Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/కీర్తిశేషులైన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు

వికీసోర్స్ నుండి




కీర్తిశేషులైన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు

20 - 6 - 1928

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి అకాల మరణముచేత ఆంధ్రదేశము అత్యుత్తముండును, స్వార్థత్యాగియు, సాటిలేని ప్రజ్ఞావంతుడును నగు నొక సత్పుత్రుని గోలుపోయినదనుట నిర్వివాదాంశము. వీరు హిందూ దేశమందును, ఆంగ్లదేశమందును, ఉత్తమ విద్య నభ్యసించి, ఆంగ్ల విశ్వవిద్యాలయములో గొప్పదగు పట్టమును బొంది, మాతృదేశమునకు వచ్చి తమ ప్రజ్ఞా విశేషమును మొదటి బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాల యొక్క సేవయందును, తరువాత భారత దేశోభ్యుదయమున కత్యంతావసరముగ నుండిన ఆ సహాయోద్యమునందును ఉపయోగించిరి. గాంధీ మహాత్మునిచే ప్రతిపాదింపబడిన పవిత్రోద్యమము, హిందూదేశమును కాశ్మీరము నుండి కన్యాకుమారి వరకును, సింధు ప్రాంతము నుండి బర్మా వరకును ఉత్సాహముతో ఉఱ్ఱూత లూపుచుండిన ఆ దినములలో - ఎంతటి పిరికివానినైనను శాంతునిగను ఎంతటి మితభాషినైనను వక్తగను, ఎంతటి తీవ్ర స్వభావము కలవానినైనను శాంతునిగను మార్చిన ఆ దినములలో- ఆంధ్ర దేశమున మన ఆంధ్ర రత్నము ప్రదర్శించిన సామర్ధ్యము అనన్య సామాన్యమని వక్కాణించగలము మన ఆంధ్రరత్నము మూలముననే కదా చీరాల పేరాలలోని ప్రజలు రవి యస్తమింపని సామ్రాజ్యము వశమునగల ఆంగ్ల ప్రభుత్వమును కొంతవరకు భయ విస్మయాకుల చిత్తముగా నొనర్చి, అసహాయోద్యమ చరిత్రమున ఆ జరామరమగు నొక యధ్యాయమును కల్పించినది 31 మార్చి 1921 నాడు అఖిల భారత జాతీయ సభోప సంఘము బెజవాడయందు సమావేశమై, భారతవర్షము నుద్ధరింప కంకణబద్ధులైన మహానాయకుల యెదుటను, లక్షకు మించి కూడిన ఆంధ్ర ప్రజాసమ్ముఖమునను, దేశ బంధు చిత్తరంజనుదాసు, "చీరాలకు నేటి దినము గవర్నరు లార్డు పెంట్లండా? కాడు కాడు! దుగ్గిరాల గోపాలకృష్ణయ్యయే"యని ఉచ్చెస్వసనమున చేసిన ప్రకటనము, అచ్చటినుండి ఆ యానందమును కొంత యనుభవించిన వారికిప్పటికిని తలచుకొనినప్పుడు చెవులందు ప్రతిధ్వనించుచున్నది! ఇట్టి నాయక వర్యుడు ఇంకను చేయవలసిన కార్యము ఎంతయో యుండ యశః కాయుడగుట భారత వర్షీయులను, అందు ముఖ్యముగా ఏ ప్రాంతమందున్న వారైనను సరే ఆంధ్రులందరును దుఃఖ సముద్రమున ముంచుననుట నిక్కము. పరమేశ్వరుడే ఆంధ్ర సోదరుని యాత్మకు శాంతిని, వారి కుటుంబమునకు ధైర్యమును ప్రసాదించుగాక ! ఆంధ్ర దేశమున నిట్టి స్వార్ధత్యాగులు పెక్కుమంది జనించి భారత వర్షాభ్యుదయమునకై ప్రయత్నింతురు గాక!