Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/బ్రాహ్మసమాజము

వికీసోర్స్ నుండి


బ్రాహ్మ సమాజము

26-1-1927

గత 23 జనవరి భారత వర్షము యొక్క ఆధునిక చరిత్రమున ముఖ్య దిన మనుటకు సందియము లేదు. అది కీ. శే. రాజారామ మోహనరాయల వలన బ్రాహ్మ సమాజము స్థాపింపబడిన పవిత్ర దినమగుట చేత ప్రతి భారతీయుని వలనను స్మరింపదగినదై యున్నది.

భారత వర్షము మతములకు పుట్టినిల్లు. ఏ కాలమునకు దగిన విధమున ఆ కాలమున నిచ్చట మహా పురుషులుదయించిరి. "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” యని భారతీయ విజ్ఞానఖనియగు గీతావచనము. కనుకనే ధర్మ గ్లాని కలిగినపుడు ఈశ్వరానుగ్రహమున ధర్మ సంస్థాపనము జరుగుచు వచ్చుచున్నది.

బ్రాహ్మ సమాజము 23 జనవరి 1830 సం॥ యందు స్థాపితమైనది. అప్పటి దేశ స్థితి అందు ముఖ్యముగా వంగ దేశము యొక్క స్థితి చాల దుఃఖప్రదముగ నుండెననుటకు సందియము లేదు. ఏకేశ్వరోపానమునకై ఉపనిషత్కాలముననే ఖ్యాతి వహించియుండిన మన మాతృ దేశము మూఢాచారములకు లోనై, పరిశుద్ధమగు దివ్యమూర్తిని మరచెను. సంఘముననెన్నియో దురాచారములు ప్రబలి యుండెను. సహగమనము, శిశువులను గంగకర్పించుట, నరబలులు మున్నగునవి లెక్కకు మిక్కిలిగ నుండి అభివృద్ధికి వలయు శాంతతను దేశమున లేకుండజేసెను. జాతులలోను అంతర్జాతులలోను పలు భేదములు, అనేకములగు హెచ్చుతగ్గులు ఏర్పడి ఐకమత్యము శూన్యమగుచుండెను. హిందూదేశమున సమావేశములైన వివిధ మతములలో ఏక భావము కుదిరి తన్మూలమున భారత జాతి యనునది యుద్భవించుట అత్యవసరమగు స్థితి కలిగెను. అట్టి కాలమున, వివిధ మతములందలి విజ్ఞానము గ్రోలి, దాని హెచ్చు తగ్గుల నారసి భారత వర్షములోని యన్ని మతముల వారికి సామాన్యమును సమిష్టిదియు నగు నొక మత వేదికను నిర్మించిన గౌరవము బ్రాహ్మ సమాజమునకు చెందవలసి యున్నది. ఈ సందర్భమును పురస్కరించుకొని హైదరాబాదు బ్రాహ్మ సమాజము వారు నిన్నటి దినమున నుత్సవము సల్పిరి. ఈ సభ యొక్క వివరములు వేరొకచో గాననగును. బ్రాహ్మ సమాజము నవీన భారత జాతి యొక్క కళ్యాణమును సమకూర్చుగాక !