Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/నన్నయ భట్టారక వర్ధంతి

వికీసోర్స్ నుండి


నన్నయ భట్టారక వర్ధంతి

21-9-1927

శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రభాషా నిలయమువారు గత శనివారము నాడు నన్నయ భట్టారక వర్ధంతి జరిపి యుండిరి. ఆ సభా వృత్తాంతమును స్థలాంతరమున ముద్రించి యున్నారము ఇట్లు కవుల వర్థంతులను జరపునట్టిది ఈ నిలయమొక్కటియే సకలాంధ్ర భూభాగమున గనపడుచున్నది. భాషాభివృద్ధికై ఏర్పడిన గ్రంధాలయములిట్టి మంచి పద్దతి నేల యనుకరింపగూడదో మాకు దోచకున్నది. హైదరాబాదులోని గ్రంథాలయములవారైనను తాము ప్రత్యేక సభలను సమావేశపరచుటకు అనుకూలము లేనిచో, నిలయమువారిలో జేరి సభ కెక్కుడు ప్రాతినిధ్యమిచ్చి, మిగుల యాకర్షణీయముగ నొనర్పకుండుటకు గారణము దురూహ్యము. నిర్వివాదమయిన ఇట్టి భాషావిషయ కోపన్యాసము లందు మనము ఏకముఖముగా ప్రవర్తించిననేగాని, జనులయందు భాషాభిమాన బీజములు నాటుటకు అవకాశము కలుగజాలదు. ఆయా గ్రంధాలయాధికారులు ఈ విషయమును గూర్చి యాలోచించెదరుగాక !

ఇక సభావృత్తాంతమును గమనించినచో అది మిగుల నిరుత్సాహకరముగ నున్నదని తెలుపుటకు చింతించుచున్నాము ఒక బాలేందు శేఖరముగారు చెప్పిన నాలుగు మాటలుతప్ప శ్రీ సోమయాజులుగారేమి, అధ్యక్షులగు ప్రభాకరరావుగారేమి, నన్నయభట్టు భారత రచనా విశేషములనుగూర్చి సుంతైనను ముచ్చటించ లేదు భారతము నెవ్వరు వరించుటలేదేయని వాపోయినంత మాత్రమున లాభము లేదు. నన్నయభట్టు రచనయందలి మేలిగొనముల నెత్తి చూపి, శ్రోతలను ఆకర్షించి వారికా గ్రంధము జదువు సబిలాష పుట్టినట్లుగా ఉద్బోధించవలయును అధ్యక్షులవా రయినను “ఎవ్వతె వీవు... అటజనించె..." అను మనుచరిత్ర పద్యముల నుద్ఘాటించిరేగాని నన్నయ పద్యరత్నములను ఉదాహరించి యుండలేదు ఆయా సమావేశ విషయములను బురస్కరించుకొని, ఆయా కవుల గ్రంధములను సారస్వత దృష్టితో విమర్శించిననేగాని సామాన్య జనులయందు భాషాభిమాన బీజములు నాటుటకును, ఆంధ్రభాష యౌన్నత్యమును జాటుటకును అవకాశముండదని మా యభిప్రాయము లేనిచో ఇట్టి సభలు సోమయాజులగారు సెలవిచ్చినట్లు ఈ కాలపు సాంవత్సరిక సంధ్యావందనములగును కార్యనిర్వాహకులు ఈ విషయములను గమనించెదరుగాక!

భారతాది గ్రంధములు ఈ కాలమువారు పఠించుటలేదని అధ్యక్షులవారు సెలవిచ్చిరి. కానీ ఈ విషయమున మేము అధ్యక్షులతో నేకీభవించజాలము పూర్వ కవులకును, గ్రంధములకును ఈ కాలమునందే ఎక్కువ ప్రచారము గలదని మా యభిప్రాయము ఇట్టి వర్థంతులు జరుపుకుండుటయు, గ్రంథాలయములు స్థాపించి యందు పూర్వకవుల గ్రంధములకు అర్హస్థానము ఒసంగు చుండుటయు, వేదికలపై భాషావిషయక ఉపన్యాసములు జరుపుచుండుటయు ప్రజలదృష్టి యెట్లు ప్రసరించుచున్నదో తెలియగలదు. అంతియెగాక, పాఠశాలలందును, కళాశాలలందును, విద్వాన్ మొదలగు పరీక్షలకును, పూర్వగ్రంధములు పఠనీయములై యుండుట క్రొత్త విషయముగాదు.మరియు ఆంధ్ర భారతీతీర్థ మొదలగు ప్రజా సంస్థలును ఈ విషయమున చక్కని కృషి సలుపు చున్నవి ఏ మాస పత్రికను, ఏ వార్తాపత్రికను తిలకించినను పూర్వగ్రంధములను స్తనశ ల్యపరీక్షచూసి చర్చించు వ్యాసములు పెక్కు గనిపింప గలవు రాజులును, భాగ్యవంతులును తమ ద్రవ్యమును కవుల పోషణమునకును, భాషాభివృద్ధికిని సద్విని యోగము చేయుచుండుటకు ఉదహరణములు లేకపోలేదు. ఈ యంశము యధ్యక్షులకు అనుభవైక వేద్యము ఇవన్నియు శుభసూచకములు. పూర్వకవుల ప్రతిభ దినదినము హెచ్చి దివ్యతేజస్సుతో వెలుగుచున్నది. అయినను సజీవమయిన భాష మార్పులు చెందుచుండుట ప్రకృతిసిద్ధము అందుచే మనము నిరుత్సాహము చెందనవసరములేదు పూర్వ కవుల ప్రతిభను ఊతగా గైకొని, నవీనోత్సాహముతో ప్రత్యాంధ్రుడూ ఆంధ్ర భాషాభివృద్ధికై ముందుకు నడుచుచుండునుగాక!