గోలకొండ పత్రిక సంపాదకీయాలు/గాంధీ మహాత్ముడు - సంస్థానములు
గాంధీమహాత్ముడు—సంస్థానములు
5 - 10 - 1933
నేడు సాధారణముగా సంస్థానములు మహాత్మునిగాని, మహాత్ముని అనుసరించుచున్నవారినిగాని అనుమానదృష్టితో చూచుచుండుట రహస్యవిషయము గాదు. ఈ అనుమానముగుండా లోతుకు చూడగలిగినచో కనబడు మూలకారణ మేమి? గాంధీ మహాత్ముడు బ్రిటిషు ఇండియాలో ప్రజలకు స్వాతంత్ర్యము సంపాదించు తలంపుతో శాసనోల్లంఘనము చేయువారికి నాయకుడైయున్నాడు సంస్థానాధిపతులకు ఈ గాంధీ మహాత్ముని, వారి అనుచరులను చూచి తమ ప్రజలు కూడ పరిపాలన చేయు హక్కును కోరుచు ఎదురు తిరుగవచ్చునేమో యను భయము కలదని ఊహింపవలసియున్నది. అనగా అప్పటికి సంస్థాన పతులకు పరిపాలనలో తమ ప్రజలకు హక్కును, అధికారమును ఇచ్చుట ఇష్టముకానిదని తేలుచున్నది ప్రజాభిప్రాయమునకు లోబడి ప్రభుత్వము చేయుటఇష్టమైన పక్షమున సంస్థానాధిపతులు గాంధి గారిని ద్వేషింపవలసిన అవసర ముండదు.
ఈ వివరించిన కారణములచే సాధారణముగా అనేక సంస్థానములలో గొప్ప అధికార పదవులందుండు వారు గాంధీ మహాత్ముని పద్ధతులను మతమును ఇష్టవడనట్లున్నను, వారిలో అనేకులు విధిలేక తమ అంతరాత్మకు విరుద్ధముగానే అట్లుచేయుచున్నారని ఎంచవచ్చును. సత్యమును బహిరంగముగా చెప్పబడు పక్షమున మహాత్ముడు దేశమును అల్లరితో నిందించుటకై కష్టపడుచుండుట లేదనియు దేశశాంతికై వారికున్నంత హృదయావేగము మరి యెవరికిని ఉండజాలదనియు చెప్పవచ్చును. సెప్టెంబరు 30వ తేదినాడు మైసూరు శాసన సభను ప్రారంభించునపుడు సభ్యులకు స్వాగతమిచ్చి ప్రస్తుత దేశ స్థితిని గూర్చి చర్చించినపుడు సర్ మీర్జా ఇస్మెయిల్, మైసూరు దివాను గారు ఈ విషయమునకు నిదర్శనమైరి. వారు ఏ మోమోటముగాని లేక మన దేశము స్వరాజ్యసుఖమును పొందుటకు అభ్యంతరములుగానున్న విరోధములను బాపుటకు గాంధీ మహాత్మునివలె అర్హుడైనవారు మరియెవరుగాని లేరని చెప్పిరి. గాంధీ మహాత్ముడు ప్రస్థుతము రాజకీయరంగమునందు ఉండుటవల్లనే క్రియా శూన్యులగు స్వయంకృత నాయకులచే దేశము ముండ్లకంపలలోగాని గుట్టలలోగాని బడక సురక్షితముగా స్వరాజ్య మహా సౌధము జేరుటకు ఆవకాశము నిలిచియున్నదను భావమును సర్ మీర్జా గారు సూచించిరి.
సర్ మీర్జా ఇస్మెయిలుగారికి గాంధీ మహాత్ముని పొగడవలసిన అవసరము సత్యముజెప్పుట తప్ప వేరొండుగలదని తలంచుటకు ఆధారము ఏదిగాని లేదు. సాధారణముగా సంస్థానాధిపతులు నిరంకుశాధికార ప్రియులుగనుకను క్రమ విరుద్ధమగు నిరంకుశత్వమునకు గాంధి గారు దూరులుగనుకను సంస్థాన ప్రభువుల కొలువులో నుండు అధికారులు తక్కువ వారైననేమి గొప్పవారైననేమి అధమ పక్షము బహిరంగముగానైనను గాంధీ మహాత్ముని మతమునెడ విరోధభావము చూపవలసియుండగా మైసూరు సంస్థానపు దివానుగారు గాంధీ గారిని ధైర్యముతో కొనియాడుటవలన ఇతర సంస్థానములకును మైసూరునకును గల భేదము సూచితమగుచున్నది. మైసూరులో ప్రభుత్వము ప్రజాభిప్రాయము ఏర్పరచు హద్దులను గమనించుచు ప్రవర్తించునట్లు ఇతర సంస్థానములలో లేదు. గాంధీ మహాత్ముడు ఆఖరుకు కోరునది ప్రజాసామాన్యము యొక్క లాభ క్షేమములను గూర్చిన వివిధాభిప్రాయములను విని విచారించి ప్రభుత్వము అధిక సంఖ్యాకులకు మేలగురీతిని వర్తింపవలయుననియే ఈ అభిప్రాయమందు దోషమేమియు లేకుండుటయేగాక తదనుసారము ఆచరించుటవలన మేలుగలదు
సంస్థాన ప్రభువులు తమ ప్రజల సౌఖ్యమే తమ సౌఖ్యముగా నెంచు ఉదారాశయులగుచో తమ ప్రభుత్వమునకు ప్రజాభిప్రాయపు ఒత్తిడి తగులటకు అంగీకరింపవలెను ఈ కాలమున ఏ రాజ్యములోగాని, ముఖ్యముగా, మన హిందూ దేశమందలి రాజ్యములలో ఒక దానికి నొక దానికి సంఘర్షణ కలుగుటకు అవకాశముతో గూడిన అనేకములగు తరగతులు లేక తెగలు గలవు. మొత్తము మీద రాజ్యమంతటికిని క్షేమాభివృద్ధులు కలుగవలయునని నీ విధములైన తెగల విరోధములను సరిపెట్టవలసియున్నది. అందుకు ఏఏ తెగలవారికి ఏదేది ఎక్కువ లాభకరమో ఏదేని చెరుపో కనుగొనుట ముందు ముఖ్యావసరము వాటిని బట్టి ప్రభుత్వము వారి తీర్మానము ఉండవలసియుండును. ఈ విషయమునే 'ప్రజాభిప్రాయము కనుగొనుట అవసరమని' అందురు దీనినే మిర్జా గారిట్లు చెప్పిరి. “అది (క్రొత్త రాజ్యాంగము) వివేకవంతులగు ప్రజలకు యిష్టమగు గాక, న్యాయబద్ధ పరిపాలనము అయిష్టము పైననే ఆధారపడి యున్నది."