గోలకొండ పత్రిక సంపాదకీయాలు/తొలిపలుకు
తొలిపలుకు
భారతదేశంలో పత్రికల చరిత్ర చాలా ఉజ్జ్వలమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య సాధనకు, భారత జాతీయతకు, భారతదేశ సమైక్యతకు ఈ పత్రికలు చాలా తోడ్పడినవి. దేశ భాషా పత్రికలే కాక ఇంగ్లీషు పత్రికలు కూడా ఈ మూడు ఆశయాల సాధనకు గణనీయమైన కృషి కావించినవి. భారత ప్రజాస్వామికానికి కూడా పత్రికలు ఇప్పటి వరకు చేసిన, ఈనాడు చేస్తున్న కృషి చాలా గొప్పదని చెప్పవచ్చు. ఒక చిత్రమేమంటే ఇంగ్లీషు వారిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి స్వరాజ్యసాధనకు కృషిచేసిన కొన్ని ముఖ్యమైన పత్రికలు ఇంగ్లీషులోనే నడిచినవి. చాలా మంది ఆంధ్రులు ఈ ఇంగ్లీషు పత్రికల నిర్వహణకు తోడ్పడినారు. వీరిలో సి. వై. చింతామణి, కోటంరాజు సోదరులు, యం. చలపతిరావు, కాసా సుబ్బారావు మొదలయినవారు ప్రత్యేకంగా పేర్కొనదగినవారు. తెలుగుపత్రికా సంపాదకులలో కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావుగారు ఈ తరగతికి చెందినవారు.
ప్రతాపరెడ్డిగారు 1926 లో గోలకొండ పత్రికను ద్వైవార పత్రికగా స్థాపించినారు. అప్పుడు హైదరాబాదు రాష్ట్రంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు ఉండేవి. ఇందులో తెలంగాణా ప్రజలు అధిక సంఖ్యాకులు, తెలుగు ప్రధానమైన భాష. అప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక భాషలకు ఏవిధమైన స్థానం ఉండేదికాదు. ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం మొదలైన ప్రాథమిక స్వత్వాలు ఏమీ లేకుండెను ఇటువంటి పరిస్థితుల్లో గోలకొండకు పూర్వమే నీలగిరి తెలుగు పత్రికలు రెండు మూడేండ్లు నడిచి ఆగిపోయినవి. కాని గోలకొండ పత్రిక మాత్రం 1947 వరకు ద్వైవార పత్రికగా నడిచి దినపత్రికయై తరువాత సుమారు 20 సంవత్సరాలపాటు వెలువడినది. ఆ రోజుల్లో హైదరాబాదు పత్రికలకు ప్రజలు, ప్రజల ఉద్యమాలతో సంబంధం కలిగినవారు సంపాదకులుగా ఉండే వారు. ఉర్దూలో రయ్యత్ పత్రిక సంపాదకులైన మందుముల నరసింగరావుగారు, పయాం పత్రిక సంపాదకులైన ఖాజీ అబ్దుల్ గఫార్ (మౌలానా అబుల్ కలాం ఆజాద్‌గారిచేత ప్రభావితుడు,) ఆర్యభాను పత్రికా సంపాదకులైన వినాయకరావు విద్యాలంకార్‌గారు ప్రత్యేకంగా పేర్కొనదగినవారు. ఆ రోజుల్లో మాడపాటి హనుమంతరావుగారు ముషీరె దక్కన్ పత్రికకు సంపాదకీయాలు రాస్తుండేవారు. ఈ పత్రికా సంపాదకులందరు ప్రజల ఉద్యమాలతో సంబంధం కలిగి ప్రజల సమస్యలపట్ల సానుభూతి కలిగినవారు . ఒకవేళ ఆ రోజుల్లోనే ప్రజలు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఏర్పడితే వీరిలో ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కాదగినవారే. వారి వ్యక్తిత్వాలలో అతివాద, మితవాద ధోరణులేమైనప్పటికి అందరూ ప్రజల మనుష్యులే అని చెప్పవలసి ఉంటుంది. పత్రికా నిర్వహణలోను సంపాదకీయాల తీరుతెన్నులలోను వారి వ్యక్తిత్వాల ప్రభావంవలన కొన్ని వ్యత్యాసాలు ఉండియుండ వచ్చును.
