గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ప్రత్యేకాంధ్ర రాష్ట్రము
ప్రత్యేకాంధ్ర రాష్ట్రము
26-3-1927
మదరాసు శాసన సభలో నా రాజధానిలోని ఆంధ్ర జిల్లాను ప్రత్యేకరాష్ట్రముగ నేర్పరచుటకై ప్రతిపాదింపబడిన తీర్మానము బహు జనాభిప్రాయానుసారము అంగీకారమును పొందినవార్త ఏ ప్రాంతములందుండు వారైనను సరే ఆంధ్రులగు వారందరుకును మోదావహమనుట నిశ్చయము. మదరాసు రాజధానిలోని మా యాంధ్ర సోదరులు ఎన్నియో వత్సరముల నుండి ప్రతేక్య రాష్ట్రమును వాంఛించుచుండిరి. ఎన్నియో ఆంధ్ర మహాసభలందు ఆంధ్ర మహానాయకులు ఈ మహద్విషయమును ఆమోదించిరి. కాని ప్రభుత్వము వారు దీనిని విచారింపరైరి. ఇంత కాలమునకే తీర్మానము, ప్రాంతిక శాసనసభలోనే యగుగాక, జయప్రదముగ నంగీకరింపబడుట మా ఆంధ్ర సోదరుల భావి విజయమునకు సూచకమని మేము విశ్వసించుచున్నాము.
ప్రస్తుత తీర్మానము భారత ప్రభుత్వము వారి యంగీకారమును కూడ పొంది ఆ చరణములోనికి వచ్చుచో ఆంధ్రులయొక్క ఆదర్శము కొంతవఱకు ఫలించినదని భావింపవచ్చును కాని భారత వర్షములోని యాంధ్ర ప్రాంతము మదరాసు రాజధానిలోనే కాక, కొంత మధ్య పరగణాలందును కొంత నిజాం రాష్ట్రమునందును, మరికొంత మైసూరు సంస్థానమందును కలదు. బ్రిటిషు హిందూ దేశములోని యాంధ్రదేశము కాలక్రమమున ఒక రాష్ట్రముగ ప్రభుత్వము వారివలన నేర్పరుపబడవచ్చును. కాని బ్రిటిషు ప్రభుత్వము వారి తీర్మానములు దేశీయ రాజ్యములలో మార్పు కలిగింపజాలవు. కనుక నాల్గు పాలనముల క్రింద నున్న ఆంధ్రదేశము కొంతకాలము తరువాత మూడు పాలనముల క్రిందకు రాగలదు. అంతే నిజాం రాష్ట్రాంధ్రుల స్థితిలందు ఈ తీర్మానము సంపూర్ణ విజయము గాంచిన తరువాత కూడ ఎట్టి మార్పును కలుగు నవకాశము లేకున్నను, బ్రిటిష్ హిందూ దేశములోని సోదరుల వాంఛ నెరవేరినచో ఈ రాజ్యములోని యాంధ్రులును ఆనందింతురనుట నిశ్చయము. ఈ సందర్భమున నొక విషయము మాత్రము మాకు విచారము కలిగింపక మానదు. ఆంధ్ర మహాసభలందు ముఖ్యస్థానము వహించి ప్రత్యేకాంధ్రరాష్ట్ర తీర్మానమును బలపరచిన పలువురు మహాశయులు మొన్న శాసనసభ యందు ఈ ఉపపాదనము వచ్చినప్పుడు తమ తొల్లింటి ప్రతిజ్ఞలను మరచి తీర్మానమునకు ప్రతికూలముగా ప్రసంగించిరి. అట్టివారిని బేర్కొనవలసిన యవసరము లేదు. వారిని నిందింపను బనిలేదు. ఈ యంశము మన సోదరుల చిత్త స్థైర్య రాహిత్యమును కార్య భీరుత్వమును, మాత్రము ప్రకటించు చున్నది. ఇట్టి విచారకరములగు లోపములు మనల ముందైన వదలుగాక!