గోలకొండ పత్రిక సంపాదకీయాలు/బాల్య వివాహ నిషేధము
బాల్యవివాహ నిషేధము
11 - 4 - 1928
"సోదరులారా ! తేజోరాసులగు పురుష సంతతికై ప్రార్థింపు"డని వివేకానందుడు భారతీయుల నుద్బోధించెను. కాని తేజోమతులగు మాతలు లేనిదే సారవంతమగు సంతతి గలుగుటెట్లు" ముక్కుపచ్చలారని బాలికలకు పుస్తె కట్టుచున్నప్పుడు విజ్ఞానహీనులగు భార్యలు, వికాస దూరులగు మాతలు, నిర్బంధ బాలవిధవలుతప్ప వీరమాతలు ఎటునుండి వత్తురు?
బట్ట కట్టుటకూడ నెరుగక, మూర్తీభవించిన ప్రకృతి దేవతలవలె జీవించు వన్యజాతులలోగూడ లేని యీ ప్రకృతి ధర్మ విరుద్ధమగు దురాచారము హిందూసంఘము నావేశించి, పీల్చి పిప్పి చేయుచున్నది. బాల్యవివాహముల మూలమున హిందూజాతి శారీరక బలము స్రుక్కి పోవుచున్నది; మనోవికాసము మరుగువడి బోవుచున్నది, నైతికదృష్టి నీరసించి పోవుచున్నది, దాంపత్య సౌఖ్య మడుగంటుచున్నది, సంఘశాంతి విలోపమగుచున్నది ప్రతి సంవత్సరము నీ ఘోర పిశాచమునకు వేలకొలది అమాయక బాలికలు బలియయి, తమ యావజ్జీవమును దుర్భర దుఃఖముతో గడుపుచున్నారు మూఢవిశ్వాసములకు బలియగుచున్న విధవల సంఖ్య నానాటికి పెరిగిపోవుచున్నది. 1921వ జనాభా ప్రకారము, 5 సంవత్సరముల లోపలనే భర్తలను కోల్పోయినవారు 19 వేలును 5 నుండి 10 సంవత్సరముల లోపువారు 85 వేలును, 10 నుండి 15 సంవత్సరములవారు 234 వేలును గలరు మొత్తముమీద స్వయంకృతాపరాధమేదియు లేకనే దుర్భర వైధవ్య దుఃఖము లనుభవించుచున్నవారు 329 వేలమందిగలరు. తరుణుల కంటి నీటిచే మసిబట్టిన వంటయిండ్లు తడుచుచున్నంతకాలము హిందూ జాతికి శుభము చేకూరదు
బాల వితంతువుల వివాహము పేరెత్తినచో ఆర్య ధర్మములు అడుగంటి పోవునని పూర్వాచార పరాయణులు గగ్గోలు పెట్టుదురు. కాని ఆర్య ధర్మములను శ్రద్ధతో పాటించుటకు ప్రోత్సాహమొసగుచు ఆర్య గృహమునకు వన్నెదెచ్చు వివాహ విధానమును ఈ పూర్వాచార పరాయణులు ఏల అంగీకరింపరో తెలియకున్నది
ఈ పూర్వాచార పరాయణుల నస్తతత్వము కడు చోద్యమయినది. చీమలకు నూకలు వేయుదురు, పాములకు పాలు బోయుదురు, పిట్టలకు ధాన్యము జల్లుదురు, గోరక్షణకయి ప్రాణము లర్పింతురు, కాని తమ కూరిమి బిడ్డలు కలకాలము దుఃఖమున దూలు చుండ నించుకేనియు చలింపరు. ఇతరు లెవరైన ఈ అమాయకపు కన్యల వెతల బాప యత్నించినచో వారిపైబడి హింసింతురు. వీరు బాల్యవివాహమును నీతితో ముడివైతురు ఈ నీతిని మతముతో పెనవైతురు. ఈ మతమను కొరడాను బుచ్చుకొని స్త్రీ జాతి నంతటిని చావగొట్టు చున్నారు. వారీ శరీర పాటవమును అణచి వేయుచున్నారు, స్వాభిమానము చంపివేయుచున్నారు, మనో వికాసమును మూల ద్రొక్కుచున్నారు.
