గోలకొండ పత్రిక సంపాదకీయాలు/భావ కవిత్వము
భావ కవిత్వము
25 - 7 - 1935
కొద్ది రోజుల క్రిందట కృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయంలో ఉస్మానియా విశ్వవిద్యా పీఠమువారు కళాశాలలో ఆంధ్ర సాహిత్యాధ్యాపకులగు శ్రీయుత రాయప్రోలు సుబ్బారావు గారి అధ్యక్షత్వమున జరిగిన సభాకార్యక్రమము సాహిత్యాభిమానులకు అధికముగ రుచించి యుండును కార్యక్రమ మందు ప్రధానాంశము "ఆధునిక కవిత్వము" అనుదానిని గూర్చి శ్రీయుత ఖండవల్లి లక్ష్మీరంజనము గారి యుపన్యాసమైనను, సంబంధవశమున ఆధునిక కవిత్వము, భావ కవిత్వము అని వ్యవహరింపబడు కవిత్వ పధమునకు ప్రతికూల పక్షమున చేరిన వానికిని వారి అభిప్రాయములను సభలో వెల్లడి చేయుటకు అవకాశమీయబడుటయు, అట్లు పైకి తేబడిన ఆక్షేపణలకు 'భావ కవులే' యగు శ్రీయుత సుబ్బారావు గారు సమాధానములు జెప్పుటకు అవకాశము కల్పింపబడుటయు సభలో రక్తి కట్టించుటకు కారణములు
లక్ష్మీరంజనముగారి యుపన్యాసమును దాని తర్వాత భావ కవిత్వమును ఆక్షేపించు డాక్టరు శర్మానంద గారి యుపన్యాసమును, రాయప్రోలు సుబ్బారావుగారి ప్రత్యుత్తరోపన్యాసమును క్రమముగా చేరి నేడు భావ కవిత్వోపాసకుల మనుకొనువారికిని ప్రాచీన కవిత్వోపాసకులమనుకొను వారికిని దృష్టి వైఖరులలో తీవ్రవైరమెందువలన కలుగుచున్నదో సుస్పష్టము జేసినవి మనలో ఆచారములు విషయమునందు వలెనే సాహిత్య సేవా విషయమునందును, ప్రాచీన మతము అని చెప్పదగు మతము నందు అభిమానము యింకను గట్టిగ నున్నది ప్రాచీనమైన ప్రతిదాని యందును గౌరవమును జూపుమన తత్వ మింకను యెక్కువ మారలేదు అందువలన భావకవిత్వమును ఉపాసించువారు కొందరు ప్రాచీన కవిత్వమునందు లోపముసు చూపి, ఆ లోపమును ఈ నూతన మార్గము ద్రొక్కు భావ కవిత్వము తీర్చుచున్నదనుసరికి ప్రాచీనాభిమానులకు కోపము కలుగును. కొందరు భావ కవిత్వ పక్ష ప్రతినిధులు తమ నూతన పద్ధతి లక్షణమును చెప్పుచు ప్రాచీన కవులు లేనిపోని ఛందోవ్యాకరణాది నియమములచే కవిత్వమును బంధించినారనియు తమను అట్టి నియమములు బంధించజాలదనియు-ఒక గొప్ప లక్షణముగ చెప్పుటచే ప్రాచీనాభిమానులకు ఉద్రేకము లేచుట ఆశ్చర్యము కాదు
ఉభయ పక్షముల మధ్య ప్రాతికూల్యము కనబడుటకు యింకొక కారణము భావ కవిత్వపక్ష వాదులు కొందరు తమ నూతన ప్రయత్న మార్గమందలి ముఖ్య లక్షణమును స్పష్టముగ జెప్పక ఆప్రధానములగు అంశములను గొప్ప లక్షణముల వలె పేర్కొనుటయే ఉదాహరణార్ధము చూడుడు కవులు నిరంకుశులు అనునది భావ కవిత్వము యొక్క ఒక ముఖ్య లక్షణముగ కొందరిచే జెప్పుకొనబడుచున్నది. కవులు నిరంకుశులనునది ప్రధాన లక్షణముగ గల కవిత్వమేదియు నుండజాలదు సహృదయ హృదయాహ్లాదకరమగు భావములను రంజకమగు రీతిని కావ్య నిబద్ధము జేయునపుడు ఛందస్సు, వ్యాకరణము మొదలగు నియమములు కవికి ఆటంకములగు సందర్భములు యెప్పుడేని సంభవించుచో, అప్పుడు ఆ నియమోల్లంఘనము ఆ కవిత్వమునందు దోషము కాజాలదని చెప్పుట న్యాయమగును కాని కవులు నిరంకుశులు నేను కూడ ఒక కవినే, కాబట్టి నా యిష్టమే న్యాయమను మొండి యబిప్రాయముతో యేవో రెండు తారు పాకపు గీతముల వ్రాసినవాడు మొదట కవియేకాడు యిక భావకవి యెట్లగును? అట్టి కవిత్వములను నూతన మార్గము యెడ సానుభూతిగలవారే ఆనందించజాలనపుడు, అవి ప్రాచీనాభిమానులు నుండి ఆక్షేపించు వైఖరిని గాక మరి దేనిని పురికొల్పును?
