Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/కాంగ్రెసు కర్తవ్యము

వికీసోర్స్ నుండి




కాంగ్రెసు కర్తవ్యము

28-12-1927

భారతదేశ స్వరాజ్య సమరమున 1928 వ సంవత్సరము యొక్క ప్రాముఖ్యత నిర్ణయింప నేటి దేశీయ మహాసభ యొక్క బాధ్యతయై యున్నది 1927 వ సంవత్సరమున 'స్వదేశి' ఉద్యమము ప్రారంభమయ్యెను 1914 వ 'హోము రూలు' ప్రచారము రగుల్కొనెను 1921 వ అసహాయోద్యమము ప్రబలెను ఈ జాతీయ ఝంఝా మారుతములు సక్రమమగు పదముల వీచునటుల బోధించి శాసించి కాంగ్రెసు వన్నె కెక్కినది. 1928 వ సంవత్సరము కూడ నొక సంధిసమయము భారతవర్ష స్వరాజ్యార్హత నిర్ణయింప సైమను కమీషను వచ్చుచున్నది గత భారతదేశ స్వాతంత్ర్య సౌభాగ్యమో లేక దాస్య దౌర్భాగ్యమో నేడు పరిష్కారము కాగలదు. ఈ పరిష్కారము శుభ ప్రదముగ జరుపుట నేటి కాంగ్రెసు కర్తవ్యము.

సైమను కమీషను పట్ల భారతీయులు ఎట్లు ప్రవర్తింపవలెను? సహకారమా ? బహిష్కారమా? ఇది ప్రస్తుతపు ముఖ్య సమస్య కొందరొక పద్ధతియు మరి కొందరు వేరొక పద్ధతియును అవలంబించిన దేశమునకు అనర్ధము.అన్ని సంఘములు తమ శక్తులొకచో క్రోడీకరించి, ఏక దీక్షతో, దేశ విముక్తి కై పాటుబడిన గాని లాభము లేదు. ఇట్లు ఈ సంఘములకు మైత్రిని, ఐకమత్యమును, కార్యదీక్షయు నొసగుట కాంగ్రెసు విధియైయున్నది. సాంఘిక స్పర్థలు, రాజకీయ కక్షలు, మతవైషమ్యములు వీటి నన్నిటిని మ్రింగివేయగల దేశభక్తి ప్రతిమనుజుని హృదయములోను కాంగ్రెసు నెలకొల్పి ప్రజ్వలింపవలెను.

కేవలము తీర్మానములు వలన లాభములేదు. ఆ తీర్మానములు వలన లాభములేదు. ఆ తీర్మానములు కార్య రూపముగ పరిణమింపవలెను. ఆశయముల పై కంటె సాధనములపై నెక్కుడు లక్ష్యముంచవలెను అప్పుడే ఈ సమావేశములకు, చర్చలకు ప్రయోజనము వుండగలదు ప్రస్తుతము సమావేశ మయిన దేశీయ మహాసభ యీ ఐకమత్యము నొనగూర్చి, జాతీయాభిమానము పురిగొల్పి, సక్రమ సాధన సంపత్తి నొసగి, దేశవిముక్తికి కారణభూత మగుగాక!