గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆరవ నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ
ఆరవ నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ
25-5-1927
ఈ మహాసభ హైదరాబాదు నగరమునందు అమర్దాదు నెల యొక్క మొదటి వారమున జరుగునను వార్త ఇందుకు ముందే ప్రకటింపబడియుండుట పత్రికా పాఠకులకు విదితమైయున్నది. విఖ్యాత వంగ విదుషీమణియగు శ్రీమతి సరళాదేవిగారిందుకు అధ్యక్షురాలుగ నుండ నంగీకరించుట ఎంతయు ప్రోత్సాహకరముగ నున్నదనియు సభకొరకు నిర్ణయింపబడిన 6, 7 అమర్దాదులు బక్రీదు సెలవులగుటవలన స్థానికులకును, ముఖ్యముగా జిల్లాల వారికిని ఎంతయు అనుకూలముగా నున్నదనుట నిస్సంశయము. ఆహ్వాన సంఘ కార్యదర్శిగారు చేసిన ప్రకటనమునుబట్టి చూడగా, పర స్థలముల నుండి వచ్చు వారికి వలయు నేర్పాటులను క్రమముగా జరుగును కనుక ఈ సమావేశమునందు నిజాం రాష్ట్ర వాసులందరును కడునుత్సాహముతో పాల్గొనుట అత్యవసరమనియు సూచించు చున్నాము.
హైదరాబాదునందు జరుగుచున్న యుద్యమములన్నిటి యందును మన మహారాష్ట్ర సోదరులు అగ్రగాములై పనిచేయుచున్నారు. రాజ్యాంగ సాంఘిక, నైతిక, విద్యాది ప్రతి విషయమునందును వారే స్థాపకులు; వారే పోషకులు; వారే నిరుపమానముగ సేవచేయువారు: వారే ఎక్కువ ధనము వ్యయమొనర్చి దేశీయులందు ప్రబోధము కలిగించుచున్నవారు. గడచిన 25 సంవత్సరముల కాలములో ఈ నగరమున ప్రజాహిత జీవనమును నెలగొల్పి, దానిని ఇంతవరకు పోషించిన గౌరవము మహారాష్ట్ర సోదరులకు ముఖ్యముగా నాయక రత్నములగు న్యాయమూర్తి పండిత కేశవరావు, ధర్మవీర వామననాయకుగార్లకు చెందవలసియున్నది. వీరే సంఘ సంస్కారోద్యమమునకును గారకులు, పోషకులునై ఆరవ మహాసభవరకు సదుద్యమమును గొనివచ్చి దేశీయుల కృతజ్ఞతకు బాత్రులైయున్నారు. దురదృష్ట వశమున నిజాం రాష్ట్రంలోని యాంధ్రులలో ప్రజాహిత జీవనాసక్తి తగిన విధముగ పెంపొందుటలేదు. ఇందునకు గడచిన (5) సంఘ సంస్కార మహాసభలే తార్కాణములు. మొదట మూడు సభలును నాందేడు జిల్లాలో జరిగెను; కనుక తెలుగువారికి వాని గూర్చిన సంగతులే తెలియవని మా యూహ. నాల్గవ సభ హైదరాబాదునందు 1331 ఫసలీలో ఆచార్య కర్వేగారి అధ్యక్షత క్రింద జరిగెను. ఆ సభలో ఆంధ్ర యౌవనులు కొందరు పాల్గొనుటయు, మహాసభలో నుపన్యసించుటయు మే మెరుగుదుము. ఆ సభలో నాంధ్రుల కెట్టి ప్రాముఖ్యము లేకపోవుటచేతనే కొందరందునకు చింతిల్లి ఆంధ్రులలో ప్రబోధము లేకపోవుటయే అందునకు గారణముగ దలచి యట్టి లోపమును క్రమముగ దొలగించుకొన గృతనిశ్చయులై సభ యొక్క మూడవ నాటి రాత్రి (8 దై 1331 ఫ.) ఎనిమిది గంటలకు కీ. శే. టేకుమాల రంగారావు హైకోర్టు వకీలుగారి యింట సభచేసి హైదరాబాదు నగరమునందు మొట్ట మొదట ఆంధ్ర జన సంఘమును స్థాపించి, తరువాత ఆంధ్రోద్యమమును ఆంధ్ర జిల్లాలందు ప్రాకించిన యంశము మాకు బాగుగా జ్ఞప్తియందున్నది.
తరువాత గుల్బర్గాలో జరిగిన మహాసభ యందును పలు ఆంధ్ర జిల్లాల నుండి యౌవనులు వెళ్ళిన మాట నిజమే కానీ దానియందైనను వారి సంఖ్య దేశమునందున్న ఆంధ్రుల జన సంఖ్యనుబట్టి చూచినచో తృప్తికరముగా నుండ లేదు. వచ్చిన వారైనను మాధ్యమిక స్థితియందుండిన యువకులు. గొప్ప ద్రవ్యస్థితి గలవారుగాని వయో వృద్ధులుగాని అందు కాన్పింపలేదు. విషయ నిర్ణాయక సంఘమునందును వారి సంఖ్య చాల లోపించియుండెను. సభలో నుపన్యసించినవారు కూడ కొలది మందియే. వేయేల? ఈ తుది రెండు సభలును మహారాష్ట్ర సంఘ సంస్కార మహాసభలనదగియుండినవి కాని నిజాం రాష్ట్ర సంఘ సంస్కార సభలన్పించుకొనుటకు అర్హములుగా నుండలేదు. అందునకు గారణము మహారాష్ట్ర సోదరుల పక్షపాత బుద్ధికాదు. ఆంధ్రుల యుపేక్షాభావమే యని నొక్కి వక్కాణింపగలము.
