గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మహాత్మజీ జన్మదినం
మహాత్మజీ జన్మదినం
20 - 9 - 1930
మహాపురుషుల జీవితములు సాధారణ ప్రజల కాదర్శప్రాయములు, ప్రజలు వర్థంతులు జరిపి మహాపురుషుల గౌరవింతురు భారతదేశమున నీ యాచారము పూర్వకాలము నుండి వచ్చుచున్నది శంకరాచార్య, రామానుజాచార్య మున్నగు మతాచార్యుల యొక్కయు రామ, కృష్ణ మున్నగు పురాణకాల పురుషుల యొక్కయు జయంతులు భారతదేశమందంతటను, ఇప్పటికిని జరుపబడుచున్నవి.
ప్రపంచమందంతటను ప్రఖ్యాతి గాంచినట్టియు అహింసా సిద్ధాంతముచే జయము పొందవచ్చుననియు చాటిన మోహనదాసు కరంచంద్ గాంధీగారి 62వ జన్మదినము నిన్న తటస్థించినది వీరు వృద్ధులైనను యువకోత్సాహముతో భారతదేశ స్వాతంత్ర్యమునకు తీవ్రమైన కృషి సలుపుచుండుటచే ప్రపంచమునందన్ని దేశములవారు ముగ్ధులగుచున్నారు వీరి శాంతి సందేశమున కన్ని జాతులవారును జోహారు లొసగుచున్నారు. యుద్ధము వలన విసిగిన పాశ్చాత్యులు వీరి విధాన మవలంబించుటకు కుతూహలపడుచున్నారు కొందరు పాశ్చాత్య మతాచార్యులు గాంధీజీ క్రీస్తు అవతారమని కీర్తించుచున్నారు
గాంధీజీ దక్షిణాఫ్రికాయందును, భారతదేశమునందును, చేసిన త్యాగ మపారము తమ సర్వస్వమును దేశమున కర్పించిరి తుదకు భారత స్వాతంత్ర్యమునకు తమ ప్రాణముల కూడ నర్పింపయున్నారు. ఈ యుత్కృష్ట పురుషుడు, నిరాండంబరజీవి, త్యాగి, యోగి యొక్క జీవితము ప్రపంచమునందలి అన్నిదేశముల వారికిని, అన్నిజాతుల వారికిని, ఆదర్శప్రాయముగ నున్నది వీరి శాంతి సందేశము వలన ప్రపంచములో ముందు యుద్ధభయ ముండజాలదు, సర్వేశ్వరుడు వీరికి ఆయురారోగ్యముల నొసగి, భారత స్వాతంత్ర్యమునకు పాటుబడుటకు సహాయపడుగాత!