Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/కీ. శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారు

వికీసోర్స్ నుండి


కీ. శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారు

14-7-1926

గడచిన 12 జూలైతో విఖ్యాత గ్రంథ కర్తలను, సంస్కర్తలును, నిష్కలంక దేశాభిమానులునునగు శ్రీ కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు స్మరణీయులై మూడువత్సరములు గడచినవి. నవీనాంధ్ర వాఙ్మయ పితామహులగు రావు బహాద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారి తరువాత, ఆధునిక వాఙ్మయమును పెంపొందించిన వారిలో శ్రీ లక్ష్మణరావుగారు అగ్రగణ్యులని చెప్పినచో అందతిశయోక్తి యుండదని మా తలంపు. విశ్వ విద్యాలయము నందు ఎం. ఏ. పరీక్ష యందుత్తీర్ణులై, ఆంధ్ర, సంస్కృత, వంగ, హిందీ, మహారాష్ట్రాది భాషల యందు నిరుపమాన పాండితీ వైభవమును గడించిన ఈ ఆంధ్ర సత్పుత్రుడు తన విజ్ఞానము నంతను ఆంధ్ర భాషామతల్లి సేవయందు వినియోగించి ఎడతెగని పట్టుదలతో, విసువు నెరుంగని యుత్సాహముతో, నిర్మల వర్తనముతో ఆదర్శప్రాయమగు జీవనము గడపిన ఈ మహాశయుని దేశీయులు విస్మరింపగూడదు.

శ్రీ లక్ష్మణరావుగారి సారస్వతసేవవారు విద్యార్థి దశయందు నివసించుచుండిన నాగపురము నందారంభమయ్యెను. మోరోపంత్ కృతమగు మహారాష్ట్ర కర్ణపర్వమునకు విద్వజ్జన సమాదరణీయమగు వ్యాఖ్యానము రచించిరి. "రామాయణీయమగు పంచవటి భద్రాచలము కడనున్నదా, నాసికవద్దనున్నదా” యను విషయమున మహారాష్ట్ర పండితులలో భేదాభిప్రాయములు కలిగి తీవ్రముగా వాదోపవాదములు జరుగుచున్న కాలమున, అట్టి వాదములందు ఉత్సాహముతో పాలుగొని భద్రాచలము వద్ద పంచవటియే రామాయణీయ పంచవటియని లోకమాన్య బాలగంగాధర తిలకు వంటి పండితవర్యులచే నొప్పించిరి. విజ్ఞానప్రదములగు అనేక మహద్విషయములను, "కావ్యమాల” యందు ప్రకటించి, నేటివరకు ఏ యాంధ్రునకును మహారాష్ట్రమున లభింపని యుత్తమ పదవిని ఆ భాషయందు సంపాదింపగలిగిరి. ఈ కాలముననే వీరు రచించిన ప్రథమ ఆంధ్ర గంథము “శివాజీ చరిత్రము" వెలువడెను.

