గోలకొండ పత్రిక సంపాదకీయాలు/నిరుద్యోగ సమస్య
సంస్థానాధీశులు
10 - 10 - 1928
బట్లరు కమిటి నియామకము వలన స్వదేశ సంస్థానాధీశులలో అలజడి కలిగినది. వారు తమ నిరంకుశ పరిపాలనము నిలుపుకొనుటకై తీవ్రముగా ప్రయత్నించుచున్నారు లండను నగరముననున్న సంస్థానాధీశులకు న్యాయవాద ప్రముఖులు తోడ్పడుచున్నారు బ్రిటిషు పత్రికలు, ఆంగ్లో హైందవ పత్రికలు, వారి ఆశయములను బలపరచుచున్నవి ఈ పత్రికల యుద్దేశము భారతీయుల స్వతంత్ర్యోద్యమమున కడ్డు దగులుటయే కదా! వీరి ప్రధాన న్యాయవాదులగు సర్ లెస్లీ స్కాంటుగారి యభిప్రాయము లెట్టివో ప్రపంచమునకు తెలసినవి. వారి ఆలోచనానుసారము మన సంస్థానాధీశులకు మెలంగుచు హిందు స్థానమునకు కళంక మాపాదించుటకై పూనుకొనుచున్నారు
బట్లరు కమిటీ వారి నెల 15 వ తేది విచారణ ప్రారంభించెదరు సంస్థానాధీశులు తమ కోర్కెలు న్యాయవాదుల ద్వారా తెలిపెదరు అయినను కమిటీవారు సంస్థానములందలి ప్రజల యొక్క అభిప్రాయమును వినుటకై నిరాకరించుట శోచనీయము ఇటులగుచో వీరి మొఱ లాలపించు వారెవరు? వీరి యిబ్బందులు తీర్చువారెవరు? కొందఱు సంస్థానాధీశులు తమ ప్రజలను తీరని యిక్కట్టులు కలిగించుచున్నారు కొన్ని చోట్ల పన్నుల భారమధికముగానున్నది. స్వదేశ సంస్థానములయందు విద్యాభివృద్ధి లేదు వాక్స్వాతంత్ర్యము ముద్రణ స్వాతంత్ర్యము లేదు. ఇట్టి విషమ పరిస్థితులు సంస్థానములందున్న బట్లరు కమిటీవారు జోక్యము కలిగించుకొనకుండుటేలనో తెలియకున్నది
నెహ్రూ సంఘము వారు సంస్థానముల సమస్య అనుకూలముగా నిర్ణయించిరి. దాని వలన సంస్థానాధీశులకే పెక్కు లాభములు కాగలవు కాని సంస్థానములందలి ప్రజలకు గాదు. అయినను వారు భారత ప్రభుత్వమునకు లొంగియుండుట తమకవమానకరమని భావించుచున్నారు. సర్ లెస్లీస్కాటు మున్నగు వారు తమ కోర్కెలు ఫలింపజేయుదురని ఆశించుచున్నారు అట్టి యెడ స్వదేశీయుల ఆలోచన వారికెటుల గిట్టును? లెస్లిస్కాటు మున్నగు వారు తమ దేశమునకనుకూలించు విధానమునే జొప్పించుటకు ప్రయత్నించెదరు కాని, భారతీయుల మేలుకై వారేల పాటుపడెదరు? బ్రిటిషు సైన్యములు సంస్థానములను రక్షించుటకవసరమని ఆంగ్లేయ పత్రికలు వ్రాయుచుండుట లేదా?
ఒక విషయము మాత్రము జ్ఞప్తియందుంచుకొన వలయును. పూర్వము స్వదేశ ప్రభువుల మూలముననే భారత జాతి దాస్య శృంఖములలో బడినది. ఇపుడు శృంఖములను ద్రెంపుటకై కృషి సలుపుచుండ మఱల సంస్థానాధీశులే అడ్డు తగులుచున్నారు. భారతీయులు వీరి దృక్పధమును కీర్తింపజాలరు. స్వదేశీయుల గౌరవము వలననే వీరి కీర్తి యినుమడించును గాని పాశ్చాత్యులకు దాసులగుటచే కాదు. అయినను పెక్కు సంవత్సరముల నుండి వేరొక జాతికి లోబడి యున్నవారికి స్వతంత్ర భావములెట్లు కలుగును ?