Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఇతర సంస్థానములు

వికీసోర్స్ నుండి


ఇతర సంస్థానములు

30 - 4 - 1934

ఇంతకు పూర్వము మేము మన రాష్ట్ర మందు తయారుచేయబడు అగ్గిపెట్టెలపైన మనప్రభుత్వము వారు విధించిన పన్నును గూర్చి మా అభిప్రాయము నిచ్చుచు దానివలన ఇప్పటికిని ప్రారంభ దశలోనే యున్నదన దగిన మన రాష్ట్రీయమైన అగ్గిపుల్లల పరిశ్రమ యొక్క అభివృద్ధికి ఈ పన్ను గొప్ప ఆటంకమగునని చెప్పి "వీలుండిన వెంటనే ఈ నూతన శుల్కములను రద్దు చేయవలయు"నని కోరి యుంటిమి ఈ పన్నును విధించు విషయమున ఇతర సంస్థానములను చూడుడు మన సంస్థానమును చూడుడు మన సంస్థానమువారు ఒక విధముగా అనవసరమైన తొందర జూపిరని మాకు తోచుచున్నది. ఎట్లనగా ఈ అగ్గిపెట్టెల పైని యక్సైజు పన్నును అమలు పరచుట యందు మన ప్రభుత్వము వారు మొట్టమొదటి వారైరి అంతేకాక పన్ను మొట్టమొదట బ్రిటిషు యిండియా శాసనసభలో ఇండియా ప్రభుత్వమునందలి ఆర్థిక సభ్యుడు కోరినంత విధింపబడినది.

సంస్థాన ప్రభుత్వములు తమ రాజ్యములందు తయారుచేయబడు అగ్గిపెట్టెలపై పన్ను అమలు పరుచవలసి వచ్చినది ఇండియా ప్రభుత్వమువారు కోరుట వలననే ఇండియా ప్రభుత్వము ఇట్లు కోరుటకు కారణము వారు బ్రిటిషు యిండియాలో తయారుచేయబడు అగ్గిపెట్టెలపై పన్ను వసూలు చేయదలచుటయు సంస్థానములలో ఇటువంటి పన్ను లేనిచో బ్రిటిషు ఇండియా వారు అగ్గిపెట్టెల పరిశ్రమలను సంస్థానములలో స్థాపించుకొని పన్నును తప్పించు కొందురను భయమున్ను అయియున్నది ఈ కారణమును తృప్తి పరచుటకు ఇండియా ప్రభుత్వము వారు తమ రాజ్యమందు తయారుచేయబడు ఆగ్గిపెట్టెలపై ఎంత పన్ను విధింతురో చూచి అంత మాత్రమే విధించిన చాలదా? మొదట ఇండియా ప్రభుత్వము యొక్క ఆర్ధిక సభ్యుడు కోరి యుండునట్టియు, ఈ ఏప్రిలు 1 వ. తేది నుండి మన రాష్ట్రమందు అమలుపరుపబడుచున్నట్టియు పన్ను రేటు బ్రిటిషు ఇండియాలో, అమలు పరుపబడుటకు ముందే, శాసనసభ వారిచే మార్చబడినది. ఇండియా ప్రభుత్వము వారును ఈ మార్పు సంగీకరించినారు ఈ మార్పు ప్రకారము అగ్గిపెట్టె 1కి 40 పుల్లలు గల అగ్గిపెట్టెలపై 144 కి ఒక రూపాయి వంతునను, ఈ లెక్కన 60 పుల్లల పెట్టెలపై వాటికి తగినట్లును 80 పుల్లలు పెట్టెలపై వాటికి తగినట్లును పన్ను అమలు పరుచబడును. ఈ విధముగా నున్న అమలుపరచిన తర్వాత గూడ కల్దారు మూడు పాయీల కొక నిప్పుపెట్టె బజారులో అమ్ముడు పోవునట్టిది ఉండగలదని ఆశింపబడు చున్నది ఈ మార్పు అగ్గిపెట్టెల పరిశ్రమ యొక్క అభివృద్ధి క్రొత్త పన్ను వలన తగ్గకుండునందులకై చేయబడినది. ఈ మార్చిన రేట్లవల్లనే ప్రభుత్వము వారును తమకు ఎక్కువ ఆదాయము వచ్చునని ఆశించిరి

మన రాష్ట్రమందలి అగ్గిపెట్టెల పరిశ్రమ బ్రిటిషు యిండియాలో దానికంటే ఎక్కువ అభివృద్ధి జెందినదికాదు గదా? అట్టి సందర్భములో బ్రిటిషు యిండియాలో పరిశ్రమ అంగీకరింపజాలని పన్నును మన రాష్ట్రీయ పరిశ్రమ మాత్రము భరింప జాలునా? నిప్పు పెట్టె ప్రతి బీదవాడును ఉపయోగించునట్టి వస్తువు. ఈ కొత్త పన్ను వలన ధనవంతులగు కొద్దిమందికి ఏ బాధయు అనిపించకున్నను అనేకులగు బీదలకు ఖర్చు హెచ్చును పన్నువలన నేర్పడు కొత్త పరిస్థితులు వారికి భారముగా నుండవలయును మన ప్రభుత్వమువారు తమ తొందరలో కొనువారినిగాని అమ్మువారినిగాని మనస్సులో నుంచుకొన నట్లే యున్నది

బరోడా ప్రభుత్వమువారిని జూడుడు. వారును అగ్గిపెట్టెలపై పన్ను విధించుటకు నిశ్చయించినను ఇండియూ ప్రభుత్వము వారు ఏ రేటును అమలు పరచిన ఆ రేటునే తమ రాజ్యములో అమలు పరచవలెనని వారు ఉత్తరువు చేసిరి పుదుక్కోట సంస్థానములో ప్రభుత్వము వారు పన్నును అమలు పరచుటకు ముందు తమ శాసనసభవారి అభిప్రాయమును గైకొనిరి ఈ ఏప్రిల్ నెల 19 వ తేదీనాడు పుదుక్కోట శాసనసభవారు అగ్గిపెట్టెలపై పన్నును అమలు పరచుటకు అంగీకరించిరి. పన్ను ఏ రేటు ప్రకారము అమలుపరుచబడునో తెలియుటలేదు. మన రాష్ట్రమునకు గూడ శాసనసభ ఒకటి ఉన్నది గదా! మన ప్రభుత్వము వారు క్రొత్త పన్ను విషయమై శాసనసభ వారి ఆమోదమును బడసిరా? అధమ పక్షము వారి యభిప్రాయమునైనను గైకొనిరా? ఈ విషయములు తెలియవచ్చుటలేదు ప్రభుత్వము వారు పన్ను అమలు పరచుటకు ఆజ్ఞ నిచ్చు సమయమును ఈ విషయములను ఒక ప్రకటనమూలముగానైనను తెలియజేసి యుండలేదు

రాష్ట్రీయుల అగ్గిపెట్టెలపై ఎంత పన్ను విధింపబడుచున్నదో ఇతర రాజ్యములనుండి దిగుమతి యగు వాటిపై అంతపన్ను విధించుటచే మన రాష్ట్ర మందలి పరిశ్రమకు భయము తప్పునని ప్రభుత్వమువారు తలచినట్లున్నది ఇది చూడగాబీదవారికి ధనము పుట్టని ఈ కాలములో ఆదాయము హెచ్చు అగుటకు తగినంత తోడ్పడకున్నను వారి ఖర్చుకు మాత్రము మరికొంత చేర్చబడినట్లైనది.