Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/గస్తీ నిషాన్ - 58

వికీసోర్స్ నుండి


గష్తీనిషాన్ - 53

30 - 11 - 1933

విఖ్యాతమగు నీ గష్తీ జారీ అయిన దినము 17 దై 1339 ఫసలి కనుక గత 17 దైనాటికి దీని యాయువులో నాల్గువత్సరములు గడచి అయిదవ సంవత్సర మారంభమైనది.

ఈ గష్తీ వలన దేశీయుల వాక్స్వాతంత్ర్యమునకు కలుగుచున్న యాటంకములు పలుమారు పత్రికాముఖమున వివరింపబడినవి. దీని మూలమున ఆపబడిన గొప్ప ప్రజాసమావేశములలో ఆంధ్ర మహాసభయు, ప్రజాపక్ష విద్యా మహాసభయు చెప్పదగియున్నవి.

గడచిన నాల్గువత్సరములలో నీ విషయమున పత్రికాముఖముననే కాక మహాసభల యందెన్నియో మారులు ఖండనములు జరిగినవి. ప్రత్యేకముగా హైద్రాబాదు నగరమున ప్రధమ వత్సరాంతమున బ్రహ్మాండమగు ఖండన సభ జరిగి యుండెను రెండవ వత్సరాంతమున మరల నట్టి సభయే సమావేశమై గష్తీని రద్దుచేయుటకు ప్రభుత్వమువారు ప్రార్థింపబడిరి మూడవ వత్సరాంతమున సభా సమావేశమునకై వేడగా ప్రభుత్వమువారు సభకు అనుజ్ఞనీయక ప్రభుత్వమువారి వద్దకి గిష్తీ కమిటీ సభాసదులను రాయబారము (డిప్యుటేషను) తీసికొని వచ్చుట మంచిదని సూచించిరి. కమిటీవారందులకంగీకరించి, ప్రభుత్వ దృక్పథము మారినదని యాశించి శ్రీయుత రామచంద్రనాయకుగారి అధ్యక్షతతో విఖ్యాతులగు హిందూ మహమ్మదీయ నాయకులుగల యొక రాయబారము నంపి లిఖితమగు నొక విజ్ఞప్తిని అర్పించుకొనుచు, ఈ గష్తీ దేశాభివృద్ధి నెట్లడ్డగించుచున్నదియు వివరించిరి. అట్టి విజ్ఞప్తితోబాటు అనుజ్ఞ నిరాకరింపబడిన పది సభల పట్టికను దాఖలు చేసిరి ఈ రాయబారమును రెవిన్యూ పొలీసు శాఖా మంత్రి వర్యులు ఆహ్వానించి, శ్రద్ధగా వారి విన్నపము నాలకించి, ప్రభుత్వమువారి యెదుట ప్రజాభిప్రాయమును విశదీకరించి సాధ్యమైన తోడ్పాటు సల్పెదమని సెలవిచ్చిరి కాని తర్వాత గష్తీ కాఠిన్యమున మార్పు కలిగించుటకు బదులుగా దానిని సమర్థించుచు ప్రభుత్వము వారొక “కమూనికు" ప్రకటించిరి దీనిలో రాయబారము వచ్చిన సంగతిగాని, వారి విజ్ఞప్తియుల్లేఖనముగాని కనుపడదు పత్రికలలోనీ గష్తీ విషయమున నేవో సంగతులు ప్రకటింపబడినవనియు, అవి ప్రభుత్వమువారి దృష్టికి తేబడినవనియు కమునిక్యులోని యుపోద్ఘాతము, “మా రాయబారము యొక్క పర్యవసానమైన" దని కమిటీవారు ప్రభుత్వము వారిని విచారించిరి, నెలలు గడచినవట కాని దానికి ప్రత్యుత్తరము రాలేదు. “ఇక వచ్చును, ఇక వచ్చును" అని ఎదురు చూచుచుండగనే నాల్గవ సంవత్సరము పూర్తియైనది. నాల్గవ వర్షాంతమున సభ సమావేశమునకై దరఖాస్తు పెట్టదలచిరట కాని మూడవ వార్షిక సభకే దొరకని యనుజ్ఞ నాల్గవ వార్షికమునకు దొరకునా యను నిరాశచే నుపేక్షించిరట! దరఖాస్తు పెట్టియుండినను నిరుపయోగమయ్యెడిదేమో !

ఎట్లయినను, ఈ విషయము చాలా ముఖ్యమైనదని మా తలంపు కమిటీవారు ముందేమి చేయదలచిరో తెలియదు కాని, ఒక కోటి నలుబది లక్షల ప్రజల వాక్స్వాతంత్ర్యమును నిరోధించుచున్నట్టియు, శాంతకాలమున ప్రపంచమందలి ఏ నాగరక రాష్ట్రమునందును అమలులో నుండనట్టియు, శాసన నిర్మాణ సభ యుండగా వేరొకమార్గమున ప్రజలనైసర్గిక హక్కులను మితపరచునట్టియు -నీ గష్తీమహాఘనత వహించిన మన ప్రభుత్వము వారికి కీర్తి తేకాలదని మా విశ్వాసమును సవినయముగ మనవిచేయుచున్నాము. ఎంత తెలివి తక్కువ వారైనను ఈ రాష్ట్రములోని ప్రజలందు విద్య, విజ్ఞానము, ఆత్మగౌరవభావము హెచ్చుచున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల వార్షిక సభయందు అంగీకరింపబడిన తీర్మానముల యొక్కయు, ఇటీవల సమావేశమైన “ముల్కీ యుద్యమ" సభల యొక్కయు వైఖరి ప్రజాదృష్టిని ప్రభుత్వమువారికి తెల్పుటకు చాలియున్నది, పైన నుల్లేఖింపబడిన సభలు కేవలము హిందువుల దృక్పధము దెల్పునవి కావు వానిలో పాల్గొనినవారు నూటికి 75 మంది మహమ్మదీయ సోదరులు. దేశీయుల హక్కులకై ఇదివరకు ఎక్కువ యుత్సాహము చూపని మతము వారగు యువకులు ఆందోళనము నారంబించియున్నారు ఈ పరిస్థితులు ప్రభుత్వమువారు గమనించి, గష్తీని పూర్తిగా రద్దుపరచుటయో ప్రధాన విషయములందు కాఠిన్యమును తగ్గించుటయో, యుత్తమ రాజనీతికి లక్ష్యముగ నుండగలదని సూచించుటతో ప్రస్తుతము తృప్తినొందుచున్నాము