Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మన విద్యా విధానము

వికీసోర్స్ నుండి




మన విద్యావిధానము

25 - 4 - 1928

గత సంచికలో నిజాం రాష్ట్రపు విద్యాశాఖగూర్చి కొన్ని యంశములను దెలిపియుంటిమి రాష్ట్రపు విద్యాలయముల సంఖ్యయు విద్యార్థుల మొత్తమును, ఈ శాఖకై హెచ్చింపబడుచున్న ధనము గూర్చియు, దెలిపియున్నాము. ఇక మన విద్యాపద్ధతి గూర్చి యించుక దెలుపవలసి యున్నది.

ఏ భాషలో విద్యగరుప వలెను? ఈ సమస్య విద్యా విధానములో మిక్కిలి ప్రాముఖ్యమైనది బ్రిటిషు ఇండియాలో ప్రతి కళాశాలలోను ఇంగ్లీషులోనే బోధనా విషయములన్నియు గరపుచున్నారు మూడవ తరగతిలో ఇంగ్లీషు ప్రారంభించి, బాలుడు పై తరగతులకు బోవుకొలది నీ భాషకు ప్రాముఖ్యత హెచ్చిపోవుచున్నది ఈ పద్ధతి మూలమున విద్యాలయములలో గరుపబడు విద్య నిస్సారమై, తేజోహీనమై, విద్యార్థుల ప్రతిభాశక్తిని అభివృద్ధి పరచుటకు బదులు, మొద్దువారిన మెదడు గలవారినిగా జేయుచున్నది. ఈ లోపమును పరిగణించి, నేడు వివిధ ప్రాంతములందు దేశభాషలోనే విద్య గరపుటకు యత్నములు జరుగుచున్నవి. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనము గూడ నీ సూత్రముపైననే యాధారపడి యున్నది.

మన రాష్ట్రపు విద్యా విధానములో కూడ ఏదేశ భాషయగు ఇంగ్లీషు భాషకు అసమంజమగు ప్రాముఖ్యత నొసగి, ప్రజలలో విజ్ఞాన వ్యా ప్తి సరికట్ట కూడదనెడి భావముతో ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపింపబడియున్నది. దేశభాషలో గరపబడు విద్యయే సులభముగను సువ్యక్తముగను బాలుర మనస్సు కెక్కుననెడి కారణమే ఈ విద్యాలయముకు కాధారము సూత్రము సర్వజనాంగీకృతమే. కాని నేటి విశ్వవిద్యాలయములో ప్రధానస్థాన మాక్రమించుచున్న ఉర్దూభాష దేశభాషయా? రాష్ట్రములోని ఒక కోటి 25 లక్షల ప్రజలలో ఉర్దూ మాట్లాడువారు 13 లక్షలమంది మాత్రమే అట్టిచో ఉర్దూభాషకు ప్రాముఖ్య మేల?

ఈ రాష్ట్రమున 1921 వ సంవత్సరపు జనవరి గణనము వలన వేయింటికి,

తెలుగు మాట్లాడువారు - 482

మహారాష్ట్రము మాట్లాడువారు - 264

కన్నడము మాట్లాడువారు - 123

ఉర్దూ మాట్లాడువారు - 104

గలరని దెలియుచున్నది ఇట్టితరి ఉర్దూ భాషకు మన విద్యా విధానమున ప్రధమ స్థానమేల యియ్యవలెను? ఇది దేశభాషలో విద్య గరపవలెననెడి సూత్రమునకు విరుద్ధము గాదా ?

ఉన్నత విధ్యయేకాక, మాధ్యమిక విద్యకూడ విద్యార్ధి మాతృభాషలో కాక విదేశ భాషయు ఇంగ్లీషులోనో, లేక పరభాషయగు ఉర్దూలోనో వివిధ విషయములను బోధించుచున్నారు. ప్రాధమిక ప్రారశాలలో మాతృభాషలోనే పాఠములు చెప్పవలెనని ప్రభుత్వమువారి విద్యా ప్రణాళికలో నున్నను, మొత్తము మీద ఇటుల జరుగుట లేదు.

