గోలకొండ పత్రిక సంపాదకీయాలు/గోలకొండ కవుల సంచిక
గోలకొండకవుల సంచిక
9 - 7 - 1934
గోలకొండ కవుల సంచిక విషయమై భిన్నాభిప్రాయములప్పుడె బయలు దేరినవి. అది శుభసూచకమే! సంచిక పలువురి దృష్టి నాకర్షించినదని సంతోషించుచున్నాము ఒక్క విషయమున జనులలో నపోహలు కలుగునని మేమెరుగుదుము - అదే మన బ్రిటిషాంధ్రులు, నిజామాంధ్రులు అనుభేదము కల్పించుట - శ్రీయుత పి రమణయ్యగారు ఈ విషయమున తమ యభిప్రాయము ఇచ్చుచు ఇట్లు భేదభావమును చూపుట సంపాదకులకు పరిపాటికాదని సూచించుచున్నారు. బ్రిటీషు నిజామాంధ్రసమస్య సుమారు 7-8 సంవత్సరములనాటి ప్రతిధ్వనియే కాని క్రొత్తదిగాదు ఆనాడు రజతోత్సవ సంచికాసందర్భమున మమ్ము వృధా నిందలకు కొందఱు పాల్సేసిరి కాని యీ 8 సంవత్సరములనుండి మేము మా సర్వసమ బుద్ధిని ప్రతి విషయమునను వెల్లడి చేసితిమో లేదో పాఠకులే నిర్ణయింపగలరు మాకు భేదభావముల ప్రచారము చేయుటగాని బ్రిటిషాంధ్రులపై యసూయ కలిగించుటగాని నాడును నేడును ఆవంతయులేదని నొక్కి చెప్పుచున్నాము
అట్లైన నిదేమి, నిజాంరాష్ట్రకవులకు మాత్రమే సంచిక ప్రకటింపవలసిన యవసరమెందుకు? ఎవ్వరో యొకవ్యక్తి తెలిసియో తెలియకయో బుద్ధి పూర్వకముగానో లేక తలవనితలంపుగానో నిజాము రాష్ట్రములో కవులు పూజ్యమన్నంతనే మీకింతతొందర యెందులకు? ఇంత యభిమానమెందుకు? అనిషృచ్ఛ - ఈ యభిప్రాయమొకేవ్యక్తిదిగా నుండిన యది నిర్లక్ష్యముగా జూడవలసిందే కాని యట్టి యభిప్రాయము పలువురకుండునట్లు వినుచుంటిమి. వినుచున్నాము నిజామురాష్ట్రాంధ్రులు వలసబోయినవారనియే బ్రిటిషు ఇండియాలోని యాంధ్రులిదివరలో తీర్మానించుకొనలేదా మఱియు నదేమి గ్రహచారమో యెన్ని యో సంవత్సరములనుండి భారతి మున్నగు బ్రిటిషిండియా పత్రికలు నడుపబడినను నా పత్రికలలో నొక్క నిజాంరాష్ట్రీయుని వ్యాసమైనను గాంచుట లేదు. అయితే వ్యాసములు పంపువారు లేకున్నవారేమి చేయుదురని చెప్పవచ్చును మంచిమంచి వ్యాసములను పేరొందినవారు పంపుటయు నయ్యవి ప్రకటింపబడక పోవుటయు మేమెఱిగిన విషయము కావున నీ కారణముచేతను నీరాష్ట్ర కవులకు ప్రోత్సాహము కలిగించుట చాలయవసరము
ముఖ్యముగా నాక్షేపకులొక్క విషయమును గమనింపవలసినది నేను వృద్ధియైన నా ప్రక్క ఇంటివానికి నష్టమని తలపకూడదు మా రాష్ట్రముపై మాకభిమానముండిన మాకితరులపై ద్వేషమున్నదని వాదింపగూడదు మా తల్లిని మేము ప్రేమించిన నితరుల తల్లులను నసహ్యముతో జూచితిమని తగవు పడకూడదు ప్రతి దేశమునను, తుదకు ప్రతి గ్రామమునను స్థానికాభిమానము మొదలు తర్వాత యిది వైశాల్యమందు హెచ్చుచు పోవును. కొంతకాలము క్రిందట నొక నెల్లూరుపత్రికలో కొందరు "నెల్లూరు గొప్పవారు" అను పలుమారు వ్యాసమున వ్రాసిరి "ఏమయ్యా మీరిట్లు వ్రాయుటచే నెల్లూరాంధ్రులు నెల్లూరేత రాంధ్రులు అను భేదము జూపుచున్నారని యా పత్రిక నెవ్వరును నా క్షేపింప లేదు " మొన్ననె ఆంధ్రభూమిలో "పడమటిసీమ కవులు" అను నొక వ్యాస ముండెను అదే పత్రికలో నాళం కృష్ణారావుగారు తూర్పు ఆంధ్రులకును పడమటి యాంధ్రులకునుగల భేదమును చాలా తీవ్రముగా (అయినను మెచ్చుకొను విధముగా) వర్ణించిన భాగమును ముద్రించిరి అది భేదభావము కల్పించునది కాదాయని యెవ్వరును ప్రశ్నింపకపోయిరి వావిలికొలనువారికి ఒంటిమిట్టపై యభిమానముండుటచేతనే కదా అందరు పోతన ఓరుగల్లు కవియేయని నొక్కి చెప్పినను “కాదంటె కాదు అతడు నా ఒంటిమిట్టవాడే" యని కట్టలు కట్టలుగా వ్రాసిరి.