ఇట్లే నేటి కవిత్వ రచనలో అనేకములు రసగ్రహణ తత్పరులకు రసము నిచ్చుట లేదు ఎక్కువగా అట్టి కవిత్వ రచనలను చూచినవారికి యిదే భావకవిత్వమైనచో యిదే ప్రాచీనమైన దానికి ప్రతికూలముగ పుట్టినదైనచో - యిది నిరసింపదగినదే యను భావము కలుగకుండునా? కావున కొంతవరకు రసహీనములైన కొన్ని కవిత్వ రచనలు భావ కవిత్వమునకు ఉదాహరణముగ పేర్కొనబడుటయు భావ కవిత్వమును నూతన మార్గము యొక్క ముఖ్యలక్షణము సుస్పష్టముగ తెల్పబడకుండుటయు జతయగుటయే చాల వరకు కవిత్వ విషయమున ప్రాచీనాధునిక తీవ్ర వైరమునకు ముఖ్య కారణము భావ కవులచే, ఇంతయేల రచయిత చేతనే భావ కవిత్వమునకు సహృదయ హృదయాహ్లాదకరమగు యొక కావ్యమును ప్రాచీనాభిమానాలు చూచి లజీ ప్రాచీన పద్ధతియే అని చెప్పుకొనుట యిందుకొక తార్కాణము
రాయప్రోలు సుబ్బారావు గారు తమ ఉపసంహరోపన్యాసములో భావకవిత్వము యొక్క ముఖ్య లక్షణమేమి యను శంకను మొట్టమొదట తీర్చి తమమార్గమునకు అడ్డముగ నుండు పెద్ద ముళ్ళకంపను తీసివేసినవారైనారు భావకవుల మనుకొను పలువురు రచించు కావ్యముల రసహీనతను బట్టుకొని అది భావ కవిత్వమనుడు, లేదా ఆధునిక కవిత్వమనుడు, లేదా మరియొక క్రొత్త పేరు పెట్టుడు- దాని ముఖ్య లక్షణమగు ఒక నూతన పక్కి యొక్క విలువనె తక్కువగ జూచుట యుక్తము కాదు, అని సుబ్బారావు గారు స్పష్టము జేసినారు భావ కవులమని తమకు తాము తలచుకొను వారందరును నిజముగ ఆ ఫక్కీని గ్రహించి అవలంబించుచున్నారో లేదో కాని సుబ్బారావు గారిచే స్పష్టముగ లక్షితమైన ఆ ఫక్కి మనము ఆదరించి స్వీకరించదగినదని చెప్పక తప్పదు ఈ ఫక్కి మన ప్రాచీన కవిత్వములందు గూడ గలదు. కాని, ప్రాముఖ్యముతో ప్రత్యేకముగ గుర్తించబడి యుండలేదు వర్డ్సువర్తు కాలము నుండి ఆంగ్లేయుల కవితా ప్రపంచమందు ఆ ఫక్కి ప్రత్యేకముగ నొక ఫక్కిగ పోషింపబడినది ఇపుడు ఆంగ్ల వాఙ్మయ సంబంధము చేత మన దృష్టిని ఆ ఫక్కి యెక్కువగ నాకర్షించినది కానీ అనేకులు ఆ ఫక్కి యొక్క లక్షణమును సరిగా గ్రహించి ప్రయత్నించనందునను, వారలలో కవిత్వ బీజము లేకున్నందునను, వున్నను మంచి సంస్కారము పొందనందునను, వారి కవిత్వ రచనలు చిన్న బుచ్చబడుచున్నవి అంతే. ఆ ఫక్కి యందలి ముఖ్య లక్షణము యేమన, దాని ననుసరించి రచించబడిన కవిత్వము నందు కవి యొక్క భావముల విలాసములో యే వస్తువుచే ఆ భావములు కలుగుచున్నవో ఆ వస్తువు అంతర్హితమగుచున్నది. అనగా కవికి ఆ వస్తువు యెట్లు అగుపడునో అట్లే మనకును అగుపడును పెల్లీకి స్కైలార్కు అను విహంగము ఆ కళంక స్వాతంత్ర్య పుంజముగగనిపించినచో మనకును అది విహంగముగ గాక స్వాతంత్య్ర పుంజముగ గనిపించును వస్తువును గూర్చి కవి యొక్క ఆ భావమును ఏ కవిత్వమున హృదయములలో ప్రేరించి ఆహ్లాద మొసంగునో ఆ కవిత్వము అది యొక పక్కిగ గ్రహించ దగినదే. మన ప్రాచీన కావ్యములందు ఉత్ప్రేక్షాలంకారము, రూపకాలంకారము గల భాగములు యిట్టి ఫక్కీనే సూచించును కాని ఆ కావ్యములలో అవి ప్రధానములుగ నెంచబడక ప్రధానమైన ఒక ఆత్మయుక్తమగు శరీరమునకు అలంకారములుగ నెంచబడినవి ఇదియే భేదము. ప్రాచీన ఫక్కిలో యేది అలంకార మాత్రముగా నుండెనొ అది పైన లక్షితమైన నూతన ఫక్కిలో శరీరమే యైనది. ఇట్టి లక్షణమును అనుసరించి రసవంతమగు కావ్యమును రచించుచు పోవుటలో ప్రాచీన సంప్రదాయ సిద్ధములగు నియమములు అడ్డము తగిలినప్పుడు ఆ నియమోల్లంఘనము తప్పదు.
నేడు భావ కవిత్వములు అనుబడునవి అనేకములు నూతన పక్కిని అవలంబించి యుండవచ్చును గాని అంత మాత్రముననే అవి గొప్ప కావ్యములని అందరు చెప్పవలెనని తాము అనుట లేదని సుబ్బారావుగారు అంగీకరించినారు రచయితలు తాము ఇది మంచి, యిది మంచిది ఆనుకొని రచించినారు నిజముగా మంచిదా కాదా యను నిర్ణయము సహృదయుల వంతు సహృదయులకు పెక్కురకు నేటి రచనలలో అనేకములు యింత కాలము వరకును రసహీనములుగనే కన్పడుచున్నవి. అది వాస్తవమే కాని నిజముగా కవులైన వారు దేనికి నెదరు కొని పోరాదు శాకుంతలము కాళిదాసుయొక్క మొదటి యత్నము కాదు ఉత్తర రామ చరితము భవభూతి యొక్క ప్రధమ రచన కాదు కొందరు కుకవుల రచనలు సహృదయుల శ్లాఘను బడయక పోవుట మంచి కవుల దోషము కాదు కాబట్టి క్రొత్త 'కవి భూషణుడు' చెప్పినట్లు నిజమైన కవి “కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వి ' అని తలచి ఋజు బుద్ధితో ఆత్మవంచన లేక తమ బుద్ధికి యుక్తమగు రచనల జేయుచుండవలసినదే!