గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఇంగ్లాండునకు పోవు విద్యార్థులు
ఇంగ్లాండునకు పోవు విద్యార్థులు
27-8-1927
ఈ వారమున మన రాష్ట్ర వాసులగు పలువురు విద్యార్థులు వివిధ విద్యలు నభ్యసించుటకై ఇంగ్లాండునకు పోవుచున్నారు. వారిలో ముఖ్యులు రాజా శ్రీనివాసరావు కార్వాన్కరు బి. ఎ., దామోదర రెడ్డి బి. ఎ., వేనేపల్లి లక్ష్మారావు బి. ఏ., రాంరావు కోరట్కరు, కిషన్‌రావు ఆత్రే బి. ఎ., డాక్టరు బోర్గాంకరు గార్లును మరికొందరు మహమ్మదీయ యువకులునై యున్నారు.
పై వారిలో మొదటివారు ఇచ్చటి విఖ్యాతులగు జాగీరుదార్లు. పూర్వము అవ్వలు తాలూక్దారు పనిచేసిన రాజా శ్రీనివాసరావు గారి మనుమలు. రెండవ వారు పోలీసు మొహతెమిం పదవి యందున్న శ్రీయుత కొండారెడ్డిగారి పుత్రులు. మూడవవారు నల్లగొండ జిల్లాలోని కొప్పోలు దేశముఖులును, నిజాం రాష్ట్ర వెలమ జన సంఘ కార్యదర్శులును అగు శ్రీయుత వేనేపల్లి నరసింహారావు గారి సోదరులు. నాల్గవవారు పండిత కేశవరావు గారి పుత్రులు. వీరు ఇదివరకే సీమకు వెడలిపోయినారు. అయిదవ వారు శ్రీయుత హనుమంతరావు ఆత్రే బి.ఎ. గారి కుమారులు. ఆరవవారు గోపాలరావు వకీలు గారి పుత్రులు.
ఈ వారమునందు పైన పేర్కొన్న యౌవనుల గౌరవార్థమై యనేక విందులు, టీ పార్టీలు జరిగినవి. కాశీనాధరావు వైద్య, రామచంద్ర నాయకు బారిష్టరు గార్ల భవనము నందును, కర్ణాటక యువజనుల పక్షమునను, కర్ణాటక పక్షమునను, ఆంధ్ర కుటీరము నందును, వివేక వర్ధనీయందును, రెడ్డి హాస్టలు నందును, ఇంకను పలు తావులందును ఇట్టివి కొన్ని బాహుళ్యముగను, కొన్ని ప్రత్యేకముగను జరుపబడినవి.
ఈ విద్యార్థులలో యెవరెవరే విద్య నభ్యసించుటకై పోవుచున్నారో వివరములు తెలియలేదు. అయినను భ్యారిష్టరీకిని, వైద్యమునకును అర్థ శాస్త్రము కొరకును అనుచున్నారు. న్యాయవాద వృత్తియందు ఉన్నత విద్య నభ్యసించ వలయునన్న మన దేశమునందే తగిన సంస్థలున్నవి. అదియును గాక సీమకు వెడలి యీ విద్యను చదివి వచ్చిన వారెందరో ఇపుడు కలరు. ఇపుడు దేశమునకు వారి అవసరము లేదనియే చెప్పవచ్చును. వైద్యమునందు ఎం.బి.సి.ఎం. ఉన్నత పరీక్షకు కూడ హిందూ స్థానమునందు శిక్షణ నొసంగబడుచున్నది. అట్టి యున్నత వైద్య పరీక్షలలో కడతేరి కొన్నాళ్ళు అనుభవము సంపాదించి ప్రత్యేక విషయమును గూర్చి ఇంకను తెలిసికొనవలయునన్న సీమకు వెడలుట యుపయోగ కరమే.
ప్రస్తుతము భారతీయులు పరిశ్రమల యందును, ఇంజనీరింగు, సైన్సు యందును ప్రవీణులు గావలసియున్నది. దేశసంపద అభివృద్ధి పరచుటకీ విద్యలే మూలాధారములు. అన్ని దేశముల వారి కన్న మనము పరిశ్రమల యందు వెనుకబడి యున్నాము. విదేశీయులు చిన్న చిన్న వస్తువుల సిద్ధపరచి కోట్లకొలది ధనమార్జించుచుండ మనము యుద్యోగములకొరకు పెనుగులాడుచున్నాము. వారిచే తయారు చేయబడిన వస్తువుల జీవితావసరములుగా జేసికొని వారికి దాసులమై జీవితముల గడుపుచున్నాము. మన దేశమునందు మిక్కుటముగ పండుచున్నట్టి ముడి పదార్థముల విదేశములకు చౌకధరలకు ఎగుమతిచేసి వాని వలననే తయారు కాబడిన వానికి హెచ్చు వెలల నొసంగి గైకొను చున్నాము. పరిశ్రమలయందు మనము నిపుణులమై యున్న ఇట్టి ముడి వస్తువుల నుండి యెన్నియో అవసర పదార్థములు సిద్ధపరచి లాభము పొందవచ్చును గదా! వారి దేశములకు పోయి మనము నేర్వదగినది ముఖ్యముగా యీ విద్యలే. ప్రస్తుతము దేశమునకు కావలసినవి ఇవియే. ఆర్థిక స్వాతంత్ర్యమున కివియే, మూలాధారములు. కాన సీమకు వెళ్ళు విద్యార్థులు పూర్వాభిప్రాయములు విడచి తమకును, దేశమునకును లాభకరమగు విద్యల నార్జించుట శ్రేయస్కరము లేనిచో వీరు వెచ్చించు వేల కొలది ధనము వృధా యనదగును. స్వదేశమునందే యుండుట మేలు కనుక పై విద్యార్థులందరును ఆలోచించెదరు గాక.
యౌవనులగు వీరందరకును ఈశ్వరుడు ఆరోగ్యమును ప్రసాదించి వీరి ఉత్తమోద్దేశములను నెరవేర్చి పిమ్మట సులభముగ స్వస్థలముల జేర్చుగాక యని ప్రార్థించుచున్నాము.వీరు తమ దేశమునకవసరమగు పాశ్చాత్య విద్యల నభ్యసించి దేశమును, దేశీయులను, దేశ సంప్రదాయములను సదా దృష్టియందు వుంచుకొని, దేశసేవకై ద్విగుణీకృతోత్సాహముతో కృతార్థులై మరలివత్తురని నమ్ముచున్నాను.