1926 లో ప్రారంభమైన గోలకొండ పత్రికకు ప్రతాపరెడ్డిగారు మొదటి రెండు మూడు సంవత్సరాలు ప్రచ్ఛన్నంగాను, తరువాత ప్రత్యక్షంగాను సంపాదకులుగా ఉండి పత్రికను నిర్వహించినారు. గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతాపరెడ్డిగారు, నరసింగరావుగారు, హనుమంతరావుగారివలెనే న్యాయవాద వృత్తితోనే జీవితం ప్రారంభించినారు. హనుమంతరావుగారు షష్ఠిపూర్తి వరకు న్యాయవాద వృత్తిని వదలిపెట్టలేదు. కాని ప్రతాపరెడ్డిగారు, నరసింగరావుగారు, కొన్ని సంవత్సరాలలోనే న్యాయవాద వృత్తిని వదలుకొని పూర్తిగా పత్రికలకే అంకితమయినారు. ఆ రోజుల్లో హైదరాబాదు రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణాలో ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన ఏ ఉద్యమాలు వచ్చినప్పటికి వీటన్నిటితోను ప్రతాపరెడ్డిగారు సంబంధం కలిగినవారు. మొట్టమొదటి ఆంధ్ర మహాసభకు ప్రతాపరెడ్డిగారే అధ్యక్షులు. ఆ రోజుల్లో సంఘ సంస్కరణ సభలకు అనేకమైన వాటికి అధ్యక్షత వహించినారు. ఆ రోజుల్లో ప్రజలకు మేలుకగిలించే ఏ ఉద్యమం వచ్చినా ప్రతాపరెడ్డిగారి సహాయం దానికి లభించేది. ఆనాటి ప్రజల రాజకీయ, ఆర్థిక సాంఘిక సమస్యలపట్ల అవగాహన కలిగి సానుభూతి కలిగిన ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రికను ఆనాటి తెలంగాణాకు దర్పణంగా రూపొందించినారు. ఆ రోజుల్లో గోలకొండ వెళ్ళని ఊరేలేదు. నిజానికి తెలంగాణాను మేలుకొల్పిన వ్యవస్థలలో గోలకొండ పత్రికకు ప్రత్యేకస్థానం ఇవ్వవలసి ఉంటుంది. ముట్నూరి కృష్ణారావుగారి సంపాదకీయాలవలె, మందుముల నరసింగరావుగారి రయ్యత్ సంపాదకీయాలు, ప్రతాపరెడ్డిగారి గోంకొండ పత్రిక సంపాదకీయాలు ప్రజలను జాగృతం చేసినవని చెపితే ఆశ్చర్యం కాదు.
ప్రతాపరెడ్డిగారు బహుభాషావిశారదులు. ఉత్తమశ్రేణికి చెందిన పండితులు. మంచి పరిశోధకులు. తెలుగులో అనేక సృజనాత్మక రచనలు చేసిన భావుకులు. వీరు కవితలు అల్లినారు. కథలు చెప్పినారు. నాటకాలు వ్రాసినారు. తెలుగు వచన రచనకు రూపురేఖలు దిద్దినారు. అనేక విషయాలపైన విజ్ఞాన ప్రబోధకరాలైన వ్యాసాలను వ్రాసినారు. ప్రామాణికమైన గ్రంథాలను వ్రాసినారు. అయినా అనాటి చాలామంది పండితులవలె దేశాన్ని ప్రజలను మరచిపోయి వారికి దూరంగా ఉండని త్యాగశీలి ప్రతాపరెడ్డిగారు. అందుచేతనే గోలకొండ పత్రికద్వారా తెలంగాణా రాజకీయ జీవితానికి పునాదులు వేసినారు. అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రాథమిక స్వత్వాలు ఏమీ లేకుండెను. ప్రజలకు ప్రాథమిక స్వత్వాలు లభించవలెనని పోరాడినవారిలో ప్రతాపరెడ్డిగారు ప్రముఖులు. ఆ రోజులలో గష్తీనిషాన్ 53 అనే ప్రభుత్వ ఉత్తర్వు అమలులో ఉండేది. ఈ గష్తీప్రకారం గ్రంథాలయాలు పెట్టుకొనవలెనన్న, సభలను చేసుకొనవలెనన్న, సభను నడపవలెనన్న ప్రభుత్వం అనుమతి అవసరమై ఉండేది. అనేక సందర్భాలలో ఈ అనుమతి లభించేదికాదు. ఒకసారి ప్రతాపరెడ్డిగారు ఈ గష్తీనిషాన్ 53 గురించి ప్రస్తావిస్తూ ఇది" వాగ్బంధన శాసన శృంగార తాండవ క్రియావిశేషం" అని చమత్కరించినారు. ఆనాటి సమస్యలపట్ల గోలకొండ పత్రికలో వచ్చిన సంపాదకీయాలను గూర్చి ప్రభుత్వం నుంచి అప్పుడప్పుడు హెచ్చరికలు వస్తుండేవి. కాని, ప్రతాపరెడ్డిగారు ఈ హెచ్చ రికలను పాటించక తమ సహజ ధోరణిప్రకారమే పత్రికద్వారా ప్రాథమిక స్వత్వాలను సమర్థించేవారు.
