గోలకొండ పత్రిక సంపాదకీయాలు/తృతీయాంధ్ర మహాసభ
తృతీయాంధ్ర మహాసభ
20 - 12 - 1934
ఈ సారి ఖమ్మములో జరిగిన మన రాష్ట్రపు తృతీయాంధ్ర మహాసభ విషయములో కల్పింపబడిన కొన్ని పరిస్థితులు నిర్వాహకులగు నాయకులకును మన ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధియే ముఖ్యోద్దేశముగా గల యీ ఆంధ్ర మహాసభల యందు అభిమానాదరములు గల వారికిని కొంత మనస్తాపమునకు కారణములైన వనుటకు చింతిల్ల వలసి యున్నది మొదట మహోత్సాహముతో మహాసభలో చర్చించదలచి చిత్తు తీర్మానముల పట్టికలో చేర్చబడినట్టియు, నేడు భరత ఖండములో నంతటను గొప్ప విద్యాధికులచే భారతీయులందరి సాంఘికాభివృద్ధికి అత్యవసరములని తలచబడు విషయములు గల్గినట్టియు రెండు మూడు తీర్మానములు మహాసభ వారి యెదుట చర్చకు రాలేదు. ప్రవేశ పెట్టబడను కూడా లేదు
మొదట యెవరు కాని యీ తీర్మానములందలి విషయములు మహాసభ వారికి - ఆమోదార్హములు గాక పోయిన పోనిమ్ము - అధమపక్షము ఆలోచించ దగినవి అని తలచి మహాసభా నిర్వాహకులకు తెలిపి యుండిననె గాని, అవి చిత్తు తీర్మానముల పట్టికలోకి యెక్కి యుండ జాలపు అట్టివారు తర్వాత తమ అభిప్రాయమును మార్చుకొని, సదరు తీర్మానములు మహాసభలో ప్రవేశ పెట్టుటకు కూడ తగనివను అభిప్రాయమునకు వచ్చిరా? లేక తీర్మానములను ఉప పాదింప దలచిన వారికి బలపరచువారు చిక్కక పోయిరా? ఈ రెండు వికల్పములలును సదరు తీర్మానములు మహాసభలో ప్రవేశ పెట్టబడ కుండుటకు కారణములు అనిపించునంత చపల చిత్తులు మన మధ్య లేరనియే మా విశ్వాసము మఱి యితర కారణమేమి?
ఇట్లు విషయమును త్రవ్వుటవల్ల సంతాపకరములగు రహస్యములు బయట పడునేమోః సనాతులను వారి యాందోళనచే పై జెప్పబడిన తీర్మానములు మహాసభలో ప్రవేశ పెట్టబడలేదని జనులందరు చాడుకొనుచున్నారు - తీర్మానముల లోని విషయములు యిష్టము కాని వారు యెవరో మహాసభలోనికి వచ్చి ప్రతి కూల వాదము చేసి తమ అభిప్రాయములను మహాసభా జనుల కందరికి వెల్లడి చేసి, తీర్మానముల నోడించుటకు యెందుకు పూనుకోలేదు. మహాసభా నిర్వాహకులు నిస్సంశయముగ ప్రతికూల వాదములను, తమ కిష్టముగాకున్నను గౌరవించు వారేనే? నిజముగా ఆ తీర్మానములు కూడనివని నిరూపించదలచిన వారు అడిగినచో, వారివాదములు సభలో జనులందరికిని స్పష్టము చేయుటకు అవకాశము లభించి యుండునే! ఈ ప్రతికూలురు సదరు తీర్మానములను మహాసభలో ప్రవేశ పెట్టనీయ వద్దని మహాసభా నిర్వాహకులను బలవంతము చేసిరా ? బలవంతము చేసినను తీర్మానములను ప్రవేశ పెట్ట దలచినవారు గాని సభా నిర్వాహకులుగాని అట్టి దానికి లొంగి యుందురా? ఇట్లే ఎవరో కొందరు కొందరు వచ్చి తమ కీ తీర్మానము యిష్టము కాదు, యిది ప్రవేశ పెట్ట వద్దు, అది ప్రవేశ పెట్టవద్దు అని అడిగినచో అట్టి ప్రతివారి మాటను మహాసభా నిర్వాహకులు గాని తీర్మానములను ప్రవేశ పెట్ట దలచువారుగాని పాటింతురని మేము నమ్మజాలము. తీర్మానములు ప్రవేశ పెట్టబడియె యుండును ప్రతికూలురు గౌరవము కలవారైనచో తమ వాదమును స్పష్టపరచియో నీచులైనచో తుంటరితనము చేసియో తమ ప్రాతి కూల్యము దెల్పియే యుందురు తుంటరితనమునకు భయపడి మహాసభా నిర్వాహకులు తీర్మాన ప్రవేశమును మానుకొని యుండరు తుంటరితనము జర్గునేమో యను భయమున్నప్పుడు ముందుగానే అట్టిది జరుగకుండ ప్రభుత్వాధికారులు రక్షణము కోరబడి యుండును రాజభక్తియు ప్రభుత్వాజ్ఞల యందు విధేయతయు ప్రకృతిగా గల మన రాష్ట్రీయులలో ప్రభుత్వాధికారుల ఆజ్ఞకు విరుద్ధముగా తుంటరి తనమును శరణువేడు వారు లేనేలేరని మా విశ్వాసము.
