గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఐకమత్య సందేశము
ఐకమత్య సందేశము
3-9-1927
భారతదేశము నందు సంఘ ద్వేషము దిన దినము ప్రబలుచున్నది. ఎటుచూచినను హిందూ మహమ్మదీయ తగవులు గాన్పించుచున్నవి. స్వల్ప కలహములే మత యుద్ధములుగా మారుచున్నవి. ఇంతవరకు ఎన్ని సభలు జరిగినను, ఎన్ని సంధి పత్రములు వ్రాసికొనినను ఫలితము అన్యధా పరిణమించినది. భారతదేశమిట్లు అధోగతి పాలగుచుండ ఏ శాంతిప్రియుడు విలపింపకుండును? దేశమునందు అల్లరులు జరుగుచుండిన యే సంఘము వారికై నను లాభము కల్గునా?
ఈ విషమ పరిస్థితులు వీక్షించుటచే రాజ ప్రతినిధులగు ఇర్విను ప్రభువుగారి హృదయము కరిగినది. వారు అన్ని పక్షముల వారి యందు ఐకమత్య మవసరమని తలంచిరి. వీరి ప్రసంగము ఫలితముగ సిమ్లా చల్లని ప్రదేశమున సర్వ రాజకీయ పక్ష నాయకులు సమావేశమై ఈ విషయమై ఆలోచించి దేశీయులకు విన్నపము ప్రకటించిరి. అందరు ఐకమత్యముతో నుండవలయునని ప్రబోధించిరి; లేనిచో జాతీయ వికాసము కలుగనేరదని విలపించిరి. నాయకులందరును తమ భేదములు విడనాడుకొనుటకు సమ్మతించిరి. అయినను ఇట్టి విన్నపముల వలన పరిస్థితులు చక్కబడునా? "ఐకమత్యము, ఐకమత్యము" అని ఒక వంక చల్లని ప్రదేశము నందుండి నాయకులు యుద్ఘోషించుచుండ వేరొక వంక కాన్పూరు నందు పరస్పర కలహము జరుగుచునే యున్నది కదా?
దేశము నందు శాంతి సమకూరుటకు దేశీయుల భావములు మార్పు గాంచవలయును. నాయకులు ప్రజలకు ఆదర్శప్రాయులు గనుక వారు మున్ముందు తమలోగల భేదాభిప్రాయములు విడనాడుకొని ఏక కంఠముతో జన సామాన్యమునందు ప్రచారము గావించవలయును. అందరు నొకే మార్గమునకు దారి చూప వలయును. ద్వేష భావములు ప్రజ్వరిల్లజేయుచున్న సంఘములను, వ్యక్తులను బహిష్కరించ వలయును. అపుడే మైత్రి సమకూరును గాని వట్టి విన్నపముల వలనగాదు. ఒకరి మతమును ప్రవక్తలను ఒకరు గౌరవించవలయును. ఈ సందర్భమున మౌల్వీ లియాకత్ హుసేన్ సా॥ ప్రకటించిన విజ్ఞప్తి యెల్లరు గమనింపదగినది. గోవధ విషయమై ముసల్మానులు పోరాడనవసరము లేదనియు, బక్రీదు సందర్భమున గోవులను వధించుటకు బదులు, వానిని కొనుటకై వెచ్చించు ధనము ధర్మ కార్యములకై వినియోగించవలెననియు, వారు సూచించుచున్నారు. ఇదే విధముగ మసీదుల యెదుట వాద్యము లాపుటకు ఖురాను విధించుటలేదని వీరి తలంపు. హిందువులు గూడ ఇతరులను తమ మతమునందు చేర్చుకొనిన ఆక్షేపింపకూడదని వీరి అభిప్రాయము. హుసేన్ గారు తమ సోదరులను పై విషయముల గూర్చి అంగీకరింపజేసి దేశమునందు ఐకమత్యము స్థిరముగ నాటుకొనునట్లు జేయుదురుగాక. ఇరు సంఘముల వారును హృదయ పరివర్తనము గావించుకొనిన భేదము లన్నియు సమసిపోగలవు. హిందూ మహమ్మదీయ మైత్రి సాధ్యమైనదే. దీనికి నాయకుల కలయికయే ముఖ్యావసరమై యున్నది. భారతదేశము నందు త్వరలో సంఘ ద్వేషము సమసిపోవు గాక.