Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/పత్రికలకు ప్రభుత్వాదరణము

వికీసోర్స్ నుండి


పత్రికలకు ప్రభుత్వాదరణము

18 - 2 - 1935

మన రాష్ట్రములో ఉర్దు పత్రికలు పెక్కుగలవు తెలుగులో నొకటే ఇంగ్లీషులో నొకటే - మరాటీలో నొకటే - కన్నడీ కిదియు లేదు ఉర్దూ పత్రికలు రెండు డజనులకు పైగా (దిన, వార, పక్ష, మాస, త్రైమాస వగైరాలు చేరి) ఉన్నను వానికార్ధిక లోపము కానరాదు బులెటిన్ పత్రిక మూడు మారులు నాయకత్వము మార్చుకొనెను తెలుగులో రెండు మూడు వారపత్రికలు, రెండు మూడు మాసపత్రికలు ముచ్చటగా మూన్నాళ్ళుండి యంతర్హితమయ్యెను ఇక మినుకు మినుకు మనునది గోలకొండ పత్రిక యొకటే మహారాష్ట్రములో నిజాం విజయ కాలధర్మము నొందు సమయములో ప్రభుత్వమువారు సహాయముచేసి (నెలకు 100 రూపాయీల ప్రకారమని వినికిడి) దాని ప్రాణములు నిలుపు పుణ్యము కట్టుకొనిరి కనడికి దిక్కెలేదు

ఇట్టి పరిస్థితులలో నెవ్వరినేని ఉర్దు పత్రికలకు ప్రభుత్వము సహాయము చేయు నవసరము కలదా లేక యీ యితర భాషా పత్రికలకు సహాయ మవసరమా అని విచారించిన రెండవ శాఖ వాటికేయని యెవరైన చెప్పుదురు కాని మన ప్రభుత్వమువారు ఉర్దు పత్రికలకే మహాయము చేయుచున్నారు. (నిజాం విజయ తప్ప)

ఉర్దూ పత్రికలలోను అన్నిటికి సాయముచేయుటలేదు అందుకొరకే యీ మధ్య "రహబరెదక్కన్, సుభేదక్కన్ పత్రికలలో వాదోప వాదములు జరుగుచున్నవి గోల్మేజు సభాకాలములో రహబరెదక్కను కిచ్చిన భృతి యొక్క వివరములివ్వియని సుభేదక్కన్ ఇట్లు వ్రాయుచున్నది.

ఒకెతడవ ఖర్చుకుగాను రూ. 3450 హాలీలు
100 పత్రికల ఖరీదు పత్రిక ఒక్కంటికి రూ. 44 ప్రకారము 4400 హాలీలు
పూర్వపు 150 పత్రికల ఖరీదు ఒక్కొక్కటి 12 రూ వెల ప్రకారము హెచ్చింపు చేసినది 1800 హాలీలు
మొత్తము 9650

ఇంచుమించు 10 వేల రూపాయీలు ఒక్క సంవత్సరములో ఒక్క రహబరె దక్కన్ ప్రతికకు ముట్టినవి ఆ పత్రిక యెంతటి మంచినోము నోచినదో

మన ప్రభుత్వము వారు చాల ఉదారులగుటచే మన రాష్ట్ర పత్రికలు విపరీతాచారము (ప్రపంచ మందెచ్చటను కనివినని యాచారము) నిర్ణయించు కొన్నవి. మామూలి చందాదారుల కొకధర ధనికుల కొకధర, సంస్థానాధిపతుల కొక చందా, ప్రభుత్వమువారి కందరికన్న హెచ్చు చందా అట్లే ప్రభుత్వమువారు కొనుచున్నారు ఇది సరియైనదికాదని మనవి చేయుచున్నాము

ప్రభుత్వమువారు పత్రికల కొనవలసిన పనిలేదు. కొనవలెనందురా అన్ని పత్రికలను సమానముగా కొనవలెను అట్లుగాక సుభేదక్కన్‌ను వదలి రహబరెదక్కనుకు ఎక్కువ ప్రాముఖ్యత యిచ్చుటచే వీరిరువురి కిప్పుడు తగాదా యేర్పడినది ఇంతేగాక ప్రభుత్వమువారు రాయిటర్ ఆసోసియేటెడ్ ప్రెస్సు తంతీలు దామెకొని ప్రతి పత్రికకును ఉచితముగా సప్లై చేయుచున్నారు ఇదియు అనవసరమగు ఖర్చె కాని యేమియు లాభము లేదు.

ప్రపంచంలో పత్రికల కెందును ఇంతటి చంటిబిడ్డ పోషణ జరుగుట లేదు ఏ పత్రిక స్వతంత్రముగ నిలచి పాఠకులను తృప్తిపరుపలేదో అట్టిది జీవించియుండుటకు గాని సహాయము పొందుటకుగాని అర్హత నొందజాలదు. దానికి వెంటనె శ్రార్ధకర్మ చేయవలసినదే ప్రజలను తృప్తి పరుపగల్గి వారి ఆదరణ పొందు స్థితిలోనుండు పత్రికలకు ప్రభుత్వ సహాయ మనవసరమని వేరె చెప్పబనిలేదు ఇట్లు రెండు విధముల పత్రికలకును సహాయము అనవసరము

ఇపుడు ఇంకో భయమేమన, మన ప్రభుత్వమువారి ఔదార్యము వలన బైటి పత్రికలకు యెన్నింటికి మన రాష్ట్ర ద్రవ్యము పోవుచున్నదోయనునది మన ప్రకటన శాఖ వారి ద్వారా ప్రభుత్వము వారు ఏ పత్రికల కెంత సహాయము చేయునది, బయటి పత్రికలకు గూడ సాయము జరుగుచున్నదా యను విషయములను తెలుపగలరేని తెలుప ప్రార్థితులు ఇట్టి సహాయమువలన కేవలం పత్రికాధిపతుల ఇనుపపెట్టెలు నిండుటయు ప్రజల ద్రవ్యము నష్టమగుటయు వివిధ పత్రికల మధ్య నీర్ష్య ప్రబలుటయు సంభవించునని మనవి చేయు చున్నాము.