తరువాత శ్రీ లక్ష్మణరావు గారి కార్యరంగము ఆంధ్రదేశమునకు మారెను. విఖ్యాతాంధ్ర భాషా పోషకులగు శ్రీ మునగాల సంస్థానాధీశుల దివానుగారు నియోజితులైరి. ఈ యుద్యోగము తరువాతి వాఙ్మయ సేవకు మంచి పునాది ఏర్పరచెను. తుదివరకు వారీ యుద్యోగముననే యుండిరి. దివాను కర్తవ్యములను వారు శ్రద్ధగా నిర్వహించ లేదనినచో అది యపరాధమగును; కాని మాకు వారితో గల పరిచయమును, వారి అనుదిన జీవితమును గూర్చిన యనుభవమును బట్టి చెప్పవలసినచో ప్రభువుగారు వీరితో మంత్రిత్వ కార్యముల నేసమయమున నిర్వర్తింపించు కొనుచుండిరో తెలియదు గాని, వీరు ఎప్పుడు వాఙ్మయ విషయక కార్యములందు నిమగ్నులైయుండిరని చెప్పగలము. 1909 వత్సరమున విజ్ఞాన చంద్రికా గ్రంథమాల నారంభించి వివిధ శాస్త్రీయ చారిత్రిక వాఙ్మయామాృత ధారలచే ఆంధ్రదేశీయులు హృదయ క్షేత్రములను ఫలవంతములుగ నొనర్చిరి. 1911 ప్రాంతమున వాఙ్మయ సేవా విషయికమగు ప్రచండమైన తుది ప్రయత్నము, అనగా "విజ్ఞాన సర్వస్వ" నిర్వహణము నారంభించి నిధనము నాటివారకు ఆ కార్యమును నిర్వహించి, "ఆ" భాగమును సుమారు 2000 పుటలలో మూడు సంపుటములుగా పూర్తి చేసి దేశీయుల కర్పించిరి. నాల్గవదగు “ఆంధ్ర సంపుటము" నకు పరికరముల కూర్చుచు, పరిశోధనము సల్పుచు," చాళుక్యులు దాక్షిణాత్యులే" యను వ్యాసమును వ్రాసి ముగించుచు ఆనాడే రాత్రి వేళ చెన్నపట్టణమున మరణించిరి.

ఈ మహాశయుని మహా సులభమును రసవంతమును నగు శైలియు ఎంతటి గహన విషయమునైనను కడు సుబోధముగా తెలియజేయు సామర్థ్యమును, దేశాభిమానాగ్నిని ప్రజ్వలింపజేయు మేధా విద్యుత్తును తలంచిన ఆశ్చర్యము కలుగకమానదు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వములోని వ్యాసములననేకులు కలిసి వ్రాసిరని చెప్పవచ్చును. కాని ముఖ్యములగు, వ్యాసములన్నియు వీరివే. "విజ్ఞాన చంద్రిక" లోని "హిందూ మహాయుగము" 'మహమ్మదీయ మహాయుగము' అను గ్రంథములను కళాశాల తరగతుల కుపన్యసించు ఆంగ్లభాషా పండితులు ఎంతయో యుపయోగించు కొందురని చెప్పిన వాని యోగ్యత ప్రకటితమగును. “స్మెల్సు" వ్రాసిన 'క్యారెక్టరు' లోని యొక యధ్యాయమును మాత్రము 'సద్వర్తనము' అను పేరుతో రచించి యుండిరి. మిల్లు, స్పెన్సరు, లబక్, మొదలగు ఆంగ్ల మహాశయుల గ్రంథ రాజముల చదివి ఇంగ్లీషు రాని ఆంధ్ర సోదరులకు జూపవలయునని వీరెంతో ముచ్చట పడుచుండిరి! కాని దేశ దురదృష్టము అందున కాటంకము కలిగించెను.

హైదరాబాదులో 1 సెప్టెంబరు 1901 నాడు శ్రీకృష్ణదేరాయల ఆంధ్రభాషా నిలయమును స్థాపించి, ఆంధ్ర భాషా విషయమున అంధకార బంధురముగా నుండిన ఈ ప్రాంతమున విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహాశయులలో శ్రీ లక్ష్మణరావుగారు ముఖ్యులు. నాల్గువత్సరముల క్రింద ఆంధ్ర జన సంఘమువారు 'పరిశోధక శాఖ'ను స్థాపించినప్పుడు వీరు ఉపసంఘము సభ్యత్వము నంగీకరించి, దివ్యములైన యాలోచనల దెల్పి, ఎంతో ప్రోత్సహించియుండిరి. చరిత్రాంశములకు నిజాం రాష్ట్రము గని యనియు, బ్రిటీషు ఆంధ్రులు ఈ ప్రాంతములను "అండమాను ద్వీపముల" వలె జూచుచుండుట తగదనియు, సోదరుల నందరను ఇచ్చట పరిశోధనము గావింప ప్రోత్సహించిరి. ఇట్టి నిష్కలంక సేవాపరాయణుని సర్వదా స్మరించి వారి యాదర్శమును ముందిడుకొనుట ధర్మమని దేశీయుల హెచ్చరించు చున్నాము.