గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆంధ్ర మహాసభలు
ఆంధ్ర మహా సభలు
1 - 7 - 1931
ఈ నెల 27 వ తేదీన ఆంధ్రభాషాభిమానులును, ఆంధ్ర ప్రముఖులును స్వార్థత్యాగులునునగు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి యాధిపత్యమున గుంటూరు నందు ఆంధ్ర మహా సభ సమావేశమయ్యెను. ప్రకాశంగారు తమ యధ్యక్షోపన్యాసము నందు భావి భారతదేశ పరిస్థితులను వివరముగ చర్చించిరి. గత భారత స్వాతంత్ర్య సమరమున పాల్గొని అధిక కష్టములకు పాల్పడి, అహింసా వ్రతానుసారముగా సమరమును విజవంతముగా కొనసాగించిన ఆంధ్ర సోదర సోదరీమణులను ప్రశంసించిరి భాషా ప్రయుక్త నిర్మాణావశ్యకతను వివరముగా తెలియపరచిరి గత రౌండు టేబిలు మహాసభయందు సింధుదేశమును ప్రత్యేక రాష్ట్రముగా నొనర్చుట కనుమతింపబడెను. కాని సుమారిరువది సంవత్సరముల నుండియే ప్రత్యేక రాష్ట్రమునకై యాందోళనము సలుపబడుచున్న ఆంధ్రరాష్ట్రము గూర్చి యందెట్టి సూచనయుగావింప బడలేదు ఆంధ్ర రాష్ట్రము నుండి వెడలిన ప్రతినిధులలో నొకరుగూడ నిందుకై చర్చించలేదు. వీరు ప్రజాభిప్రాయము నేమాత్రమును నీసభయందు వెల్లడింప లేదు ఇందుచే వీరు ప్రజాప్రతినిధి యర్హతను బొందలేదనియు, ముందు జరుగబోపు సభలో తప్పక ప్రజాప్రతినిధులు బోవలసిన యావశ్యకత గలదనియు, ప్రజలు ప్రభుత్వ నియోజత ప్రతినిధివర్గము వలన నేమాత్రమును లాభము పొందజాలరనియు, తేటతెల్లమగు చున్నది.
పంతులుగారు హిందూ మహమ్మదీయ సమస్య గూర్చి అమూల్యాభిప్రాయము నొసగిరి. వీరు సంయుక్త నియోజక వర్గములు దేశాభివృద్ధికి మూలకారణములని నుడివిరి. ప్రస్తుతము భారతదేశమందీ సమస్యకు ప్రాముఖ్యత కలిగినది. మహమ్మదీయులలోని జాతీయ పక్షము వారికిని షాకతలీ పక్షమువారికినీ పరస్పర విరోధములుదయించినవి ఈ రెండు పక్షముల వారిని సమాధానపరచుటకై ప్రధమము నుండియు భూపాలు నవాబుగా రత్యంత ప్రశంసనీయమగు కృషి సలిపిరి కాని దేశ దురదృష్టమువలన నది విఫల మైనట్లు సిమ్లాలో జరిగిన సమావేశమువలన విదితమగుచున్నది. భారతదేశమునందు హిందూ మహమ్మదీ యొక్యతను కాక్షించు మహానుభావులందరును, మహమ్మదీయులలో నధిక సంఖ్యాకులును, ముఖ్యముగా జాతీయ వాదులందరును, సంయుక్త నియోజకవర్గములనే వాంచించుచున్నారు. కొన్ని దినముల క్రిందట నిచటికి విచ్చేసి సుమారారు వారము లిచట నివసించినట్టియు, లాహోరులోని జమీందారు పత్రికా సంపాదకులైనట్టియు మౌలానా జఫరలీఖాన్ సా॥ గూడ సంయుక్త నియోజక వర్గములే కోరుచు ప్రస్తుత స్థితిగతులనుబట్టి పది సంవత్సరముల వరకు ప్రత్యేక నియోజకవర్గము లుండవలయుననియు, తదుపరి సంయుక్త నియోజక వర్గములు కావలయుననియు, యభిప్రాయ మొసగిరి. దీనికి జాతీయ పక్షము వారొప్పుకొనినను షాకతలీ పక్షమువారు ఇందు మరికొన్ని కఠినతమములగు నిబంధన లేర్పరచిరి ఇక ముందైనను వీరు సమాధానమునకు వత్తురో లేదో చూడవలసి యున్నది. ప్రకాశంపంతులుగారు హిందూదేశ అంతస్సమస్యయగు నిది పరిష్కారముగాకున్నను రౌండుటేబిలు మహాసభ యందు పాల్గొనవలయునని యభిప్రాయమును వెల్లడించిరి. గాంధీ మహాత్ముడును, కాంగ్రెసు కార్యనిర్వాహక సభ్యులును, దీనినే యంగీకరించినారు కదా! ప్రకాశంగారు సంస్థాన ప్రజల యధికారమును గూర్చి వివరముగ చర్చింపకున్నను పటియాలా మహారాజుగారు సమాఖ్య విధానమునకు సమ్మతింపక నూతన విధానమును సూచించుట గూర్చి తీవ్రముగా ఖండించి యితర సంస్థానాధీశులు వీరి యభిప్రాయమునకు సమ్మతిని తెలుపనందున సంతసించిరి సంస్థానాధీశులు బ్రిటీషిండియాతో బాటు సమాఖ్యలో చేరవలయునని వీరు సలహా నొసగిరి
మొత్తముపై వీరు భారత దేశాభివృద్ధికరములగు నట్టియు, భావ్యభివృద్ధికి ఆటంకములగు నట్టియు, విషయములన్నిటిని చర్చించిరి. వీరు ముఖ్యముగా కోరినట్టి విషయమగు ప్రత్యేకాంధ్ర రాష్ట్రమును గూర్చి ముందు జరుగబోవు రౌండు టేబిలు సభలో విచారణకు వచ్చుననియు, గాంధీమహాత్ముడు ఈ విషయమును గురించి శ్రద్ధ వహించుటకు సమ్మతించుటచే నిది సఫలమగుననియు, విశ్వాసము కలుగుచున్నది దీని కొరకు ఆంధ్రులు తమ యావచ్ఛక్తిని వినియోగించెదరు గాక అంతః కలహముల చెలరేపి ఈ మహదాశయమునకు విఘ్నము కలిగింపకుందురు గాక!