గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మన స్థితిగతులు
మన స్థితిగతులు
6 - 12 - 1930
స్వదేశీలీగుపక్షమున నిన్న దేవీదీస్‌బాగులో జరిగిన బహిరంగసభ చాల ముఖ్యమైనదని చెప్పవచ్చును ఈ సభ కధ్యక్షత వహించిన పండిత కేశవరావుగారు కరోద్గిరి మహిసూలు వలన ప్రజలకు నష్టము కలుగుచున్నదని అంకెల ద్వారా తెలిపిరి. ఈ కరోద్గిరి మహిసూలు (సుంకపు పన్ను కొన్ని వస్తువులపై మూడు నాలుగుసార్లు తీసికొనబడును ) ఈ దేశమునందు తయారగు వస్తువులే నగరమునకు గొనితెచ్చినవానిపై పన్ను విధించుట చోద్యముగ నున్నది. ఈ విషయ మొక యుదాహరణము వలన బాగుగ తెలియగలదు ఒక నేతగాడు షోలాపూరము నుండి నూలు తెప్పించిన మొదలు ఈ నూలు ఈ రాష్ట్రమునకు దిగుమతి చేయబడినందున దానిపై సుంకము వసూలుచేయబడును ఆ నేతగాడు ఈ నూలుతోనే నేసిన వస్త్రములను విక్రయమునకు దెచ్చిన మరల సుంకము వసూలు చేయబడును ఆ వస్త్రములనే ఒకడు కొని వేరొకచోటికి తీసికొని పోయిన అవి క్రొత్త వస్త్రములని సుంకము విధింపబడును ఈ ప్రకారము సుంకము అందగట్టుటచే ఇచటి పరిశ్రమలకు తీరని నష్టము కలుగుచున్నది. మేమిదివరకెన్నియోసారులు సూచించినట్టు దయామయులగు ప్రభుత్వమువారు దేశీయ పరిశ్రమ అభివృద్ధి జెందవలయునని కోరుదురేని ఈ కరోడ్గిరి మహిసూనులును వెంటనే తొలగించవలయును.
రామచంద్రనాయకు బారెట్లగారు హైద్రాబాదు ప్రస్తుత ఆర్థికస్థితిని దెలిపి విద్యాధికులను గ్రామముల స్థితి బాగుపరుచుటకు పూనుకొనుటకై ప్రబోధించిరి ఫజలుల్రహామాన్ సా॥ తెలిపినట్లు ప్లేగు, కలరా మున్నగు అంటువ్యాధుల వలన జనసంఖ్య తగ్గుచున్నది ప్రజలకు వైద్య సహాయము లభించుటలేదు. ప్రజలు విద్య నేర్చినవారు కానందున ప్రభుత్వమువారు చేయునున్న సహాయము నుండి యైనను లాభము పొందుటలేదు. గ్రామముల పారిశుధ్యము కూడా బాగులేదు. అందువలననే మరణసంఖ్య అధికముగ నున్నది ఎల్లప్పుడు ఏదో యొక వ్యాధి ప్రబలుచుండును ఈ విషయమున ప్రభుత్వమువారికన్న ప్రజలే తగుకట్టుబాట్లు చేసికొనవలసియున్నది గ్రామములో విద్యావంతులు తమ తోడి సోదరుల క్షేమ లాభములను దృష్టియందుంచుకొని వారికి ఆరోగ్య విషయమునను, యితర విషయములందును బోధ గావించిన కొలది దినములలో గ్రామముల స్థితిగతులు కొంతవరకైనను బాగుపడుననుటలో సందియముండదు.
మాడపాటి హనుమంతరావు పంతులుగారు నుడివినటుల తెలంగాణములోనే కల్లుదుకాణము లధికముగ గలవు. మత్తు పదార్థముల గ్రోలుటకు ప్రభుత్వమువారి పద్ధతియే ప్రోత్సహించు చున్నదని దేశాభిమాను లనుకొనుచున్నారు. ఆబ్కారీ ఆదాయము ప్రతి సంవత్సరము పెరుగుచుండుటయే దీనికి నిదర్శనము. మత్తుపదార్ధముల ధరలు హెచ్చిన వానిని యుపయోగించు వారి సంఖ్య తగ్గుచుండుట లేదు. కనుక ప్రభుత్వమువారు త్వరలో త్రాగుడు పద్ధతి నిర్మూలించుటకు నూతన పద్ధతి ప్రవేశ పెట్ట వలయును
ఇచట దేశపురోవృద్దికై పాటుబడువారే అరుదు ఉన్న వారై నను ప్రచారము చేయదలచినను బహిరంగ సభల గష్తివలన ఆటంకము కలుగుచున్నది. ప్రభుత్వమువారు బహిరంగ సభలకై అనుమతి నొసంగుచున్నను సభా సమావేశకులకు అనుమతి పొందుటకు కొంత కాలము ప్రయత్నింప వలసివచ్చుచున్నది. దీనిచే సమయము మించిపోయి చేయదలచుకొనిన సభవలన అంతగా లాభము కలుగుచుండుట లేదు. దేశము నందావరించి యున్న అంధకారమును తొలగించుటకు ప్రస్తుతము ఉపన్యాసములే అవసరమై యున్నవి ప్రజలలో ప్రబోధము కలిగిన వారపుడు కార్యాచరణకై గడంగుదురు కనుక దేశాభివృద్ధి కలుగవలయునన్న ఈ బహిరంగ సభల గూర్చిన గష్తీని ప్రభుత్వమువారు వెంటనే రద్దుచేయవలయును ప్రభుత్వమువారు రాజకీయ సభలకై అనుమతి పొందవలయునను నిర్బంధముంచినను ఉంచవచ్చును, కాని విద్యా, సాంఘిక విషయిక సభలకై ఎట్టి నిర్బంధముల నుంచరాదని మేము కొరుచున్నాము.