గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆంధ్ర మహాజన సభ
ఆంధ్ర మహాజన సభ
16-11-1927
ఈ మహాజన సభ అనంతపురములో శ్రీయుత ఒ. లక్ష్మణస్వామి గారి యాజమాన్యమున సమావేశమయినది. అధ్యక్షుల ప్రారంభోపన్యాసము భావగర్భితమై ఒప్పుచున్నది ఆంధ్ర మహాసభ ఏర్పడి పదునైదు సంవత్సరములు గడచినను ఆంధ్ర సభల యుద్దేశము పూర్తికానులేదని వీరు నిరూపించిరి. ఆంధ్ర రాష్ట్ర సమస్య యింకను పరిష్కరింపబడలేదు. చిత్తూరు జిల్లా వారికిగల అభిప్రాయభేదములు త్వరలో తొలగిపోయి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము జరుగునని తలచెదము ఈ విషయమై ఆంధ్ర మహాసభ శ్రద్ధవహించవలసి యున్నది. ఆంధ్రులలో వివిధ రాజకీయ పక్షములున్నను ఈ విషయమై అందరు ఏకాభిప్రాయులై ప్రయత్నించెదరని నమ్మెదము
రెండవది ఆంధ్ర విశ్వవిద్యాలయము. విశ్వవిద్యాలయ కార్యాలయము స్థాపింపబడి ఒక సంవత్సరము గడచిపోయినను ఇంకను ప్రత్యేక విద్యా విధానము ఆచరణకు రానులేదు. విశ్వవిద్యాలయ కార్యస్థానము గూర్చియే తగవులాట జరుగుచున్నది ప్రతి ప్రాంతము వారును తమ ప్రాంతమునకే కార్య స్థానమున్న గౌరవము లభించవలెనని పోరాడుచున్నవారే కానీ మొత్తము పైన అన్ని ప్రాంతముల ఆంధ్రుల అందుబాటులో నుండవలయునని విచారించుట లేదు. ఇకనయినను కాల హరణము చేయక సభ్యులు తగు నిర్ణయము చేయుదురు గాక!
అధ్యక్షులగు లక్ష్మణస్వామి గారు ఆంధ్రోద్యమము ద్వారా గ్రంథాల యోద్యమము విరివిగా వ్యాపించినదనియు ఇక ముందు ఆంధ్ర వికాసమునకు ఇట్టి సంస్థలే మూలాధార మనియు వాక్రుచ్చిరి ఆంధ్ర మహాసభ ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధి కొరకు పాటుపడవలయు ననియు, ఆంధ్రుల ప్రత్యేక శక్తులు విజృంభింపవయునన్న అన్ని విధముల జీవితమునకు ప్రోత్సాహము కలుగవలెననియు, దీనికి జాతీయ వాఙ్మయము అవసరమనియు, ఇవి యన్నియు స్థాయి సంఘమువారు పూనుకొనవలయు ననియు సూచించిరి
కొన్ని సంవత్సరముల నుండి ఆంధ్రులు రాజకీయ విషయములందే పాల్గొనుచున్నారు కాని సాంఘిక, వాఙ్మయాభివృద్ధి కొరకు శ్రద్ధ వహించుట లేదు. అందుచే ఆంధ్ర మహాసభ నిర్వీర్యమయినది ప్రతి సంవత్సరము సమావేశములు జరుగుచున్నవి, కాని కార్యాచరణలేదు. గత సంవత్సరము మద్దూరి అన్నపూర్ణయ్యగారు కార్యదర్శిగా నియమింపబడుటచే వారు కొంతవరకు మహాసభా తీర్మానములు ఆచరణకు దెచ్చుటకై ప్రయత్నించిరి ముఖ్యముగా కార్యదీక్ష కావలసియున్నది కనుక స్థాయి సంఘము చేయవలసిన పని యెంతేని గలదు
ఆంధ్ర మహాసభ అన్ని ప్రాంతములలో నున్న ఆంధ్రుల అభివృద్ధికొరకు ప్రయత్నింపవలయును రాజకీయ విషయములలో ఒక ప్రాంతము వారికి వేరొక ప్రాంతము వారికిని భేదమున్నను సాంఘిక, ఆర్ధిక విషయములలో భేదము వుండజాలదు ఈ సభ చెన్న రాజధానిలోని ఆంధ్రుల కొరకే ప్రయత్నించినచో అందు విశేషమేమి? ఆంధ్ర దేశములోని కొన్ని ప్రాంతములవారు విద్యాది విషయములలో వెనుకబడి యుండవచ్చును అంత మాత్రమున అట్టి వారిని వేరుపరచుటకు వీలువుండదు వారి అభివృద్ధికి కూడ మార్గము చూపుచుండవలయును అపుడే ఆంధ్ర మహాసభ యనిన ఏ ప్రాంతములో నుండు ఆంధ్రుల కయినను గౌరవోత్సాహములు కలుగును. సభానామము, ఉద్దేశము సార్థకమగును. మహాసభవారు ఈ విషయమున శ్రద్ద వహించెదరా?