1947 లో గోలకొండపత్రిక దినపత్రిక అయిన తరువాత ఈ పత్రిక సంపాదకీయాలపైన ప్రభుత్వం ఒక ఆంక్షను విధించింది. ఆ ఆంక్ష ప్రకారం ప్రతిరోజు వ్రాసే సంపాదకీయాలను మొదట సమాచారశాఖకు పంపి వారు సూచించిన మార్పులను చేయవలసి ఉండేది. కాని ప్రతాపరెడ్డిగారు ఈ ఆంక్షను ఒప్పుకోలేదు. అందుకు బదులుగా ప్రపంచ మహనీయులు అన్ని భాషలలో వ్రాసిన సూక్తులను - ముఖ్యంగా ప్రజల ప్రాథమిక స్వత్వాలకు సంబంధించిన సూక్తులను - సేకరించి ఒక్కొక్క రోజు ఒక సూక్తిని ప్రకటించేవారు. ఈ సూక్తులు ప్రభుత్వానికి సంపాదకీయాలకన్నా ఎక్కువ బాధకలిగించేది. పత్రికల చరిత్రలో ఇది మరువరాని సన్నివేశం.
ఆనాటి హైదరాబాదు రాష్ట్రానికి, తెలంగాణాకు సంబంధించిన రాజకీయ ఆర్థిక, సామాజిక సమస్యలకు సంబంధించిన విషయాలపైన ప్రతాపరెడ్డిగారు సంపాదకీయాలు వ్రాసేవారు. అందుచేత ఆనాటి పరిస్థితులకు సంబంధించిన ఏ విషయాన్ని గురించి పరిశోధన జరిగినా గోలకొండ పత్రిక సంపాదకీయాలలో విలువైన సమాచారం లభిస్తుంది. చరిత్ర, సాంఘిక శాస్త్రం, ఆర్థిక పరిస్థితులు, రైతుల ఇబ్బందులు స్త్రీ విద్య, స్త్రీ స్వాతంత్ర్యం, మాతృభాషలో విద్యాబోధన, విద్యావిషయాలు మొదలైన అనేక సమస్యలపైన పరిశోధన చేయదలచుకున్నవారు ఈ సంపాదకీయాలు అవశ్యం చదువ దగినవి.
ప్రతాపరెడ్డిగారి శైలి విశిష్టమైంది. ఏ విషయాన్ని గురించి చెప్పవలసి వచ్చినా దాపరికం లేకుండా, స్పష్టంగా, సూటిగా తమ అభిప్రాయం ప్రకటించేవారు ప్రతాపరెడ్డిగారు. ఈ విశిష్టత వారి సంపాదకీయాలలోకూడా కనిపిస్తుంది. స్వచ్ఛమైన తెలంగాణ తెలుగు ప్రతాపరెడ్డిగారి శైలిలో నిగనిగ లాడుతుంది. వారు వ్రాసిన సంపాదకీయాలు ఏవో ఏవి కావో వారి సమకాలికులు సులభంగా తెలుసుకునే వారు. ప్రతాపరెడ్డిగారి సంపాదకీయాలలో వ్యంగ్యం, అధిక్షేపం, తీవ్రత, అభినివేశం అనే గుణాలు కొట్టవచ్చినట్లు కనిపించేవి. విషయానికి అనుగుణంగా వారు శైలిని మార్చి వ్రాసేవారు. స్వేచ్ఛగా వ్రాసేవారు. అప్పుడప్పుడు ప్రతాపరెడ్డిగారు స్వగ్రామమైన ఇటికాల పాడుకు (అప్పుడది నీళ్లు లేని ఇటికేల పాడు) వెళ్ళి వచ్చేవారు. వారు లేనప్పుడు సంపాదకీయాలు వ్రాసే బాధ్యత స్నేహితుల కెవరికైనా అప్పగిస్తూండే వారు. ఆ సంపాదకీయాలు చదివితే ప్రతాపరెడ్డిగారు హైదరాబాదులో లేరన్న విషయం సులభంగా అర్థమయ్యేది. సంపాదకీయాన్ని చదివి మీరు తిరిగి హైదరాబాదు వచ్చారని తెలిసిందని ఉత్తరాలు వ్రాసిన మిత్రులు వారికి లేకపోలేదు. సంపాదకీయాలను చదివితే ఆయన ఉనికి స్పష్టంగా తెలిసిపోయేది.
