గోలకొండ పత్రిక సంపాదకీయాలు/చారిత్రక బోధ
చారిత్రక బోధ
22 - 8 - 1935
"To teach biased propagandist history is to damage everything that should be cherished.
"ఒక పక్షమును అవమానము పాలుచేయు కుత్సిత ప్రచారము గల చరిత్రను బోధించుట యన చిరకాలము స్మరింపదగినది ఏదీ యుండునో దానిని నాశనము చేయుటే యగును."
"It is a very bad thing for any child to be brought up on a history which does not appeal to his sense of the heroic and romance"
_ Mac Donald
"ధీర చరితములుసు, అద్భుత చరితములును బాలురచే మెచ్చుకొనబడును. అట్టిది యేదియు కాని చరిత్రను వారికి బోధించుట యెంతమాత్రము యుక్తము కాదు”.
-మెక్డొనల్డు
“ప్రకృతము హిందూముసల్మానుల ద్వేషములకు కారణము ఇప్పుడుండు చరిత్రలే. అవే రెండు తరములనుండి ద్వేషములను పెంచినవి.”
మౌలానా మహమ్మదలీ.
సరియైన చరిత్రను, ఏ మాత్రమును పక్షపాతము చూపకుండు వ్రాయు చరిత్రకారుడు ఉత్తమ వర్గములో చేరినవాడు కాని సాధారణముగ మనము చూచు చరిత్రలలో చరిత్రకారుడు తనకు అభిమానమైన విషయములను కొండంత చేసి తనకు నచ్చని సంగతులను హీనము చేసి లేక హేళనము చేసి వ్రాయుట కలదు తాళ్ళపాక వారి కవిత్వము కొంత మా పైత్యము కొంత అన్నట్లు ఏలనో కొందరు చరిత్రకారులు తమ రాగ ద్వేషములను దాచుకొనలేక గ్రంథస్థము చేసి ప్రకటించుకొనుచుందురు మన సర్ హైదర్ నవాజ్ జంగ్బ హద్దరు గారు ఇట్టి చరిత్రకారులను దృష్టియందుంచుకొనియే కాబోలు రెండు మూడు మారులు హెచ్చరించి యుండిరి. నవాబుగారు మన పాఠశాలలలో చెప్పబడు చరిత్రలు సరియైనవి కావనియు, హిందూ ముసల్మానుల ఐకమత్యమునకు అనుకూలించునవిగా వ్రాయు చరిత్రలే యుత్తమమైనవనియు నభిప్రాయమిచ్చు ఉపన్యాసములు ఇచ్చియుండిరి చరిత్రకారుడు తన యిష్టము వచ్చినట్లు గత గోష్ఠిని గురించి యభిప్రాయ మిచ్చుటకు స్వతంత్రుడే. కానీ ఆ అభిప్రాయములు పక్షపాతముతో కూడినవై యుండినవి యెవ్వరికి పనికివచ్చినను విద్యార్ధులకు మాత్రమే పనికిరావని మా యభిప్రాయము
మెక్ డొనాల్డుగారు, విదేశములో ఇంగ్లీషు, చరిత్రను గురించి యొకటి రెండే తప్పుడు వాక్యముల వ్రాసి బోధించుచుండినందున, ఆ ప్రభుత్వమునకు వ్రాయగా వెంటనే వారు ఆ ఆక్షేపణీయమగు వార్తలను తీసివేసి ముద్రించిరట ఇక్కార్యము ఉభయ దేశముల గౌరవమును హెచ్చింపవలెను
మన దేశములో నిప్పుడు విద్యార్థులకు బోధించు చరిత్రలు కొన్ని బాగుగా పరిశీలించి వ్రాయించవలసి యుండును నిజమైన విషయములు వ్రాయుటకు ఆటంకము లేదు కానీ అనవసరముగా హేళనము చేయుట, ఒక మతము వారికి ఉద్రేకము కలిగించుట, ఒక మతము వారికి అవమానము కలిగించుట, ఒక మతమును గురించి అనవసర విమర్శనము చేయుట, ఆ మత సిద్ధాంతములను వెక్కిరించుట, ఇట్టివి గల చరిత్రలు ఎంత కాలము మన యువకులకు నేర్పబడుచుండునో అంతవరకు దేశమందు ద్వేషములు, మనస్పర్థలు ప్రబలుచుండును
మన రాష్ట్రములో "తారీఖెహింద్" అను ఉర్దూ గ్రంథములోని కొన్ని భాగములను ఇటీవల వైదికాదర్శిలో ఎత్తి ప్రకటించినారు ఆ భాగములు కొందరికి గాని బహుళ జనులకు గాని ఆక్షేపణీయములు కావని తలంచినను, "వైదికాదర్శి" వంటి వారికి కొంత మందికి మనస్తాపము కలిగించినట్లు కనబడు చున్నది ప్రభుత్వము వారీ విషయములో శ్రద్ధ కలిగించుకొని విచారించి అందు నిజముగా ఆక్షేపణీయాంశములు వున్నవని నిశ్చయించిన, వెంటనే తగిన చర్య పుచ్చుకొందురని తలచుచున్నాము మరియు ఈ "తారేఖెహింద్" గ్రంధము మన రాష్ట్రంలోనన్ని పాఠశాలలందును ప్రైమరీ మొదలుకొని బి ఏ వరకును, అదే గ్రంధకర్తచే వ్రాయబడినదై, విద్యార్థులకు చదివింపబడుచున్నదని వినుచున్నాము. ఈ గ్రంధములలో ఏవేని ఆక్షేపణీయములో, ఏవేవి చరిత్ర విరుద్ధాంశములో, యేవేవి అనవసర ప్రసంగములో అట్టివన్నియు సమకూర్చుటకై యొక కమిటీని నిర్ణయించి బ్రిటిషిండియా, ఇంగ్లాండులలోని సుప్రసిద్ధ చరిత్రకారుల యభిప్రాయములను గైకొనవలెననియు సూచించుచున్నాము.