ఇంతదూరము విచారించగా యిపుడు వ్యాపించియున్న జనశ్రుతిలో బలము లేకుండదు అని ఊహించవలసి వచ్చునేమో కొందరు మొదట తాము ఖమ్మము పురములో మహాసభయె జరుగగూడదని తాలుక్దారు సాహెబు మొదలగు అధికారులకు దరఖాస్తులను పంపుకొనియు, ఆ దరఖాస్తులు త్రోసివేయబడిన పిమ్మట చిత్తు తీర్మానములలోని నిమ్న జాత్యుద్ధరణము, వివాహసంస్కరణము, సాత్విక పూజా విధానములను గూర్చిన తీర్మానములను మహాసభలో ప్రవేశపెట్టబడ కుండునట్లు చేయవలెనని అధికారుల వద్ద మొరపెట్టుకొనిరనియు, అటుపైన అధికారులే ఆ తీర్మానములను మహాసభలో ప్రవేశపెట్టనీయవద్దని మహాసభా నిర్వాహకులకు సలహా నిచ్చిరనియు ఇట్లు ప్రభుత్వాధికారి సలహా యగుటచే ఆ తీర్మానములు ప్రవేశపెట్టనీయబడలేదనియు వదంతిగా నున్నది ఈ చెప్పబడిన తీర్మానములలో యే ప్రభుత్వాధికారులకైన నేమి, లేక అసలు ప్రభుత్వమువారికైననేమి అనిష్టములైన విషయములున్నట్లు మేమనుకొనము, మరియెందుకు తీర్మానముల ప్రవేశము అధికారులకు యిష్టము కాలేదు. తీర్మానములు ప్రవేశ పెట్టబడినచో అవి ఇష్టముకానివారలు గలభా చేయుదురేమో, అందువల్ల శాంతికి భంగము గల్గునేమో యని అధికారుల అనుమానమై యుండినచో, ఆదియు నిరాధారమే యని మా యభిప్రాయము మేమింతకుముందే చెప్పినట్లు అధికారుల యాజ్ఞకు వ్యతిరేకించి గలభాచేయు ప్రకృతి మన రాష్ట్రమువారికిలేదు. అందులోను గౌరవము గల మన రాష్ట్ర సనాతనులకు అంతకు ముందేలేదు. పోనీ, ఒకవేళ గలభా జరుగనే జరుగ వచ్చునని వాదమునకై ఒప్పుకొందము. అట్టిస్థితిలో సనాతనులకే గాని మరి యెవరికేగానీ గలభా చేయనీయకుండ తగిన భయము పెట్టుటకు మన ప్రభుత్వాధికారుల వద్ద శక్తి లేదా? ప్రవేశ పెట్టరాదనబడిన తీర్మానములలో ప్రభుత్వమునకు గాని, న్యాయదృష్టికి గాని, ప్రజాహిత దృష్టికిగాని విరుద్ధమైన విషయములు లేవుగదాః హిందూ మతమునకు విరుద్ధములైన విషయములున్న వనియు, అందువల్ల తీర్మానములు ధర్మ విరుద్ధములనియు వాదమా? అటైనచో తీర్మానములు హిందూమత విరుద్ధములు కావనియు, అందువల్ల ధర్మ సమ్మతములే యనియు వాదించు హిందువులే ఎక్కువ మంది యున్నారు ఇట్లు హిందువులతోనే రెండు భిన్నాభిప్రాయము లున్నపుడు దాని పరిష్కారమునకై శాంతముగా మహాసభవారు ఆలోచించుటకు అధికారులు తోడ్పడకపోయిరా? ఇప్పుడు అధికారులు తీర్మానములు ప్రవేశపెట్టబడరాదను వారి పక్షమును సమర్ధించినట్లగుపడుటచే అధికారుల అధికార దౌర్బల్యమో లేక పక్షపాతమో ఊహింపబడుటకు అవకాశమేర్పడినదేమో యని సంశయము కలుగవచ్చును కాని, ఇటీవలనే మనరాష్ట్రమున కంతటికిని సంబంధించిన శాసన సభవారిచే ఆమోదింపబడిన వితంతూద్వాహ శాసనము కంటె సూచిత తీర్మానములు సనాతనులు భావములకు యెక్కువ అనిష్టమగు పరివర్తనను కోరుచున్నవా! సనాతనులకు వితంతూద్వాహము కంటె యెక్కువ కోపము గల్గినను నట్టిది యింకొకటి యుండునా? సనాతనుల భావములకు కోపముగల్గునేమో యను భయముచే సంఘ సంస్కరణలను గూర్చిన చర్చలను జరుగనీయరాదనుటయే మ ఘ వ ప్రభుత్వమువారి అభిప్రాయమైనచో, రాష్ట్రీయ శాసన సభలో వితంతూద్వాహమును గూర్చిన చిత్తు శాసనముపై చర్చను జరగనిచ్చి యుందురా? జరుగనిచ్చి యుండరు ఇట్లు ప్రభుత్వమువారు సాంఘిక విషయములలో తటస్థులు అని తేలినది. కాబట్టి ప్రభుత్వాధికారులను ఈ విషయములలో సంశయించుటకెట్టి యాస్పదమును గనుపట్టదు.
ఈ యంశములును, మరికొన్నియు సూచింపబడిన తీర్మానములను ఆటంకపరచుటకై అధికారులను కోరిన సోదరులు నిజముగా సనాతనులు కాదేమో, మనసులో నేదో (మేము ఊహింపజాలని) క్రోధము నుంచుకొని యెట్లయినను సభకేదో యొక ఆటంకము పెట్టి కసి తీర్చుకొన్నుటకు బద్ధకంకణులైన నట్టి స్వార్ధపరులేమో యను అనుమానమునకు తావిచ్చుచున్నవి. అదెట్లో రాబోవు సంచికలో చర్చించెదము