ఆనాడు దేశానికి మార్గదర్శకులైనవారు పత్రికలనే అందుకు సాధనంగా వినియోగించుకున్నారు. అన్నిటికన్న మిన్నగా మహాత్మాగాంధిగారు యంగ్ ఇండియా, మరియు హరిజన్ పత్రికలను, బాలగంగాధర తిలక్ గారు మరాటా, కేసరిద్వారా, జవహర్‌లాల్ నెహ్రూగారు నేషనల్ హెరాల్డు పత్రికద్వారా, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌గారు అల్ హిలాల్ పత్రిక ద్వారా, రాజగోపాల చారిగారు స్వరాజ్య పత్రికద్వారా తమ అభిప్రాయాలను ప్రజలకు అందజేసినారు. ప్రతాపరెడ్డిగారు ఈ మహనీయుల మార్గమునే అవలంబించిరి. బి. ఏ., బి. యల్ పట్టభద్రులైన ప్రతాపరెడ్డిగారు వృత్తినే అవలంబిస్తే న్యాయమూర్తులయ్యేవారు. ఉద్యోగమే చేస్తే పెద్ద పదవి దొరికేది. వ్యవసాయం చేసుకున్నా తగినంత సంపాదన లభించేది. పుష్కలమైన సంపాదన కొరకు అవసరమైన అవకాశాలన్నీ కలిగినప్పటికి ప్రతాపరెడ్డిగారు వాటిని వినియోగించు కొనక పత్రికా నిర్వహణకు తమ జీవితమును అంకితము చేసినారు. ఇది ఆయన త్యాగ నిరతికి నిదర్శనం. గోలకొండ పత్రికతో ఆకస్మికముగా సంబంధం వదలుకొన్నప్పుడు మరొక పత్రిక స్థాపించే దాక ప్రతాపరెడ్డిగారు నిదురపోలేదు. ప్రజావాణి పత్రికను కొంతకాలము వారు నడిపినారు. ప్రజావాణి కూడా గోలకొండ సంప్రదాయాన్ని అనుసరించింది. ఈవిధంగా దేశ సేవ కొరకు పత్రికను సాధనంగా స్వీకరించి సంపాదక వృత్తికి ఆత్మార్పణ గావించిన ప్రతాపరెడ్డిగారి వంటివారు దేశనాయకులలో, మేధావులలో, పత్రికా సంపాదకులలో ఎంతమంది?
1926 నుంచి 1947 దాకా ప్రతాపరెడ్డిగారు గోలకొండపత్రికకు సంపాదకులుగా ఉన్నారు. ఈ రెండు దశాబ్దుల సంపాదకీయాల నుంచి కొన్ని ముఖ్యమైన సంపాదకీయాలను రెండు సంపుటాలుగా కూర్చటం జరిగింది. రెండు, మూడు సంపుటాలు మాకు లభ్యం కాలేదు. దేశ సమస్యలు. ప్రజల సమస్యల పట్ల ప్రతాపరెడ్డిగారి దృక్పథాన్ని వివిధ కోణాలనుంచి చూపటానికి వీలుగా ఈ సంపాదకీయాలను ఎన్నుకోవడం జరిగింది. నలభై ఏళ్ళకు పైగా గోలకొండ పత్రికలను పదిలపరిచి మాకు ఈ కార్యసాధనలో సహకరించిన ప్రతాపరెడ్డిగారి కుమారులు శ్రీయుతులు యన్. యన్. రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము.
హైదరాబాదు
దేవులపల్లి రామానుజరావు
1-6-1989
డా॥ ఎల్లూరి శివారెడ్డి