతాధికారులలో మన నవాబు మెహదేయార్‌జంగు గారును చాల ఉత్తములు రాష్ట్రమునకుగాని రాజుకుగాని కించిత్తు కూడ వ్యతిరేకముగా తలపుచేయువారు కారు వారు రాష్ట్రములో నెప్పటికిని శాంతి యుండవలెననియు ప్రజలకు ఏలాటి యిబ్బందులు వుండకూడదనియు, అశాంతి నిర్మూలము కావలెననియు సదా హిత చింత చేయువారు

పై యిరువురి అభిప్రాయములను వినిన తర్వాత దేశభాషలకు సరియైన స్థానము వెంటనే కాకున్న క్రమశః యైన దొరకునని ఆశ పొడముచున్నది

అన్నియు సరేకాని క్రమశః అనుపదమే కొంచెము తట్టుకొనుచున్నది దీని యర్ధము రబ్బరు వంటిది ఎంత దూరము లాగిన అంత దూరము సాగును. అట్టి రబ్బరుకు కూడ తెగిపోవు సమయము రానేవచ్చును కావున క్రమశః అనగా యెంతకాలము? విద్యా విషయములో క్రమశః వుండవచ్చునా? నూటికి 85 పాళ్ళ జనుల ముల్కీ భాషలకు ఇంతవరకే సరియైన స్థానము లేక వారి సభ్యత వారి విజ్ఞానము, కావలసిన రీతిగా అభివృద్ధి యగుట లేదు

బ్రిటిషిండియాలో పరభాషయగు ఇంగ్లీషులో విద్యా వ్యాపకము చేసిన 68 ఏండ్లకు “అరరే” ఇంతవరకు చేసిన వ్యయము, యత్నము శ్రమ, అంతయు వ్యర్ధమే" అని ప్రభుత్వమువారును, ప్రజలును గుర్తించిరి ఆ పద్దతి అస్వాభావికమనియు హానికరమనియు గుర్తించిరి

మేము పలుమారులు ఈ ముల్కీ భాషా సమస్యను గూర్చి వ్రాసినచో మేము ఉర్దూ ద్వేషులమని భావించువారు మాయెడ చాలా అన్యాయము చేసిన వారగుదురు. మన విద్యా విధానములో ఉర్దూకుండిన ప్రాముఖ్యతయైన దేశ భాషలకు లేకుండెను గదా యనుట సంకుచిత దృష్టి మాదియో ఇంకెవ్వరిదియో మాయెడ దురభిప్రాయపడువారు ఎదమీద చేయి పెట్టుకొని దైవమును సాక్షిగ నుంచుకొని తమ అభివ్రాయముల పునర్విమర్శనము చేసికొందురు గాక

రాజకీయ వ్యవహారములలో ఉర్దూను వుంచుకొనుడు అధికారములకై, నౌకరీలకై ఉర్దూ నియమము ఉంచుడు కచ్చేరీల తీర్పులు ఉర్దూలోనే చేయుడు. సర్కారీ నివేదికలు ఉర్దూలోనే ప్రచురించుడు. కాలేజీలలో ఉర్దూనే ప్రధానముగ నుంచుడు మాకు ఏమియు నాక్షేపణము లేదు. కాని ప్రాధమిక, మాధ్యమికాది పాఠశాలలలో జనుల మాతృ భాషల మూలముననే విద్య చెప్పించవలెననుట ముఖ్యము ఆ విషయములో మేము ఎన్నటికిని మాతృద్రోహము చేయజాలము.

కావున ఈ సందర్భమును మరల పురస్కరించుకొని మహారాజా గారిని ఈ విషయమును లేవనెత్తినందులకు, నవాబు గారిని ఈ విషయములో శ్రద్ధ బూనినందుకు, ప్రశంసించుచు ఆ క్రమశః అను పదమునకు నిర్వచనము కాల పరిమితితో చేసిన బాగుండునని తలంచుచున్నాము