రాబోవు మహాసభలో నధ్యక్షురాలు అఖిలభారత వర్ష ప్రాముఖ్యతగల శ్రీమతి సరలాదేవి అధ్యక్షురాలి యుపన్యాసము వేయి విధముల హిందీ భాష యందే యుండగలదు. ఈ విషయమున శ్రీదేవిగారికి సూచింపబడినదనియు మాకు దెలిసినది. కనుక కార్యక్రమము ఎక్కువగా హిందీ భాష యందే జరుగ వచ్చును. మన రాష్ట్రమునందు హిందువులు నాల్గు తరగతులుగా నున్నారని చెప్పవచ్చును. 1. మహారాష్ట్రులు 2. ఆంధ్రులు 3. కర్ణాటకులు 4. ఉత్తర హిందూస్థానము నుండి వచ్చి మన రాష్ట్రమున స్థిరనివాస మేర్పరచుకొనిన వారు. వీరందరకును హిందీభాష బాగుగనే తెలియును. ప్రజా సామాన్యమున కుపయోగపడునట్లు ముఖ్య తీర్మానముల పైన మహారాష్ట్రము, తెనుగు, కన్నడమున గూడ నుపన్యాసములు జరిగినచో అందరకును ఉత్సాహప్రదముగ నుండగలదు. కనుక దేశీయులందరును ఈ మహాసభ యందు ప్రతినిధులుగా బహుళ సంఖ్యలో జేరి జయప్రదముగా జేయుట ధర్మము.
హైద్రాబాదునందును జిల్లాలందును ఎన్నియో కాలేజీలును, ఉన్నత పాఠశాలలును కలవు. వానిలోని యాంధ్ర విద్యార్థులీ మహాసభ యందు చేరి తోడ్పడవలయును. ఆంధ్ర న్యాయవాదులు పూర్వమువలె నిది ఎవరి యింటిలోని పెండ్లియోయని తలంపక, మన సంఘమునకు దేనిని ముఖ్యమైనదిగా భావించి ఈ మహాసభ యెడ అభిమానము వహించవలయును. ఉద్యోగస్థులగువారును, చిక్కులు లేని ఈ సాంఘికోద్యమమున శ్రద్దగైకొని ముందంజ వేయుట యుచితము. పలుమాటలేల? నిజాం రాష్ట్ర ఆంధ్రులందరును ప్రతినిధులుగనో ప్రేక్షకులుగానో ఆహ్వాన సంఘ సభాసదులు గనో దీనియందు జేరి తమ యుత్సాహమును వ్యక్తపరుపవలయును. ఈ మహాసభ జయప్రదముగ సాగునుగాక.
పిక్టోరియల్ హైదరాబాదు
పై పేరనొక చిత్రపటమును కట్టించు నుద్దేశముతో ఆంధ్ర యౌవనులును, విఖ్యాత సేవా పరాయణులును అగు శ్రీయుత కృష్ణస్వామి ముదిరాజాగారు తమ చంద్రకాంత ముద్రాలయము పక్షమున వెలువరించిన ఇంగ్లీషు భాష యందలి నివేదనమును అందికొంటిమి. ఇది నిజముగ గొప్ప కార్యము. దీని యందు పటములు (500) లకు తక్కువ కాకుండ నుండును. ప్రతి పటమును గూర్చియు సంగ్రహాంశములు చేర్పబడగలవు. ఈ పటములు నాలుగు భాగము లుగ విభజింపబడి యుండును. 1. రాజ్యములోని గొప్పవారు 2, చారిత్రక మందిరములు, ప్రదేశములు 3. పారిశ్రామికములు. 4. ఇతరములు. డబల్ డెమ్మీ సైజున ("8" + 11 ") సంపుటము ప్రకటితమగునని నివేదికయందు కలదు. ఉద్యోగ ప్రియులగు పై ముద్రాలయము వారు, దేశీయులను రాజ పోషకులుగను (రూ. 500/-లు), పోషకులుగను (రూ.250/-), ఆభిమానులుగను (రూ. 100/-) వుండుటకు అంగీకరించి ఈ యుద్యమమున తోడ్పడ వేడుచున్నారు. ఆంధ్ర యౌవనుని ఈ యుత్సాహము ప్రశంసార్హము. దేశీయుల సహాయమునకు వీరు పాత్రులై యున్నారని సూచించుచు మా మిత్రులగు శ్రీకృష్ణస్వామి గారినీ మహోద్దేశమునకుగాను అభినందించుచున్నాము.