గోలకొండ పత్రిక సంపాదకీయాలు/నిజాంసాగర్ ప్రాజెకు
నిజాంసాగరు ప్రాజక్టు
8 - 4 - 1935
నిజాంసాగరు ప్రాజక్టు నిర్మాణము జయప్రదముగా సంపూర్తి అయినందుకు హైదరాబాదు రాష్ట్రము గర్వించ వచ్చును 4½ కోట్ల రూపాయీల ఖర్చుతో ఏడేండ్లకాలము తీసుకొన్న ఈ ప్రాజెక్టు ప్రపంచములోని గొప్ప చెఱువులలో నొకటియనియు, ఇండియాలో నిర్మింపబడిన గొప్ప చెఱువులలో రెండవది యనియు, ఇంతగొప్ప చెఱువు ప్రారంభమునుండి అంతమువరకు "మ-ఘ-వ- నిజాం 'ప్రభువుగారి విశ్వాస' పాత్రులు అగు ప్రజల చేతనే" నిర్మించబడెననియు చెప్పుకొనగల్గినందుకు నవాబ్ అలీనవాజ్ జంగ్‌గారు, వారి యనుచరాధికారులతోకూడ ఏల గర్వించరాదు. నవాజ్ అలీనవాజ్ జంగ్‌గారి రాష్ట్రాభిమానము ప్రశంసనీయమైనది - ఈ ప్రాజక్టు నిర్మాణ పరిపూర్తిచే నవాబ్‌గారు, తగిన అవకాశ మిచ్చినచో నిజాం రాష్ట్రీయులు బ్రిటీషిండియానుదాటి ప్రపంచమందు నాగరికతలో బ్రిటీషు ఇండియాను మించియున్న యితర దేశములతో కూడ సరిసమానమగు స్థానము నాక్రమించగలరని నిరూపించినారు ఇందుకు నిజాం రాష్ట్రీయులు నవాబ్‌గారికి కృతజ్ఞులై వారికి రాష్ట్ర పరిపాలనా కార్యనిర్వహణమందు తమ యావచ్చక్తిని వినియోగించుటకు యిప్పటికంటె ఎక్కువ అధికారస్వాతంత్ర్యమును కోరుట యుక్తముగనె యున్నది
ప్రభుత్వమువారు ప్రజల ద్రవ్యమును వ్యయపరుపయందు సాధ్యమైనంత యెక్కువ మందికి సాధ్యమైనంత యెక్కువ లాభము గల్గునట్లు చూచుట విధి ఈ విధినిజాంసాగర్ ప్రాజక్టు నిర్మాణములో గూడ తప్పకుండుటకై చీప్ ఇంజనీర్ అగు ననాబ్‌గారు, యంత్ర సాధనములను సాధ్యమగునంత తగ్గించి పనినంతయు విశేషముగా కూలీ మనుషులద్వారానే చేయించుకొనినారు ఇందువల్ల చాలామంది రాష్ట్రీయులగు కూలి పనివారలకు సంపాద్యము లభించినది ఇది కూడ నవాబ్ అలీనవాజ్ జంగ్‌గారు పరిపాలనయందలి బాధ్యతను చక్కగా గుర్తించినట్లు సూచించు చున్నది. ఇంత గొప్పవ్యయముతో 275000 యెకరములకు నీటిపాఱుదల గావించగల గొప్ప ప్రాజక్టు నిర్మాణము గావించినందుకు, తగినంత లాభము వ్యవసాయాభివృద్ధి ప్రజలు పొందునపుడు ప్రాజక్టుకారకులు తాము పూర్తిగా చరితార్థులమైతిమని తృప్తిజెంద వచ్చును ఈ ప్రాజక్టు ప్రాంతములో చెఱకును విస్తారముగా పైరుచేసి, ఆ చెఱకు నంతటిని ఈ రాష్ట్రములోనే బెల్లము చక్కెరచేసి అమ్ముటకు సౌకర్యములున్నచో యీ ప్రాజక్టువల్ల గొప్ప లాభముండును అని అలీనవాజ్‌జంగ్‌గారు తలచుచున్నారు ఎట్లయినను యీ ప్రాజెక్టుకు కారకులగు వారికి దానివలన రాష్ట్రము యొక్క ద్రవ్యోత్పత్తి స్పష్టముగా యెక్కువగునంతవరకు, ప్రాజెక్టుపని పూర్తి అయినదని తలచకుండ ఆయా విషయము లన్నింటియందు నిపుణులగు వారి సలహాలతో పనిచేయునట్టి బాధ్యతాధికారములను యిచ్చి చూచుట మంచిదని మాతలంపు.