కాని యీ దురాచారదాసుల యధికారము చిరకాలము సాగనేరదు హిందూ సాంఘికులు మేలుకొని, యిట్టి సాంఘిక దౌర్జన్యములను బాపుటకై సత్వరముగ ప్రయత్నించిననే గాని హిందూ సంఘము నంతటిని మొదలంట కలచివైచి కలవర పరచు యువతీయువకుల తిరుగుబాటు జరుగగలదు సామాన్యపు యోచనాపరుడగు ప్రతివాడును ఉత్తమ సాధ్వులు, వీరమాతలు కాగల తరుణీమణుల కాంతివంతములగు జీవితములు శుష్క జీవితములుగసు, నిరర్థకములుగను, పరిణమించుట జూచి సహింపజాలడు, జాలిగుండె గలవాడెవ్వడును ఈ ఘోరపాపమును కలకాలము కనులార జూచి సైరింపలేడు.
బాలవితంతువుల సమస్య సమసిపోవలెనన్న బాల్యవివాహములు నిషేధించుటయే యత్యుత్తమమగు మార్గము దీనికి మొదటి మెట్టుగ 1925 లో నిషేక వయోపరిమితిని 12 నుండి 14 సంవత్సరములకు హెచ్చింపవలసినదని ఢిల్లీ శాసనసభలో సర్‌హరిసింగుగారు ప్రతిపాదించిరి అప్పుడు ప్రభుత్వము వారు తటస్థులుగ నుండి, యీ తీర్మానమును దేశమందలి వివిధ సాంఘికులు యభిప్రాయ ప్రకటనకై నానారాష్ట్రముల కంపిరి. మొత్తము మీద దేశములో నధిక సంఖ్యాకులు దీనికి సుముఖముగానే యభిప్రాయమిచ్చిరి మొన్నటి శాసనసభ జంకుచు ముందు కింకొక దాటువేసెను గత నెలలో హరవిలాస శారదగారు 18 ఏండ్లలోపల బాలురకును, 14 ఏండ్లలోపల బాలికలకును వివాహము చేయుట న్యాయవిరుద్ధమనియు, దండనీయమనియు ప్రతిపాదింప అది సభ వారిచే యంగీకరింప బడెను. ఇది దేశీయుల యభిప్రాయము కొరకై త్వరలో ప్రకటింపబడును. అన్ని ప్రాంతములవారును దీనికి ప్రోద్బల మొసగి హిందూ సంఘమును తేజోవంతముగ జేయుదురని నమ్ముచున్నాము
పరిపూర్ణముగ అంగవికాసము నొందని బాలికలను సంరక్షించుటకై యింతకుముందే వివిధ దేశీయ సంస్థానములలో శాసనములు గలవు. బరోడాలో బాలురకు 18 లోపలను, బాలికలకు 14 లోపలను వివాహములు నిషేధించి యున్నారు కాశ్మీరములో కూడ నిట్టి శాసనమే విధింపబడి యున్నది. కొండాల్ కోట, మైసూరు, ఇందూ సంస్థానములలో నిట్టి చట్టములే కలవు. రాజకోట సంస్థానములో రెండు నెలల క్రిందటనే బాలికలకు 15 ను బాలురకు 19 ను వివాహ యోగ్యవయస్సుగ శాసింపబడెను ఇట్లీ సంఘసంస్కార విషయమున దేశీయ సంస్థానములు ముందంజ వేయుచుండుట ప్రశంసార్హము
నిజాం రాష్ట్రమునకు కూడ బాల్యవివాహనిషేధ శాసనమొకటి అత్యవసరము, మన రాష్ట్రములో వేయింటికి 500 బాలికలకు 15 సం॥ లోపలనే వివాహము జరుగుచున్నది అందుచే బాలవితంతువుల సంఖ్య కూడ ప్రబలముగ నున్నది మొత్తము మనరాష్ట్రములో పదిన్నర లక్షల విధవలు గలరు వీరిలో సుమారు 4 లక్షల మంది 15 సంవత్సరము లోపువారే. కాబట్టి స్థానిక స్త్రీసంఘములొక బాల్య వివాహనిషేధ సంస్థ నేర్పాటు చేసి, ఢిల్లీలో నుండి మహారాణిగారిచే స్థాపింపబడిన కేంద్ర సంఘముతో సంబంధము లేర్పరచుకొని, ప్రజలలోనీ విషయమయి ప్రచారము సలిపి, నిజాము ప్రభుత్వము వారికి మహాజరులంపి, ఈ దురాచారమును మాన్ప బ్రయత్నింతురని హెచ్చరించు చున్నాము.