గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆర్య సమాజోత్సవములు
ఆర్య సమాజోత్సవములు
16 - 5 - 1935
పది పండ్రెండు రోజులనుండి నగరములో ఆర్య సమాజోత్సవములతోను, కన్యా గురుకుల వార్షికోత్సవముతోను కళకళలాడుచు నగర వాసులలో వేలకొలది మందికి ఉత్సాహ సమయమై యుండెను దయామయులగు ప్రభుత్వము వారు యీ సభలకు అనుమతించి తమ నిష్పక్షపాత దృష్టిని కాపాడుకొనినారు
ఈ ఉత్సవములలో కడపటి రోజున జరిగిన ఒక విశేషము మాత్రము జనుల దృష్టిని కొంచెము అధికముగ నాకర్షించియుండ వచ్చును అది యేదనగా, ఆర్య సమాజీయులకు ఒక బెదరింపు లేఖ ఆ లేఖ ఆర్య సమాజకార్యదర్శియగు బన్సీలాల్ వకీలుగారిచే సభలో చదివి వినిపించబడినది ఈ సంస్థాన ముసల్మానులు ఆర్య సమాజ ప్రచారమును సహింపజాల రనియు, ఆ ప్రచారమును అంతమొందించుటకు యత్నముచేయబడుచున్నదనియు, ఆ జాబులో వ్రాయబడియున్నట్లు చదువబడినది
ఈ జాబు వ్రాసిన దెవరు? నిజముగా ఆర్య సమాజ వ్యాప్తిని ద్వేషించువారేనా యీ జాబుకు కారకులు? వారు ఆర్య సమాజము ప్రచారము తమకు యిష్టము కానిచో ఆ మాట బహిరంగముగా చెప్పరాదా? ఇట్టి ఊరు పేరులేని జాబులేల? ఈ జాబులో ఈ రాష్ట్ర ముసల్మానుల కెవరికి గాని ఆర్య సమాజ ప్రచారము యిష్టముకా దనుటయు అందువల్ల ఆ ప్రచారము నంతమొందించుటకు యత్నము చేయబడుచున్నదనుటయు ఆశ్చర్యమును గొల్పుచున్నది ఏలనన, ఈ రాష్ట్ర ముసల్మానులలో అట్టి అసహన భావమున్నట్లు యిదివరకు వినియుండలేదు హైద్రాబాదు రాష్ట్రము మత సఖ్యతకు ప్రసిద్ధి చెందినదని పేరుగాంచి యున్నది ఆర్య సమాజ ప్రచారము యీనాడు పుట్టినది కాదు అట్టి సందర్భములో ఇపుడు క్రొత్తగా యీ రాష్ట్ర ముసల్మానులకు ఆర్య మత ప్రచారమనిన గిట్టదని యెవరు చెప్పినను ఆశ్చర్యమే కదా! అట్టి మాటను యెంత మాత్రము నమ్ముటకు వీలులేదు.
ఇక యిది ఆర్యమత మనిన సహింపజాలని యే బుద్ధిగల భీరువుచేతనో వ్రాయబడియుండ వలెను అందుచేత ఆర్య సమాజీయుల నిది భయపెట్టజాలదు
ఈ లేఖ జనులలో కొంత విస్మయమును కలిగించియుండుటచే దాని వాస్తవమును తత్సంబంధాధికారులు పరిశోధన చేసి వెల్లడిచేయుట యుక్తమని మా యభిప్రాయము
ఇదంతయు నెట్లున్నను ప్రభువునకు సర్వ మతములును సమానమేయను ఆదర్శముగల మ॥ఘ॥వ॥ నిజాం ప్రభువుగారి రాష్ట్రమున యితర మతములను దూషించక తమ మతముయొక్క ప్రాశస్త్యమును గూర్చి ప్రచారము చేయుచున్నంత కాలము ఆర్య సమాజీయులు భయపడ నక్కరలేదనియే మా విశ్వాసము