గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మన స్వదేశీ ఉద్యమము
మన స్వదేశీ ఉద్యమము
21 - 6 - 1934
మ ఘ వ నిజాం ప్రభువరేణ్యుడు తమదేవిడిలో గోల్కొండ సబ్బులనే ఉపయోగించుచున్నామని చెప్పి నెలలు, సంవత్సరములు గడుచుచున్నవి - అప్పుడే ఉత్సాహముతో ప్రారంభమైన "బై - హైదరాబాదు లీగు" (హైద్రాబాదు వస్తువులనే కొనుడు అని ప్రచారము చేయుటకై పుట్టిన సంఘము) ఇప్పుడు ఎక్కడ నున్నది కూడ ప్రజల దృష్టికి వచ్చుట లేదు. గత దీపావళికి ముందు సంవత్సరపు దీపావళిలో నగరములో ప్లేగుండగా 'సదరు లీగు' సభ్యులు కొందరు తాము ప్రత్యేకముగా సాధ్యమైనంతవరకు కొన్ని కొన్ని ఇండ్లకుపోయి విదేశి వస్తువులను కొనకుండ ప్రబోధము చేసెదమని చెప్పి అట్లే చేసిరి. అంతటితో లీగులో చేరిన వ్యక్తులు గూడ మరల ఆ కార్యమువైపే దృష్టి మరల్చుట మాని నట్లున్నది. లీగు పని చేయుచున్నచో కొద్దికొద్దిగానైనను ఆ విషయము తెలియును కదా. ఈ విధముగా పనిచేసినచో ఏ రాష్ట్రమందుగాని స్వదేశీ అభిమానము ఎంత కాలమునకు ప్రజాసామాన్యమందు వ్యాపించగలదు దయామయులు అగు ప్రభువుగారు ప్రోత్సాహమిచ్చి మార్గము చూపుచున్నను ఈ విధముగా ప్రజలు మాంద్యము చూపుచున్నపుడు ప్రభుత్వము వారి ప్రోత్సాహము లేకపోగా మీదు మిక్కిలి వారివలన ఆటంకము కలుగుచో - ఒక విధముగా చూచిన ఆ సందర్భములో ప్రభుత్వము వారిని అనవలసిన పని యేమి యుండదు.
ప్లేగువలన తమ ఉద్యమ ప్రచారమును ఆపవలసి వచ్చినది అను వారు ప్లేగు తగ్గగానే ప్రచారమునకు పూనుకొనియుండుట యుక్తము. అయితే యిపుడు ఆ ప్లేగు పోయినది-మరల ప్లేగు తగ్గినది స్ఫోటకము విజృంబించియుండి తగ్గుచున్నది ఈ విధముగా కాల పరివర్తనమే గాని క్రియ శూన్యముగా నున్నది
కథియవాడ ద్వీపకల్పములో అనేకములైన చిన్న చిన్న సంస్థానములు గలవు. ఈ సంస్థానములలో శాసనోల్లంఘనోద్యమ కాలమున స్వదేశీ ఉద్యమము నిద్రలో పడెను దాని నిపుడు మరల కళకళలాడునట్లు చేయుటకై అచ్చటి యువకులు పూనుకొనినారు వారు తయారు చేసి అమలుపరచగోరునట్టి క్రొత్త విధానమువల్ల మంచి లాభము గలుగగలదు - ఈ విధానము స్థలాంతరమున సూచింపబడి యున్నది మన రాష్ట్రమందు అటువంటి మార్గములో ప్రయత్నములు చేయబడుచో త్వరలో ఇచట అనేక చరిద్రుల కుటుంబములకు వృత్తులేర్పడ గలవు మన జిల్లాలలో అనేక స్థలములందు యిప్పటికిని కొన్ని కళలు తమ స్థానమును నిలుపుకొనియున్నవి వీటికి తగు ప్రోత్సాహమున్నచో అవి చక్కగా వృద్ధిగాంచ గలవు స్వదేశీయాభిమానము రాష్ట్రీయ ప్రజలలో ఎక్కువగా వ్యాపించిననె గాని రాష్ట్రీయులు తయారు చేయు వస్తువులకు మంచి నమ్మకమైన మార్కెట్టు ఏర్పడజాలదు తీవ్రమైన ఉత్సాహముతోను పట్టుదలతోను నిరంతరకృషి సల్పిననే గాని ప్రజలలో తమ రాష్ట్రపు వస్తువులు అను అభిమానము వ్యాపించదు. దానికి తగిన సమయము ఎట్లు అనగా ముల్కి ఉద్యమము యిపుడు క్రొత్త ఉడుకులోనున్నది. ఇది యొక విధముగా "రాష్ట్రీయ" భావమును రంగమునకు తెచ్చినది మన రాష్ట్రీయ నాయకులు ఈ అవకాశమును పోగొట్టుకొనక రాష్ట్రము యొక్క ఆర్థిక సౌష్ఠవాభివృద్ధికి తగిన స్వదేశి ప్రచార విధానమును తీర్మానించుకొని త్వరలో కార్యరంగమున దిగెదరు గాక