గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మన ప్రభువు గారి హృదయ వైశాల్యము
మన ప్రభువుగారి హృదయ వైశాల్యము
26-10-1932
మ॥ఘ॥వ॥ నిజాముగారు, పూనాలో భండార్కారు పండితుడు స్థాపించిన "ఓరియన్టల్ యిన్ట్సిట్యూటు వారికి నైజామ్స్ గెస్ట్‌హౌస్" అను పేరుతో ఒక అతిథి భవనమును నిర్మించుటకు 25000 రూపాయల మొత్తమును, మహాభారతమును సవరించి ప్రకటించుటకు సంవత్సరమునకు 1,000 రూపాయల వంతున పది సంవత్సరముల వరకు యిచ్చుట కనుగ్రహించుట వారి యౌదార్యమునే గాక విశాల హృదయత్వమును కూడ తెలియజేయుచున్నది. వారి దానములు జాతి మత దేశ భేదములను దాటి పోగల్గుట యిప్పటి విరాళములవల్ల మరియొకసారి కనుగొన గల్గుచున్నాము సత్యజ్ఞానాన్వేషణ ప్రయత్నములు ఎచటనున్నను వారి దృష్టికి సమానములే
శ్రీ ప్రభువుగారు పరమతద్వేషములేని మహమ్మదీయ శ్రేష్ఠులు. లేనిచో హిందువుల యుద్యమమగు ఓరియన్టల్ రీసర్చ్ యిన్ట్సిట్యూటు వారి కార్యములకు వారు ధనసహాయ్యము చేయుట పొసగదు అందులోను మహమ్మదీయుల కన్న హిందువులకు ముఖ్యముగా గౌరవనీయమగు మహాభారతమును అచ్చువేయుటకు అగు ఖర్చులను వారుదయచేయుట ప్రశంసనీయము వాస్తవమే, యిట్టిధర్మములకు వారికిది మొదలుగాదు మహమ్మదీయులకు సంబంధములేని భద్రాచల రామాలయము యొక్క ఖర్చులను వారు దయచేయు చుండుట చాల కాలము నుండి ఎరిగిన విషయమే.
ఈ శ్లాఘనీయ కార్యములను తెలిసికొనియైనను హిందూ ముసల్మానులు పరస్పర వైరమును విడనాడుట మంచిది శ్రీ॥మ॥ఘ॥వ నిజాముగారిని మహమ్మదీయులు ఆదర్శపురుషునిగా యెంచవలెను దేశాభిమానమన్న పరదేశ ద్వేష మెట్లుకాదో స్వధర్మపాలనకై పరధర్మముల యెడల అట్లు ద్వేషమును పూనబని లేదు పరమతద్వేషమును బోధించు మతము మతమే కాదు అని అందరును గుర్తింపవలయును ఒక మతమును మరియొక మతమువారు ద్వేషించుటవలన పూర్వము ఎన్నియో ఉపయుక్తములును, మనోహరములు నగు విజ్ఞాన గ్రంధములు నశించినవి విశ్వకళ్యాణ దీక్షితులగు మహాపురుషులు ఎందరో హింసలకు లోనై యీ ప్రపంచమును వదలవలసి వచ్చెను ఒక్కొక్క మతమున అందరును గ్రహించదగిన కొన్ని కొన్ని మంచి విషయములుండును. మతద్వేషము వలన అట్టి వానిని నిరసించుట సరిగాదు.