గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఉర్దూ భాష - విద్యావ్యాప్తి
ఉర్దూభాష - విద్యావ్యాప్తి
18 - 1 - 1934
ఈ మధ్యమధ్య హిందూదేశ సంస్థాన ప్రజా మహాసభవారు సమావేశమై జవోరా సంస్థాన ప్రభువు ఆ సంస్థానమందు ఉర్దుభాష చదువను వ్రాయను నేర్చినవారు చాలా తక్కువమందియైనను ఉర్దునే సర్కారు వ్యవహార భాషగా నుంచుటకు ఏర్పాట్లు చేసినందుకు తమ ఆందోళనమును దెల్పిరి. చాలా కాలము నుండి ఆ సంస్థానములో హిందీభాషయే సర్కారు వ్యవహారభాషగా నుండెననియు ఈ మధ్యనే ఆ సంస్థానపు నవాబుగారు హిందిస్థానమును ఉర్దుభాష కిప్పించుటకు పట్టుబట్టి యుండెననియు తెలియుచున్నది
ఈ పరిస్థితులు మన రాష్ట్ర పరిస్థితులను మనస్సునకు దెచ్చుచున్నవి. మన రాష్ట్రములో 1931 వ సంవత్సరపు జనాభా ప్రకారము మొత్తము జనసంఖ్య 14436148 మందిలో 192039 మంది మాత్రమే ఉర్దుభాష చదువను వ్రాయను నేర్చియున్నవారు 1327 వ ఫసలీలో ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపింపబడెను అది మొదలుకొని ఉర్దుభాష మనరాష్ట్ర విద్యావిధానమందు అగ్రస్థానము వహించియున్నను ఇప్పటికి ఉర్దు చదువను వ్రాయను నేర్చినవారు (సామాన్యముగా ఒకరికొకరు వ్రాసికొను జాబుల ననుగ్రహింపవలెను ) 100కి ఇద్దరైనను బయలుదేరలేదని తేలుచున్నది. విద్యాశాఖకై చేయబడు వ్యయమా అంతకంతకు ఎక్కువగా యున్నదేగాని తగ్గుట లేదు అంత అధికమగు ఖర్చుతో ఇంత తక్కువ సాధింపబడుటకు మాతృభాషా మూలమున విద్య నేర్పుటకు ఏర్పాటులు చేయకపోవుట ఒక ముఖ్యకారణమని మా అభిప్రాయము.
స్థలాంతరమున ముల్కీ ఉద్యమనాయకులు కొందరు స్థాపింపదలచిన “నిజాం ప్రజాసమితి" యొక్క ఉద్దేశ్యములును, విధానమున్ను తెలుపబడినవి వాటిలో ముఖ్యమైనది ఒకటి ఏమనగా నిజాం రాష్ట్ర ప్రజలకందరికి సామాన్య ముగా నుపయోగపడుటకు వ్యవహారభాష హిందీగా నుండవలెనను మతము. అనగా ఈ రాష్ట్రమున సైతము వివిధ భాషలవారికి సామాన్య వ్యవహార భాషగా నుండుటకు ఉర్దుకంటె హిందీయే ఎక్కువ తగినదని ముల్కీ ఉద్యమము యొక్క అభిప్రాయము. ఎటు జూచినను రాష్ట్రీయులలో పదిమందికిని ఎక్కువ లాభకరము కాని ఉర్దులో మాత్రమే అన్ని స్థలములలోను విద్యనేర్పు ఏర్పాటు వలన వృధా ధనవ్యయము తప్ప మరియొక లాభముండదు.
జవోరా సంస్థాన ప్రభువు చేసిన మార్పు - అది నిజమేయైనచో - ప్రశంసనీయము కాదు. మన ప్రభుత్వమువారును ఎంత త్వరలో మాతృభాష ద్వారా విద్య నేర్పించు ఏర్పాటుల అవసర ప్రాముఖ్యములను గ్రహింపగలరో అంత మంచిది.