మన రాష్ట్రములో విద్యా వ్యాప్తి చీమ నడకతో సాగుచుండుటకీ పద్ధతియే చాలవరకు కారణమని మా అభిప్రాయము మన తాతలనాటి వీధి బడులలో వ్రాయుట, చదువుట, గణితము, మాతృభాషలోనే బోధింపబడుచుండెను. దీని మూలమున విద్యార్ధులకు సులభముగ నలవడుచుండెను ఈ దృఢమగు పునాదిమీద, జాతీయ భాషలో, జాతీయ పద్ధతుల ననుసరించి గట్టబడిన విజ్ఞాన మందిరము సర్వాంగ సౌష్టవము గలిగి, శక్తివంతమై కలకాలము నిలుచుచుండెను కాని నేటి విద్యావిధానమిందుకు విరుద్ధమైయున్నది బాల్యమున ప్రతివానికిని విజ్ఞాన తృష్ణ ప్రబలముగ నుండును బాలురకు ప్రకృతిలోని ప్రతి చిన్న వస్తువును, వారికి ఆశ్చర్యము గొలుపును, చీమ మొదలుకొని ఏనుగువరకు, ఇసుక రేణువు మొదలుకొని మహోన్నత పర్వతమువరకును వారికి ఆనందదాయకములే. కట్టెపుల్ల మొదలుకొని సూర్యచంద్ర గ్రహములవరకును వారికి ఆట వస్తువులే. విశ్వమంతయు వారికి లీలారంగమే అందుచే వారు ప్రతివస్తువు గూర్చియు ఇదియేమి ? ఎందుకిటులున్నది? ఎటుల పుట్టినది? తుదకేమియగును ? మున్నగు ప్రశ్నలు కుతూహలముతో వేయుచుందురు వారికా విషయములను సులభముగ గ్రాహ్యమగు నటుల తేట మాటలతో, మాతృభాషలో బోధించుట యత్యుత్తరమగు విద్యావిధానము ఇట్లు గరపిన విద్య, బాలురకానంద దాయకముగ నుండుటయేకాక, వారి కోమల మేధస్సునకెట్టి కష్టములేకయే. వారి యందిముడును. కాని నేడిటులు గాక బడికి పోవుచున్న ఆరేండ్ల పసి బాలుడు తిన్నగ గీతయే గీయజాలని కాలమున అర్థహీనమును, ఉత్సాహ భంగములును నగు ఓన మాలును, ఏ బీ సీ, లను, అలీబ్బేలను నేర్చుకొనుటకు గాను తల బ్రద్దలు కొట్టుకొనవలసి వచ్చుచున్నది మాతృభాషలోని అక్షరములను నేర్చుటే చాలు దీనికి తోడుగ నోరు తిరుగని వింత శబ్దములు గల కొంకిరి గీతలను నేర్చుకొనుట బాలునికింకెంత దుర్భరముగ నుండునో వేరుగ జెప్ప నక్కరలేదు. ఇట్టి పరిస్థితులలో బాలుడు బడి దొంగయైనచో నొక వింతయా ?

ఇంతేకాదు, ఐదవ యేట బాలుడు పాఠశాల ప్రవేశించి 16 వ యేట మెట్రికు ముగించెనను కొందము. ఈ 11 సంవత్సరములలో కనీసము 7 సంవత్సరములు, ఒక కొత్త భాషనేర్చుటతోడనే పూర్తియగుచున్న వనవచ్చును. ఈ కాలమునే విజ్ఞాన ప్రాప్తికి వినియోగించియున్నచో, బాలుడెంతయు ప్రజ్ఞావంతుడై యుండును. కాబట్టి ఉర్దూ మాతృభాష కాని వారికి నేటి విద్యా విధానము వలన ఎన్నదగిన లాభమేమియు గలుగుటలేదు ఇంగ్లీషు భాష నేర్చుకొనుట కుక్కిరి బిక్కిరి యగుచున్న వారిపై ఉర్దూ బండ నొకదానిని వేయుటయే దీని ఫలితము ఉన్నత విద్యా విధానములో కాకున్నను, ప్రాధమిక మాధ్యమిక విద్యాలయములలో మాత్రమీ విధాన మంతరింపవలెను