ఇప్పుడంతరించిన 'జయంతి' యను పత్రికలోనిట్లు సంపాదకులు వ్రాసిరి. "తెనుగు భాష కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో మాట్లేడేది అట్లాంటిది ఇతర భాషలతో కలసివుండే ప్రదేశాలల్లో ఈ మార్పునందు అంత సానుభూతివుండదు బరంపురము, హైద్రాబాదు, చిత్తూరు ఇటువంటి ఇతర భాషా సంపర్కం కలట్టి చోట్ల వాళ్ళకి గ్రాంథికభాష నిలబెట్టుకోటమో కష్టం” ఈ వాక్యములవలన నా పత్రికకు తన ఉత్తర సర్కారు భాషయే నిజమైన తెనుగు భాషగను తక్కిన ప్రాంతముల తెనుగు భాష పైశాచ తుల్యముగను గనపడినట్లు దోచకమానదు కాని ఆ జయంతి పత్రిక నెవ్వరును మీరు హైద్రాబాదు భాషను వెక్కిరించుచున్నారు గాన మీరు నిజామాంధ్రులు ఉత్తర సర్కారాంధ్రులు అను భేద భావమును ప్రచారము చేయుచున్నారని యాక్షేపించిన పాపమున బోలేదు
శ్రీ శేషాద్రి రమణ కవులు "నిజాం రాష్ట్ర కవులు” అను నొక పెద్ద వ్యాసమును వ్రాసి పూర్వ కవుల పట్టీనె తయారుచేసిరి వారిపై యే నిందారోపణ చేయలేదేలకో! దత్తమండల కవుల పట్టీలను వ్రాసి యా కవుల ప్రశంసించిన వారు కలరు వారిది గూడ తప్పగునా ?
ఒకవేళ మేము బ్రిటిషండియాలో కవులు పూజ్యమనియో లేక తెలివి కలిగిన కవి గాని మెదడు కలిగిన పండితుడుగాని అక్కడ లేడు అనియో లేక యే విధమైన నిందారూపకమగు వాక్యములనో పలికిన మమ్మాక్షేపించుట కడుంగడు సమంజసమైయుండెడిది మేము బ్రిటిషు ఆంధ్రుల నెన్నడును నిరసింపము. వారిపై మాకు ప్రేమ మెండు మొత్తమాంధ్ర జాతిపై యితర జాతి వాడెవ్వడేని నిందా రూపకముగా పలికిన మా కలము ఖడ్గమై పనిచేయుటలో వెనుదీయదు
ఇంత దూరము మా మిత్రులగు వెంకట రమణయ్యగారికి తెలుపుట యే మన మేము ద్వేష బుద్ధితో నీ కార్యమునకు దిగలేదు. నిజాము రాష్ట్రము కపులకు పత్రికాధారము బ్రిటీషు ఇండియాలోనున్నట్లు లేనందున ననేకులు మారుమూలలందు తమ కీర్తిని నడచికొనియున్నారు అట్టివారి కవితా స్రవంతిని బయటి కుప్పొంగజేసి నిజాము రాష్ట్రాంధ్రుల యొక్క వాడిపోవుచున్న ప్రతిభాలతకు నూతన జీవకళ నాపాదించుటయే మా ముఖ్య కృషి - స్వకీయాభి మానమును పరకీయ ద్వేషముగా నిర్వచించుట అన్యాయము ఈ సమాధానమును మా పాఠకులు గమనించి మాకు బ్రిటిషాంధ్రులపై భేదముగాని, ద్వేషముగాని, దురభిప్రాయముగాని లేదని తెలుసుకొందురు గాక.