గోలకొండ పత్రిక సంపాదకీయాలు/నిజాం రాష్ట్ర వాణిజ్యము
నిజాం రాష్ట్ర వాణిజ్యము
4 - 9 - 1933
1341 ఫసలీలో నిజాం రాష్ట్రముయొక్క ఎగుమతి దిగుమతు లెట్లుండినది వివరించు ప్రభుత్వ పరిశీలనము మాత్రము మాకు పంపబడినది ఆ పరిశీలనమై కొంత వ్యాఖ్యానము గావించుటకు ముందు మేమొక మొఱను తెలుపవలసి యున్నది. పరిశీలన మొదలునుబట్టి చూడగానే ఆ పరిశీలనకు ముందు ఎగుమతి దిగుమతుల సంఖ్యలను మాత్రము ఇచ్చు నివేదిక ఒకటి యుండవలెనని గోచరింపగలదు. అట్టి నివేదిక ఏదియు మాక్కు పంపబడలేదాయెను. ఇట్లే మ. ఘ. వ. నిజాం ప్రభుత్వము నందు మాకు నివేదికలను పంపక ప్రభుత్వ పరిశీలనను మాత్రమే పంపునట్టి శాఖలు ఇంకను కొన్ని కలవు. ఎట్లో మాకు లెక్కల శాఖవారి నివేదికయు సహకార శాఖవారి నివేదికయు చేరినవి. ఇదివరకు అర్షశాఖా నివేదిక విషయమునకూడ ఈ సంగతినే మేము మొఱపెట్టి యుంటిమి
ఇంక ప్రస్తుతాంశమునకు వచ్చుదము నివేదన సంవత్సరములో-పరిశీలన సంవత్సరములో ననుటయే మాకు సరియని తలచెదము. వాణిజ్యము అంతకుముందు సంవత్సరముకంటె సుమారు నూటికి 3 లేక 4 లెక్కన తగ్గెను ఆర్ధిక దుస్థితి - అనగా డబ్బు పుట్టకపోవుట అందువల్ల ధరలు తగ్గుట అనులక్షణములు గల పరిస్థితి - ప్రపంచమునంతయు బాధించినటులే నిజాము రాష్ట్రమును గూడ బాధించి యుండినందువల్ల ఈ తగ్గుదల ఫలితమయ్యెను ఎగుమతులకంటె దిగుమతులు 3 కోట్ల 22 లక్షల 47 వేల రూపాయలు హెచ్చుట మన రాష్ట్రమునకు అనుకూల విషయముగ నుండవచ్చును
కొన్ని ముఖ్యమగు వస్తువుల విషయమున ఎగుమతి దిగుమతుల సంఖ్యలు సూచించు విషయములను పరిశీలింతము మన రాష్ట్రపు ఎగుమతులలో ముఖ్యమైనవి ప్రత్తియు, వేరు సెనగయు అవియేమో పడిపోయినవి 1340 ఫసలీలలో 1454079 మనుగులది మాత్రము ఎగుమతియైనది వేరుసెనగల ఎగుమతులు 53,4000 మణుగుల నుండి 40,80,000 మణుగులకు పడెను ఆముదాలు 2414673 మణుగుల నుండి 1898653 మణుగులకు పడెను ఈ వస్తువులను పండించు రైతుల గతి ఏమో దీనినిబట్టి తెలిసికొనవచ్చును గతము ఈ విధముగానుండ వర్తమానము కూడ ఎటువంటి ఆశకు తావీయక యున్నందువలన వివిధ గ్రామముల నుండి భూమిశిస్తు రకం తగ్గించిననేగాని బాగుపడజాలమను రైతుల మొరలు మాకు ఒకటి వెంబడి నొకటి వచ్చుచున్నవి మ ఘ వ నిజాం ప్రభుత్వమువారు కరుణామయులన్న సంగతి పూర్వపు బరాయిందాలు మాఫీల వలన రూఢమైనదే గనుక ఇపుడును వారు రైతుల స్థితిపై జాలిగొని వారి నుద్ధరించుటకు వారి భారమును తగ్గించు యత్నము ఆలపింపక చేసెదరని నమ్ముచున్నాము. పై జెప్పిన వస్తువుల విషయమున మాత్రమేగాక ధాన్యములన్నిటి విషయమున గూడ ధరలు లోపించినందువలన రైతుల భారము ఎక్కువైనది.
ఎగుమతులలో హెచ్చిన వస్తువుల విషయము చూచి సంతోషింపదగిన దొకటి కలదు ఈ రాష్ట్రమందు మిల్లులలో తయారైన గుడ్డల ఎగుమతులు 1340 ఫ లో రూ. 5000 ల విలువగల్గి యుండినవి. ఇప్పుడు ఒక లక్ష 42 వేల వరకు హెచ్చినవి రాష్ట్రమందు చేతితో తయారు చేయబడిన గుడ్డలు నివేదన సంవత్సరములో 15 లక్షల 48 వేల రూపాయల విలువగలిగియుండ పూర్వము 7 లక్షల 44 వేలు మాత్రమే యుండెను. అదే విధముగ నూనె మొదలగునట్టి చమురు ఎగుమతులు 1340 ఫ. లో 31 లక్షల 79 వేల నుండి 1341లో 33 లక్షల 46 వేలకు పెరిగెను. ఇట్లు ఈ సంస్థానములో వస్త్రపరిశ్రమయు, నూనె సంబంధమగు పరిశ్రమయు వృద్ధిగాంచుట గర్వించదగిన విషయమే
వస్త్రముల విషయమున ఎగుమతి దిగుమతులను రెంటిని పోల్చిచూచినను మన రాష్ట్రమునకు అనుకూలముగనే యున్నది మిల్లు గుడ్డల ఎగుమతుల విలువలో పూర్వముకంటే 'నివేదన వత్సరములో నూటికి 2740 వంతున ఎక్కువగా దిగుమతులు నూటికి సుమారు 7 వంతున మాత్రమే ఎక్కువయ్యెను. చేతిపనులవలన తయారగు వస్త్రముల విషయములో ఎగుమతులు నూటికి 108 వంతున హెచ్చగా, దిగుమతులు 100 కి 41 వంతున మాత్రమే హెచ్చును. ఈ అంకెలలో మ. ఘ. వ నిజాం రాష్ట్రమందు ప్రభుత్వ వాణిజ్య పారిశ్రామిక శాఖవారు ఇంతవరకును చేసిన అభివృద్ది ప్రయత్నముల ఫలమును కొంతవరకు కనుగొనవచ్చును.