గోలకొండ పత్రిక సంపాదకీయాలు/నాయకులు - ప్రజలు
నాయకులు—ప్రజలు
11-5-1927
అసహాయోద్యమము ప్రజల హృదయమునందు నాటియున్నదని చెప్పుటకు నాగ్పూరు యందును అలీబాగు యందునూ జరుగుచున్న సత్యాగ్రహములే నిదర్శనములు. నాయకులు తమ భావములు మార్చుకొని రానురాను ప్రభుత్వమునకు సహాయపడుట కుద్యుక్తులగుచున్నారు. కానీ ప్రజలు మహాత్మా గాంధీగారి హితవును మరువలేదు. నాయకులయందు వాక్శూరత్వ మున్నంత కార్య శూరత్వము లేదు. ఒకరితో నొకరికి సరిపడక, అభిప్రాయ భేదములు కలిగి, నిరంతరము తగవులాడుచు, కాలము మారుకొలది నూతన రాజకీయ కక్షలు బయలుదేరదీయు చున్నారు. తమ చంచల అభిప్రాయములకు తోడ్పడుటకై దేశమునందు పర్యటనము సల్పి బలము కూర్చుకొనుటకు ప్రయత్నించుచున్నవారే కానీ దేశ విముక్తికై యెట్టి మార్గ మవలంబించవలయునో ఆ త్రోవ త్రొక్కుట లేదు. ఆరునెలల క్రిందట శాసన సభలకుపోయి ప్రభుత్వము వారి చర్యల ఖండించి ఆదాయ వ్యయముల అంగీకరించమనియు, ద్వంద్వ ప్రభుత్వములు కూలదోసెదమనియు, ఆర్భాటములు చేసి అమాయకులగు ప్రజల నుండి సమ్మతుల సంపాదించి శాసన సభా మందిరములకు జేరిరి. నాటినుండి నేటివరకు ప్రజలకు కలుగుచున్న కష్ట నిష్టురములు విచారించినవారు గానరారు. శాసన సభల యొక్క మొదటి సమావేశపు గడవు తీరినది. ఏవో కొన్ని తీర్మానములపై తీవ్రమగు ఉపన్యాసముల గావించిరి. సంగీతముచే చింతకాయలు రాలవన్నట్లు వీరి ఉపన్యాసముల వలన ప్రభుత్వము లొంగునా?
శాసన సభలనుండి విశ్రాంతి కలిగిన పిదప జాతీయ మహా సభాధ్యక్షులగు శ్రీమాన్ శ్రీనివాస అయ్యంగారు దేశమునందు పర్యటనము సలిపి తమ శాసన సభల ద్వారా స్వరాజ్యము పొందజాలమనియు, తాము ముందు దేశము పాలించుటకై అనుభవము సంపాదించుటకై వానలో చేరితిమనియు నుడివిరి.
ఇపుడు సర్వ రాజకీయ పక్షముల వారును కలసి నొక నివేదిక తయారు చేసి ప్రభుత్వమున కర్పించవలయునని ప్రచారము గావించుచున్నారు. లోగడ బీసెంటమ్మగారు తయారుచేసిన ఇండియా కామనువెల్తు బిల్లునకే దుర్గతి పట్టినదో విదితమే కదా! అయ్యంగారి నివేదిక వలన కలుగు లాభమేమి? ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘాధ్యక్షులు సహకారమునకు దిగుచున్నారు. ఈరీతి నాయకులందరును పెడమార్గమునకు దిగుచున్నా రనిన తప్పుకాదు. మన నాయకుల స్థితి యీ రీతి యుండ ప్రజలు మాత్రము వారి అభిప్రాయానుసారము మెలగక పూర్వము అసహాయోద్యమమునందే నిలచియున్నారు. ప్రభుత్వము వారు వంగరాష్ట్ర రాజకీయ నిర్బంధితుల విడుదల గావింపలేదని నాగ్పూరునందు అవరేగారి నాయకత్వమున ఆయుధ శాసన ఉల్లంఘనము జరుగుచున్నది. ప్రతినిత్యము స్త్రీలు పురుషులు ఆయుధపాణులై సివిలు లై నునందును ఊరేగుచున్నారు. పోలీసువారు మొదటి దినములలో కొందరిని అరెస్టు చేసిరి. కాని యిపుడు మౌనము వహించియున్నారు.
ఇదియే రీతి బొంబాయి రాష్ట్రమందలి ఆలీబాగు నందు పన్నులు ప్రభుత్వమున కొసగగూడదని తీర్మానించుకొని సత్యాగ్రహమునకు పూనుకొనిరి. గత సంవ్సతర మిచట రిసెటెలుమెంటు జరిగియుండెను. ఇందువలన పన్నులు హెచ్చింపబడెను. ఎన్నిసార్లు రైతులు మొరపెట్టుకొనినను అధికారులు గమనించలేదు. అందుచే వీరు సత్యాగ్రహమునకు పూనుకొనిరి. నాయకులెవ్వరో తెలియుట లేదు. కాంగ్రెసు అధ్యక్షులు అలీబాగునకు వెళ్ళి అచట స్థిరచిత్తులయి యుండవలయునని ప్రజలకు హితవు గరపిరి.
ఇంతియేగాక దేశమునందు మతావేశపూరితలగు నాయకులు కొందరు గలరు. వీరి ఉద్రేకపూరితమగు యుపన్యాసముల వలస అపుడపుడు హిందూ మహమ్మదీయ కలహములకు కారణమగుచున్నది. ప్రభుత్వము వారింతవరకే "విభజింపుడు, పాలింపుడు" - అను సూత్రమును అనుసరించి ఉద్యోగముల యందును, వోట్లయందును, మత భేదములు గల్పించి యున్నారు, వానికితోడు మత ప్రచారము తీవ్రరూపము దాల్చుటకు సహాయపడుచున్నది. ఇట్టివారి నాయకత్వము పోయిననేగాని దేశ విముక్తి సాధ్యపడ నేరదు. కనుక ప్రజలు వీరి అభిప్రాయములకు చెవి యొగ్గకూడదు.
దేశమునందు పరిస్థితులు ఇట్లుండ మేనెల 15 వ తేదీ బొంబాయి నగరమున కాంగ్రెసు కార్యనిర్వాహక సభ గూడుచున్నది. సభవారు పరిస్థితులు సమగ్రముగ చర్చించి యేమి తీర్మానింతురో అని అందరు కుతూహలపడు చున్నారు. కనుక ఇట్టి సందిగ్ధ స్థితియందు సభవారు పెడమార్గమునకు ద్రొక్కక దేశముయొక్క దాస్య విముక్తికై చక్కని మార్గము నిరూపించెదరు గాక.